Engineering Career: బీటెక్.. బెస్ట్‌గా నిలవాలంటే!
బీటెక్.. దేశంలో లక్షల మంది విద్యార్థుల కల! తమ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఇంటర్‌లో చేరిన మొదటి రోజు నుంచే అహర్నిశలు కృషి చేస్తారు. ఇలాంటి విద్యార్థులందరూ.. ఎంట్రెన్స్ టెస్టులో విజయం సాధించి..బీటెక్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. బీటెక్‌లో ప్రవేశం పొంది..తరగతి గదిలో అడుగుపెట్టడంతోనే లక్ష్యం సాధించినట్లు కాదు. ఇది లక్ష్య సాధనకు తొలిమెట్టు మాత్రమే. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో అకడమిక్ సబ్జెక్టులతోపాటు లేటెస్ట్ టెక్నాలజీపై పట్టు సాధించేలా నిత్యం కృషి చేయాలి. అప్పుడే సర్టిఫికెట్ చేతికొచ్చేనాటికి జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయి. నైపుణ్యాలుంటేనే ఆఫర్లు దక్కే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు నిపుణుల సలహాలు..
- డొమైన్, కోర్, సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే అవకాశాలు
- ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన తప్పనిసరి
- బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిపుణుల సూచన
‘బీటెక్.. నచ్చిన బ్రాంచ్‌లో, మెచ్చిన కాలేజీలో సీటు సాధించడంతోనే సరిపోదు. విద్యార్థులు ఇంకా ఎన్నో అంశాల్లో నైపుణ్యం సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీస్‌పై అవగాహన, ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌పై పట్టు ఎంతో ప్రధానం.’ బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు నిపుణుల సలహా ఇది! ప్రస్తుతం కంపెనీలు.. ఆఫర్లు ఖరారు చేసే విషయంలో అభ్యర్థుల అకడమిక్ జీపీఏలు, గ్రేడ్‌లకే పరిమితం కావడం లేదు. ఇండస్ట్రీ పరంగా తాజా నైపుణ్యాలు, రియల్ టైమ్ స్కిల్స్ సొంతం చేసుకున్న వారికే పెద్ద పీట వేస్తున్నాయి. కాబట్టి బీటెక్‌లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్‌కు అనుగుణంగా ఇండస్ట్రీ పరిణామాలను పరిశీలిస్తూ.. సంస్థలు అనుసరిస్తున్న నూతన టెక్నాలజీలను అవపోసన పట్టాలి. ఇందుకోసం బీటెక్ మొదటి సంవత్సరం నుంచే కృషి చేయాలి అంటున్నారు నిపుణులు.
డిజిటల్ టెక్నాలజీ
ప్రస్తుతం ఇండస్ట్రీ పరిణామాలను పరిశీలిస్తే.. కంపెనీలు డిజిటల్ టెక్నాలజీ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. అన్ని రంగాల్లోని సంస్థలూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. ఇందుకోసం తగిన నైపుణ్యాలున్న వారికే నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం నుంచి సదరు టెక్నాలజీస్‌పై పట్టు పెంచుకునేందుకు కృషి చేయాలి. ఎందుకంటే.. మూడో సంవత్సరంలోనో లేదా ఫైనల్ ఇయర్‌లోనో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా తృతీయ, చివరి సంవత్సరాల్లో అకడమిక్ సబ్జెక్టులు, ప్రాజెక్ట్ వర్క్ తదితర ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకునేందుకు సమయం అందుబాటులో ఉండదు.
చదవండి: బీటెక్ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్ ఉండాల్సిందే!
ఇండస్ట్రీ 4.0 స్కిల్స్
బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా పేర్కొంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి స్కిల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ప్రస్తుతం కంపెనీలు ఈ స్కిల్స్ ఉన్న వారికే ఆఫర్లు ఖరారు చేస్తున్నాయి. కాని ఇలాంటి నైపుణ్యాలున్న విద్యార్థుల సంఖ్య 20 నుంచి 25 శాతం మధ్యలోనే ఉంటోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3–డి డిజైన్, ఎథికల్ హ్యాకింగ్, నెట్‌వర్కింగ్ స్కిల్స్ ఉన్న వారికి చక్కటి ఆఫర్లు లభిస్తున్నాయి. కాబట్టి వీటిని నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
కోడింగ్.. ప్రోగ్రామింగ్
కోడింగ్.. ప్రోగ్రామింగ్.. ఇంజనీరింగ్ విద్యార్థుల డ్రీమ్ జాబ్.. ఐటీ కొలువు సొంతం చేసుకోవడంలో అత్యంత కీలక నైపుణ్యాలు ఇవి. సీఎస్‌ఈ, ఐటీ తదితర సాఫ్ట్‌వేర్ అనుబంధ బ్రాంచ్‌ల విద్యార్థులతోపాటు ఇతర విభాగాల వారు సైతం.. కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను ప్రాక్టికల్ అప్రోచ్‌తో నేర్చుకునేందుకు సిద్ధమవ్వాలి. ముఖ్యంగా పైథాన్, ఆర్, జావా, జావా స్క్రిప్ట్, సీ++, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్ డేటాబేస్ వంటివి నేర్చుకునేందుకు కృషిచేయాలి. అందుకోసం షార్ట్‌టర్మ్ కోర్సులు, ఆన్‌లైన్ కోర్సులు, సర్టిఫికేషన్స్ చేయాలి. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యాట్, ఐబీఎం, జెట్ కింగ్ వంటి సంస్థలు కోడింగ్ నైపుణ్యాల సమ్మిళితంగా ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవచ్చు.
సర్క్యూట్ బ్రాంచ్‌లు
- సీఎస్‌ఈ, ఐటీతోపాటు సర్క్యూట్ బ్రాంచ్‌లుగా గుర్తింపు పొందిన ఈసీఈ, ఈఈఈల విద్యార్థులు సైతం డిజిటల్ స్కిల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. లేటెస్ట్ స్కిల్స్ సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలి.
- ఈసీఈ విద్యార్థులు రోబోటిక్స్, వీఎల్‌ఎస్‌ఐ, నానో టెక్నాలజీల్లో షార్ట్‌టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా జాబ్ మార్కెట్లో ముందుండొచ్చు. ఈసీఈ విద్యార్థులు ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్స్‌పై సర్టిఫికేషన్స్ చేయడం జాబ్‌మార్కెట్ పరంగా కలిసొస్తుంది.
- ఈఈఈ విద్యార్థులు ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్ అనాలిసిస్, సర్క్యూట్ అనాలిసిస్, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌పై అవగాహన పెంచుకోవాలి. వీటితోపాటు సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్, డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి.
చదవండి: Robotics and AI: పది లక్షల ఉద్యోగాలకు వేదిక... రూ. 12 లక్షల వార్షిక వేతనం
రోబోటిక్ స్కిల్స్
మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు రోబోటిక్ స్కిల్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. దీంతోపాటు ఈ బ్రాంచ్ వారు క్యాడ్, క్యామ్, 2–డి, 3–డి డిజైన్ ప్రింటింగ్‌లను కూడా అభ్యసించాలి. ఇప్పుడు రోబో ఆధారిత కార్యకలాపాలు అన్ని సంస్థల్లోనూ కొనసాగుతున్నాయి. కాబట్టి అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు రోబోటిక్ స్కిల్ కెరీర్ పరంగా మేలు చేస్తుందని చెప్పొచ్చు. వీటిని ఆన్‌లైన్ మార్గాల ద్వారా నేర్చుకోవచ్చు.
ఆ రెండు లక్షణాలు తప్పనిసరి
బీటెక్‌లో చేరిన విద్యార్థులకు ప్రాక్టికల్, అప్లికేషన్ అప్రోచ్ చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ఏ అంశాన్నైనా ప్రాక్టికల్ దృక్పథంతో అధ్యయనం చేయడం ముఖ్యం. అందుకోసం లేబొరేటరీల్లో ఆయా సబ్జెక్ట్ అంశాలపై ప్రాక్టికల్స్ చేసేందుకు ఎక్కువ సమయం వెచ్చించాలి. రియల్ టైమ్ నైపుణ్యాలు అందుకునేందుకు అవసరమైతే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ సహాయం తీసుకోవాలి. ఇటీవల కాలంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు మెంటారింగ్ సెల్స్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నాయి. క్లాస్ రూంలో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బిడియపడే విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్స్ సాధనంగా
బీటెక్ విద్యార్థుల నైపుణ్యాల సాధనకు చక్కటి మార్గం..ఇంటర్న్‌షిప్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా రియల్ టైమ్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటే.. కనీసం రెండు లేదా మూడు ఇంటర్న్‌షిప్స్ చేయాలి. ఈ మేరకు ఏఐసీటీఈ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి విద్యార్థులు తమ బ్రాంచ్‌కు తగ్గ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు పొందేందుకు మార్గాలను అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్‌లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్, ఆయా సంస్థల్లో పని చేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇలా ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. దీంతోపాటు నైపుణ్యాలు సైతం మెరుగుపరచుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సమయంలో మెరుగైన ప్రతిభ చూపితే.. ఆయా సంస్థల్లోనే ఉద్యోగ ఆఫర్ సైతం అందే అవకాశం ఉంది.
సాఫ్ట్ స్కిల్స్
ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్‌పైనా దృష్టి పెట్టాలి. ఎందుకంటే.. కంపెనీలు టెక్నికల్ స్కిల్స్‌తోపాటు, సాఫ్ట్ స్కిల్స్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ రెండు ఉన్న వారికే ఆఫర్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయని పలు సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సంస్థలు నిర్దిష్టంగా ఒక విభాగంలో విధులు కేటాయించినప్పుడు.. దానికి సంబంధించి.. క్లయింట్లతో సంప్రదింపులు సాగించడం, టీమ్ మెంబర్లు, ఇతర ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేయగలిగే నైపుణ్యాలున్న వారిని కోరుకుంటున్నాయి. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి రోజు నుంచే తమ కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బిహేవియరల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, క్రాస్ కల్చరల్ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవాలి.
ఆన్‌లైన్ ఆదరవుగా
విద్యార్థులు ఆన్‌లైన్ మార్గంలో ఆయా స్కిల్స్‌ను పెంచుకోవాలి. ముఖ్యంగా మూక్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్ల లెక్చర్స్ వినే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే జాతీయ స్థాయిలో ఎన్‌పీటీఈఎల్, స్వయం వంటి ఆన్‌లైన్ టీచింగ్ పోర్టల్స్ ద్వారా కూడా నైపుణ్యాలు పెంచుకోవచ్చు. ఇలా.. ఒకవైపు అకడమిక్ నాలెడ్జ్, మరోవైపు ఇండస్ట్రీకి అవసరమైన లేటెస్ట్ నైపుణ్యాలు సొంతం చేసుకునేలా మొదటి ఏడాది నుంచే ముందుకు సాగితే కచ్చితంగా కలల కొలువులు సొంతం చేసుకోవచ్చు.
బీటెక్ మొదటి సంవత్సరం.. కీలకాంశాలు
- బ్రాంచ్ ఏదైనా ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతున్న ఇండస్ట్రీ 4.0 స్కిల్స్.
- ఆన్‌లైన్ విధానంలో నేర్చుకునేందుకు అందుబాటులోకి వస్తున్న మార్గాలు.
- ప్రాక్టికల్ అప్రోచ్, అప్లికేషన్ అప్రోచ్ ఉంటేనే నైపుణ్యాల సాధన సుగమం.
- డిజిటల్ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్ స్కిల్స్‌కూ ప్రాధాన్యమిస్తున్న సంస్థలు.
ఆందోళన లేకుండా
మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు తొలుత కొంత ఆందోళనకు గురవుతారు. ఇప్పుడు నైపుణ్యాలు అందిపుచ్చుకునేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అకడమిక్స్ కోణంలో లెర్నింగ్‌తోపాటు ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ దృక్పథం అలవరచుకుంటే.. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వాటంతటవే లభిస్తాయి. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు మొదటి ఏడాది నుంచే నిర్దిష్ట ప్రణాళికతో కృషి చేయాలి.
–ప్రొ‘‘ వి.రవీంద్ర, జేఎన్‌టీయూ–కె
చదవండి:
Computer Science
Engineering Careers