Skip to main content

బీటెక్ త‌ర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల‌తో పాటు.. ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌గా మారొచ్చు..

భారత సైన్యానికి అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక విభాగం ఉంది. దీంతో భారత సైన్యంలోని టెక్నికల్‌ వింగ్స్‌లో ఇంజనీర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. టెక్నికల్‌ ఎంట్రీ లెవెల్‌తో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరొచ్చు.

బీటెక్‌ తర్వాత యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్‌(యూఈఎస్‌), ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌ క్యాట్‌), షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ), కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ) వంటి వాటి ద్వారా త్రివిధ దళాల్లో చేరొచ్చు. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు(టీజీసీ)కు దరఖాస్తు చేసుకొని.. ఇండియన్‌ మిలటరీ అకాడమీలో చేరొచ్చు. రక్షణ దళాల్లో ఉద్యోగం అంటే.. అత్యంత గౌరవప్రదమైన కెరీర్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. ఇందులో చేరిన అభ్యర్థులకు మంచి వేతనం, ఉద్యోగ భద్రత, సౌకర్యాలతోపాటు దేశానికి సేవ చేస్తున్నామని సంతృప్తి సైతం లభిస్తుంది.

ప్రైవేట్‌ రంగంలో కొలువు..
బీటెక్‌ ఉత్తీర్ణులకు ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. నైపుణ్యాలుంటే.. ప్రభుత్వ రంగం కంటే ఎన్నో రెట్లు అధిక వేతనాలు కార్పొరేట్‌ కంపెనీల్లో లభిస్తున్నాయి. బీటెక్‌ గ్రాడ్యుయేట్లను ఇంజనీర్లుగానే కాకుండా.. పరిశోధకులుగా, కన్సల్టెంట్లుగా, సాఫ్ట్‌వేర్‌ డవలపర్‌లుగా నియమించుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, సివిల్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీర్, సిస్టమ్‌ అనలిస్ట్, ఐటీ కో ఆర్డినేటర్, అప్లికేషన్‌ డెవలపర్‌ వంటి జాబ్స్‌ ఐటీ రంగంలో దక్కించుకోవచ్చు. అలాగే క్వాలిటీ ఇంజనీర్, ప్రాసెస్‌ ఇంజనీర్, ఇండస్ట్రియల్‌ మేనేజర్, ప్లాంట్‌ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్‌ టెక్నీషియన్‌ వంటి కొలువులు సైతం తయారీ రంగంలో సొంతం చేసుకోవచ్చు. సీ, సీ++, జావా, ఎస్‌క్యూఎల్, ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, నెట్‌వర్కింగ్, ఐవోటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, ఎంబెడెడ్‌ టెక్నాలజీ, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి నైపుణ్యాలు పెంచుకుంటే వివిధ విభాగాల్లో కొలువులు లభించే అవకాశం ఉంటుంది.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌..
ఇటీవల ఎక్కువ మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, కొత్త ఆలోచనతో స్టార్టప్‌ స్టార్ట్‌ చేయాలని కోరుకుంటున్నారు. విద్యార్థులు ప్రారంభించిన పలు స్టార్టప్స్‌ విజయవంతం కావడం.. ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు ప్రేరణగా నిలుస్తోంది. కాని సొంత వ్యాపారం అనే మార్గంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేందుకు ఎంతో ఓపిక, సహనం అవసరం!!

ఇంకా చ‌ద‌వండి : part 1: బీటెక్‌ తర్వాత ఉన్నత విద్యా లేక ఉద్యోగమా.. మీ దారెటు?

Published date : 14 May 2021 03:34PM

Photo Stories