Skip to main content

ఫ్రీలాన్సింగ్... నైపుణ్యమే పెట్టుబడి!

ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. నచ్చిన సమయంలో, ఇష్టమైన ప్రదేశంలో, వీలున్నప్పుడు.. బిందాస్‌గా పనిచేస్తూ సంపాదించడమే ఫ్రీలాన్సింగ్.
ఏదైనా ఒక డిమాండింగ్ స్కిల్ తెలిసుంటే చాలు. వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌తో లైఫ్‌ను నింపాదిగా గడిపేయొచ్చు. ఇటీవల అన్నిదేశాల్లోనూ ఫ్రీలాన్స్ వర్క్ కల్చర్ పుంజుకుంటోంది. ముఖ్యంగా మన దేశంలో ప్రతిభగల యువతకు చక్కటి అవకాశంగా నిలుస్తోందీ రంగం. భవిష్యత్‌లో ఫ్రీలాన్సింగ్ మరింత విస్తృతమవుతుందనే అంచనాల నేపథ్యంలో దీనిపై విశ్లేషణ..

నిర్దిష్ట పనిగంటలు, డెడ్‌లైన్లు, అవసరమున్నా లేకున్నా మీటింగులు, టార్గెట్లు వంటివి లేని వర్క్ లైఫ్.. ఫ్రీలాన్సింగ్! ఇష్టమైన సమయంలో పనిచేసుకునే వెసులుబాటు, నైపుణ్యముంటే రెగ్యులర్ ఉద్యోగం కంటే ఎక్కువగా సంపాదించుకునే వీలు.. వెరసి ఫ్రీలాన్సింగ్‌కు క్రేజ్ పెరుగుతోంది. కంటెంట్ రైటింగ్ నుంచి కార్పొరేట్ ప్రొడక్ట్ డెలివరీ వరకు.. అన్ని ఉద్యోగాలూ ఫ్రీలాన్సింగ్‌కు అనువైనవే!

వీటికి డిమాండ్ :
  • ఫ్రీలాన్సింగ్‌లో ఐటీ నైపుణ్యాలు, కంటెంట్ రైటింగ్ స్కిల్స్‌కు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, మై ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్, ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్, బిజినెస్ కన్సల్టింగ్, మెషిన్ లెర్నింగ్, 3డీ రెండరింగ్, లా, అకౌంటింగ్, ఫొటోగ్రఫీ/వీడియో ఎడిటింగ్, వాయిస్‌ఓవర్ ఆర్టిస్టులకు ఎక్కువగా ఫ్రీలాన్సింగ్ అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
  • ఫ్రీలాన్సింగ్ ఏ ఒక్క విభాగానికోపరిమితం కాలేదు. అన్ని కేటగిరీలకు విస్తరించింది. ఒకప్పుడు ఫ్రీలాన్సర్ అంటే.. రచయితలు, జర్నలిస్టులు, ట్రాన్స్‌లేటర్లు, ఫొటోగ్రాఫర్లు గుర్తొచ్చే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. డేటా ఎంట్రీ నుంచి డేటా సైంటిస్టుల వరకు పరిధి విస్తరించింది. సేల్స్, డిజైనింగ్ అండ్ క్రియేటివ్, వెబ్, మొబైల్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ, నెట్‌వర్కింగ్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, ఫారెన్ లాంగ్వేజెస్, ట్రాన్స్‌లేషన్, లీగల్, అడ్మిన్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ తదితర విభాగాల్లో ఫ్రీలాన్స్ కనిపిస్తోంది.

కన్సల్టెంట్‌లదే హవా!
ఫ్రీలాన్సింగ్ వర్క్ స్వరూపం మార్కెట్ అవసరాల మేరకు మారుతుంటుంది. ప్రస్తుతం కన్సల్టెంట్ల హవా కొనసాగుతోంది. అంటే.. ఆయా రంగంలోని నిష్ణాతులు స్వయంగా కార్యాలయం ఏర్పాటుచేసుకొని.. సంబంధింత కంపెనీలకు తమ సేవలు అందిస్తుంటారు. ఉదాహరణకు ఒక స్టార్టప్‌ను ప్రారంభించేందుకు, వ్యాపార విస్తరణ వ్యూహాలకు కంపెనీలు కన్సల్టెంట్లను నియమించుకుంటున్నాయి. వీరిలో ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్స్, ఫైనాన్షియల్ అనలిస్టులు, హెచ్‌ఆర్ స్పెషలిస్టులు, లీగల్ అడ్వయిజర్లు, ఆర్కిటెక్ట్స్ ముందంజలో ఉంటున్నారు. వీరు ఆయా రంగాల్లోని కంపెనీలకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ ఆర్జిస్తుంటారు.

కటెంట్ రైటింగ్ :
ఫ్రీలాన్సింగ్‌లో ఎక్కువగా డిమాండ్ నెలకొన్న మరో స్కిల్.. కంటెంట్ రైటింగ్. ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్లలో కంటెంట్ రైటర్ల కోసం వెతికే కంపెనీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ఫ్రీలాన్సింగ్‌లో హాట్‌జాబ్ ప్రొఫైల్స్ పరంగా టాప్‌లో నిలుస్తోంది కంటెంట్ డెవలపర్. ఇప్పుడు ప్రతి వ్యాపార సంస్థకు వెబ్‌సైట్స్ తప్పనిసరిగా మారాయి. అందుకే కంటెంట్ రైటింగ్, బ్లాగింగ్‌కు ఎక్కువగా డిమాండ్ ఏర్పడింది. వెబ్‌సైట్ కంటెంట్‌లో ఉపయోగించే కీ వర్డ్స్‌తో సదరు వెబ్‌సైట్‌ను వీక్షించే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. నేటి ఇంటర్నెట్, ఈ-కామర్స్ యుగంలో వెబ్‌సైట్‌కు వినియోగదారులను రప్పించడం తప్పనిసరి కావడంతో కంటెంట్ రైటింగ్ నిపుణులకు డిమాండ్ ఏర్పడింది.

వెబ్ డిజైనింగ్ :
ప్రతి రంగంలోనూ ఆయా సంస్థలు సరికొత్త వెబ్‌సైట్లు రూపొందిస్తున్నాయి. సమాచారాన్ని ఆకర్షణీయ రీతిలో పొందుపరిచే స్కిల్స్ ఉన్నవారి కోసం అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నికల్ వెబ్‌సైట్స్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న కంటెంట్ డెవలపర్ల కోసం ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. అలాగే వెబ్ డిజైనింగ్ కూడా మరో ప్రధాన ఉపాధి వేదికగా నిలుస్తోంది. వెబ్‌సైట్‌ను వీక్షకులకు ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి అవసరమైన గ్రాఫిక్ డిజైనర్స్, వెబ్ డెవలపర్లకు కూడా ఇటీవల కాలంలో డిమాండ్ పెరిగింది. లోగోల డిజైన్, వెబ్‌సైట్లను ఆకర్షణీయంగా రూపొందించడం, గ్రాఫిక్ డిజైన్, వీడియో ప్రొడక్షన్, ఫొటోగ్రఫీ మొదలైన కేటగిరీల్లో డిజైనర్లకు చక్కటి అవకాశాలు ఉన్నాయి.

సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ :
ఆన్‌లైన్ వెబ్‌సైట్స్, ఈ-కామర్స్ సంస్థలు.. కంటెంట్ డెవలపర్స్, వెబ్ డిజైనర్స్‌కే పరిమితం కాకుండా.. ఎస్‌ఈఓ (సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్), ఎస్‌ఈఎం (సెర్చ్ ఇంజన్ మేనేజ్‌మెంట్) సేవలను సైతం పొందాలని చూస్తున్నాయి. వినియోగదారులు ఒక కీవర్డ్ ద్వారా ఏదైనా ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను సెర్చ్ ఇంజన్స్ ద్వారా తెలుసుకోవాలనుకునే క్రమంలో తమ వెబ్‌సైట్ ముందుగా కనిపించాలని కోరుకుంటున్నాయి. అలాంటి రైటింగ్ స్కిల్స్, కంటెంట్ డెవలప్‌మెంట్ స్కిల్స్ ఉన్న సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ స్పెషలిస్ట్‌లకు ఫ్రీలాన్సింగ్ అవకాశాలు ఎక్కువ.

ఐటీలో ఫ్రీలాన్సింగ్ మేటి:
ఐటీ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ప్రోగ్రామింగ్, డేటాసైన్స్, యాప్ డెవలప్‌మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్, టెక్ సపోర్ట్ వంటి ఐటీ, ఐటీ ఆధారిత పనుల్లోనూ ఫ్రీలాన్సింగ్ వేగంగా విస్తరించింది. టాప్ ఎంఎన్‌సీలు మొదలు, స్టార్టప్‌ల వరకు ఫ్రీలాన్సర్లను నియమించుకోవడంపై దృష్టిసారిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అంకుర సంస్థలు ఫ్రీలాన్సింగ్ ద్వారానే తమ పనులు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రాజెక్టులు వచ్చినప్పుడుఫ్రీలాన్సర్లను తీసుకోవడం ద్వారా డబ్బు ఆదా చేసుకుంటున్నాయి. ఉద్యోగులను నియమించుకోవడం, తర్వాత క్లయింట్స్, ప్రాజెక్టులు లేకపోతే ఆర్థికంగా ఇబ్బందిపడే అవకాశం ఉండటంతో సేఫ్ జోన్‌లో ఉండేలా అంకుర సంస్థలు ఫ్రీలాన్సింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఫలితంగా ఐటీ రంగంలో పని చేస్తున్న పలువురు ఫ్రీలాన్స్ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. డేటాసైన్స్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీపై నిపుణుల కొరత ఉండటంతో పెద్ద, చిన్న కంపెనీలు ఫ్రీలాన్సర్ల కోసం అన్వేషిస్తున్నాయి. వీరికి పెద్దమొత్తంలో చెల్లించడానికి వెనకాడటం లేదు.

‘‘వ్యక్తిగత పరిచయాలు, వెబ్‌సైట్ల ఆధారంగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు పొందొచ్చు. కమర్షియల్ ప్రాజెక్టులు అయితే ఎక్కువ చెల్లింపులు ఉంటాయి. ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టు పూర్తిచేస్తే సదరు క్లయింట్ మన ప్రొఫైల్‌పై ఇచ్చే రేటింగ్/ఎండార్స్‌మెంట్ ఆధారంగా మరిన్ని అవకాశాలు వస్తాయి. ఫ్రీలాన్సింగ్ లోనూ కొన్ని ప్రతికూలతలున్నాయి. ప్రాజెక్టు సగం పూర్తిచేసి దానిద్వారా క్లయింట్ సంతృప్తి చెందితేనే నిర్దేశించుకున్న మొత్తంలో కొంత భాగం విడుదల చేస్తారు. ఒకవేళ నచ్చకుంటే పని వృథా అవుతుంది. ఫ్రీలాన్సింగ్‌లో రాణించాలంటే ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను మెరుగుపరచుకోవాలి. కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలి’’ .
- అనుమోజు శ్రవణ్ కుమార్, ఐటీ ఫ్రీలాన్సర్.
Published date : 06 Feb 2018 02:11PM

Photo Stories