Skip to main content

విదేశాల్లోని ఎంబీఏ కోర్సుకు మహా క్రేజ్...

పేరుగాంచిన కళాశాలలు..చక్కటి మౌలిక వసతులు.. అత్యున్నత బోధనా రీతులు.. ప్రపంచవ్యాప్త ఆదరణ.. విసృ్తత అవకాశాలు.. ఆకర్షణీయ వేతనాలు.... విదేశాల్లోని
ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సు పట్ల క్రేజ్‌కు కారణాలివి... అందుకే, స్టడీ అబ్రాడ్‌గా ఎక్కువమంది విద్యార్థులు చదవాలనుకునే కోర్సుగానూ ఇది నిలుస్తోంది. అయితే.. దీనికి ‘విదేశాల్లో ఎంబీఏ లక్ష్యం’ ఒక్కటే సరిపోదు. దేశాలవారీ అత్యుత్తమ కళాశాలల వివరాలు తెలుసుకోవడం, ప్రవేశ ప్రక్రియపై అవగాహన పొందడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ‘ఎంబీఏ అబ్రాడ్’పై ఫోకస్..

అమెరికా :
మేనేజ్‌మెంట్ విద్యలోనూ అమెరికాదే అగ్రస్థానం. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ తదితర ప్రపంచ ప్రఖ్యాత బీస్కూళ్లు ఇక్కడ ఉన్నాయి. టాప్-100 బీస్కూళ్లలో 30కి పైగా అమెరికావే. వీటిలో ఎంబీఏ చేసినవారు అత్యున్నత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే ప్రవేశం అంత సులువేమీ కాదు. మన దేశంలోలా డిగ్రీ అనంతరం నేరుగా ఎంబీఏలో చేరడం యూఎస్‌లో సాధ్యం కాదు. చాలా యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్‌తో పాటు కనీసం రెండేళ్ల పని అనుభవానికి ప్రాధాన్యమిస్తున్నాయి. జీమ్యాట్‌లో 700పైగా స్కోర్ సాధించడం తప్పనిసరి.

ప్రముఖ విద్యాసంస్థలు....
హార్వర్డ్ బిజినెస్ స్కూల్
www.hbs.edu

స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్
www.gsb.stanford.edu

షికాగో యూనివర్సిటీ
www.chicagobooth.edu

కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
www.kellogg.northwestern.edu

పెన్సిల్వేనియా యూనివర్సిటీ
www.upenn.edu

కొలంబియా బిజినెస్ స్కూల్
www.columbia.edu

యూకే :
బిజినెస్ స్కూల్స్ పరంగా యూఎస్ తర్వాతి స్థానం యునెటైడ్ కింగ్‌డమ్‌దే. విఖ్యాత ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ బిజినెస్ స్కూల్ వంటివి ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఎంబీఏలో చేరాలంటే డిగ్రీతో పాటు జీమ్యాట్‌లో 700పైగా స్కోర్ సాధించాలి. రెండేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. అంతేకాక పలు వర్సిటీలు ఏడాది ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు యూకే వైపు మొగ్గుచూపుతున్నారు. కొన్ని వర్సిటీలు 15-18 నెలల ఎంబీఏ కోర్సును, మరికొన్ని 21 నెలల ఎంబీఏ కోర్సును నిర్వహిస్తున్నాయి. అయితే వీటి సంఖ్య అతి తక్కువ.

ప్రముఖ విద్యాసంస్థలు...
లండన్ బిజినెస్ స్కూల్
www.london.edu

యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ (సెయిడ్ బిజినెస్ స్కూల్).
www.sbs.ox.ac.uk

యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (జడ్జ్ బిజినెస్ స్కూల్)
www.jbs.cam.ac.uk

మాంచెస్టర్ బిజినెస్ స్కూల్
www.mbs.ac.uk

ఇంపీరియల్ కాలేజ్ బిజినెస్ స్కూల్
www.imperial.ac.uk/business-school

అస్ట్రేలియా :
యూఎస్, యూకే తర్వాత అత్యధిక మంది విదేశీ విద్యార్థులు మొగ్గుచూపుతున్న దేశం ఆస్ట్రేలియా. నాణ్యమైన విద్యతోపాటు అనుకూల వాతావరణ పరిస్థితులు ఇందుకు కారణం. ఆస్ట్రేలియా విశ్వ విద్యాలయాలు సైతం జీమ్యాట్ స్కోర్‌తో పాటు పని అనుభవానికి ప్రాధాన్యమిస్తాయి. స్పెషలైజేషన్‌ను బట్టి రెండు నుంచి ఐదేళ్ల పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. జీమ్యాట్‌లో 550పైగా స్కోర్ సాధించినవాళ్లు ప్రముఖ బీస్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. ఇక్కడి విద్యా సంస్థలు 12 నెలలు, 16 నెలలు, రెండేళ్ల వ్యవధితో ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి.

ప్రముఖ విద్యాసంస్థలు...
మెల్‌బోర్న్ బిజినెస్ స్కూల్
https://www.mbs.edu

మాక్వారీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్.
www.mgsm.edu.au

క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్
www.business.uq.edu.au

మోనాష్ బిజినెస్ స్కూల్
https://www.business.monash.edu/

ఆస్ట్రేలియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్)
https://www.unsw.edu.au

కెనడా :
ఫీజులు తక్కువ, నాణ్యమైన విద్య, అధిక ఉద్యోగాల కల్పన కారణంగా ఎంబీఏ చేయాలనుకునే విద్యార్థులు ఎక్కువమంది ఈ దేశానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇక్కడ ఏడాది, 16 నెలలు, రెండేళ్ల వ్యవధి కోర్సులున్నాయి. జీమ్యాట్‌లో 675 స్కోర్ తప్పనిసరి.

ప్రముఖ విద్యాసంస్థలు...
రోట్మాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (యూనివర్సిటీ ఆఫ్ టొరంటో)
www.rotman.utoronto.ca

ఐవీఈవై బిజినెస్ స్కూల్
www.ivey.uwo.ca

సౌడర్ బిజినెస్ స్కూల్ (యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా)
www.sauder.ubc.ca

హెచ్‌ఈసీ మాంట్రియల్
www.hec.ca/en

సింగపూర్ :
ఆర్థిక, పర్యాటక రంగాల్లో సింగపూర్ ముందుంది. ప్రఖ్యాత సంస్థల కార్యాలయాలన్నీ ఈ దేశంలో ఉన్నాయి. అవకాశాలు పుష్కలం. విద్యా రంగంలోనూ ఈ దేశం ఉన్నత ప్రమాణాలతో దూసుకెళ్తోంది. ఇక ఎంబీఏలో ఏవియేషన్, ఏషియన్ బిజినెస్ వంటి వినూత్న స్పెషలైజేషన్లు సింగపూర్ ప్రత్యేకత. ఇక్కడి వర్సిటీలు ఏడాది, రెండేళ్ల కాల వ్యవధితో ఎంబీఏ కోర్సులు నిర్వహిస్తున్నాయి.

ప్రముఖ విద్యాసంస్థలు...

ఇన్‌సీడ్ (INSEAD) సింగపూర్
www.insead.edu/campuses/asia

నాన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ
www.ntu.edu.sg

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్
www.nus.edu.sg

సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ
www.smu.edu.sg

ప్రవేశ ప్రక్రియ...
ఎంబీఏ ప్రవేశాల విషయంలో దాదాపు అన్ని దేశాల విధి విధానాలు ఒకే విధంగా ఉంటున్నాయి. కోర్సు ప్రారంభానికి ఆరు నెలల ముందు నుంచే దరఖాస్తు ప్రక్రియకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ సమయంలో స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమండేషన్, అకడమిక్ టెస్టిమోనియల్స్, ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ ఆథరైజేషన్స్ తప్పనిసరి. అదే విధంగా జీమ్యాట్ కు ఎన్నిసార్లు హాజరయ్యారనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నాయి. తొలి రెండు యత్నాల్లో నిర్ణీత స్కోర్ సాధించిన విద్యార్థులకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి.

ఫీజుల వివరాలు..
దేశం ప్రఖ్యాత వర్సిటీలు సాధారణ వర్సిటీలు
అమెరికా 60-70 వేల డాలర్లు 45-50 వేల డాలర్ల్లు
ఆస్ట్రేలియా 50-55 వేల డాలర్లు 45-50 వేల డాలర్లు
కెనడా 60-70 వేల డాలర్లు 50-60 వేల డాలర్లు
సింగపూర్ సగటున 40 వేల డాలర్లు సగటున 25 వేల డాలర్లు
యూకే 60- లక్ష పౌండ్లు 50-60 వేల పౌండ్లు
Published date : 25 Nov 2017 03:42PM

Photo Stories