అనుభవం + నైపుణ్యం.. అప్రెంటీస్‌షిప్
Sakshi Education
ఎంచుకున్న రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు ప్రద ర్శించేవారు... ఇతరుల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందుంటారు. దీనికి జాబ్‌మార్కెట్ కూడా అతీతం కాదు. అప్రెంటీస్‌షిప్‌తో తరగతి గదిలో నేర్చుకున్న అకడమిక్ నైపుణ్యాలను వృత్తినైపుణ్యాలుగా మార్చుకోవచ్చు. ఫలితంగా ఉద్యోగ ఔత్సాహికులు అవకాశాలను అందుకునేందుకు కావాల్సిన అర్హతలు సాధించవచ్చు. ఈ నేపథ్యంలో కెరీర్ పరంగా అప్రెంటీస్‌షిప్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం...
స్కిల్ ఇండియా... స్కిల్ గ్యాప్‌కు చెక్
అప్రెంటీస్‌షిప్ ప్రాధాన్యం:
డీజీఈటీ అప్రెంటీస్‌షిప్ స్కీం:
బోర్డ్స్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్:
టెక్నీషియన్ అప్రెంటీస్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్లలో డిప్లొమా
టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్: ఒకేషనల్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత
వెబ్సైట్: www.mhrdnats.gov.in
పీఎంకేవీవై.. మరింత ప్రత్యేకం:
అన్ని విభాగాలు:
నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్:
అప్రెంటీస్‌షిప్ ప్రయోజనాలు
- ‘స్కిల్ గ్యాప్’.. ఇండస్ట్రీ వర్గాల నుంచి నిరంతరం వినిపించే మాట! ‘కోర్సు పూర్తయింది... కానీ, ఉద్యోగం లభించట్లేదు. ఎక్కడికెళ్లినా వృత్తికి సంబంధించిన వాస్తవ పరిస్థితుల అనుభవం గురించే అడుగుతున్నారు’ ఇది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న చాలా మంది ఔత్సాహికులు స్పందన.
- ఇండస్ట్రీ, ఉద్యోగ ఔత్సాహికులు మధ్య ఏర్పడిన గ్యాప్‌ను పూరించేందుకు అప్రెంటీస్‌షిప్ చక్కగా ఉపయోగపడుతుంది.
- ముఖ్యంగా టెక్నికల్ కోర్సుల విద్యార్థు స్కిల్ గ్యాప్ సమస్యకు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్‌తో సరైన పరిష్కారం లభిస్తోంది.
- ఆన్ జాబ్ ట్రైనింగ్, రియల్ టైం ఎక్స్పీరియన్స్, ఆర్థిక తోడ్పాటులతో పాటు భవిష్యత్తు అవకాశాలను మరింత మెరుగు పరచుకునేందుకు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ దోహదపడుతుంది.
- ‘మేక్ ఇన్ ఇండియా... స్కిల్ ఇండియా.. స్టార్టప్ ఇండియా’ కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యాంశాల్లో ముందు వరుసలో ఉన్నాయి. ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే.. నైపుణ్యాలున్న మానవ వనరులు తప్పనిసరి.
- దేశ అవసరాలకు అనుగుణంగా యువతకు జాబ్ స్కిల్స్ అందించడమే కాకుండా ప్రపంచానికి కూడా నిపుణులైన మానవనరులను అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది.
- స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి 40 కోట్ల మందికి ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
అప్రెంటీస్‌షిప్ ప్రాధాన్యం:
- టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాల ఆవశ్యకత రోజురోజుకీ పెరుగుతోంది. ఐటీఐ నుంచి ఐఐటీ వరకు... ప్రాక్టికల్ నైపుణ్యాలు ఉన్నవారికే కంపెనీలు నుంచి ఆఫర్ లెటర్లు అందుతున్నాయి.
- కోర్సు పూర్తయ్యాక సంబంధిత కోర్సుకు సంబంధించిన ఏదైనా ఒక పరిశ్రమలో నిర్ణీత వ్యవధిలో శిక్షణ పొందడమే అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ సమయంలో మెరుగైన పనితీరు కనబరిస్తే అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి.
- ప్రాక్టికల్ నైపుణ్యాలు నేర్పించడంలో కీలకంగా నిలుస్తోంది అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్. ఇప్పుడు ఔత్సాహికులకు అప్రెంటీస్ పరంగా అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
- టెక్నికల్ కోర్సులకే పరిమితమైన అప్రెంటీస్ ఇప్పుడు అకౌంటింగ్, ట్యాక్సేషన్, హోటల్ మేనేజ్మెంట్.. ఇలా ప్రాక్టికల్ నైపుణ్యాలు అవసరమైన ప్రతి విభాగంలోనూ లభిస్తున్నాయి. ముఖ్యమైన అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ల వివరాలు..
డీజీఈటీ అప్రెంటీస్‌షిప్ స్కీం:
- ఇది జాతీయ స్థాయిలో కార్మిక శాఖ అమలు చేస్తున్న పథకం. ఈ పథకం అప్రెంటీస్‌షిప్ యాక్ట్-1961 ప్రకారం డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో అమలవుతోంది.
- ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలకు సంబంధించిన ప్రాక్టికల్ నైపుణ్యాలను అందుకోవచ్చు. ఐటీఐ, ఒకేషనల్ ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్, బీటెక్ ఉత్తీర్ణులు అప్రెంటీస్ ట్రైనింగ్‌కు అర్హులు.
- అభ్యర్థుల అర్హతలు, ఎంపిక చేసుకున్న శిక్షణ ఆధారంగా ట్రైనింగ్ వ్యవధి ఉంటుంది. ఈ ట్రైనింగ్‌లో ప్రస్తుతం 259 ట్రేడ్లలో శిక్షణ లభిస్తోంది. బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు 126 సబ్జెక్ట్‌లలో ఏడాది వ్యవధిలో ట్రైనింగ్ ఉంటుంది.
- అప్రెంటీస్ ట్రైనింగ్ సమయంలో బీటెక్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4984; డిప్లొమా, ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీలకు రూ. 3542; ఒకేషనల్ అప్రెంటీస్ ట్రైనీలకు రూ. 2758 చొప్పున స్టయిఫండ్ అందిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు డీజీఈటీ ఆధ్వర్యంలోని రీజనల్ డెరైక్టరేట్ ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
- అభ్యర్థుల అర్హతల ఆధారంగా అప్పటికే తమ వద్ద నమోదు చేసుకున్న సంస్థల అవసరాలకు సరితూగే అభ్యర్థులను సదరు సంస్థల్లో అప్రెంటీస్ ట్రైనీలుగా తీసుకుంటారు.
- పరిశ్రమల్లో నిర్ణీత వ్యవధిలో అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేసి.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ నిర్వహించే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ కూడా లభిస్తోంది.
బోర్డ్స్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్:
- కేంద్ర మానవ వనరుల శాఖ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ కోసం ‘బోర్డ్స్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్’ను రూపొందించింది. ఈ ప్రోగ్రామ్ పరిధిలో ఇంజనీరింగ్ / టెక్నాలజీలో 122 విభాగాల్లో అప్రెంటీస్ చేసే అవకాశముంది.
- ఔత్సాహిక అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా ఖాళీలు ఉన్న సంస్థల్లో అవకాశం లభిస్తుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ అందిస్తారు. దేశవ్యాప్తంగా నాలుగు రీజనల్ సెంటర్ల ద్వారా బోర్డ్స్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అమలవుతోంది.
- దక్షిణభారత దేశానికి సంబంధించి చెన్నైలోని బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ సెంటర్ ఈ ప్రోగ్రామ్ అమలును పర్యవేక్షిస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ స్కీం ద్వారా ట్రైనింగ్ పొందేందుకు ఉండాల్సిన అర్హతల వివరాలు..
టెక్నీషియన్ అప్రెంటీస్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్లలో డిప్లొమా
టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్: ఒకేషనల్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత
వెబ్సైట్: www.mhrdnats.gov.in
పీఎంకేవీవై.. మరింత ప్రత్యేకం:
- మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియాలను లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్/ఆన్ జాబ్ ట్రైనింగ్ ద్వారా యువతలో స్కిల్స్ పెంచేందుకు ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన (పీఎంకేవీవై) పథకాన్ని ప్రారంభించింది.
- 2022 నాటికి 40 కోట్ల మందికి ప్రాక్టికల్ స్కిల్స్ అందించే లక్ష్యంలో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా ప్రైవేటు సంస్థలతో సైతం ఒప్పందాలు కుదుర్చుకుని అభ్యర్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించడం జరుగుతోంది.
- నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ ట్రైనింగ్ సంస్థల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఎనిమిదో తరగతి నుంచి బీటెక్ వరకు అన్ని కోర్సుల విద్యార్థులు పీఎంకేవీవై ద్వారా శిక్షణ పొందవచ్చు
- అభ్యర్థుల అర్హత, ఎంపిక చేసుకున్న శిక్షణ స్థాయిని బట్టి నిర్ణీత వ్యవధిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సర్టిఫికెట్ కూడా అందుకోవచ్చు. ఇందులో భాగంగా రూ. 8 వేల వరకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్‌ఎస్‌డీసీతో ఒప్పందం కుదుర్చుకున్న ట్రైనింగ్ కేంద్రాల్లో మాత్రమే శిక్షణ పొందాలి.
అన్ని విభాగాలు:
- పీఎంకేవీవై ద్వారా ఇంజనీరింగ్/సాంకేతిక విభాగాలకు చెందిన వారే కాకుండా.. అగ్రికల్చర్, మీడియా, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, బీఎఫ్ఎస్ఐ వంటి నాన్-టెక్నికల్ రంగాల్లోనూ శిక్షణ పొందవచ్చు. పీఎంకేవీవై ద్వారా మొత్తం 33 రంగాల్లోని ఔత్సాహిక అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నారు.
- ఒక అభ్యర్థి తన విద్యార్హతలకు సరితూగే రంగంలోనే కాకుండా.. ఇతర రంగాల్లో కూడా శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత శిక్షణ పూర్తయ్యాక నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్ లభిస్తుంది.
- శిక్షణ సమయంలో ఎన్ఎస్డీసీ ట్రైనింగ్ పార్ట్నర్స్కు చెల్లించాల్సిన ఫీజు కూడా లోన్ ద్వారా అందిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధానమంత్రి కౌశల్ రుణ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. రెండు నెలల వ్యవధి నుంచి మూడేళ్ల వ్యవధి గల అన్ని కోర్సులకు ఈ రుణ సదుపాయం లభిస్తుంది.
నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్:
- ఇది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని మరో అప్రెంటీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీని ద్వారా ఐటీఐ, ఒకేషనల్ ఇంటర్మీడియెట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు క్షేత్ర నైపుణ్యాలు అందుకోవచ్చు.
- ఏడాది వ్యవధిలో ఉండే ఈ ట్రైనింగ్‌లో ప్రస్తుతం గ్రాడ్యుయేట్/డిప్లొమా స్థాయిలో 126 విభాగాలు, ఒకేషన్ ఇంటర్మీడియెట్ స్థాయిలో 128 విభాగాల్లో అప్రెంటీస్ ట్రైనింగ్ అందుబాటులో ఉంది.
- ఔత్సాహిక అభ్యర్థులు వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకుంటే ఆయా సంస్థల్లో అప్రెంటీస్ ట్రైనింగ్ అవకాశం కల్పిస్తారు.
అప్రెంటీస్‌షిప్ ప్రయోజనాలు
- అకడమిక్ నైపుణ్యాలకు క్షేత్ర స్థాయిలో మెరుగులు దిద్దుకోవచ్చు.
- పనితీరు బాగుంటే శాశ్వత కొలువు సొంతమయ్యే అవకాశం.
- స్టయిఫండ్ ద్వారా ఆర్థిక ప్రోత్సాహకం.
- ఎన్ఎస్డీసీ, పీఎంకేవీవై వంటి పథకాల ద్వారా ప్రైవేట్ ట్రైనింగ్‌కు రుణ సదుపాయం.
- వృత్తి శిక్షణలో 8వ తరగతి నుంచి బీటెక్ వరకు అప్రెంటీస్ ట్రైనింగ్‌కు అవకాశాలు.
అవకాశాలు మెరుగవుతాయి... ఐటీఐ, ఒకేషనల్, పాలిటెక్నిక్, బీటెక్ తదితర కోర్సుల ఉత్తీర్ణులు.. అప్రెంటీస్ ట్రైనింగ్ ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. కోర్సు సమయంలో లభించని వృత్తి నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు అప్రెంటీస్ ట్రైనింగ్ దోహదం చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం అప్రెంటీస్ ట్రైనింగ్ అందించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. నేషనల్ అప్రెంటీస్ యాక్ట్ ప్రకారం- పారిశ్రామిక సంస్థలు తప్పనిసరిగా అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవలనే నిబంధన ఉంది. అదే విధంగా అప్రెంటీస్ ట్రైనీలకు ఇచ్చే స్టయిఫండ్ మొత్తాలను పెంచడం వంటి చర్యలు అప్రెంటీస్ ట్రైనింగ్ వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా పరిశ్రమ అవసరాలకు సరితూగే నైపుణ్యాలను సొంతం చేసుకునే అవకాశం కలుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు అప్రెంటీస్ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి. - టి.వి.ఎల్.ఎన్.రావు, డెరైక్టర్, ఏటీఐ, హైదరాబాద్ |
Published date : 06 Nov 2015 12:06PM