Skip to main content

కార్పొరేట్ రంగంలో..కన్సల్టింగ్ ఉద్యోగాలకు భారీగా డిమాండ్

కన్సల్టింగ్.. కార్పొరేట్ రంగంలో.. హాట్ కేక్!సేవల నుంచి తయారీ వరకు.. ఏ రంగంలో చూసినా.. కన్సల్టింగ్ జాబ్ ప్రొఫైల్‌కు డిమాండ్ పెరుగుతోంది.
 ఏ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను చూసినా... క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, పీపీఓల్లో అధికశాతం ఆఫర్స్ కన్సల్టింగ్‌లోనే! ఐఐటీల్లో, ఐఐఎంల్లో కన్సల్టింగ్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. కన్సల్టింగ్ ఎందుకంత క్రేజ్? సంస్థల్లో కన్సల్టింగ్ విభాగం విధులు.. కన్సల్టింగ్ కెరీర్ స్కోప్‌పై ప్రత్యేక కథనం...

ఒక సంస్థను ప్రారంభించాలన్నా.. లేదా అప్పటికే ఉన్న సంస్థను మార్కెట్లో మరింత ముందంజలో నిలపాలన్నా.. అందుకు తగిన ప్రణాళికలు, వ్యూహాలు తప్పనిసరి. వీటిని రూపొందించేదే.. కన్సల్టింగ్ విభాగం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సంస్థలు భవిష్యత్తు మనుగడ, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండటంతో కన్సల్టింగ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఐఐటీలు, ఐఐఎంల్లో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులను కన్సల్టింగ్ కొలువుల్లో నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వీరికి సంబంధిత నైపుణ్యాలు ఉంటాయని సంస్థలు భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇటీవల ఐఐఎంలలో ముగిసిన ఎస్‌పీఓలు (సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్‌‌స), ఐఐటీల్లో కొనసాగుతున్న పీపీఓ(ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్‌‌స)ల్లో సగటున 30 శాతం మేరకు కన్సల్టింగ్ జాబ్ ప్రొఫైల్స్ ఉండటమే ఇందుకు నిదర్శనం.

స్ట్రాటజిక్ కన్సల్టింగ్ :
కన్సల్టింగ్ విభాగంలో స్ట్రాటజిక్ కన్సల్టింగ్, ఆపరేషన్స్ కన్సల్టింగ్ అని రెండు రకాలు. వీటిలో స్ట్రాటజిక్ కన్సల్టింగ్‌కు మరింత ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. కారణం.. కొత్తగా సంస్థను ప్రారంభించే లక్ష్యంతో ఉన్న వారు తమ ఉత్పత్తికి సంబంధించి మార్కెట్ రీసెర్చ్, ప్రాజెక్ట్ రిపోర్ట్, అభివృద్ధి ప్రణాళికలు రూపకల్పన వంటి వాటిపై దృష్టిపెడుతున్నాయి. ఈ కార్యకలాపాలను సమగ్రంగా నిర్వహించేదే స్ట్రాటజిక్ కన్సల్టింగ్.

ఆపరేషన్స్ కన్సల్టింగ్ :
సంస్థలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు ఆపరేషన్స్ కన్సల్టింగ్ దోహదం చేస్తుంది. ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలు.. వృద్ధిబాట పట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆయా సంస్థల ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న పోటీని బేరీజు వేస్తూ.. దానికి అనుగుణంగా సంస్థ అనుసరించాల్సిన వ్యూహాలు తయారుచేస్తుంది. మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి సంస్థ చేపట్టాల్సిన చర్యలపై ఆపరేషన్ కన్సల్టింగ్ విభాగం సలహాలు ఇస్తుంది. సంస్థల విలీనాలు, టేకోవర్స్ వంటి ప్రక్రియల్లోనూ ఆపరేషన్ కన్సల్టింగ్ విభాగం మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. సదరు ప్రక్రియలు పూర్తయ్యేలా చూస్తుంది.

పెరుగుతున్న డిమాండ్..
కన్సల్టింగ్ విభాగంలో నిపుణులకు డిమాండ్ ఏటేటా పెరుగుతోంది. ఇటీవల ఐఐఎంలలో ముగిసిన ఎస్‌పీఓ ప్రక్రియలో మొత్తం ఆఫర్స్‌లో 40 శాతం కన్సల్టింగ్ సంస్థల్లో ఉండటమే ఇందుకు నిదర్శనం. అదే విధంగా ఐఐటీల్లో ప్రీ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలోనూ సగటున 30 శాతం కన్సల్టింగ్ సంస్థల నియామకాలే నమోదైనట్లు చెబుతున్నారు. కన్సల్టింగ్ విభాగంలో ఎస్‌పీఓలు, పీపీఓలు అందుకున్న వారికి రూ.లక్ష నుంచి రూ. మూడు లక్షల వరకు స్టయిఫండ్ అందించడం కూడా కన్సల్టింగ్ విభాగానికి పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు.

అనలిటిక్స్ కీలకం :
డేటా అనలిటిక్స్ విభాగంలోనూ డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారుల ఆసక్తులకు అనుగుణంగా సంస్థలు తమ కార్యకలాపాలను, ఉత్పత్తులను రూపొందించడం.. అందుకోసం డేటాను విశ్లేషించడం వంటివి కీలకంగా మారుతుండటమే ఇందుకు కారణం. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి అనలిటిక్స్ ఎక్స్‌పర్ట్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. డేటా అనలిస్ట్; డేటాసైంటిస్ట్; డేటావిజువలైజేషన్ స్పెషలిస్ట్; డేటాఇంజనీర్; అనలిటిక్స్ మేనేజర్ వంటి హోదాల్లో ఐఐటీలు, ఐఐఎంల అభ్యర్థులను సంస్థలు నియమించుకుంటున్నాయి. వీరికి ఎంట్రీ లెవల్‌లోనే సగటున రూ.5 లక్షల వార్షిక వేతనం అందుతోంది. అనలిటిక్స్ పరంగా సంస్థలు టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ విభాగంలో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పొచ్చు.

ఆఫ్ క్యాంపస్ నియామకాలు..
కన్సల్టింగ్‌లో విభాగాల్లో ఆఫ్ క్యాంపస్ నియామకాలు ఉండవా? అనే సందేహం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం కంపెనీలు ఎక్కువ శాతం ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల క్యాంపస్‌లకే పరిమితం అవుతున్నాయి. ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ల పరంగా సంస్థలు జాబ్ పోర్టల్స్‌ను అనుసంధాన వేదికలుగా మార్చుకుంటున్నాయి. అభ్యర్థులు తమ ప్రొఫైల్స్‌ను జాబ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేసుకోవడం ద్వారా అవకాశాలు అందుకునే వీలుందని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా సంస్థల రిక్రూట్‌మెంట్ లింక్స్‌లోనూ అప్‌లోడ్ చేసుకోవాలంటున్నారు.

ఈ నైపుణ్యాలు ఉండాలి..
కన్సల్టింగ్ సంస్థల్లో కొలువు కోసం డొమైన్ నాలెడ్జ్‌తోపాటు ఇతర నైపుణ్యాలను కూడా మెరుగుపరచుకోవాలని ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల ప్లేస్‌మెంట్ వర్గాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా అనలిటికల్ అప్రోచ్; ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్; డేటారీసెర్చ్; డేటాఅనాలిసిస్; డేటా మేనేజ్‌మెంట్; ఇన్నోవేటివ్ థింకింగ్; క్రియేటివిటీ; టీమ్ వర్కింగ్; కమ్యూనికేషన్ స్కిల్స్; మార్కెట్ నాలెడ్జ్ వంటి నైపుణ్యాలకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

టాప్ రిక్రూటర్స్ :
ఐఐటీలు, ఐఐఎంలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కన్సల్టింగ్ నియామకాల పరంగా.. బెయిన్ అండ్ కో; పీడబ్ల్యుసీ(ప్రైస్ వాటర్ కూపర్); యాక్సెంచెర్ స్ట్రాటజీ; స్ట్రాటజీ అండ్ కో; కేపీఎంజీ; ది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్; ఈ ఎన్ వై; మెకిన్సే అండ్ కో; డెలాయిట్; ఎ.టి.కెర్నీ వంటి సంస్థలు టాప్ రిక్రూటర్స్‌గా నిలుస్తున్నాయి. డేటా అనలిటిక్స్ విభాగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలు ముందంజలో ఉంటున్నాయి.

ఉద్యోగాలు ఇవే..
కన్సల్టింగ్ సంస్థల్లో రీసెర్చ్, డేటా అనాలిసిస్, రిపోర్ట్ రైటింగ్‌కు సంబంధించి ఉద్యోగాలు లభిస్తున్నాయి.
ఆ వివరాలు..
  • అనలిస్ట్, జూనియర్ అసోసియేట్: మేనేజ్‌మెంట్ పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు కన్సల్టింగ్ సంస్థల్లో అనలిస్ట్, జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరు డేటాకలెక్షన్, డేటా అనాలిసిస్, ఫైండింగ్స్‌తో నివేదికలను రూపొందించాల్సి ఉంటుంది. వీరికి ప్రారంభంలో నెలకు రూ.50వేల వరకు వేతనం లభిస్తోంది.
  • కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, మేనేజర్: అయిదారేళ్ల పని అనుభవం ఉండి.. పీజీ ఉత్తీర్ణులైన వారికి కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, మేనేజర్ తదితర ఉద్యోగాలు లభిస్తున్నాయి. అనలిస్ట్‌లు, జూనియర్ అసోసియేట్‌లు అందించిన నివేదికలను విశ్లేషించడం, వాటిని బేరీజు వేసి.. అందుకు అనుగుణంగా క్లయింట్ సమస్యకు పరిష్కారం చూపాలి.
  • పిన్సిపల్ /డెరైక్టర్: కన్సల్టింగ్ సంస్థల్లో ఉన్నత స్థాయిలో ద్వితీయ శ్రేణిలో ప్రిన్సిపల్స్ లేదా డెరైక్టర్స్‌ను కన్సల్టింగ్ సంస్థలు నియమించుకుంటున్నాయి. వీరు నేరుగా క్లయింట్ రిలేషన్‌షిప్‌ను ఏర్పరచడం, కొత్త క్లయింట్లను తేవడం వంటివి చేయాల్సి ఉంటుంది.
  • ఆయా హోదాల్లో అనుభవం గడించిన కొద్దీ.. సీనియర్ మేనేజర్, అనలిస్ట్, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్ట్ హెడ్ స్థాయికి చేరుకోవచ్చు.
కన్సల్టింగ్ కెరీర్.. గణాంకాలు :
  • 2018 సంవ‌త్సరంలో ఐఐఎంలు, ఇతర బి-స్కూల్స్ ప్లేస్‌మెంట్స్‌లో సగటున 40 శాతం మేర కన్సల్టింగ్ సంస్థల ఆఫర్స్.
  • ప్రారంభంలో రూ.30 లక్షలు(డొమెస్టిక్); రూ.80 లక్షల నుంచి రూ.కోటి (ఇంటర్నేషనల్ ఆఫర్స్) పే ప్యాకేజీలు
  • 2019 సంవ‌త్సరంలో ఐఐఎంల ఎస్‌పీఓ ప్రక్రియలో 40శాతం కన్సల్టింగ్ సంస్థల ఆఫర్స్
  • ఐఐటీల్లోనూ 30 శాతం మేరకు కన్సల్టింగ్ సంస్థల నుంచే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్లు.
ఎక్కువ ఆఫర్లు.. కన్సల్టింగ్ సంస్థల్లో పీపీవో నియామకాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు కన్సల్టింగ్ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం.. డేటారీసెర్చ్, అనాలిసిస్, ఫోర్‌క్యాస్టింగ్ వంటి అంశాల్లో వీరికి నైపుణ్యాలు ఉంటాయని భావించడమే. పీపీఓలను దృష్టిలో పెట్టుకుంటే..2019-20 ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలోనూ కన్సల్టింగ్ సంస్థలు ఎక్కువ ఆఫర్లు ఇస్తాయని  చెప్పొచ్చు.
                             -ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ ఏముల, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, ఐఐటీ-హైదరాబాద్
Published date : 11 Dec 2019 01:45PM

Photo Stories