Skip to main content

కొత్త ఏడాది.. కొలువులకు స్వాగతం

మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తిచేసుకుని జాబ్ మార్కెట్‌లో అడుగుపెట్టనున్నారు. సాధారణంగా వీరందరిలో తలెత్తే ప్రశ్నలు.. జాబ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? కంపెనీలు ఏ స్థాయిలో నియామకాలు చేపడతాయి? గతేడాది కంటే ఈ ఏడాది జాబ్ మార్కెట్ మెరుగ్గా ఉంటుందా? అనేవే. అయితే ఈ విషయంలో ఆందోళన చెందనక్కర్లేదని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది జాబ్ మార్కెట్ వెలుగులీననుంది. అన్ని రంగాల్లో నియామకాలు గతేడాదితో పోల్చితే ఎక్కువే ఉంటాయని పరిశ్రమ వర్గాల విశ్లేషణ. మరోవైపు అసోచామ్, సీఐఐ, నాస్కామ్ వంటి సంస్థల సర్వేలు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2014లో హైరింగ్ ట్రెండ్స్‌పై విశ్లేషణ..

  1. ముందంజలో బీఎఫ్‌ఎస్‌ఐ
    కొత్త ఏడాదిలో నియామకాల పరంగా నిపుణుల అంచనా ప్రకారం..
    మిగతా రంగాలతో పోల్చితే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ రంగాలు ముందంజలో నిలవనున్నాయి. ప్రైవేటు బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఫలితంగా.. ఒక్క బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలోనే కొత్తగా దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకి అవకాశముంది. ‘ఈ ఏడాది బ్యాంకింగ్ రంగంలో నియామకాలు ఆశావహంగా ఉండనున్నాయి. ఉద్యోగార్థులు ముందస్తు ప్రణాళికతో అడుగులు వేస్తే ఏదో ఒక బ్యాంకులో కొలువు ఖాయం’ అంటున్నారు కోటక్ మహీంద్రా బ్యాంక్ క్యాంపస్ సెలక్ట్ హెడ్ ఎస్.చంద్రకళ. బీఎఫ్‌ఎస్‌ఐ తర్వాత స్థానంలో అత్యధిక నియామకాలు చేపట్టనున్న రంగం రిటైల్ పరిశ్రమ. ఇందులో ప్రస్తుత సంఖ్యతో పోల్చితే దాదాపు 40 శాతం మేర ఉద్యోగాల సంఖ్య పెరగనుంది. ప్రధానంగా 2014 ప్రథమార్ధంలోనే అన్ని స్థాయిల్లో నియామకాలు పూర్తి చేయాలని సంస్థలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి జూన్ చివరి వరకు రిటైల్ రంగంలో ఉద్యోగ మేళా కొనసాగనుంది. ఉద్యోగార్థులు వ్యక్తిగతంగా పరిమితులు విధించుకోకుండా ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే అవకాశాలు చేతికందుతాయి అనేది ఈ రంగంలో నిపుణుల సూచన.
  2. మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్
    జాబ్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే రంగం.. మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దేశంలో ఇంజనీరింగ్ తర్వాత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఎంచుకునే కోర్సు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ కోర్సు ఉత్తీర్ణులకు కూడా కొత్త ఏడాది ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్, మార్కెటింగ్ స్పెషలైజేషన్ విభాగాల్లో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుంది. అటు ఉత్పత్తి రంగంలో, ఇటు సర్వీస్ సెక్టార్‌లో కొత్త కంపెనీలు రానున్నాయి. వాటికి వెన్నెముకలుగా నిలిచే ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఆయా కంపెనీలు ఎక్కువ దృష్టి సారించనుండటమే నియామకాలకు ప్రధాన కారణం అనేది క్యాపిటల్ ఐక్యూ హెచ్.ఆర్. ప్రతినిధి శ్వేత అభిప్రాయం. అంతేకాకుండా ఫైనాన్స్ విభాగానికి సంబంధించి అమెరికా, ఇతర దేశాలు మన దేశంలో అవుట్ సోర్సింగ్‌కు మొగ్గు చూపుతున్నాయి. ఇది ఫైనాన్స్ స్పెషలైజేషన్ విద్యార్థులకు కలిసొచ్చే అంశమని ప్రముఖ అవుట్ సోర్సింగ్ సంస్థ డెలాయిట్ ప్రతినిధి సిమిశర్మ అంటున్నారు. ఈ రంగాల్లో అందివస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మేనేజ్‌మెంట్ సంబంధిత సాఫ్ట్‌వేర్ కోర్సులు చేయడం కూడా లాభిస్తుంది. వివిధ ప్రైవేటు సంస్థలు షార్ట్‌టర్మ్ కంప్యూటర్ కోర్సులను అందిస్తున్నాయి. ఫైనాన్స్, మార్కెటింగ్ మాత్రమే కాకుండా ఎంబీఏలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఎయిర్ అండ్ కార్గో మేనేజ్‌మెంట్, రిటైల్ మేనేజ్‌మెంట్, రూరల్ మేనేజ్‌మెంట్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను అభ్యసించినవారికి మంచి అవకాశాలున్నాయి. అయితే మంచి కంపెనీలో కోరుకున్న వేతనంతో ఉద్యోగం సాధించాలంటే అత్యుత్తమ నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి.
  3. ఐటీ.. ఐటీఈఎస్ ఆశావహమే..
    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అనుబంధ సర్వీసుల రంగంలో నియామకాలు గత ఏడాదితో పోల్చితే 10 నుంచి 14 శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే కంపెనీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించనున్నాయి. ముఖ్యంగా తాజా నియామకాల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండనున్నాయి. దీనికి మన దేశంలోని సాఫ్ట్‌వేర్ సంస్థలకు ప్రధాన క్లయింట్లుగా ఉన్న అమెరికా, యూరప్ దేశాల్లోని ప్రతికూల ఆర్థిక పరిస్థితులే కారణమన్నది నిపుణుల విశ్లేషణ. భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టడం కంటే అవసరమైనప్పుడు మాత్రమే భర్తీ చేయడానికి కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. సబ్జెక్ట్ పరంగా పరిపూర్ణత పొందిన వారికే అవకాశాలు లభించనున్నాయి. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగార్థులు అకడెమిక్‌గా సబ్జెక్ట్ పరంగా సంపూర్ణ అవగాహన, క్షేత్ర స్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ హెడ్- ప్లేస్‌మెంట్ టి.వి. దేవీ ప్రసాద్.
  4. కోర్ ఇంజనీరింగ్ కళ కళ
    దేశవ్యాప్తంగా ఏటా దాదాపు పది లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికి వస్తున్నారు. వీరిలో కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు (మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సివిల్) విద్యార్థులు 70 శాతం ఉంటారు. వీరికి ఈ ఏడాది ఉద్యోగాలపరంగా మంచి అవకాశా లున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల్లో నియామకాల సంఖ్య గత ఏడాదితో పోల్చితే పది నుంచి 20 శాతం మేర పెరగనుంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండనుంది. అంతేకాకుండా.. టెలికాం, పవర్ జనరేషన్ సంస్థల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కోర్ బ్రాంచ్‌ల ఇంజనీరింగ్ విద్యార్థులకు 2014 అత్యంత ఆశావహ సంవత్సరంగా పేర్కొనొచ్చు. ‘దేశంలో ఉత్పత్తి రంగం, ఆర్ అండ్ డీలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్‌ల విద్యార్థులకు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ పెరగనుంది. దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత విద్యార్థులదే’ అంటున్నారు బీహెచ్‌ఈఎల్ హెచ్‌ఆర్ మేనేజర్ బాలకిషన్.
  5. ఫార్మాస్యూటికల్స్
    బ్యాంకింగ్, ఐటీ, రిటైల్, సర్వీస్ సెక్టార్‌లను మినహాయిస్తే.. జాబ్ మార్కెట్, హైరింగ్ ట్రెండ్స్ విషయంలో ఫార్మాస్యూటికల్ విభాగంలో అధిక ఉద్యోగాలు లభించనున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం- దీనికి రెండు ప్రధాన కారణాలు.. మొదటిది.. దేశీయంగా ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరగడం.. ఆ మేరకు ఔషధ వినియోగం పెరగడం. కాగా, రెండో కారణం.. అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఆర్ అండ్ డీ నిబంధనలు, మానవ వనరుల విషయంలో కొరత కారణంగా అక్కడి ఫార్మాస్యూటికల్ సంస్థలు మన దేశంలో అవుట్‌సోర్సింగ్‌కు మొగ్గు చూపడం. ఈ రెండు కారణాలతో ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు ఈ ఏడాది అధిక అవకాశాలు లభించనున్నాయి. ప్రధానంగా డ్రగ్ ఫార్ములేషన్, డ్రగ్ రీసెర్చ్ విభాగాల్లో ఎక్కువగా ఖాళీల భర్తీ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎంఫార్మసీ విద్యార్థులకు ఈ ఏడాది కలిసొచ్చే సంవత్సరం అంటున్నారు నైపర్ ప్రాజెక్ట్ డెరైక్టర్ అహ్మద్ కమల్.
  6. కెరీర్‌కు వ్యవ‘సాయం’
    ఇక.. సర్వేల పరంగా చూస్తే.. అసోచామ్ నిర్వహించిన సర్వే ప్రకారం-వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో ఈ ఏడాది పురోగతి కనిపించనుంది. రబీ సీజన్‌లోనే ఈ నియామకాలు ఊపందుకోనున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగా లైన అగ్రి ఇంజనీరింగ్, హార్టికల్చర్, సీడ్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ వంటి కోర్సులు పూర్తిచేసినవారికి అటు ప్రభుత్వ రంగం లోనూ,ఇటు ప్రైవేటు రంగంలోనూ అత్యుత్తమ ఉపాధి అవకాశాలున్నాయి. బీటెక్‌లో అగ్రి బయో టెక్నాలజీ కోర్సులు పూర్తిచేసినవారికీ అవకాశాలు పుష్కలం. ఎందుకంటే మనదేశం ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. అంతే కాకుండా ఈ రంగంలోకి బహుళజాతి సంస్థలూ ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్‌తో కెరీర్ ‘పంట’ పండుతుందని నిపుణులు అంటున్నారు.
  7. హాస్పిటాలిటీ, టూరిజం
    సర్వీస్ సెక్టార్‌లో ప్రధానంగా హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం వంటి రంగాలు కూడా కొత్త ఏడాదిలో ఉద్యోగార్థులకు కొలువుల పరంగా కేరాఫ్‌గా నిలవనున్నాయి. ఈ విభాగాల్లో గత ఏడాదితో పోల్చితే 20 నుంచి 25 శాతం మేర నియామకాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణుల విశ్లేషణ. ఆర్థిక ఒడిదుడుకులు, జీడీపీ వృద్ధితో సంబంధం లేకుండా.. ప్రస్తుతం నమోదవుతున్న జీడీపీలో దాదాపు 10 శాతం వృద్ధి నమోదు చేసుకుంటున్న రంగాలు హాస్పిటాలిటీ, టూరిజం రంగాలు. ఈ రంగంలో నియామకాలు పెరుగుతాయని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. పీపుల్ స్ట్రాంగ్ ఇండియా అనే సంస్థ సీఐఐతో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.
Published date : 27 Jan 2014 06:02PM

Photo Stories