Skip to main content

మార్కులా లేక ఆయా ఎంట్రన్స్‌ టెస్ట్‌లా.. అడ్మిషన్‌కి ఏది కొలమానం..!

విద్యార్థి ప్రతిభకు ఆయా కోర్సుల్లో నిర్వహించే పరీక్షలు, అందులో పొందిన మార్కులే కొలమానమా? అనే ప్రశ్న ఎదురవుతోంది.

 ప్రస్తుతం మన విద్యా విధానంలో విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించడానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో మంచి మార్కులతో మెరుగైన అవకాశాలు అందుకోవచ్చనే అభిప్రాయం నెలకొంది. అందుకే చాలామంది బట్టీ విధానానికి ప్రాధాన్యమిస్తూ.. అకడమిక్‌ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సొంతం చేసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఏ కోర్సు తీసుకున్నా.. సీట్లు తక్కువ, పోటీ ఎక్కువ. ఆయా ఎంట్రెన్స్‌లకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు. ఇలాంటి పరిస్థితుల్లో అకడమిక్‌గా కనీస మార్కుల నిబంధన లేకపోతే.. ప్రవేశ ప్రక్రియ క్లిష్టంగా మారుతుందనేది అకడమిక్‌ వర్గాల భావన.

అందుకే.. ఎంట్రన్స్‌ టెస్ట్‌లు..
ఆయా కోర్సుల్లో ప్రవేశానికి కనీస అర్హత మార్కుల నిబంధనను పేర్కొంటున్నప్పటికీ.. అభ్యర్థుల సబ్జెక్ట్‌ నైపుణ్యాలను గుర్తించేందుకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ల విధానం అమలవుతోంది. ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు అకడమిక్‌ పరీక్షలకు భిన్నంగా.. విద్యార్థుల్లోని అప్లికేషన్‌ స్కిల్స్‌ను గుర్తించే విధంగా ఉంటున్నాయి. దీనిద్వారా వాస్తవ నైపుణ్యాలున్న విద్యార్థులకే ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలు లభించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. ఇంటర్మీడియెట్‌/10+2 స్థాయిలో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు కూడా కొన్ని ఎంట్రన్స్‌ టెస్ట్‌లలో ఆశించిన ఫలితం పొందని సందర్భాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎంట్రన్స్‌ టెస్ట్‌లు.. మలిదశ
ఎంబీఏ, ఎంటెక్‌ వంటి పలు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాల సందర్భంగా అకడమిక్‌గా కనీస మార్కులు, ఎంట్రన్స్‌ టెస్ట్‌లలో స్కోర్‌తోపాటు మలిదశలో ప్రత్యేక ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఐఐఎంలు, ఐఐటీలు.. క్యాట్, గేట్‌ స్కోర్‌ ఆధారంగా.. మలి దశలో గ్రూప్‌ డిస్కషన్స్, గ్రూప్‌ టాస్క్, టెక్నికల్‌ అసెస్‌మెంట్‌ వంటివి నిర్వహించి తుది జాబితా ఖరారు చేస్తున్నాయి. దీన్నిబట్టి విద్యార్థులకు గ్రేడ్‌లు, మార్కులతోపాటు సబ్జెక్టు నైపుణ్యాలు, అప్లికేషన్‌ దృక్పథం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా అవసరమని అర్థమవుతోంది.

క్యాంపస్‌ డ్రైవ్స్‌.. భిన్నంగా..
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు నిర్వహించే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహించే సంస్థలు.. కనీస జీపీఏ ఉన్న విద్యార్థులనే ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాయి. ఆ తర్వాత దశలో నిర్వహించే ప్రక్రియలో అభ్యర్థుల్లోని ప్రాక్టికల్‌ నాలెడ్జ్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, లైఫ్‌ స్కిల్స్, సోషల్‌ స్కిల్స్‌ వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిల్లోనూ మెరుగ్గా ఉన్న విద్యార్థులకే సంస్థలు ఆఫర్లు ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో టాప్‌ జీపీఏ ఉన్న విద్యార్థులు సైతం సాఫ్ట్‌ స్కిల్స్‌ లేక ఆఫర్లకు దూరమవుతున్నారు. జీపీఏ ఓ మోస్తరుగా ఉన్నా.. రియల్‌ స్కిల్స్‌లో మెరుగ్గా రాణిస్తే అవకాశాలు లభిస్తున్నాయి. అంటే.. ఒకవైపు జీపీఏలకు ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు రియల్‌ స్కిల్స్‌ కూడా అభ్యర్థుల్లో ఉండాలని సంస్థలు ఆశిస్తున్నాయి.

ఇంకా చదవండి : part 4: ప్రస్తుత పరిస్థితుల్లో అకడమిక్‌ మార్కులతోపాటు ఈ స్కిల్స్‌కు ప్రాధాన్యం..!

Published date : 07 Jul 2021 05:25PM

Photo Stories