Civils Free Coaching: సివిల్స్‌లో మెరిసేలా.. ఉచిత శిక్షణ..
దీనిలో భాగంగా ఆల్ ఇండియా సర్వీస్ పరీక్షకు ఉచితంగా అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకు సంబంధించి ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే ప్రణాళికపరంగా చర్యలు చేపట్టారు.
శిక్షణ పొందేందుకు ప్రాథమిక పరీక్ష ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు డిసెంబర్ 3న తుది పరీక్ష నిర్వహించారు. ఎంపికై న అభ్యర్థులకు రంపచోడవరంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో తొమ్మిది నెలలు పాటు ఉచిత శిక్షణ ఇస్తామని ఐటీడీఏ అధికారవర్గాలు తెలిపాయి.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
శిక్షణకు ఏర్పాట్లు
రంపచోడవరం ఐటీడీఏలో గిరిజన యువతకు సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలు రాసేందుకు శిక్షణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో, ఉత్తమమైన శిక్షణ ఇచ్చేలా పీవో సూరజ్ గనోరే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో శిక్షణ ఇప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
వీరితో పాటు న్యూఢిల్లీ, విశాఖ, హైదరాబాద్ కేంద్రాలుగా సివిల్స్ సర్వీసెస్‌కు శిక్షణ ఇస్తున్న 21 సెంచరీ వారు కూడా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో భాగస్వామ్యులు కానున్నారు.
తుది దశకు అభ్యర్థుల ఎంపిక
సివిల్ శిక్షణకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని అభ్యర్థులు రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహణ పూర్తి చేశారు. పరీక్ష రాసేందుకు 499 మంది దరఖాస్తు చేసుకోగా 422 మంది అభ్యర్ధులు ప్రాధమిక పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 150 మంది అర్హత సాధించారు.
చింతూరు డివిజన్‌కు సంబంధించి 145 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 51 మంది ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించారు. చింతూరు, రంపచోడవరం వైటీసీల్లో డిసెంబర్ 3న నిర్వహించిన పరీక్షకు 200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తుది ఫలితాలు ఈనెల 5వ తేదీన ప్రకటిస్తారు.
8,9 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి శిక్షణ కోసం రెండు డివిజన్‌ల్లోను 75 మందిని ఎంపిక చేస్తారు. డిసెంబరు 15 తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి.తొమ్మిది నెలలపాటు నిర్వహించే ఈ శిక్షణకు దాదాపుగా రూ.30 లక్షలకు పైగా రంపచోడవరం ఐటీడీఏ వెచ్చిస్తోంది.
యువతకు ఎంతో మేలు
డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలకు కోసం ఎదురు చూస్తున్న గిరిజన యువతకు సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ కోసం పరీక్ష నిర్వహించడం చాలా సంతోషం. శిక్షణ కోసం కృషి చేసిన పీవోకు గిరిజన యువత రుణపడి ఉంటుంది. శిక్షణకు ఎంపికవుతామని నమ్మకం ఉంది.
– గొర్లె రాజేష్, ధారగెడ్డ, వై.రామవరం మండలం
శిక్షణ అభినందనీయం
సివిల్ సర్వీసెస్, గ్రూప్–1, గ్రూప్–2, ఉద్యోగాలకు శిక్షణ పొందాలంటే వేలల్లో ఖర్చవుతుంది. ఈ ప్రాంతంలో గిరిజనులు అంత ఖర్చు పెట్టి శిక్షణ పొందాలంటే చాలా కష్టమైన పని. రంపచోడవరం ఐటీడీఏ పీవో శిక్షణకు శ్రీకారం చుట్టడం అభినందనీయం.
–జర్తా జోగి రత్నం, తుంగమడుగుల, అడ్డతీగల మండలం
గిరి యువత సత్తా చాటాలి
గిరిజన యువత సివిల్స్, గ్రూప్స్ ఉద్యోగాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో శిక్షణ ఏర్పాటు చేస్తున్నాం. అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆశయానికి తగ్గట్టుగా మంచి ఫలితాలు సాధించి సత్తా చాటుతారని ఆశిస్తున్నాం.
– సూరజ్‌గనోరే, పీవో రంపచోడవరం ఐటీడీఏ