Skip to main content

కృత్రిమ మేధతో కొత్త కొలువులు

మానవ మేథస్సు సృష్టించిన అసాధారణ యంత్రమే రోబో. మనిషి రూపొందించిన రోబోలు.. శక్తియుక్తుల విషయంలో మనిషిని ఎప్పుడో మించిపోయాయి.
ప్రస్తుతం శాస్త్రవేత్తలంతా.. మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా రోబోలకు శిక్షణ ఇస్తున్నారు. మనుషులు చేసే చాలా పనులను రోబోలు చేయబోతున్నాయి. దాంతో మనకు సరికొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలతో పోలిస్తే అవి చాలా భిన్నం. ఓ తాజా సర్వే అంచనా ప్రకారం- 2030 నాటికి అందుబాటులోకి రానున్న ఆ కొత్త ఉద్యోగాలేమిటో చూద్దాం..!

రోబో కౌన్సెలర్ :
భవిష్యత్తు అంతా రోబోల మయం కాబోతుంది. ఆఫీసులో, ఇంట్లో, వ్యాపారాల్లో, కార్యకలాపాల్లో.. ఇలా అన్నిచోట్లా రోబోలు కీలకపాత్ర పోషించనున్నాయి. మన(వ్యక్తులు, కంపెనీలు) అవసరాలేమిటి, ఎలాంటి రోబో కావాలి, దాని సామర్థ్యం ఎంత ఉండాలి, మన పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్స్ ఏమైనా జోడించాలా..?! ఇలాంటి విషయాల్లో సలహాలిచ్చేందుకు రోబో కౌన్సెలర్లు అవసరం అవుతారు. రోబో కౌన్సిలర్‌గా రాణించాలంటే.. రోబోటిక్స్‌కు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలతోపాటు వ్యక్తుల, సంస్థల స్థితిగతులు, అవసరాలపై అవగాహన ఉండాలి.

హైవే కంట్రోలర్ :
2030 నాటికి భూమి మీద రోబోలతో సమానంగా ఆకాశంలో ఎగిరే డ్రోన్ల సంఖ్య పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నా రు. అప్పుడు భూమి మీద ఎంత ట్రాఫిక్ ఉంటుందో.. డ్రోన్ల సంఖ్య పెరగడంతో ఆకాశం లోనూ అంతే ట్రాఫిక్ ఉండబోతోంది. అందుకే ఆకాశంలో ట్రాఫిక్ కంట్రోల్ చేసే ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఆ ఉద్యోగం పేరే ‘హైవే కంట్రోలర్’!

మ్యాన్-మెషీన్ టీమింగ్ మేనేజర్ :
2030 తర్వాత ఆఫీసుల్లో హోదాల పేర్లు కూడా మారనున్నాయి. ప్రస్తుతం మనం టీమ్ లీడర్, టీమ్ మేనేజర్‌గా పిలుచుకుంటున్న ఉద్యోగాలు.. భవిష్యత్తులో ‘మ్యాన్-మెషీన్ టీమింగ్ మేనేజర్’గా మారనున్నాయి. ఎందుకంటే..భవిష్యత్తులో మనుషులు, రోబోలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆ మేరకు-టీమ్ మేనేజర్ పనితీరు మారిపోతుంది. అటు మనుషులను, ఇటు రోబోలను, యంత్రాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

గార్బేజ్ డిజైనర్స్ :
వృథా వస్తువులను తిరిగి వాడుకలోకి తేవడాన్ని ప్రస్తుతం మనం ‘రీసైక్లింగ్’ అంటున్నాం. ఈ పనిని చేయడానికి 2030 తర్వాత ప్రత్యేక ఉద్యోగులు రానున్నారు. వారినే ‘గార్బేజ్ డిజైనర్స్’ అంటారు. ఒక వస్తువు పాడయ్యాక దాన్ని మరో ఉపయోగకర రూపంలోకి మార్చడం వీరి పని.

నోస్టాలజిస్ట్ :
వాస్తవానికి నోస్టాలజిస్ట్ అంటే... గతం పట్ల అమితాసక్తి, బెంగపెట్టుకోవడం. రాబోయే రోజుల్లో నోస్టాలజిస్ట్ అనే కొత్తరకం ఉద్యోగం తెరపైకి రానుంది. భిన్న రకాల పాత్రలను ఈ ఉద్యోగులు పోషించనున్నారు. ఇంటీరియర్ డిజైనర్లుగా, హిస్టరీ పరిశోధకులుగా.. ఇలా అనేక రకాలుగా వ్యవహరిస్తారు. ఇంటినీ, ఇంటీరియర్‌ను వినియోగదారులు కోరిన కాలం నాటి పద్ధతుల్లో డిజైన్ చేసేందుకు సాయం చేస్తారు. ఓ విధంగా చెప్పాలంటే.. ఆర్ట్ డెరైక్టర్స్‌లాగా పనిచేస్తారు. ఉదాహరణకు 1980లలో ఉన్న మోడల్స్‌లో ఇళ్లు కావాలంటే.. అప్పటి పరిస్థితలను అధ్యయనం చేసి, అప్పట్లో వినియోగించిన సామాగ్రి ఇంట్లో ఉండేలా డిజైన్ చేయడం నోస్టాలజిస్టుల పని.

సోలార్ టెక్నాలజీ స్పెషలిస్ట్ :
మనం భవిష్యత్తులో పూర్తిగా సౌరశక్తి మీదే ఆధారపడాల్సి ఉంటుంది. ఈ రంగంలో రోబోలకు కాకుండా.. మనుషులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కనున్నాయి. సోలార్ ప్యానల్స్ డిజైనింగ్, నిర్వహణకు సోలార్ టెక్నాలజీ స్పెషలిస్ట్‌లు అవసరం. దీంతో భారీగా ఈ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

టెలీ సర్జన్ :
ప్రస్తుతం వైద్యుడు, రోగి పక్కనే ఉండి సర్జరీలు చేస్తున్నారు. భవిష్యత్తులో వైద్యుడు, రోగి వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నా.. సర్జరీలు జరిగిపోనున్నాయి. అది ఎలాగా అనుకుంటున్నారా? రోగి ఉన్న చోట రోబోటిక్ చేతులు సర్జరీ చేస్తుంటే.. ఎక్కడో ఉన్న వైద్యుడు ఆన్‌లైన్‌లో ఆ చేతుల్ని నియంత్రిస్తుంటాడు. అంతా టెక్నాలజీ ప్రతిభ!

మరికొన్ని నయా జాబ్ ప్రొఫైల్స్..
  • ఆర్టిటెక్ అడ్వెంచర్ గైడ్
  • డేటా డిటెక్టివ్
  • ఐటీ ఫెసిలిటేటర్
  • ఎథికల్ సోర్సింగ్ ఆఫీసర్
  • ఫిట్‌నెస్ కమిట్‌మెంట్ కౌన్సెలర్
  • సైబర్ సిటీ అనలిస్ట్
  • ఫైనాన్షియల్ వెల్‌నెస్ కోచ్
  • డిజిటల్ టైలర్
  • చీఫ్ ట్రస్ట్ ఆఫీసర్
  • క్వాంటమ్ మెషీన్ లెర్నింగ్ అనలిస్ట్
  • పర్సనల్ మెమొరీ క్యూరేటర్
  • ఏఆర్ జర్నీ బిల్డర్
  • జెనెటిక్ డైవర్సిటీ ఆఫీసర్
Published date : 20 Feb 2018 04:35PM

Photo Stories