Skip to main content

CSE craze in IITs: ఐఐటీల్లో సీఎస్‌ఈ క్రేజ్‌

ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను 4వ తేదీన నిర్వహించారు. ఐఐటీ గువహటి ప్రొవిజనల్‌ కీని కూడా విడుదల చేసింది. 18వ తేదీన ఫలితాలు వెల్లడించే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2023 పరీక్ష తీరుతెన్నులు, కటాఫ్‌ అంచనా, ఐఐటీల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, బ్రాంచ్‌లు, ప్రవేశ విధానంపై ప్రత్యేక కథనం..
IIT CSE career
IIT CSE

అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రెండు పేపర్లుగా.. ఒక్కో పేపర్‌లో 51 ప్రశ్నలు అడిగారు. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 17 చొప్పున ప్రశ్నలు వచ్చాయి. ఒక్కో పేపర్‌కు 180 మార్కులు లెక్కన రెండు పేపర్లను కలిపి మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు.

క్లిష్టంగా మ్యాథమెటిక్స్‌
రెండు పేపర్లలోనూ మ్యాథమెటిక్స్‌ విభాగం ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని.. విద్యార్థులు, సబ్జెక్ట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ట్రిగ్నోమెట్రిక్‌ ఈక్వేషన్స్, హార్మోనిక్‌ ప్రోగ్రెషన్స్, వెక్టార్స్, ప్రాబబిలిటీ, ఎలిప్స్, మ్యాట్రిసెస్, ఫంక్షన్స్‌ నుంచి అడిగిన ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నా.. 3–డి జామెట్రీ, కానిక్‌ సెక్షన్స్‌ విభాగం ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. పేపర్‌–2లో కో–ఆర్డినేట్‌ జామెట్రీ, కాలిక్యులస్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారని.. హైపర్‌ బోలా, పెర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్, డెఫినిట్‌ ఇంటిగ్రేషన్‌ విభాగాల నుంచి డైరెక్ట్‌ కొశ్చన్స్‌ అడిగినా.. అవి సుదీర్ఘ సమాధానం ఇవ్వాల్సిన విధంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.

చదవండి: Advantages of 'CSE' Branch in Engineering : బీటెక్‌లో 'సీఎస్‌ఈ' బ్రాంచ్ ఎంపిక చేసుకుంటే..ఉంటే లాభాలు ఇవే..

ఫిజిక్స్‌.. ఓ మోస్తరు క్లిష్టత
ఫిజిక్స్‌లో ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. ఎలక్ట్రిసిటీ, రొటేషనల్‌ మోషన్, కైనమాటిక్స్, వర్క్‌ పవర్‌ అండ్‌ ఎనర్జీ, థర్మోడైనమిక్స్, సర్ఫేస్‌ టెన్షన్‌ల నుంచి అడిగిన ప్రశ్నలు రెండు, మూడు కాన్సెప్ట్‌ల కలయికతో.. సుదీర్ఘంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.


కెమిస్ట్రీ.. ఊరట
కెమిస్ట్రీలో ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. ఫిజికల్‌ కెమిస్ట్రీ నుంచి మోల్‌ కాన్సెప్ట్,ఎలక్ట్రో కెమిస్ట్రీ, సర్ఫేస్‌ కె­మిస్ట్రీ, థర్మో డైనమిక్స్, కెమికల్‌ కైనటిక్స్‌ వి­భాగాల్లో ప్రశ్నలు అడిగారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ­లో కాన్సెప్ట్‌ బేస్డ్‌ ప్రశ్నలు, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ­లో రియాక్షన్‌ బేస్డ్‌ ప్రశ్నలు ఎదురయ్యాయి.

Advantages of ECE Branch in Engineering : బీటెక్‌లో 'ఈసీఈ' బ్రాంచ్ ఎంపిక చేసుకుంటే.. ఉండే ఉప‌యోగాలు ఇవే..

కటాఫ్‌ 80 మార్కులు
మొత్తం 360 మార్కులకు నిర్వహించిన అడ్వాన్స్‌డ్‌లో.. కటాఫ్‌ మార్కులు 80గా ఉంటాయని నిపుణుల అంచనా. ఈ మార్కులు 60కు పరిమితమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని చె­బుతున్నారు. గతేడాదితో పోల్చితే పరీక్ష కొంత సులభంగా ఉండడంతో కటాఫ్‌ మార్కులు పెరిగే అవకాశముంది. గత ఏడాది జనరల్‌ కేటగిరీ కటాఫ్‌ 55 మార్కులు మాత్రమే.


ఐఐటీల్లో 16,598 సీట్లు
అడ్వాన్స్‌డ్‌ స్కోర్‌ ఆధారంగా 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లలో ప్రవేశం లభిస్తుంది. వీటిలో విద్యార్థులు ఎంతో క్రేజీగా భావించే కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్‌ వంటి ఎవర్‌ గ్రీన్‌ బ్రాంచ్‌లతోపాటు.. బయో సైన్సెస్‌ అండ్‌ బయో ఇంజనీరింగ్, బయోటెక్‌ అండ్‌ బయోకెమ్‌ ఇంజనీరింగ్, బయో ఇంజనీరింగ్‌ వంటి వైద్య అనుబంధ బ్రాంచ్‌లు ఉండడం విశేషం. వీటితోపాటు ఇటీవల మార్కెట్‌ ట్రెండ్, జాబ్‌ మార్కెట్‌ స్కిల్స్‌కు అనుగుణంగా.. డేటాసైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఏఐ–ఎంఎల్‌ వంటి బ్రాంచ్‌లను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీ రింగ్‌లోనూ డేటా సైన్స్‌ మేజర్‌గా కొత్త ప్రోగ్రామ్‌ అందుబాటులోకి వచ్చింది. అదే విధంగా అయిదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ(బీటెక్‌+ఎంటెక్‌) ప్రోగ్రామ్‌లు కూడా ఉన్నాయి.

 

BTech Branches & Colleges Selection 2023 : బీటెక్‌లో.. బ్రాంచ్‌, కాలేజ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే.. ఎంపికలో తొలి ప్రాధాన్య దీనికే ఇవ్వాలి..

సీఎస్‌ఈకే తొలి ప్రాధాన్యం
గత కొన్నేళ్లుగా అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్ల తొలి ప్రాథమ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ నిలుస్తోంది. గత ఏడాది ఐఐటీ–ముంబైలో క్లోజింగ్‌ ర్యాంకు 62గా ఉండగా.. ఐఐటీ–ఢిల్లీలో 102గా, ఐఐటీ–చెన్నైలో 175గా, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 303, ఐఐటీ–రూర్కీలో 413, ఐఐటీ–హైదరాబాద్‌లో 608గా నమోదయ్యాయి. మిగతా ఐఐటీల్లో ఓపెన్‌ కేటగిరీలో 2000లోపు ర్యాంకుతోనే సీఎస్‌ఈ సీట్లు భర్తీకావడం ఈ బ్రాంచ్‌కున్న క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు.


ప్రాధాన్యం వీటికే
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ తర్వాత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్‌ ఇంజనీరింగ్‌లు విద్యార్థుల ప్రాథమ్యాలుగా నిలుస్తున్నాయి. గత ఏడాది ఆరు రౌండ్లలో నిర్వహించిన ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో.. విద్యార్థుల ఆప్షన్లను పరిశీలిస్తే ఈ నాలుగు బ్రాంచ్‌లే ముందంజలో నిలిచినట్లు స్పష్టమవుతోంది. వీటిలో ఓపెన్‌ కేటగిరీలో చివరి రౌండ్‌లో తొమ్మిది వేలలోపు క్లోజింగ్‌ ర్యాంకు నమోదైంది.


ఏఐ కోర్సులకూ క్రేజ్‌

  • జాబ్‌ మార్కెట్‌ అవసరాలు, లేటెస్ట్‌ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని పలు ఐఐటీలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌ అ­నుబంధ ప్రోగ్రామ్‌లను కూడా ప్రారంభించాయి. వీటిలోనూ క్లోజింగ్‌ ర్యాంకు గరిష్టంగా రెండు వేల లోపు నమోదవుతోంది. 
  • డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌: ఐఐటీ రూర్కీలో 822, గువహటిలో 951, భిలాయ్‌లో 5744గా ఓపెన్‌ కేటగిరీ క్లోజింగ్‌ ర్యాంకులు ఉన్నాయి.
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌: ఐఐటీ హైదరాబాద్‌లోనే ఉన్న ఈ ప్రోగ్రామ్‌లో క్లోజింగ్‌ ర్యాంకు 840గా నమోదైంది.
  • డేటా సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌: ఐఐటీ మండిలో 3974, పాలక్కాడ్‌లో 6502గా క్లోజింగ్‌ ర్యాంకులు ఉన్నాయి.
  • ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌: జోథ్‌పూర్‌లో 3257గా, పాట్నాలో 3702గా క్లోజింగ్‌ ర్యాంకులు నిలిచాయి.

Career Opportunities: 5జీ టెక్నాలజీలో రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల ఉద్యోగాలు..

కెరీర్‌ అవకాశాలు

  • సీఎస్‌ఈ బ్రాంచ్‌తో బీటెక్‌ పట్టా అందుకుంటే..జాబ్‌ గ్యారెంటీ అనే అభిప్రాయం నెలకొంది. ఐఐటీల క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌లో సీఎస్‌ఈ విద్యార్థులకు సగటున రూ.35 లక్షల వేతనం లభిస్తోంది. 
  • సీఎస్‌ఈ తర్వాత ఎలక్ట్రానిక్స్‌కు జాబ్‌ మార్కెట్లో అధిక డిమాండ్‌ కనిపిస్తోంది. మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, 5జీ టెక్నాలజీస్‌ కారణంగా..ఈసీఈ, ఎలక్ట్రికల్‌ విద్యార్థులకు డిమాండ్‌ పెరుగుతోంది. వీరికి కూడా సగటున రూ.30 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. మెకానికల్, సివిల్‌ వంటి బ్రాంచ్‌ల వారికి కూడా ఐఐటీల్లో ఆకర్షణీయ వేతనంతో ఆఫర్స్‌ లభిస్తున్నాయి.


జోసా కౌన్సెలింగ్‌
ఐఐటీల్లో సీట్ల కేటాయింపు కోసం జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ(జోసా) ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఛాయిస్‌ ఫిల్లింగ్‌లో ఇన్‌స్టిట్యూట్స్, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ల ప్రాథమ్యాలను వరుస క్రమంలో పేర్కొనాలి. తదుపరి దశలో అభ్యర్థులు పేర్కొన్న ప్రాథమ్యాలు, ఆయా ఇన్‌స్టిట్యూట్స్, బ్రాంచ్‌లలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే సీట్‌ అలాట్‌మెంట్‌ జరుగుతుంది. సీట్‌ అలాట్‌మెంట్‌ పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నిర్దేశిత ఫీజు చెల్లించి.. సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరవడంతోపాటు జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణులు ఐఐటీలు, నిట్‌లు తదితర ఇన్‌స్టిట్యూట్‌లను తమ ప్రాథమ్యాలుగా ఎంచుకోవచ్చు.


ఆరు రౌండ్లలో కౌన్సెలింగ్‌
జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ నిర్వహించే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ మొత్తం ఆరు రౌండ్లలో జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం– జోసా–2023 కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 19న ప్రారంభం కానుంది. అభ్యర్థులు అయిదో రౌండ్‌ వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొని స్లైడింగ్‌ ప్రక్రియకు హాజరవ్వచ్చు.
     జూన్‌ 19: జోసా వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్,ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియ ప్రారంభం. 
     జూన్‌ 25: మాక్‌ సీట్‌ అలొకేషన్‌(సీట్ల కేటాయింపు నమూనా జాబితా)–1 విడుదల. (జూన్‌ 24 రాత్రి 8గంటల వరకు అభ్యర్థులు పేర్కొన్న ప్రా­థమ్యాల ఆధారంగా దీన్ని విడుదల చేస్తారు).
     జూన్‌ 27: మాక్‌ సీట్‌ అలొకేషన్‌(సీట్ల కేటాయింపు నమూనా జాబితా)–2 విడుదల. (జూన్‌ 26 సాయంత్రం అయిదు గంటల వరకు పేర్కొన్న ప్రాథ్యమాల ఆధారంగా వెల్లడించనున్నారు).
     జూన్‌ 28: ఛాయిస్‌ ఫిల్లింగ్, క్యాండిడేట్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ. 
     జూన్‌ 29: వివరాల పునస్సమీక్ష, పరిశీలన.
     జూన్‌30:మొదటి రౌండ్‌ సీట్ల కేటాయింపు.
     జూన్‌ 30–జూలై 4: మొదటి రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేయాలి. అదే విధంగా యాక్సప్టెన్స్‌ ఫీజును చెల్లించాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. 
     జూలై 6: రెండో దశ సీట్ల కేటాయింపు.
     జూలై 6–10: రెండో రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్ల అప్‌లోడ్‌. 
     జూలై 7–11: రెండో రౌండ్‌లో పొందిన సీటు విషయంలో ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్‌ ప్రక్రియ నుంచి విరమించుకునే అవకాశం.
     జూలై 12: మూడో రౌండ్‌ సీట్ల కేటాయింపు.
     జూలై 12–14: మూడో రౌండ్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌.
     జూలై 13–15: మూడో రౌండ్‌ తర్వాత సీటు ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్‌ ప్రక్రియ నుంచి ఉపసంహరణ.
     జూలై 16: నాలుగో రౌండ్‌ సీట్ల కేటాయింపు.
     జూలై 16–19: నాలుగో రౌండ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌.
     జూలై 18–20: నాలుగో రౌండ్‌ తర్వాత సీటు ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్‌ నుంచి ఉపసంహరణ అవకాశం.
     జూలై 21: అయిదో రౌండ్‌ సీట్ల కేటాయింపు.
     జూలై 21–24: అయిదో రౌండ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, డాక్యుమెంట్‌ అప్‌లోడ్, ఫీజు పేమెంట్‌.
     జూలై 21–25: అయిదో రౌండ్‌ తర్వాత సీటు విత్‌డ్రా లేదా కౌన్సెలింగ్‌ నుంచి ఉపసంహరణ అవకాశం.
     జూలై 26: ఆరో రౌండ్‌(చివరి రౌండ్‌) సీట్ల కేటాయింపు.
     జూలై 26–28: ఆరో రౌండ్‌లో పొందిన సీటుకు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://josaa.nic.in

Published date : 14 Jun 2023 05:17PM

Photo Stories