Skip to main content

Board Exams Conducted Twice a Year: 10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు

న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
Board Exams Conducted Twice a Year
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు

 రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్‌ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అక్టోబ‌ర్ 8న‌ పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌సీఎఫ్‌)   సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్‌ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్‌ స్కోర్‌ సాధించొచ్చు. ఈ ఆప్షన్‌ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు.

చదవండి: CBSE Board Class 10 Exams: ఈ టాప్ కీ పాయింట్‌లు గుర్తుంచుకోండి!

ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్‌ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు.

రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్‌ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్‌ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు.   2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు.

చదవండి: Single Girl Child Scholarship 2023: సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌–2023.. ఎవరు అర్హులంటే..

డమ్మీ స్కూల్స్‌ పనిపడతాం

రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్‌ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం.

విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్‌లో అడ్మిట్‌ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు.

పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు.

Published date : 09 Oct 2023 01:34PM

Photo Stories