Skip to main content

కెరీర్‌ గైడెన్స్..ఫిజియోథెరపీ

హెల్త్‌కేర్ రంగంలో అవకాశాలకు వేదికగా నిలుస్తోన్న రంగం ఫిజియోథెరపీ. వైద్యరంగంలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ నేడు ఫిజియోథెరపిస్టులు పనిచేస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా అభ్యర్థులు లేకపోవడంతో.. ఇటీవల కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ పెరిగింది. జీవన విధానంలో వస్తున్న మార్పులు, ప్రతి వైద్య విభాగంలో ఫిజియోథెరపీ సేవలు అవసరం ఏర్పడుతుండడం, స్పోర్ట్స్, ఫిట్‌నెస్ పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో ఫిజియోథెరపీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో విస్తృత అవకాశాల వేదికగా నిలుస్తోన్న ఫిజియోథెరపీ కెరీర్‌పై ఫోకస్..

ప్రస్తుతం వైద్య రంగంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రమాదంలో గాయపడి కాలు, చేయి ఫ్రాక్చర్ అవడం.. లేదా బెణికినప్పుడు చేసే చికిత్స విధానాల్లో ఫిజియోథెరపిస్టులు పాలుపంచుకుంటారు. వ్యాయామ పరికరాలను అవసరానికనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపీ, మాగ్నటోథెరపీ, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి, లిగమెంట్స్, టెండాన్ సమస్యల పరిష్కారానికి ఫిజియో థెరపిస్టులు అత్యవసరం. క్రీడాకారులకు ఫిట్‌నెస్ సెంటర్లలో ట్రైనర్‌గా సేవలందించడానికి కూడా ఫిజియోథెరపిస్ట్‌లు అవసరం.

కోర్సులు:
ఫిజియోథెరపీకి సంబంధించి మన రాష్ట్రంలో ఒకేషనల్, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఇంటర్ స్థాయిలో ఉండే ఒకేషనల్ కోర్సుకు అర్హత పదో తరగతి. ఫిజియోథెరపిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాలంటే మాత్రం.. బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. ఈ కోర్సును బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)గా వ్యవహరిస్తారు. తర్వాత పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బీపీటీ:
బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సులో చేరేందుకు అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ) లేదా ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (ఫిజియోథెరపీ). కోర్సు కాల వ్యవధి: నాలుగున్నరేళ్లు (ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌తో కలిపి). మన దేశంలో దాదాపు 180 కాలేజీలు బీపీటీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో 1500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రవేశానికి ఎటువంటి ఎంట్రెన్స్ టెస్ట్ ఉండదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ-విజయవాడ, రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లను ఖరారు చేస్తుంది. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏడాది సాధారణంగా జూన్/జూలై నెలలో వెలువడుతుంది

ఉన్నత విద్య:
బీపీటీ తర్వాత పీజీ స్థాయిలో ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సు చేసే అవకాశం కూడా ఉంది. ఈ కోర్సులో కూడా కౌన్సెలింగ్ ద్వారానే ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ జూలై/ఆగస్టు/సెప్టెంబర్‌లలో వెలువడుతుంది. రాష్ట్రంలో దాదాపు 17 కాలేజీలు వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంపీటీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. తర్వాత ఆసక్తిని బట్టి పీహెచ్‌డీ కోర్సును చేయవచ్చు.

ఎంపీటీ-స్పెషలైజేషన్స్:
- ఆర్థోపెడిక్స్
- న్యూరాలజీ
- కార్డియాలజీ అండ్ వ్యాస్కులర్ ప్లామెంటరీ
- స్పోర్ట్స్ మెడిసిన్

కావల్సిన స్కిల్స్:
ఫిజియోథెరపీ ఒక ప్రత్యేకమైన రంగం కాబట్టి ఇందులో రాణించాలంటే... కొన్ని ప్రత్యేక లక్షణాలు అవసరం. ఒక సమస్యకు శాస్త్రీయంగా కారణాలు చెప్పడంతోపాటు పరిష్కార మార్గాలను సూచించే నైపుణ్యం తప్పనిసరి. గంటల తరబడి పనిచేయగలిగే శారీరక సామర్థ్యం ఉండాలి. పేషెంట్ల పట్ల సానుభూతితోపాటు సహనంతో వ్యవహరించాలి. దాంతోపాటు వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపగలగాలి. మంచి పరిశీలన సామర్థ్యం ఉండాలి. నూతన విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి తప్పనిసరి.

నిమ్స్:
రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలతోపాటు నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్)- హైదరాబాద్ కూడా ఫిజియోథెరపీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. వివరాలు..
కోర్సు: బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ).
అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ) లేదా ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (ఫిజియోథెరపీ).
ప్రవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా. జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు/సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది.

ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ):
అర్హత:
బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ).
ప్రవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా. జూలై/ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది. రాత పరీక్ష ఆగస్టు/సెప్టెంబర్ లలో ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది.
వివరాలకు: https://nims.ap.nic.in

అవకాశాలు:
వైద్యరంగంలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ నేడు ఫిజియోథెరపిస్టుల అవసరం ఉంటోంది. ప్రస్తుతం మన దేశంలో డిమాండ్‌కు సరిపడా ఫిజియోథెరపిస్టులు అందుబాటులో లేరు. ఒక అంచనా ప్రకారం ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉండాలి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కోర్సు పూర్తి చేసిన వెంటనే ప్రైవేట్, ప్రభుత్వ రంగంలో ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. హాస్పిటల్స్, ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌లు, హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లు, రక్షణ శాఖ, హెల్త్ క్లబ్‌లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, నర్సింగ్ హోమ్స్, మానసిక చికిత్సాలయాలు, స్పోర్ట్స్ క్లినిక్స్‌లలోను ఫిజియోథెరపిస్ట్‌గా విధులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా... వివిధ రిహాబిలిటేషన్ సెంటర్లల్లో కూడా అవకాశాలుంటాయి. క్రీడారంగం కూడా చక్కని కెరీర్ అవెన్యూగా నిలుస్తోంది. ఇందులో క్రీడాకారులకు ఫిజియోలుగా, ట్రైనర్లుగా అవకాశం ఉంటుంది. ఫిట్‌నెస్‌పై ప్రజల్లో పెరుగుతన్న అవగాహనతోపాటు తదనుగుణంగా ఏర్పాటవుతున్న ఫిట్‌నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్ లు ఫిజియోథెరపిస్ట్‌లకు డిమాండ్‌ను పెంచాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఎంఎన్‌సీలు కూడా విధిగా ఫిట్‌నెస్ సెంటర్లను నిర్వహిస్తుండడం కూడా వీరికి కలిసొచ్చే అంశం. ఫిజియోథెరపీ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రొఫెసర్/ఫ్యాకల్టీగా చేరొచ్చు. సొంతంగా క్లినిక్‌లను ప్రారంభించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా వీరికి చక్కని అవకాశాలున్నాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఫిజియోథెరపిస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంది.

వేతనాలు:
ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఫిజియోథెరపిస్ట్‌లకు నెలకు రూ. 10,000 నుంచి రూ. 30,000 వరకు వేతనం లభిస్తుంది. సాధారణంగా ప్రైవేట్ రంగంలో ఫ్రెషర్స్‌కు ప్రారంభంలో నెలకు రూ. 10,000 నుంచి రూ. 15, 000 వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కూడా ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రారంభంలో నెలకు రూ. 30,000 వరకు చెల్లిస్తున్నారు. తర్వాత హోదాను బట్టి సీనియర్ ఫిజియోథెరపిస్ట్‌కు రూ. 45,000, సూపరింటెండెంట్ కేడర్‌కు రూ. 60-70 వేల వరకు వేతనం లభిస్తుంది. చీఫ్ సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నాక నెలకు రూ. 80,000 వరకు సంపాదించవచ్చు. టీచింగ్ ప్రొఫెషన్‌ను ఎంచుకున్నా వారికి ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి ప్రారంభంలో నెలకు రూ. 10,000 తక్కువ కాకుండా వేతనం లభిస్తుంది. తర్వాత సీనియారిటీ హోదాను బట్టి నెలకు రూ. 40,000 వరకు సంపాదించవచ్చు. చాలా మంది ఫిజియోథెరపిస్ట్‌లు సొంత ప్రాక్టీస్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. సాధారణంగా ఒక్కో సిట్టింగ్ దాదాపు రూ. 250 నుంచి రూ. 400 వరకు చార్జ్ చేస్తారు.

విదేశాల్లో:
ఫిజియోథెరపిస్ట్‌లకు విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికా, కెనడాలలో ఫిజియోథెరపిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాలంటే.. నేషనల్ లెసైన్సింగ్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. కొన్ని దేశాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఫిజియోథెరపిస్ట్‌గా ప్రాక్టీస్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా, కెనడా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాలు వీరికి చక్కటి ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వేతనాల విషయానికొస్తే.. భారతీయ కరెన్సీలో నెలకు రూ. 50,000 నుంచి రూ.2 లక్షల వరకు లభిస్తుంది.

దేశంలోని ప్రముఖ ఫిజియోథెరపీ కాలేజీలు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్-ముంబై
వెబ్‌సైట్: www.aiipmr.gov.in

పండిట్ దీన్‌దయాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండీకాప్డ్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.iphnewdelhi.in

పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-చండీగఢ్
వెబ్‌సైట్: www.pgimer.nic.in

కేఈఎం హాస్పిటల్ అండ్ సేథ్ జీఎస్ మెడికల్ కాలేజ్-ముంబై
వెబ్‌సైట్: www.kem.edu
-------------------------------------------------------

100 శాతం జాబ్ గ్యారెంటీ కోర్సు
గతంలో విద్యార్థుల్లో అంతగా అవగాహన లేక పోవడంతో బీపీటీ కోర్సుకు ఆదరణ తక్కువగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి చాలా మారింది. హెల్త్ సెక్టార్ విస్తరిస్తుండడం... పెరుగుతున్న అవకాశాల ఫలితంగా బీపీటీ కోర్సును ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగింది.ప్రస్తుతం ఇది 100 శాతం జాబ్ గ్యారెంటీ కోర్సుగా గుర్తింపు పొందుతుంది. కోర్సు పూర్తి చేసిన వారికి కేవలం హెల్త్ సెక్టార్‌లోనే కాకుండా.. ఫిట్‌నెస్ సెంటర్లు, ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కూడా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రతి సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఎంఎన్‌సీలు ఫిట్‌నెస్ సెంటర్‌ను కచ్చితంగా నిర్వహిస్తుండడం కూడా బీపీటీ అభ్యర్థులకు వరంగా మారింది. విదేశాల్లో చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లిస్తున్నారు. పీజీ చేస్తే ప్రారంభంలోనే నెలకు రూ. 18,000 వేతనం అందుకోవచ్చు. అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లో ఫిజియోథెరపిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. గల్ఫ్ దేశాల విషయానికొస్తే.. అక్కడి ప్రతినిధులు ఇక్కడికే వచ్చి అవసరమైన అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. బీపీటీ తర్వాత ఎంపీటీ కోర్సులు చేయవచ్చు. ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కోర్సు చేయొచ్చు.
-విశ్వనాథ్,
ప్రిన్సిపల్, కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
ఫిజియోథెరపీ అండ్ పారామెడిక్స్
Published date : 12 Aug 2013 02:26PM

Photo Stories