Skip to main content

గ్రూప్ డిస్కషన్‌లో విజయం సాధించాలంటే..!

బీస్కూల్లో ప్రవేశాలు పొందాలన్నా.. కోర్సు అనంతరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజేతగా నిలవాలన్నా.. గ్రూప్ డిస్కషన్ (జీడీ)ను ఎదుర్కోవాల్సిందే! గ్రూప్ డిస్కషన్‌కు రాత పరీక్షలా నిర్దిష్ట సిలబస్, నిర్వహణా విధానం ఉండదు. అయినా, అభ్యర్థులు జీడీలో ప్రతిభ చూపడం తప్పనిసరి! అసలు బీస్కూల్స్, కంపెనీలు జీడీని ఎందుకు నిర్వహిస్తున్నాయి..
 జీడీ సందర్భంగా అభ్యర్థుల్లో పరిశీలిస్తున్నఅంశాలేంటి! గ్రూప్ డిస్కషన్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం...

ప్రముఖ బీస్కూల్స్‌లో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి తొలిదశలో క్యాట్ నిర్వహిస్తారు. ఇందులో మంచి పర్సంటైల్ సాధించిన వారికి రెండో దశలో గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ), ఎస్సే రైటింగ్, కేస్ డిస్కషన్‌లు ఉంటాయి. మరోవైపు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించే కంపెనీలు.. ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేసే రిక్రూటింగ్ ఏజెన్సీలు కూడా రాత పరీక్ష, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక ఖరారు చేస్తున్నాయి. అంటే.. అటు ఎంబీఏ ప్రవేశాల్లో, ఇటు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనూ గ్రూప్ డిస్కషన్ కీలకపాత్ర పోషిస్తోంది.

జీడీ ఇలా..
జీడీలో అభ్యర్థులను బృందాలుగా విభజించించి..ఏదైనా ఒక అంశం ఇచ్చి చర్చించమంటారు. ఈ సందర్భంగా బీస్కూల్స్, కంపెనీలు.. అభ్యర్థుల్లోని విశ్లేషణాత్మక దృక్పథం, బృందస్ఫూర్తితోపాటు మేనేజర్‌గా రాణించేందుకు అవసరమైన లక్షణాలను పరీక్షిస్తాయి. గ్రూప్ డిస్కషన్‌లో అభ్యర్థులు నిర్దిష్ట సమయంలో నిర్దేశించిన అంశంపై తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పగలగాలి. అదే సమయంలో ఇతరుల అభిప్రాయాలను గౌరవించగలిగే దృక్పథం సైతం ఉండాలి. ఈ ప్రక్రియలో అభ్యర్థుల నిజమైన వ్యక్తిత్వ లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అభ్యర్థుల్లోని భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సబ్జెక్ట్ నాలెడ్‌‌జ, సమయస్ఫూర్తి తదితరాలను జీడీలో పరీక్షిస్తారు.

అంశాలివిగో..
జీడీలో ప్రధానంగా బిజినెస్-ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సామాజిక, రాజకీయ పరిణామాలపైనే అడుగుతున్నారు.
బిజినెస్-ఎకానమీ: ఆర్థిక, వ్యాపార రంగాల్లో సంభవిస్తున్న తాజా పరిణామాల నుంచి జీడీ అంశాలు ఇస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు బిజినెస్-ఎకానమీకి సంబంధించిన కీలక మార్పులు, విధానాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాటి ప్రభావాలను అధ్యయనం చేయాలి.
కరెంట్ అఫైర్స్: జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, మీడియాలో చర్చనీయాంశంగా మారిన అంశాలు, ప్రభుత్వాల విధానాలపై అవగాహన పెంచుకోవాలి.
సామాజిక అంశాలు: సామాజిక బాధ్యత కలిగిన పౌరులకు ఉండాల్సిన లక్షణాలను పరీక్షించేలా జెండర్ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, నైతిక విలువలను జీడీ అంశాలుగా ఇస్తున్నారు.

ప్రిపరేషన్.. ప్రణాళికాబద్ధంగా...
కమ్యూనికేషన్ స్కిల్స్: గ్రూప్ డిస్కషన్‌కు ప్రిపరయ్యే అభ్యర్థులు కమ్యూనికేషన్ నైపుణ్యాలపై దృష్టిపెట్టాలి. భావవ్యక్తీకరణ సరళంగా, స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆలోచనల్లో, అభిప్రాయాల్లో స్పష్టత ఉండాలి. అభ్యర్థి తన మనసులోని భావాలను సూటిగా, సరళంగా, స్పష్టంగా చెప్పగలగడంపైనే జీడీలో అతని విజయం ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
విషయ పరిజ్ఞానం: జీడీకి హాజరయ్యే అభ్యర్థులకు విషయ పరిజ్ఞానం తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
నాయకత్వ లక్షణాలు: జీడీలో నాయకత్వ లక్షణాలను పరీక్షిస్తారు. కాబట్టి అభ్యర్థులు సందర్భోచితంగా స్పందించడం, హుందాగా వ్యవహరించడాన్ని అలవరచుకోవాలి.
వాదనలు వద్దు: జీడీలో ఎదుటివారి అభిప్రాయాలు, ఆలోచనలను గౌరవించాలి. ఇతరుల అభిప్రాయాల్లో పొరపాట్లు ఉన్నట్లయితే వారితో వాదించకుండా హుందాగా చెప్పాలి.
భాషా పరిజ్ఞానం: భాష జీడీలో కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడంపై దృష్టిపెట్టాలి. జీడీలో కంటెంట్‌కు అధిక ప్రాధాన్యం ఉన్నా.. ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని సైతం పరిశీలిస్తారు. కాబట్టి ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి.
హావభావాలు: హుందాగా ఉండేలా దుస్తులు ధరించడం, నిటారుగా కూర్చోవడం, కాళ్లు చేతులు, తల ఎక్కువగా కదిలించకుండటం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం ముఖ్యం.
పరిధి విస్తృతం: జీడీ అంశాల పరిధి విస్తృతంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రపంచంలో జరిగే తాజా పరిణామాలపై దృష్టిపెట్టాలి. దీనికోసం ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు, మ్యాగజైన్లు, టీవీచానళ్లు, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవాలి. జీడీలో విషయ పరిజ్ఞానంతోపాటు, బృందస్ఫూర్తి, క్రిటికల్ థింకింగ్, నాయకత్వ లక్షణాలను పరీక్షిస్తారు. అభ్యర్థులు సదరు అంశాలపై పట్టుసాధించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన అంశాలు..
  • ఎండ్ ఆఫ్ గ్లోబలైజేషన్/డీ గ్లోబలైజేషన్/నేషనలైజేషన్.
  • వాతావరణ మార్పులు/కాలుష్యం.
  • సమాజం, వ్యక్తుల ప్రవర్తనపై సోషల్ మీడియా ప్రభావం.
  • ఉద్యోగాలపై టెక్నాలజీ ప్రభావం.
  • మీటూ క్యాంపైన్.
  • క్రిప్టో కరెన్సీ/బిట్‌కాయిన్స్
  • బ్యాంకింగ్ స్కామ్స్.
  • మార్స్ మిషన్.
  • భారత్ నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సిద్ధంగా ఉందా?
జీడీలో చేయాల్సినవి..
 1. చిరు మందహాసం ప్రదర్శించాలి.
 2. హుందాగా వ్యవహరించాలి.
 3. సానుకూల దృక్పథంతో మెలగాలి.
 4. అనర్గళంగా, పూర్తి పట్టుతో మాట్లాడాలి.
 5. ఇచ్చిన అంశానికే పరిమితం కావాలి.
 6. మన అభిప్రాయాల్లో స్పష్టత ఉండాలి.
 7. ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినాలి.
 8. ఉత్సాహంగా ఉండాలి  చొరవ చూపాలి.
 9. ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి.
 
 జీడీలో చేయకూడనివి..
 1. అత్యుత్సాహం ప్రదర్శించడం.
 2. చేతులు ఊపుతూ గట్టిగా మాట్లాడటం.
 3. మధ్యలో అభ్యంతరాలు చెప్పడం.
 4. ఆధిపత్యం కోసం ప్రయత్నించడం.
 5. నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉండటం.
 6. సంబంధంలేని అంశాలను ప్రస్తావించడం.
 7. అసమంజస పద ప్రయోగం.
Published date : 22 Jan 2019 06:16PM

Photo Stories