Skip to main content

క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ఈ కోర్సు విద్యార్థులకు అవకాశం.. రూ.5లక్షలకు పైగా ప్రారంభ వేతనంతో కొలువులు!

వచ్చే నాలుగేళ్లలో భారత్‌లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మార్కెట్‌ ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని అంచనా. దాంతో ఐటీ కంపెనీలకు ఆ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు నిపుణులైన మానవ వనరుల అవసరం ఉంటుంది.

క్లౌడ్‌ రంగంలో కెరీర్స్‌ పరంగా బీటెక్‌ సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌ల ఉత్తీర్ణులు ముందంజలో ఉంటారనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే.. క్లౌడ్‌ టెక్నాలజీ సేవలు.. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ నైపుణ్యాల ఆధారంగానే ఉంటాయి. దీంతో అకడమిక్‌గా ఈ నైపుణ్యాలపై అవగాహన ఉన్న సీఎస్‌ఈ, ఈసీఈ అభ్యర్థులకు సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

వేతనాలు ఆకర్షణీయం..

  • క్లౌడ్‌ టెక్నాలజీస్‌లో కొలువులు, వేతనాల పరంగా ఆశాజనక పరిస్థితి కనిపిస్తోందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
  • ఎంట్రీ లెవల్‌లో రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వార్షిక వేతనం లభించనుంది.
  • రెండు నుంచి అయిదేళ్ల అనుభవం ఉన్న వారికి రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల వార్షిక వేతనం అందే అవకాశం ఉంది.
  • మిడిల్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్స్‌కు రూ.20 లక్షల వరకు వార్షిక వేతనం దక్కే వీలుంది.

క్లౌడ్‌ ఆర్కిటెక్ట్స్‌కు డిమాండ్‌..
క్లౌడ్‌ టెక్నాలజీస్‌ విభాగంలో.. క్లౌడ్‌ ఆర్కిటెక్ట్స్‌కు ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. ఈ నైపుణ్యాలున్న వారికి రూ.30 లక్షల వార్షిక వేతనం అందించడానికి సైతం సంస్థలు ముందుకొస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌కు.. ప్రొడక్ట్‌ను డిజైన్‌ చేయడం మొదలు, దాన్ని డెవలప్‌ చేయడం, ఆ తర్వాత నిర్వహణ తదితర నైపుణ్యాల అవసరం ఉంటుంది. అందుకే ప్రస్తుతం భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్‌ ఆర్కిటెక్ట్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.

జాబ్‌ ప్రొఫైల్స్‌..
క్లౌడ్‌ ఆర్కిటెక్ట్, క్లౌడ్‌ బిజినెస్‌ అనలిస్ట్, క్లౌడ్‌ నెట్‌వర్క్‌ ఆర్కిటెక్ట్, క్లౌడ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, క్లౌడ్‌ ప్రొడక్ట్‌ మేనేజర్, క్లౌడ్‌ కన్సల్టెంట్, క్లౌడ్‌ సిస్టమ్స్‌ ఇంజనీర్, క్లౌడ్‌ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్‌ నెట్‌వర్క్‌ ఇంజనీర్‌.

అకడమిక్‌ నైపుణ్యాలు..
అకడమిక్‌గా బీటెక్, ఎంటెక్‌ స్థాయిలో ఎలక్టివ్, మేజర్‌ సబ్జెక్ట్‌గా పలు ఇన్‌స్టిట్యూట్‌లు క్లౌడ్‌ టెక్నాలజీస్‌ను అందిస్తున్నాయి. వీటితోపాటు.. మరెన్నో సంస్థలు.. క్లౌడ్‌ నైపుణ్యాలకు సంబంధించి ప్రత్యేకంగా సర్టిఫికేషన్‌ కోర్సులను కూడా ప్రవేశపెట్టాయి. ఐబీఎం సర్టిఫైడ్‌ క్లౌడ్‌ సెక్యూరిటీ నాలెడ్జ్, హెచ్‌పీ ఎక్స్‌పర్ట్‌ వన్‌ క్లౌడ్‌ సర్టిఫికేషన్, వీఎం వేర్‌ క్లౌడ్‌ సర్టిఫికేషన్, ఈఎంసీ క్లౌడ్‌ ఆర్కిటెక్ట్, ఈఎంసీ క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సర్వీసెస్‌ సర్టిఫికేషన్, ఈఎంసీ వర్చువలైజ్డ్‌ డేటా సెంటర్‌ అండ్‌ క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్టిఫికేషన్‌ వంటి వాటి ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.

టెక్నికల్‌ స్కిల్స్‌..
క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీస్‌లో కెరీర్‌ కోరుకునే వారికి.. డెవప్స్, ప్రోగ్రామింగ్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌–లినక్స్, సిస్టమ్‌ ఆటోమేషన్, క్వాలిటీ అష్యూరెన్స్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ వంటి టెక్నికల్‌ స్కిల్స్‌ కీలకంగా మారుతున్నాయి. వీటితోపాటు ప్రాసెస్‌ స్కిల్, కాంప్లెక్స్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్, కాగ్నిటివ్‌ ఎబిలిటీస్, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటి నైపుణ్యాలు కూడా అవసరమవుతాయి.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌.. ముఖ్యాంశాలు

  • 2024 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోనున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మార్కెట్‌.
  • ఫోర్బ్స్, గార్ట్‌నర్‌ వంటి సంస్థల అంచనాల ప్రకారం–18 లక్షల ఉద్యోగావకాశాలు.
  • ప్రస్తుత పరిస్థితుల్లో తమ సర్వీసులను క్లౌడ్‌ ఆధారితంగా నిర్వహిస్తామని 60 శాతం పైగా సంస్థల వెల్లడి.
  • ఎంట్రీ లెవల్‌లో అయిదు నుంచి ఏడు లక్షల వార్షిక వేతనం.
  • అసోసియేట్‌ స్థాయిలో రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల వేతనం.
  • మిడ్‌ లెవల్‌ మేనేజర్స్‌కు రూ.20 లక్షల వరకు వేతనం.

వినియోగం పెరుగుతోంది..
క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో మూడు కీలక విభాగాలైన ఎస్‌ఏఏఎస్, ఐఏఏఎస్, పీఏఏఎస్‌ వినియోగం పెరుగుతోంది. ప్రధానంగా ఎస్‌ఏఏఎస్‌ విధానాన్ని దాదాపు అన్ని సంస్థలూ అనుసరిస్తున్నాయి. దీనిద్వారా వినియోగదారులకు నేరుగా ఇంటర్నెట్‌ ఆధారంగా సాఫ్ట్‌వేర్‌ సంబంధిత సర్వీసులు అందించే అవకాశం ఉంది. ప్రధానంగా ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు, స్టార్టప్‌లు, ఈ–కామర్స్‌ సంస్థలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విధానాలను అనుసరిస్తున్నాయి. కాబట్టి సంబంధిత నైపుణ్యాలు నేర్చుకుంటే.. ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు.
– ఎం.ఆర్‌. చెంగప్ప, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

ఇంకా చదవండి : part 1: క్లౌడ్‌ కంప్యూటింగ్‌కి పెరుగుతున్న డిమాండ్‌.. రానున్న రోజుల్లో 18లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన..!

Published date : 30 Jun 2021 03:48PM

Photo Stories