Army: ‘అగ్నివీర్’ ర్యాలీ తేదీలు ఇవే.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..
రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ ర్యాలీ గతంలో సూర్యాపేటలో జరగగా ఈసారి ఖమ్మంను ఎంచుకున్నారు. ఏడురోజుల పాటు జరిగే ర్యాలీలో ఇప్పటికే రాతపరీక్షలో అర్హత సాధించిన 7397మంది అభ్యర్థులు పాల్గొంటారు. ఈమేరకు వివరాలను కల్నల్ కీట్స్ కె.దాస్, కలెక్టర్ వీ.పీ.గౌతమ్, సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆగస్టు 16న ఖమ్మంలోని డీపీఆర్‌సీ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
చదవండి: Fake Jobs: ఆర్మీలో ఉద్యోగాల పేరిట రూ.6 కోట్ల టోకరా
తెల్లవారుజామునే మొదలు
వచ్చే 1నుంచి 7వ తేదీ వరకు ప్రతిరోజు తెల్లవారుజామున 2–30గంటలకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ర్యాలీ ప్రారంభమవుతుందని కల్నల్ దాస్ వెల్లడించారు. అయితే, రోజుకు వెయ్యి నుంచి 1,200 మంది అభ్యర్థులకు పోటీ ఉంటుందని.. అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లోనే హాజరుకావాలని సూచించారు.
ఇందుకోసం అభ్యర్థుల అడ్మిట్ కార్డులో హాజరు కావాల్సిన తేదీ, సమయం పొందుపర్చామన్నారు. ర్యాలీకి కావాల్సినట్లుగా మైదానంలో ఏర్పాట్లు, తాగునీటి వసతి, సీసీ కెమెరాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 1.6 కిమీ. పరుగు పందెం, ఇతర పోటీలతో పాటు ఎత్తు, బరువు, ఛాతి కొలతలు తీయడమే కాక సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయని కల్నల్ చెప్పారు.
చదవండి: Indian Air Force Recruitment 2023: భారత వాయుసేనలో అగ్నివీర్ నియామకాలు.. ఎంపిక విధానం ఇలా..
దళారుల మాటలు నమ్మొద్దు
రిక్రూట్‌మెంట్‌కు ర్యాలీ సంబంధించిన విషయంలో అభ్యర్థులెవరు కూడా మధ్యవర్తుల మాటలు నమ్మొద్దని ఆయన సూచించారు. పోటీలు, ఎంపిక పారదర్శకంగా సాగుతాయని చెప్పారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఈవెంట్లలో పాస్ చేయిస్తామని నమ్మబలికితే వారి వివరాలను సమీప పోలీసుస్టేషన్‌లో అందజేయాలని సూచించారు.
ప్రతిరోజు వెయ్యి నుంచి 1,200మంది అభ్యర్థులకు ర్యాలీ ఉంటుందని, నిర్దేశిత తేదీన తెల్లవారుజామున 2–30గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంకు రావాలని తెలిపారు. కాగా, స్టేడియంలో 150మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని ఆయన వివరించారు.
ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి
అభ్యర్థులు అడ్మిట్ కార్డ్స్‌లో సూచించిన తేదీ, సమయానికి హాజరుకావాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, విద్యార్హతల సర్టిఫికెట్ల ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్, అఫిడవిట్, స్థానికత/నివాస, కుల ధృవీకరణ పత్రాలు, ఆధార్‌కార్డ్, పాన్ కార్డ్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇతర అవసరమైన అన్ని సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలి.
తొలుత అగ్నివీర్ ర్యాలీ నిర్వహణపై కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు ఎస్.వారియర్‌తో ఆర్మీ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఆర్మీ మేజర్ శీతల్‌కుమార్, సబ్ మేజర్ శివాజీలాల్, లైజన్ అధికారి వీ.వీ.నాయుడు, ఎస్‌ఆర్.పుష్కర్, ఖమ్మం ఆర్డీఓ జి.గణేష్, డీఎంహెచ్‌ఓ బి.మాలతి, ఆర్ అండ్ బీ ఈఈ శ్యాంప్రసాద్, ఏసీపీలు గణేష్, ప్రసన్నకుమార్, సారంగపాణి, డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ మల్లీశ్వరి, డీవైఎస్‌ఓ సునీల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ డీఈ రంగారావు, తహసీల్దార్ శైలజ తదితరులు పాల్గొన్నారు.