Krishnadevaraya Polytechnic College: పూర్వ విద్యార్థుల కృషి అభినందనీయం
జనవరి 28న కళాశాల ఆవరణలో 1959 నుంచి 2024 వరకు చదువుకున్న, చదివే విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఇక్కడి కళాశాలలో చదువుకున్న వారంతా నేడు దేశ విదేశాల్లో స్థిరపడ్డారని, కళాశాలపై మక్కువతో ఉదారంగా విరాళాలు అందించడం హర్షణీయమన్నారు.
ప్రభుత్వం తరుఫున కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని, వందలాది మంది పూర్వ విద్యార్థుల నడుమ గడపడం తన విద్యార్థి దశ గుర్తుకొస్తుందని పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. పూర్వ విద్యార్థి, రాష్ట్ర పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి పి.బీసీరెడ్డి మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు సత్వరమే విడుదలయ్యేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. అంతకుముందు పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను పూర్వ విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
చదవండి: SP Success Story : బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేశా.. 'ఐపీఎస్' కొట్టానిలా.. కానీ..
కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ రఘు, ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ముఖ్యఅతిథులు హన్మంతరావు, కుమారస్వామి, వెంకటేష్ యాదవ్, దురిశెట్టి, మనోహర్, నరేష్, మనోరంజన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఒకేచోట చేరి ఆప్యాయంగా పలకరించుకుంటూ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడపడం కనిపించింది. అప్పటి పాలిటెక్నిక్ కళాశాల శోభ, అధ్యాపకులు పాఠాలు బోధించిన తీరు, వ్యక్తిగత, కుటుంబ విషయాలు పంచుకున్నారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఒక బ్యాచ్ విద్యార్థులందరూ కలుసుకుంటారు. కానీ అందుకు భిన్నంగా కళాశాల ప్రారంభం నుంచి నేటి విద్యార్థుల వరకు అందరూ కలిసేలా ఏర్పాటు చేసిన తొలి ఆత్మీయ సమ్మేళనం ఇదే. ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రస్థాయిలో వివిధ హోదాల్లో ఉండి ఇక్కడ చదువుకున్న విద్యావంతులు, అధికారులు, ఉద్యోగులు ఇలా అన్నివర్గాల వారు హాజరుకావడం విశేషం.