Skip to main content

అపార జ్ఞానాన్ని అందించే ఆన్‌లైన్ కోర్సులు..

అమెరికాలో ఉన్న ఎంఐటీ ప్రొఫెసర్ నుంచి కంప్యూటర్ బేసిక్స్, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నుంచి తత్వ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అది కూడా ఉచితంగా ఇంట్లోనే కూర్చున్న చోటునుంచి కదలకుండా! ఇదెలా వీలవుతుంది అని అనుకుంటున్నారా! ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థుల ఆశలను నెరవేర్చడమే లక్ష్యంగా ఎన్నో సంస్థలు ఆన్‌లైన్ ద్వారా ఉచిత కోర్సులను అందిస్తున్నాయి. వీటి ద్వారా ఏ సబ్జెక్ట్, ఏ కోర్సుకు సంబంధించిన అంశాలనైనా ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా సులువుగా నేర్చుకోవచ్చు. వాటి వివరాలు..

మీరు హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. లేదా మరేదో కోర్సు అభ్యసిస్తున్నారు. మీ సబ్జెక్టుకు సంబంధించి మీకెన్నో సందేహాలున్నాయి. మీరు చదువుతున్న కోర్సుకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న మార్పులు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అది కూడా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ విద్యా సంస్థల ప్రొఫెసర్లు, విద్యావేత్తల నుంచి. మీరేమో ఇక్కడ. వారేమో అక్కడ. మరెలా? ఈ నేపథ్యంలో మీలాంటి విద్యార్థులను ఆన్‌లైన్ ద్వారా సంబంధిత కోర్సుల్లో.. సబ్జెక్టుల్లో నిష్ణాతులను చేసే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు, యూనివర్సిటీలు, విద్యావేత్తలు ఆన్‌లైన్ విద్యా విధానంలో ఓ సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చాయి. అదే ఓపెన్‌కోర్స్‌వేర్. ప్రపంచంలోనే ప్రముఖ విద్యా సంస్థల్లో పనిచేసే ప్రముఖ ప్రొఫెసర్లు, విద్యావేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఉచితంగా ఆన్‌లైన్‌లో కోర్సులను బోధించడమే ఈ ఓపెన్‌కోర్స్ వేర్. దీనివల్ల ప్రపంచం నలుమూలల్లో ఏ ప్రాంతం నుంచైనా విద్యార్థులు తమకు కావలసిన సంబంధిత సబ్జెక్టుల పాఠాలు, అంశాలను ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా వివిధ కోర్సులను అందించే వాటి గురించి తెలుసుకుందాం.
---------------------------------------------------

టఫ్ట్స్ ఓపెన్ కోర్స్‌వేర్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, విద్యార్థులతోపాటు స్వయంగా నేర్చుకునేవారి కోసం టఫ్ట్స్ యూనివర్సిటీ రూపొందించిన ఉచిత ఆన్‌లైన్ ప్రాజెక్ట్.. టఫ్ట్స్ ఓపెన్ కోర్స్‌వే ర్. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఆన్‌లైన్ ద్వారా రూపొందించిన ఉచిత విద్యా విధానంలో భాగమే ఈ టఫ్ట్స్ ఓపెన్ కోర్స్‌వేర్.
ప్రవేశం: ఇందులో లభ్యమయ్యే కోర్సులన్నింటి ని ఉచితంగా పొందొచ్చు. ఇందులో వివిధ రకాల సబ్జెక్టులు, వాటి సిలబస్‌లు, ప్రాజెక్టులు, లెర్నింగ్ యూనిట్లు, అనుబంధ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: https://ocw.tufts.edu
---------------------------------------------------

ఎంఆర్ యూనివర్సిటీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం
జార్జి మాసన్ యూనివర్సిటీకి చెందిన టైలర్ కొవెన్, అలెక్స్ టేబరాక్ అనే ఇద్దరు అర్థశాస్త్ర ప్రొఫెసర్లు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ ఈ ఎంఆర్ యూనివర్సిటీ. ఇందులో వివిధ కోర్సులకు సంబంధించిన వీడియోలు మొదలైనవి ఉంటాయి. వీటన్నింటిని ఉచితంగా పొందొచ్చు. ఈ వీడియోలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ల ద్వారా, స్పీకర్ వాయిస్ ఓవర్లల ద్వారా రూపొందించారు. వీడియోనే కాకుండా ఆడియోను విడిగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.
ప్రవేశం ఇలా: ఇందులో వీడియోలను, మెటీరియల్‌ను పొందడానికి ప్రత్యేకంగా రిజిస్టర్ అవసరం లేదు. అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నవారికి సంబంధిత పరీక్ష తర్వాత కోర్సు పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్ ఇస్తారు.
వెబ్‌సైట్: https://mruniversity.com
---------------------------------------------------

ఓపెన్.మిచిగన్ ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్
ప్రపంచవ్యాప్తంగా వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థులతోపాటు, అధ్యాపకులు, విద్యార్థులు, ఇతరులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి ఏర్పాటైన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ ఈ ఓపెన్.మిచిగన్ ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. ఈ పోర్టల్ పూర్తిగా సంబంధిత సబ్జెక్ట్ కంటెంట్‌ను మాత్రమే అందిస్తోంది తప్ప, ఎలాంటి డిగ్రీలను, సర్టిఫికెట్లను అందించదు. మిచిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో ఏర్పాటైన ఈ వెబ్‌సైట్‌ను అధ్యాపకులు, విద్యార్థులు వారి సొంత రీసెర్చ్‌తోపాటు వివిధ అంశాలను నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

ప్రవేశం ఇలా: సంబంధిత వెబ్‌సైట్ హోంపేజీలో ఫైండ్ సెక్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఆయా కోర్సుల మెటీరియల్స్, వీడియోలు, సాఫ్ట్‌వేర్ టూల్స్ మొదలైనవాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://open.umich.edu
---------------------------------------------------

ఎడ్‌ఎక్స్ ప్రాజెక్ట్
వెబ్ ఆధారిత ఉన్నత చదువును అందించే ఉద్దేశంతో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) సంయుక్తంగా ఎడ్‌ఎక్స్ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశాయి. లాభాపేక్ష లేకుండా ఉన్నత చదువును విద్యార్థులకందించడమే ధ్యేయంగా ఈ ఎడ్‌ఎక్స్ ప్రాజెక్ట్ రూపుదాల్చింది. ఇది వివిధ సబ్జెక్టుల్లో ఆన్‌లైన్ క్లాసులను అందిస్తోంది.

ఎడ్‌ఎక్స్ అందిస్తున్న వివిధ సబ్జెక్టులు: లా, హిస్టరీ, సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్, సోషల్ సెన్సైస్, కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ హెల్త్ మొదలైనవి. ఇటీవల ఈ ఎడ్‌ఎక్స్ ప్రాజెక్ట్ ద్వారా ఐఐటీ-ముంబై వివిధ కోర్సులు అందించడానికి ముందుకొచ్చింది. కోర్సులు పూర్తిచేసి సర్టిఫికెట్లు పొందినవారికి వివిధ వర్సిటీలు, ఉద్యోగ కల్పన సంస్థలు ఉన్నత విద్య ప్రవేశాల సమయంలోనూ, ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి. విద్యార్థులు ఎడ్‌ఎక్స్ ఆన్‌లైన్ ద్వారా అందించే కోర్సులను రెండు విధాలుగా పొందొచ్చు. అవి..

1) కోర్సులో పేరు నమోదు చేసుకుని ఎసైన్‌మెంట్ సమర్పించి సంబంధిత పరీక్షలు రాసి ‘సర్టిఫికెట్ ఆఫ్ మాస్టరీ’ని పొందొచ్చు.

లేదా
2) సంబంధిత వెబ్‌సైట్‌లో కోర్సులను అనుసరించడం ద్వారా.

ప్రవేశం ఇలా: ఎడ్‌ఎక్స్ కోర్సులో ప్రవేశాలకు నమోదు చేసుకోవడం ద్వారా కోర్సులు చేయొచ్చు. కోర్సు కోసం నమోదు చేసుకున్నవారు మాత్రమే హోమ్‌వర్క్ ఎసైన్‌మెంట్లు సమర్పించడానికి, సంబంధిత పరీక్షలు రాయడానికి అర్హులు. ఈ విద్యార్థులు మాత్రమే సర్టిఫికెట్ ఆఫ్ మాస్టరీ పొందడానికి అర్హులు. సర్టిఫికెట్ అవసరం లేనివారు వీడియోల ద్వారా కూడా కోర్సులు పొందొచ్చు.
వెబ్‌సైట్: www.edx.org
---------------------------------------------------

ఖాన్ అకాడెమీ
పాఠశాల విద్యార్థుల కోసం తయారుచేసిన ఉచిత వీడియోలను అందించడంలో పేరుగాంచింది ఖాన్ అకాడెమీ. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సల్మాన్‌ఖాన్ ఈ అకాడెమీని రూపొందించారు. పది నిమిషాల నిడివిలో, అత్యంత సులువుగా విద్యార్థులకు అర్థమయ్యేటట్లు, వివిధ సబ్జెక్టులను విశదీకరించి రూపొందించిన ఆన్‌లైన్ వీడియోలు ఇందులో ఉంటాయి. తన స్నేహితులు, బంధువుల పిల్లలకు మ్యాథమెటిక్స్ చెప్పడం కోసం సూక్ష్మమైన ఆన్‌లైన్ టూల్స్‌ను ఉపయోగిస్తూ ఖాన్ రూపొందించిన ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత కాలంలో ఖాన్ రూపొందించిన ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ అకాడెమీగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ అకాడెమీ కొన్నివేల వీడియో పాఠాలను. మెటీరియల్స్‌ను, ఆయా సబ్జెక్టులకు సంబంధించిన వివిధ అంశాలను పూర్తి ఉచితంగా అందిస్తోంది.
ఖాన్ అకాడెమీ ఆన్‌లైన్‌లో ఉచితంగా అందిస్తున్న కొన్ని సబ్జెక్టులు: మ్యాథ్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, హ్యుమానిటీస్.

ప్రవేశం ఇలా: ఈ అకాడెమీలో చేరేవారు తమ ఈ-మెయిల్ అకౌంట్‌తో లాగిన్ కావాలి. తర్వాత హోం పేజీలో కనిపించే లెర్న్ సెక్షన్‌లోకి ప్రవేశించి విద్యార్థికి కావాల్సిన సబ్జెక్టు మీద క్లిక్ చేయాలి. అంతేకాకుండా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ తదితర అంశాలను కూడా ఈ అకాడెమీలో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.khanacademy.org
---------------------------------------------------

ఎంఐటీ ఓపెన్ కోర్స్‌వేర్
దాదాపుగా ఎంఐటీకి సంబంధించిన అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను, మెటీరియల్‌ను వెబ్‌ను ఆధారితంగా చేసుకుని ఉచితంగా అందిస్తుంది ఈ ఎంఐ టీ వర్సిటీ. ఈ వెబ్‌సైట్‌లో దాదాపుగా 2000కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల గణాంకాల ప్రకారం దాదాపు 125 మిలియన్ల సందర్శకులు దీని వల్ల లాభపడ్డారు. వీడియో, ఆడియో లెక్చర్స్, లెక్చర్ నోట్స్, అసెస్‌మెంట్స్, స్టూడెంట్ వర్క్, ఆన్‌లైన్ పాఠ్యపుస్తకాలు మొదలైనవి ఇందులో లభిస్తాయి.

ప్రవేశం ఇలా: సంబంధిత వెబ్‌సైట్ హోంపేజీలో కోర్సు సెక్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా విద్యార్థికి కావలసిన కోర్సులను అంశాలవారీగా పొందొ చ్చు.ఎంఐటీకి చెందిన క్రాస్ డిసిప్లినరీ కోర్సులు, అనువాద కోర్సులు ఈ విభాగంలో లభిస్తాయి.
వెబ్‌సైట్: https://ocw.mit.edu/index.htm
---------------------------------------------------

courseera.org
కళాశాలలు/యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు ఓపెన్ కోర్స్‌వేర్ అందిస్తున్న మరొక ముఖ్యమైన ఆన్‌లైన్ కోర్స్‌వేర్ కోర్సుఎరా.ఓఆర్‌జీ. ఇది ఒక విద్యా సంబంధిత కంపెనీ. ప్రపంచంలో ఉన్న వివిధ ప్రముఖ యూనివర్సిటీలు, సంస్థలతో భాగస్వామ్యం పొంది విద్యార్థుల కోసం ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులను అందిస్తోంది.

కోర్సుల వివరాలు: ప్రస్తుతం పోర్టల్ విస్తృత స్థాయిలో అందిస్తున్న సబ్జెక్టులు: హ్యుమానిటీస్, మెడిసిన్, బయాలజీ, సోషల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, బిజినెస్, కంప్యూటర్ సైన్స్ మొదలైనవి.
ప్రవేశం ఇలా: ఈ కోర్సుల కోసం విద్యార్థి సంబంధిత వెబ్‌సైట్‌లో ఈ-మెయిల్‌తో సైనప్ అవ్వాలి.ఆ తర్వాత కోర్సుల సెక్షన్‌లోకి వెళ్లి కావాల్సిన కోర్సును ఎంపిక చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.coursera.org/courses
---------------------------------------------------
ఉడెమి
ఉడెమి అనే ఆన్‌లైన్ లెర్నింగ్ వెబ్‌సైట్‌ను 2010లో ప్రారంభించారు. దీని ద్వారా అనేక కోర్సుల్లో విద్యనభ్యసించొచ్చు. ఇది రెండు రకాలుగా సేవలు అందిస్తోంది. ఇది పూర్తి ఉచితంగా లభించే పోర్టల్ కాదు. కొన్ని కోర్సులకు నిర్దేశించిన మేరకు రుసుం చెల్లించాలి. అదేవిధంగా మరికొన్ని కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు, కోర్సు ఫీజు ఆ కోర్సును బోధించే శిక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు వారికి కావలసిన కోర్సులను కేటగిరీలవారీగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సులు: బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అకడెమిక్స్, ఆర్ట్స్, హెల్త్ అండ్ ఫిట్‌నెస్, లాంగ్వేజ్, మ్యూజిక్, టెక్నాలజీ మొదలైనవి.

ప్రవేశం ఇలా: ఆన్‌లైన్ ద్వారా ఉచిత కోర్సుల కోసం విద్యార్థులు తమకు నచ్చిన కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత సైనప్‌ను కంటిన్యూ చేయాలి. ఫీజు చెల్లించి నేర్చుకునే కోర్సులకు నిర్దేశిత ఫీజులు చెల్లించాలి.
వెబ్‌సైట్: www.udemy.com/courses
---------------------------------------------------

ఉడాసిటీ
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన సెబాస్టియన్ త్రన్, పీటర్ నార్వింగ్ అనే ఇద్దరు ఫ్యాకల్టీలతో ‘ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పేరుతో ఉచిత ఆన్‌లైన్ కోర్సును అందించడానికి ఏర్పాటు చేసిందే ఈ ఉడాసిటీ. ప్రత్యేకంగా కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, సైకాలజీ, బిజినెస్ సబ్జెక్టుల్లో ప్రాథమిక, మధ్య, ఉన్నత స్థాయిల్లో ఆన్‌లైన్ కోర్సులకు ఒక మంచి ఆన్‌లైన్ ప్రత్యామ్నాయం ఈ ఉడాసిటీ. ఇప్పటివరకు 190 దేశాల నుంచి దాదాపు 1,60,000 మంది విద్యార్థులు ఈ ఉడాసిటీ అందించే కోర్సుల్లో నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోర్టల్ అత్యంత నాణ్యతతో కూడిన తరగతులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఉచితంగా అందిస్తోంది.
ప్రవేశం ఇలా: ఈ కోర్సుల కోసం విద్యార్థి తన వ్యక్తిగత ఈ-మెయిల్‌తో సైనప్ కావాలి. ఆ తర్వాత కోర్సుల కేటలాగ్‌లోకి ప్రవేశించి తనకు కావాల్సిన కోర్సును ఎంచుకోవచ్చు.
వెబ్‌సైట్: www.udacity.com
---------------------------------------------------

ఎన్‌పీటీఈఎల్
మన దేశంలో ఏడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీ-ముంబై, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-గువహటి, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-రూర్కీ); ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)-బెంగళూరు కలిసి నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్సెడ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్)ను ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించాయి. ఇందులో ఈ-లెర్నింగ్ ద్వారా నేర్చుకునేలా ఇంజనీరింగ్, సైన్స్ చదివే విద్యార్థుల కోసం కోర్సు మెటీరియల్‌ను అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్‌కు సంబంధించిన వివిధ సబ్జెక్టుల ఆన్‌లైన్ వెబ్ వీడియోలను ఇందులో పొందుపరిచారు.

మన దేశంలో ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తూ ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను పెంచడమే ఎన్‌పీటీఈఎల్ లక్ష్యం. ఇందులో ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్ వీడియో తరగతులు పూర్తి ఉచితంగా లభిస్తాయి. దేశంలో కళాశాలలు, యూనివర్సిటీలు సబ్‌స్క్రైబ్ చేసుకుని స్పెషల్ ప్యాకేజ్‌ను పొందొచ్చు. అంతేకాకుండా ఈ ఎన్‌పీటీఈఎల్ కోర్సులతో కళాశాలలు ప్రత్యేక ఆన్‌లైన్ లైబ్రరీని కూడా నిర్వహిస్తే విద్యార్థులకు మరింత మేలు కలుగుతుంది. ఇప్పటివరకు మన దేశంలో దాదాపు 710 ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లు ఈ ప్యాకేజ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నాయి.

ఎన్‌పీటీఎల్ పోర్టల్‌లో లభించే ఉచిత కోర్సులు: ఏరోస్పేస్, అట్మాస్ఫియరిక్ సైన్స్, ఆటోమొబైల్, బేసిక్ కోర్సులు (సెమ్-1, సెమ్-2), బయోటెక్నాలజీ, కెమికల్, కెమిస్ట్రీ-బయోకె మిస్ట్రీ, సివిల్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్, ఈసీఈ, ఇంజనీరింగ్ డిజైన్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, హ్యుమానిటీస్-సోషల్ సెన్సైస్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్, మెటలర్జి-మెటీరియల్ సైన్స్, మైనింగ్, నానో టెక్నాలజీ, ఓషన్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, టెక్స్‌టైల్ మొదలైనవి.

ప్రవేశం ఇలా: సంబంధిత వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. ఆ తర్వాత కావలసిన సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్‌నెట్ సదుపాయం లేనివారికి బయట డీవీడీల రూపంలో కూడా ఈ క్లాసులకు సంబంధించిన డీవీడీలు లభిస్తాయి. ఒక్కో టైటిల్ డీవీడీ 200 రూపాయలు. ఒక డీవీడీలో 30 నుంచి 45 వరకు లెక్చర్స్ ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌లో వీడియో చూడాలంటే ఫ్లాష్ వర్షన్ 9.0 లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సాఫ్ట్‌వేర్ అవసరం. వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తోపాటు ఫైర్‌ఫాక్స్, ఐ-ఈ7, సఫారీ లాంటి బ్రౌజర్లు అందుబాటులో ఉండాలి.
వెబ్‌సైట్: www.nptel.iitm.ac.in
---------------------------------------------------

లెర్న్‌స్ట్రీట్
అన్ని తరగతుల విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్న మరొక ఆన్‌లైన్ పోర్టల్ లెర్న్‌స్ట్రీట్. ఈ వెబ్‌సైట్ రూబీ, పైథాన్, జావా స్క్రిప్ట్‌లకు సంబంధించిన ప్రాథమిక స్థాయి కోర్సులను అందిస్తుంది. అదేవిధంగా నేర్చుకున్న కోర్సుకు సంబంధించి ప్రాక్టీస్ చేయడానికి ప్రాజెక్టులు, టీచర్ ప్రోగ్రామ్స్ కూడా లభిస్తాయి. ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉన్న వివిధ రకాల పద్ధతులను లెర్న్‌స్ట్రీట్ ద్వారా నేర్చుకోవడం వల్ల విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. అదేవిధంగా వివిధ రకాల గేమ్స్, టూల్స్, అల్గారిథమ్స్‌పై స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు.

ప్రవేశం ఇలా: ప్రాథమిక కోర్సులను యాక్సెస్ చేయడానికి నేరుగా హోంపేజ్‌లో ఉన్న కోర్సు సెక్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా సంబంధిత వివరాలను తెలుసుకోవచ్చు. తద్వారా జావా స్క్రిప్ట్‌లోని ఏడు పాఠాలు, పైథాన్‌కు చెందిన తొమ్మిది పాఠాలు, రూబీకి చెందిన 12 పాఠాలు పొందొచ్చు. వీటితోపాటు పాఠంలోని ప్రతి భాగానికి ఎక్సర్‌సైజులను కూడా ఇచ్చారు. ప్రాక్టీస్ సెక్షన్స్, టీచర్ ప్రోగ్రామ్స్ కోసం వ్యక్తిగత ఈ-మెయిల్ ద్వారా లాగిన్ కావాలి.
వెబ్‌సైట్: www.learnstreet.com
---------------------------------------------------

ఎన్నో ప్రయోజనాలు
ఆన్‌లైన్ టీచింగ్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఫ్యాకల్టీ ఆన్‌లైన్ ద్వారా లభిస్తారు. తరగతి గదిలో ఒక అధ్యాపకుడు చెప్పేది మాత్రమే వినగలరు. అదే ఆన్‌లైన్ ముందు ఎంతోమంది ఫ్యాకల్టీ చెప్పిన పాఠ్యాంశాలను చూడొచ్చు. అంతేకాకుండా ఒక ఫ్యాకల్టీ చెప్పిన పాఠం అర్థం కాకపోతే ప్రముఖ ప్రొఫెసర్లు చెప్పే విలువైన పాఠ్యాంశాలను మళ్లీమళ్లీ ఆన్‌లైన్ ద్వారా చూడొచ్చు. దేశంలో ఎన్నో కళాశాలలు ఫ్యాకల్టీ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ టీచింగ్ ద్వారా కీలకమైన సబ్జెక్టుల్లో ఫ్యాకల్టీ కొరతను అధిగమించవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా అమెరికాలోని మూడు యూనివర్సిటీలతో ఆన్‌లైన్ టీచింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తాం. అదేవిధంగా మిగిలిన వర్సిటీలు, కళాశాలలతో కూడా ఆన్‌లైన్ టీచింగ్ ద్వారా అనుసంధానం కావాలనే ఆలోచనలో ఉన్నాం. అయితే సంబంధిత సబ్జెక్టులకు సంబంధించి నాణ్యమైన ఫ్యాకల్టీని గుర్తించగలగాలి. అదేవిధంగా కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై అధ్యయనం కూడా చేపట్టాం.
Published date : 26 Jul 2013 03:19PM

Photo Stories