Skip to main content

ట్రిపుల్ ఐటీలతో...పల్లె ప్రతిభకు ‘సాంకేతికత’ సొబగులు!

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను వెలికితీసి, సానపట్టి.. ఉన్నత కెరీర్ దిశగా అడుగేయించే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థలు... ట్రిపుల్ ఐటీలు.
వీటిలో 2008, ఆగస్టులో పదో తరగతిలో ఉత్తీర్ణులైన దాదాపు 6,500 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు మొదటి బ్యాచ్‌గా అడుగుపెట్టారు. చేయడం ద్వారా నేర్చుకోవడం (Learning by Doing), సమస్యల ఆధారిత అభ్యసనం (Problem based Learning) వంటి పద్ధతులతో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ (పీయూసీ+బీటెక్) పూర్తిచేసి, మంచి నైపుణ్యాలతో బయటకొచ్చారు. ఉన్నత వేతనాలతో జాబ్ ఆఫర్లను చేజిక్కించుకున్నారు. అలాంటి ట్రిపుల్ ఐటీల్లో 2015-16 ప్రవేశాలకు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో స్పెషల్ ఫోకస్..

ఆర్‌జీయూకేటీ ఆంధ్రప్రదేశ్
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ).. ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు, ఇడుపులపాయ ప్రాంగణాల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో 2015-16లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు క్యాంపస్‌ల్లో వెయ్యి చొప్పున రెండు వేల సీట్లు అందుబాటులో ఉంటాయి.
అర్హత: 2015లో ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థులుగా తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత.
వయసు: 2015, డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గరిష్ట వయో పరిమితి 21 ఏళ్లు.
ప్రవేశాలు: పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజీ (జీపీఏ), ప్రతి సబ్జెక్టులో సాధించిన గ్రేడ్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
  • సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు వెయిటేజీ ఇచ్చేందుకు వీలుగా నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పదో తరగతి జీపీఏకు అదనంగా 0.4 డిప్రైవేషన్ స్కోర్‌ను కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తారు.
  • రాష్ట్రపతి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మొత్తం సీట్లలో 85 శాతం స్థానిక ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం ఓపెన్ సీట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు.
  • రిజర్వేషన్: ఎస్సీ- 15 శాతం, ఎస్టీ- 6 శాతం, బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం, పీహెచ్-3 శాతం, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్‌డ్ పర్సనల్ (సీఏపీ- 2 శాతం), ఎన్‌సీసీ- 1 శాతం, స్పోర్ట్స్ 0.5 శాతం. అన్ని కేటగిరీల విద్యార్థినులకు 331/3 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రేతర విద్యార్థులు; అంతర్జాతీయ విద్యార్థులు; గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు ప్రత్యేకంగా అదనంగా కొన్ని సీట్లు ఏర్పాటు చేశారు.

ముఖ్య సమాచారం:
  • ఏపీ ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు రుసుం: రూ.150 (ఓసీ, బీసీ), రూ.100 (ఎస్సీ, ఎస్టీ).
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 19, 2015
  • కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: జూలై 1, 2015
  • ప్రత్యేక కేటగిరీలకు కౌన్సెలింగ్: జూలై 15, 2015
  • ఇతర కేటగిరీలకు కౌన్సెలింగ్, ప్రవేశాలు (పేజ్-1): జూలై 20, జూలై 21-2015.
  • కౌన్సెలింగ్, ప్రవేశాలు (పేజ్-2): జూలై 27, 2015
  • తరగతుల ప్రారంభం: ఆగస్టు 1, 2015
  • వెబ్‌సైట్: apadmissions.rgukt.in

ఆర్‌జీయూకేటీ తెలంగాణ
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ).. తెలంగాణలోని బాసర ప్రాంగణంలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో 2015-16లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం వెయ్యి సీట్లు అందుబాటులో ఉంటాయి.
  • అర్హత, వయసు, ప్రవేశ విధానం, రిజర్వేషన్ అమలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటాయి.
  • రాష్ట్రపతి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మొత్తం సీట్లలో 85 శాతం స్థానిక తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం ఓపెన్ సీట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రేతర విద్యార్థులు; అంతర్జాతీయ విద్యార్థులు; గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు ఏర్పాటు చేశారు.

ముఖ్య తేదీలు:
  • ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు రుసుం: రూ.150 (ఓసీ, బీసీ), రూ.100 (ఎస్సీ, ఎస్టీ).
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 19, 2015
  • కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: జూలై 1, 2015
  • ప్రత్యేక కేటగిరీలకు కౌన్సెలింగ్: జూలై 20, 2015
  • ఇతర కేటగిరీలకు కౌన్సెలింగ్, ప్రవేశాలు (పేజ్-1): జూలై 22, జూలై 23-2015.
  • కౌన్సెలింగ్, ప్రవేశాలు (పేజ్-2): జూలై 27, 2015
  • తరగతుల ప్రారంభం: ఆగస్టు 1, 2015
  • వెబ్‌సైట్: tsadmissions.rgukt.in

కోర్సు స్వరూపం
ఇంటిగ్రేటెడ్ బీటెక్ (కాల వ్యవధి ఆరేళ్లు)
మొదటి రెండేళ్లు:
ప్రి యూనివర్సిటీ కోర్సు (ఇంటర్‌తో సమానం)
  • మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్‌సెన్సైస్(ఎంపీసీ+బైపీసీతో సమానం) వంటి సబ్జెక్టులుంటాయి.
  • రెండేళ్లు పూర్తయ్యాక బయటకు వెళ్తామనే విద్యార్థులకు పీయూసీ సర్టిఫికెట్ ఇస్తారు.
    తర్వాతి నాలుగేళ్లు: పీయూసీ తర్వాత మూడో ఏడాది నుంచి నాలుగేళ్ల బీటెక్ కోర్సు మొదలవుతుంది. ప్రస్తుతం ఆరు బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి..
  • కెమికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
  • మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్

మేజర్, మైనర్ సబ్జెక్టులు: మూడో ఏడాది నుంచి ప్రారంభమయ్యే బీటెక్ కోర్సులో అందుబాటులో ఉన్న ఆరు బ్రాం చ్‌ల్లో ఒకదాన్ని మేజర్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవాలి. దీంతోపాటు ఇంటర్-డిసిప్లినరీ నైపుణ్యాలు పొందేందుకు మరో సబ్జెక్ట్‌ను మైనర్ సబ్జెక్ట్‌గా తీసుకోవచ్చు. ఇంజనీరింగ్, సెన్సైస్, మేనేజ్‌మెంట్, సోషల్ సెన్సైస్, క్లాసికల్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి సబ్జెక్టులను మైనర్ సబ్జెక్టులుగా అందిస్తున్నారు. మైనర్ సబ్జెక్టును ఇచ్చేందుకు విద్యార్థి ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు. మైనర్ సబ్జెక్టును పూర్తిచేసిన వారికి అదనపు క్రెడిట్స్ ఉంటాయి.

ఆర్థిక ఆసరా
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యనందించడం ట్రిపుల్ ఐటీల ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో సామాజిక వర్గ నేపథ్యంతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల వార్షికాదాయం (నాన్ ఎస్సీ, ఎస్టీ) రూ.లక్షలోపు ఉంటే; ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షల లోపు ఉంటే ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించక్కర్లేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు (ఇతరులకు రూ.వెయ్యి), రూ.2 వేలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. ఇది కూడా కోర్సు పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తారు. నిర్దేశ ఆదాయం కంటే ఎక్కువగా ఉన్న విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేల ట్యూషన్ ఫీజు చెల్లించాలి.

ఇంటర్న్‌షిప్‌తో క్షేత్రస్థాయి నైపుణ్యాలు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్ కొలువుల్ని సొంతం చేసుకోవాలంటే తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలు సరిపోవు! మార్కెట్ కోరుకునే ప్రాక్టికల్ నైపుణ్యాలనూ సొంతం చేసుకోవాలి. కాలేజీలో చదువుకున్న అంశాలను, వాస్తవ పరిస్థితుల్లో అన్వయించగల నేర్పును అలవరచుకోవాలి. దీనికోసం ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. అందుకే ఆర్‌జీయూకేటీ సైతం ఇంటర్న్‌షిప్‌నకు అధిక ప్రాధాన్యమిస్తోంది. విద్యార్థులను వేసవి ఇంటర్న్‌షిప్‌లకు పంపుతోంది. చివరి సంవత్సరంలో ఆర్నెల్ల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. దీన్ని ఏడాదికి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, బీఎస్‌ఎన్‌ఎల్, వైజాగ్‌స్టీల్‌ప్లాంట్ తదితరాల్లో విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. దీనివల్ల కోర్సు పూర్తయింది తడవు జాబ్ మార్కెట్లో ముందుండి కోరుకున్న కొలువును దక్కించుకుంటున్నారు.

నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యకు చిరునామా!
ట్రిపుల్ ఐటీలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన, పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నాయి. ప్రతి విద్యార్థికీ ల్యాప్‌టాప్, అన్ని సౌకర్యాలు ఉన్న ల్యాబ్, విద్యార్థిని అనునిత్యం గమనిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దే మెంటార్లు, లెర్నింగ్ బై డూయింగ్ (చేస్తూ నేర్చుకోవడం), ప్రాబ్లమ్ సాల్వింగ్ (సమస్య పరిష్కారం), వీడియో లెక్చర్స్, గెస్ట్ లెక్చర్స్ వంటి అభ్యసన విధానాల కారణంగా విద్యార్థులు ప్రతిభావంతులుగా తయారవుతున్నారు. మొత్తంమీద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) మేళవింపుతో సాగే బోధన మంచి ఫలితాలు ఇస్తోంది. ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ పూర్తిచేసిన వారికి ఇన్ఫోసిస్, ఐబీఎం, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఇప్పుడు ప్లేస్‌మెంట్స్ వంద వరకు పెరిగాయి. మొత్తంమీద మూడు క్యాంపస్‌ల్లో కలిపి 1,100 మందికి అవకాశాలు లభించాయి. ఆఫ్‌క్యాంపస్‌లో కూడా ఎక్కువ మందికి జాబ్ ఆఫర్లు లభిస్తున్నాయి. నేను వీసీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు ప్రతి క్యాంపస్‌ను సందర్శించి, విద్యార్థులను ఉన్నత లక్ష్యాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నాను. విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇవ్వాలంటే సబ్జెక్టుపై థియరిటికల్, ప్రాక్టికల్‌గా పట్టు ఉంటే సరిపోదు. వాటితో పాటు మరికొన్ని నైపుణ్యాలు అవసరం. కోర్సులో చేరినప్పటి నుంచి వీటిని అందించేందుకు ఆర్‌జీయూకేటీ కృషిచేస్తోంది. అవి.. కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద స్ఫూర్తి (టీమ్ వర్క్), నాయకత్వ లక్షణాలు (లీడర్‌షిప్ క్వాలిటీస్), ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ (సమస్య పరిష్కార నైపుణ్యాలు), సోషల్ స్కిల్స్. ఫైనలియర్‌లో ప్రస్తుతం ఆర్నెల్లు ఇంటర్న్‌షిప్ ఉంది. దీనివల్ల విద్యార్థులకు పరిశ్రమల్లో క్షేత్రస్థాయి నైపుణ్యాలు అలవడుతున్నాయి. మార్కెట్ అవసరాలకు తగినట్లు సిద్ధమవుతున్నారు. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫైనలియర్‌లో మొత్తం ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నాం.
- ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్, ఆర్‌జీయూకేటీ.
Published date : 06 Jun 2015 01:03PM

Photo Stories