అర్ధాకలి చదువులు!.. మధ్యాహ్న భోజనం అందిస్తే మెరుగైన ఫలితాలు
విద్యాసంస్థల్లో మౌలిక సవతులు కల్పిస్తూ మెరుగైన విద్యనందించాలని ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాది. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం లేదు. దీంతో కళాశాలలకు వచ్చే అధిక శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సరైన సమయంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకోకుండా కళాశాలలకు వస్తున్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఆమోదం తెలిపారు. కానీ ప్రభుత్వం మారడంతో భోజన పథకం అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంపై విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.
చదవండి: Sadhna Saxena: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళ ఈమెనే..
జిల్లాలో ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు..
జిల్లాలో ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 2,613 మంది చదువుతున్నారు. వీరంతా సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చి వెళ్తున్నారు. వీరు ఉదయం 9గంటల వరకు కళాశాలలకు రావాల్సి ఉండడంతో మధ్యాహ్న భోజనం తెచ్చుకోకుండా వస్తున్నారు.
మరికొందరు ఉదయం కూడా తినకుండా వచ్చేస్తున్నారు. దీంతో వారు సాయంత్రం వరకు కళాశాలల్లోనే ఉండాల్సి రావడంతో మధ్యాహ్నం భోజనం ఏలక అర్థాకలితోనే చదువుతున్నారు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు సరైన సమయంలో భోజనం తీసుకోక తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.
మధ్యాహ్న భోజనం అందిస్తే మెరుగైన ఫలితాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే విద్యార్థుల హాజరు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మెరుగైన ఫలితాల సాధనకు వీలుంటుంది. పౌష్టికాహారం అందడంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారని పలువురు అంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సత్వరమే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తూ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని కోరుతున్నారు.