Skip to main content

ప్యాకేజింగ్‌లో ఉపాధికి ఈ కోర్సు.. ఉప‌యోగాలు తెలుసుకోండిలా..

వస్తువు కొనే ముందు వినియోగదారుడు తొలుత చూసేది.. ప్యాకింగ్‌నే! ప్యాకింగ్‌ను చూసే వస్తువును గుర్తుపడతాం. ప్యాకింగ్‌తోనే మనం వస్తువు గురించి సమాచారం తెలుసుకొని కొంటాం. వస్తువును నాణ్యంగా తయారు చేయడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఆకర్షణీయంగా ప్యాక్‌ చేయడం కూడా అంతే ప్రధానం. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో.. సదరు వస్తువును జాగ్రత్తగా వినియోగదారుడి ఇంటికి చేర్చడంలోనూ ప్యాకింగ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే కంపెనీలు వస్తువుల ప్యాకింగ్‌పై ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి. ప్యాకింగ్‌ నైపుణ్యాలున్న వారిని ప్రత్యేకంగా నియమించుకుంటున్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌(ఐఐపీ) తదితర ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్న ప్యాకేజింగ్‌ కోర్సులు, కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం.. 

ప్యాకేజింగ్‌ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి, ప్యాకేజింగ్‌ ప్రమాణాలను మెరుగుపరచడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ 1966లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌(ఐఐపీ)ను ఏర్పాటు చేసింది. ఆహారం, వాణిజ్యం, ఫార్మా, ఇతర రంగాల కంపెనీల ఉత్పత్తులకు పటిష్ట ప్యాకేజింగ్‌ రూపొందించడం.. విదేశాలకు ఎగుమతయ్యే ఆహార పదార్థాలు, రసాయనాలు, ఆభరణాలను ప్యాకేజింగ్‌ చేసే నిష్ణాతులను తయారు చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. 


ప్యాకేజింగ్‌ కోర్సులు..

ప్యాకేజింగ్‌ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి ఐఐపీ పలు కోర్సులు అందిస్తోంది. ముఖ్యంగా పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్, దూర విద్య విధానంలో డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్, సర్టిఫికెట్‌ కోర్సు ఇన్‌ ప్యాకేజింగ్‌తోపాటు స్వల్పకాలిక శిక్షణ ప్రోగ్రామ్స్‌నూ అందిస్తోంది. ముంబై ప్రధాన క్యాంపస్‌తోపాటు దేశ వ్యాప్తంగా చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, న్యూఢిల్లీల్లోని సెంటర్స్‌లోనూ కోర్సులను అందిస్తోంది. ఇదే కాకుండా పలు ఇతర సంస్థలు సైతం డిప్లొమా,బీఈ/బీటెక్,పీజీ డిప్లొమా స్థాయి ప్యాకేజింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 


ఇన్‌స్టిట్యూట్‌లు..

  1. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌(ఐఐపీ), ముంబై
  2. ఐఐటీ రూర్కీ
  3. అన్నా యూనివర్సిటీ, తమిళనాడు
  4. తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, అసోం
  5. జేఎన్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్, హైదరాబాద్‌ 
  6. తదితర ఇన్‌స్టిట్యూట్‌లు పలు ప్యాకేజింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. 


శిక్షణ ఇలా..

పరిశ్రమలు, సంస్థలు, కంపెనీలు రూపొందించే ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకునేలా ప్యాకింగ్‌ చేయడంలో ప్యాకేజింగ్‌ నిపుణులది కీలకపాత్ర. ప్యాకేజింగ్‌ ఎంత ఆకర్షణీయంగా ఉంటే.. అమ్మకాలు అంత ఎక్కువగా ఉంటాయి. అందుకే కోర్సులో భాగంగా సంస్థలు ప్యాకేజింగ్‌ అవసరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్యాకేజింగ్‌ ప్రా«ధాన్యత, వ్యాపారంపై దాని ప్రభావం తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. 


ప్యాకేజింగ్‌..

మన నిత్య జీవితంలో ఉపయోగించే టూత్‌ పేస్టులు, సబ్బులు, స్ప్రేలు, షేవింగ్‌ కిట్స్, వేసుకునే బూట్లు, చెప్పులు, పిల్లలాడుకునే బొమ్మలు, పూజకు ఉపయోగించే అగర్‌బత్తీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్‌లు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లు, ఫెర్టిలైజర్స్‌.. ఇలా చెప్పుకుంటూపోతే జాబితా పెద్దగానే ఉంటుంది. ప్రస్తుత కాలంలో ప్రతి వస్తువుకు ప్యాకింగ్‌ అనేది తప్పనిసరిగా మారింది. అందుకే విరామం లేకుండా పని ఉండే రంగాల్లో ప్యాకేజింగ్‌ ఒకటి. అందుకే కోర్సు పూర్తికాగానే ఉపాధి కల్పించడంలో ప్యాకేజింగ్‌ రంగం ముందుంటోంది. 


విభాగాలు..

ప్యాకేజింగ్‌ అంటే ఒక వస్తువును అందంగా ప్యాకింగ్‌ చేయడమే కాదు. ఇందులో చాలా విభాగాలు ఉంటాయి. ప్యాకింగ్‌ మెటీరియల్, ప్రొడక్ట్‌కు అనుగుణంగా ప్యాకింగ్‌ మెటీరియల్‌ను ఎంపిక చేయడం, వినియోగదారుడిని ఆకర్షించేలా డిజైన్‌ రూపొందించడం, ప్యాకేజింగ్‌ పద్ధతులను ఎంపిక చేయడం, ప్యాకింగ్‌ నాణ్యత, ఎక్కువ కాలం మన్నుతుందో లేదో పరిశీలించడం, ఏమైనా లోపాలు ఉంటే వాటిని అధిగమించడానికి చర్యలు.. ఇలా ఎన్నో విభాగాల్లో సంబంధిత నిపుణుల అవసరం ఉంటుంది. 


కెరీర్‌కు భరోసా..

కరోనా పరిణామాలతో ఆన్‌లైన్‌ అమ్మకాలు, హోం డెలివరీకి ప్రాధాన్యం పెరిగింది. ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో వస్తువులు వినియోగదారులను ఆకట్టుకోవాలంటే.. అందమైన ప్యాకింగ్‌ తప్పనిసరి. కానీ ప్రస్తుతం మంచి నైపుణ్యం కలిగిన ప్యాకేజింగ్‌ నిపుణుల కొరత నెలకొంది. దాంతో ప్యాకేజింగ్‌ కోర్సులను పూర్తిచేసుకొని.. నైపుణ్యాలు సొంతం చేసుకున్న అభ్యర్థులకు మంచి వేతనాలతో ఆఫర్లు లభిస్తున్నాయి.

 

కొలువులెక్కడ..

నెస్లే ఇండియా లిమిటెట్, ఆగ్రోటెక్‌ ఫుడ్స్‌ లిమిటెడ్, క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్, క్యాస్ట్రాల్, కోకాకోలా, సిప్లా, డాబర్‌ ఇండియా, హిందూస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ ఇలా చాలా కంపెనీలు ఉపాధి కల్పిస్తున్నాయి. 


వేతనాలు..

ప్యాకేజింగ్‌ కోర్సులను పూర్తిచేసిన వారు ప్యాకేజ్‌ డిజైనర్, కన్సూమర్‌ బిహేవియర్‌ అనలిస్ట్, ప్యాకేజింగ్‌ స్పెషలిస్ట్, ప్యాకేజింగ్‌ ఆపరేటర్‌ వంటి పలు విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. పనిచేసే సంస్థ, నైపుణ్యాలను బట్టి నెలకు రూ.25000 వరకు ప్రారంభ వేతనం లభిస్తోంది. మంచి పనితీరు, అనుభవం సంపాదిస్తే లక్షల్లో వేతనాలు పొందవచ్చు. సొంతంగా ప్యాకేజింగ్‌ యూనిట్‌ను కూడా ప్రారంభించుకోవచ్చు. 

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.iip-in.com 

Published date : 18 May 2021 07:03PM

Photo Stories