ఇంజనీరింగ్.. ఫీజులుం
Sakshi Education
- 2019-22 బ్లాక్ పిరియడ్‌కు ఫీజుల పెంపునకు కసరత్తు ప్రారంభం
- స్థానిక కళాశాలల్లో 60 వేల వరకు వార్షిక ఫీజు పెరిగే అవకాశం
- పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లలో ఫీజు రూ.రెండు లక్షలకు చేరే ఆస్కారం
- కళాశాలల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్న తెలుగు రాష్ట్రాల ఏఎఫ్‌ఆర్‌సీలు
- ఫీజులు పెరుగుతున్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ అరకొరే..
బీటెక్.. తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థుల స్వప్నం! ఆ స్వప్న సాకారం కోసం ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే ఎంసెట్‌లో విజయం కోసం శ్రమిస్తుంటారు. ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించడమే లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇప్పటికే రూ.లక్షలు వెచ్చించి కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ ఎంపీసీ చదువుతూ.. మరోవైపు ఎంసెట్ కోచింగ్ కోసం వేలకువేలు ఫీజులు కడుతున్న విద్యార్థులు.. కష్టపడి చదివి ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించాక మరిన్ని ఫీజుల భారం మోయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది!! 2019-2022 బ్లాక్ పిరియడ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో పెరగనున్న ఫీజుల భారంపై నిపుణుల విశ్లేషణ...
2019-2022 బ్లాక్ పిరియడ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు దిశగా కసరత్తు మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల ఏఎఫ్‌ఆర్‌సీ (అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) లు.. ఆయా కళాశాలల నుంచి ప్రతిపాదనల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించాయి! ఈ ప్రతిపాదనల ఆధారంగా ఫీజుల నిర్ధారణ జరగనుంది. ఫీజుల పెంపుపై కాలేజీల డిమాండ్‌ల దృష్ట్యా 2019-2022 బ్లాక్ పిరియడ్‌కు భారీగా ఫీజులు పెరిగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రతి మూడేళ్లకోసారి పెంపు
తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రతి మూడేళ్లకు ఒకసారి ఫీజుల సవరణ విధానం అమలవుతోంది. ఇందుకోసం ఆయా కళాశాలల ఆదాయ, వ్యయ వివరాలను పరిగణనలోకి తీసుకొని.. ఫీజును నిర్ధారించాలనే విధానం 2013లో తొలిసారిగా అమల్లోకి వచ్చింది. ఇందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఏఎఫ్‌ఆర్‌సీ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఏఎఫ్‌ఆర్‌సీలోని నిపుణులు ఆయా కళాశాలలు పంపిన ఆదాయ, వ్యయ ప్రతిపాదనలను పరిశీలించి ఫీజులు నిర్ధారిస్తున్నారు. 2016-2019 బ్లాక్ పిరియడ్ గడువు ముగియనుంది. దీంతో 2019-2022కు గాను ఫీజుల సవరణకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే ఆయా కళాశాలల నుంచి ఆదాయ వ్యయ ప్రతిపాదనలను ఏఎఫ్‌ఆర్‌సీలు స్వీకరిస్తున్నాయి.
రూ.60 వేల నుంచి రెండు లక్షల వరకు?
2019-22 బ్లాక్ పిరియడ్‌కు సంబంధించి స్థానిక కళాశాలల్లో కనిష్టంగా బీటెక్ వార్షిక ఫీజు రూ.60వేల వరకు పెరిగే అవకాశముందంటున్నారు. కొంత పేరున్న కళాశాలల్లోనైతే ఈ ఫీజు రూ.రెండు లక్షల వరకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. 2016-19 బ్లాక్ పీరియడ్‌కు స్థానిక ఇంజనీరింగ్ కళాశాలల్లో రూ.35 వేలు వార్షిక ఫీజును నిర్ధారించగా.. పేరున్న కళాశాలల్లో గరిష్టంగా రూ.1.13 లక్షలు నిర్ణయించారు. పేరున్న ఆ కళాశాలలు సదరు రూ.1.13 లక్షల ఫీజు తమ వ్యయాలకు సరిపోవట్లేదని.. ఇంకా పెంచాలని కోరుతూ కోర్టుల్లో వాజ్యాలు సైతం వేశాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో రూ.1.5 లక్షలకుపైగా వార్షిక ఫీజు చెల్లించేలా విద్యార్థుల నుంచి ఒప్పంద పత్రాలు రాయించుకున్న పరిస్థితి తెలిసిందే! ఇప్పుడిక తాజాగా 2019-2022 బ్లాక్ పిరియడ్‌కు సంబంధించి ఈ పేరున్న కళాశాలలు అధికారికంగానే రూ.రెండు లక్షల వరకు ఫీజును నిర్ధారించాలని ఒత్తిడి తెచ్చే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు.
‘భారీ’ ఫీజులకు కారణం?
ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీకి వేతనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకయ్యే వ్యయాల కోసం ప్రస్తుత ఫీజులు ఏ మాత్రం సరిపోవడం లేదని కాలేజీలు పేర్కొంటున్నాయి. ఇప్పుడున్న ఫీజులను దాదాపు రెట్టింపు చేస్తే తప్ప ఏఐసీటీఈ ప్రమాణాల మేరకు కాలేజీలు మనుగడ సాగించడం కష్టమని చెబుతున్నాయి. కాలేజీల ఇలాంటి వాదన కారణంగా 2019-2022 బ్లాక్ పిరియడ్‌కు ఫీజులు భారీగా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనావేస్తున్నారు.
మూడు నుంచి పది లక్షలు ఖర్చు చేస్తేనే!
భారీ స్థాయిలో ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైన నేపథ్యంలో స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసేందుకు నాలుగేళ్ల కోర్సులో ట్యూషన్ ఫీజుకే దాదాపు మూడు లక్షలు కట్టాల్సి ఉంటుంది. దీనికి అదనంగా ఇతర ఖర్చులు ఉండనే ఉంటాయి. పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఏకంగా రూ.పది లక్షల వరకు వ్యయం చేస్తేనే బీటెక్ పట్టా చేతికందుతుంది.
ఫీజులు పెరిగినా.. నాణ్యత లభించేనా?
కళాశాలల డిమాండ్‌లకు అనుగుణంగా ఫీజులు పెరిగే అవకాశమున్నా.. విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందన్న గ్యారెంటీ ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పేరున్న కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కొంత మెరుగ్గా ఉన్నా.. మిగతా కాలేజీల్లో మాత్రం అర్హులైన ఫ్యాకల్టీ సంఖ్య ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా ఉండట్లేదు. ఏఐసీటీఈ ఇటీవల విడుదల చేసిన నూతన కరిక్యులం ప్రకారం-ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి తన నాలుగేళ్ల కోర్సు కాలంలో మూడు ఇంటర్న్‌షిప్‌లు చేయాలని.. కాలేజీలో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్స్‌ను ఏర్పాటుచేయాలని.. ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని... మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటన్నింటినీ అమలు చేసే కళాశాలల సంఖ్యను వేళ్ల మీద లెక్కించొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలంలోనూ ఇంజనీరింగ్ కళాశాలలు కనిపిస్తున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సైతం ఇవి పుట్టుకొచ్చాయి. ఈ కళాశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన వంటివి కనుచూపుమేరలో కనిపించడంలేదు. ఇలాంటి కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు సైతం ఇష్ట పడటం లేదు. గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్, సీట్ల భర్తీ గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఫీజులు పెంచుకున్న కాలేజీలు ఆ మేరకు నిబద్ధతతో వ్యవహరిస్తే విద్యార్థులకు నాణ్యమైన బోధన, నైపుణ్యాలు లభిస్తాయని అంటున్నారు. అందుకు భిన్నంగా లాభాపేక్షే లక్ష్యంగా ఫీజులు పెంచుకుంటే మాత్రం.. నాణ్యతా ప్రమాణాల పరంగా నాలుగేళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెబుతున్నారు.
మిగిలిపోతున్న సీట్లు
నాణ్యత ప్రమాణాలు లేని కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దాంతో ఆయా కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. గతేడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం- ఏపీలో ప్రైవేటు కళాశాలల్లో కౌన్సెలింగ్ కోటాలో 92 వేలకు పైగా సీట్లు ఉంటే.. దాదాపు 34 వేల సీట్లు మిగిలిపోయాయి. తెలంగాణలో 66 వేల సీట్లకు గాను 17 వేల సీట్లు మిగిలిపోయాయి.
అవకాశాలు లేక.. దిక్కు తోచక
ఎలాగోలా ఫీజుల భారం మోసి.. కోర్సు పూర్తి చేసుకుని డిగ్రీ పట్టా అందుకుని.. క్యాంపస్ బయట కాలు పెట్టిన విద్యార్థులకు ఉద్యోగాల పరంగా దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. స్థానిక కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అనే మాటే వినిపించట్లేదు. ఆ కాలేజీల్లో నాణ్యమైన బోధన లేక.. నైపుణ్యాల లేమి కారణంగా బయట కూడా జాబ్ మార్కెట్‌లో కొలువులు లభించడంలేదు. సొంతంగా ఉద్యోగ అన్వేషణలో జాబ్ మార్కెట్‌లో అడుగుపెట్టాక విద్యార్థులకు బీటెక్ పట్టాలు ఎందుకూ కొరగానివని.. అదనపు నైపుణ్యాలుంటేనే ఉద్యోగం లభిస్తుందని తెలిసి ఆవేదన చెందుతున్నారు.
నియంత్రణ పటిష్టంగా ఉంటేనే
ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు పెరగాలంటే నియంత్రణ వ్యవస్థలు పటిష్టంగా పనిచేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. సాంకేతిక విశ్వ విద్యాలయాలు తమ అనుబంధ కళాశాలల్లో ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని పేర్కొంటున్నారు. నిత్యం తనిఖీలు చేస్తుండటం.. లోపాలుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం వంటి చర్యల వల్ల కాలేజీల వైఖరిలో మార్పు వచ్చే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం చాలా సందర్భాల్లో యూనివర్సిటీల అధికారిక బృందాలు ఆయా కళాశాలల్లో తనిఖీ చేసే సమయం గురించి ముందుగానే తెలియజేయడం.. పర్యవసానంగా యాజమాన్యాలు అప్పటికప్పుడు తనిఖీ బృందాలు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి యూనివర్సిటీల అధీకృత బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తే కళాశాలల వాస్తవ పరిస్థితులు తెలుస్తాయంటున్నారు.
ఫీజులు పెరిగినా.. పెరగని రీయింబర్స్‌మెంట్
ఇంజనీరింగ్ ఫీజుల పరంగా విద్యార్థులకు వరం.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం. కానీ, గత కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం దారితప్పింది. ఆయా కోర్సుల్లో ఫీజులు భారీగా పెరుగుతున్నా...రీయింబర్స్‌మెంట్ మాత్రం పెరగడం లేదు. ఇస్తున్న ఆ కొద్ది మొత్తం కూడా సకాలంలో, సక్రమంగా చెల్లించక కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు ఎన్నో! బీటెక్‌కు సంబంధించి 2016-19 బ్లాక్ పీరియడ్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. రెండు రాష్ట్రాల్లోనూ సీలింగ్ నిబంధన పేరుతో ఏడాదికి రూ.35వేలు మాత్రమే రీయింబర్స్ చేస్తున్నారు. ఆపై మొత్తాన్ని విద్యార్థులే సొంతగా చెల్లించుకోక తప్పదు. బీసీ, ఈబీసీ వర్గాల విద్యార్థుల ర్యాంకు పదివేలు దాటితే.. ఫీజు ఎంతున్నా రూ.35వేల రీయింబర్స్‌మెంట్‌తో సరిపుచ్చుకోవాల్సిందే!
ఫీజుల పెంపు.. కాలేజీల అభిప్రాయాలు
- ఏఐసీటీఈ నిబంధనలు పాటించాలంటే ఫీజులు పెంచితేనే సాధ్యం.
- ఫ్యాకల్టీ వేతనాలకే ఆదాయంలో సగం వెచ్చించాల్సి వస్తోంది.
- మౌలిక సదుపాయాలకు రూ.లక్షల్లో ఖర్చు అవుతోంది.
ప్రమాణాలు పాటించాలంటే తప్పదు.. కానీ..
ఏఐసీటీఈ ప్రమాణాలు పాటించాలంటే ఫీజుల పెంపు తప్పదు. కానీ.. ఫీజుల పెంపును డిమాండ్ చేసే కాలేజీలు.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో వ్యవహరించాలి. నియంత్రణ సంస్థలు ఆయా కళాశాలల పనితీరుపై కన్నేసి ఉంచాలి. అప్పుడే విద్యార్థులకు వ్యయ భారమైనా.. ఉద్యోగ నైపుణ్యాలు లభిస్తాయి.
- డాక్టర్ డి.ఎన్.రెడ్డి, డెరైక్టర్, సీఆర్ రావు ఏఐఎంఎస్‌సీఎస్, జేఎన్‌టీయూ-హెచ్ మాజీ వీసీ.
ఆన్‌లైన్ తనిఖీ వ్యవస్థ
కళాశాలలు తాము అందించిన ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా కళాశాలల్లో సదుపాయాలపై చర్యలు తీసుకుంటున్నాయా? లేదా? అనే విషయం నిరంతరం తెలుసుకునేలా ఆన్‌లైన్ తనిఖీ వ్యవస్థను రూపొందించాలి. ఎప్పటికప్పుడు కళాశాలల్లో చేపడుతున్న టీచింగ్, నాన్-టీచింగ్ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సంబంధిత యూనివర్సిటీకి ఆన్‌లైన్‌లో తెలియజేసే విధంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందిస్తే పెరిగే ఫీజుల మేరకు విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.
- ప్రొ॥వి.ఎస్.రావు, ప్రెసిడెంట్, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ.
Published date : 14 Jan 2019 06:56PM