Narendra Modi: ఉద్యోగ నియామకాల్లో అవినీతి, బంధుప్రీతి అంతం
ఆ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి తుది ఫలితాలు ప్రకటించే దాకా మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ చేశామని వివరించారు. నియామకాల ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా, పక్షపాత రహితంగా మార్చామని అన్నారు. గ్రూప్–సి, గ్రూప్–డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు చేశామని తెలిపారు.
గత తొమ్మిదేళ్ల బీజేపీ పరిపాలనలో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పుంజుకుందని ఉద్ఘాటించారు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు(మే 16)న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని గుర్తుచేశారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ స్ఫూర్తితో తమ ప్రయాణం ఆనాడే మొదలైందన్నారు. ‘వికసిత్ భారత్’ కోసం శ్రమిస్తున్నామని చెప్పారు. ఇదే రోజు సిక్కిం రాష్ట్రహోదా పొందిందని వివరించారు.
దేశమంతటా కొత్త ఉద్యోగాల సృష్టి
మన దేశంలో 2018–19 నుంచి ఇప్పటిదాకా 4.5 కోట్ల మంది ఉద్యోగాలు పొందారని, ఈపీఎఫ్‌ఓ గణాంకాలను బట్టి ఈ విషయం నిరూపణ అవుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) పెరుగుతున్నాయని, మన ఎగుమతులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని, దేశంలో ప్రతిమూలనా కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ మద్దతుతో కొత్త కొత్త రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఉద్యోగాల స్వరూప స్వభావాలు మారిపోతున్నాయని వెల్లడించారు. ఇకస్టార్టప్ రంగం ఆకాశమే హద్దుగా ఎదుగుతోందని అన్నారు. 2014 కంటే ముందు దేశంలో కేవలం కొన్ని వందల సంఖ్యలో స్టార్టప్ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య లక్షకు చేరిందని తెలియజేశారు. స్టార్టప్ కంపెనీల్లో 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు.
యువత సంక్షేమం, అభివృద్ధి పట్ల తమ అంకితభావం, చిత్తశుద్ధికి రోజ్‌గార్ మేళాలే నిదర్శనమని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని వివరించారు. పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు. దేశంలో ఇప్పుడు యూనివర్సిటీల సంఖ్య 1,100కు, మెడికల్ కాలేజీల సంఖ్య 700కు చేరిందన్నారు.