Presidential Advisory Commission: అమెరికా గ్రీన్‌కార్డుల ప్రాసెసింగ్... ఇన్ని నెల్లలో పూర్తి చేయాలి..
. పెండింగ్ కేసులతో సహా గ్రీన్ కార్డు దరఖాస్తులన్నింటినీ ఆరు నెలల్లోపు ప్రాసెస్ చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ కమిషన్ ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. ఇందుకు అధ్యక్షుని ఆమోదముద్ర పడితే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వేలాది మంది భారతీయ టెకీల కలలు ఫలిస్తాయి. మే 16న జరిగిన కమిషన్ సమావేశంలో భారత అమెరికన్ల నాయకుడు అజయ్ జైన్ భుటోరియా ఈ అంశాన్ని లేవనెత్తారు. గ్రీన్ కార్డు దరఖాస్తులన్నింటినీ ఆర్నెల్ల లోపు ప్రాసెస్ చేయాలని ప్రతిపాదించారు. అందుకు సమావేశానికి హాజరైన 25 మంది కమిషనర్లూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. భారత్ నుంచి హెచ్–1బీ మీద అమెరికాకు వెళ్లిన నిపుణులైన టెకీలు ప్రస్తుత ఇమిగ్రేషన్ విధానం వల్ల అత్యధికంగా నష్టపోతున్నారు. గ్రీన్ కార్డుల జారీకి అనుసరిస్తున్న ‘ఒక దేశానికి 7 శాతం కోటా’ విధానంతో వారికి బాగా నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ ప్రాసెస్ చేసి అర్హులకు వీలైనంత త్వరగా గ్రీన్ కార్డు మంజూరు చేసేలా ముందడుగు పడింది.
ఏటా భారీగా గ్రీన్ కార్డుల వృథా
ఒక దేశానికి 7 శాతం కోటా కారణంగా ఏటా భారీగా గ్రీన్ కార్డులు వృథా అవుతున్నాయి. 2021లో అందుబాటులో ఉన్న 2.26 లక్షల కార్డుల్లో 65,452 మాత్రమే మంజూరు చేశారు. మరోవైపు గత ఏప్రిల్ నాటికి ఏకంగా 4,21,358 గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు భుటోరియా కమిషన్ దృష్టికి తెచ్చారు. దాంతో ఈ పెండింగ్ భారం తగ్గించడానికి అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్‌సీఐఎస్)కు పలు చర్యలను అడ్వైజరీ కమిషన్ సిఫార్సు చేసింది. ‘‘2022 ఆగస్టు నుంచి 3 నెలల్లోపు గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఇంటర్వూ్యల సంఖ్యను రెట్టింపు చేయాలి. అందుకోసం నేషనల్ వీసా సెంటర్ అదనపు సిబ్బందిని నియమించుకోవాలి. దరఖాస్తుల పరిష్కారాన్ని 2023 ఏప్రిల్ కల్లా 150 శాతానికి పెంచాలి. ఆ తర్వాత నుంచి గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను ఆర్నెల్ల లోపు పూర్తి చేయాలి. వర్క్ పర్మిట్లు, ట్రావెల్ డాక్యుమెంట్లు, తాత్కాలిక హోదా పొడిగింపులు, మార్పుచేర్పు అభ్యర్థనలను మూడు నెలల్లోపు పరిష్కరించాలి. నెలన్నర లోపే ప్రక్రియ పూర్తి చేసేలా ప్రీమియం ప్రాసెసింగ్‌నూ అందుబాటులోకి తేవాలి’’ అని పేర్కొంది.