Skip to main content

‘జ్ఞాన్’ పథకంతో గ్లోబల్ నైపుణ్యాలు

‘‘నేటి తరం విద్యార్థులు గ్లోబల్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.. ఐఐటీల నుంచి స్టేట్ యూనివర్సిటీల వరకు వేధిస్తున్న ఫ్యాకల్టీ కొరత తీర్చేందుకు కృషి చేయాలి.. పుస్తకాలే కాకుండా ప్రాపంచిక దృక్పథంతో ముందడుగు వేయాలి..’’ ఇటు విద్యార్థుల కోణంలో.. అటు ఇన్‌స్టిట్యూట్‌ల కోణంలో విద్యా విషయక ప్రావీణ్యత (Academic Excellence) ఆవశ్యకతపై వెల్లువెత్తుతున్న అభిప్రాయాలివి! ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం జ్ఞాన్ (GIAN-Global Initiative of Academic Networks) ప్రారంభించింది. విద్యార్థులకు అంతర్జాతీయ నైపుణ్యాలు అందించే ఉద్దేశంతో రూపొందించిన ఈ పథకంపై విశ్లేషణ.. సద్వినియోగం చేసుకునేందుకు మార్గాలు...
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో చదవాలని ఎందరో విద్యార్థులు కోరుకుంటారు. కానీ, ఇలాంటి అవకాశం కొందరికే లభిస్తుంది. అంతమాత్రాన దిగులు పడక్కర్లేదు. ఇప్పుడు భారత విద్యార్థులు తమ ఇన్‌స్టిట్యూట్‌లలోనే ఎంఐటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, ఇల్లినాయిస్ యూనివర్సిటీ తదితర ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల ప్రొఫెసర్ల పాఠాలు వినొచ్చు. అంతర్జాతీయ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. దీనికి మార్గం.. జాతీయ స్థాయిలో రూపొందించిన ఎఐఊ ప్రోగ్రాం. ఫ్యాకల్టీ కొరతను తీర్చడంతోపాటు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.

ప్రధాన ఉద్దేశం
  • ఈ పథకం ద్వారా ఉన్నత విద్యలో విద్యార్థులకు అత్యున్నత నైపుణ్యాలు, అంతర్జాతీయ పరిస్థితులపై అవగాహన కల్పిస్తారు.
  • అంతర్జాతీయంగా పేరున్న శాస్త్రవేత్తలు, ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను భారత్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లలో పాఠాలు బోధించేందుకు ఆహ్వానిస్తారు.
  • ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎంలు మొదలు, సాధారణ స్టేట్ యూనివర్సిటీలకు విదేశీ నిపుణులు వచ్చి, గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు. దీనివల్ల విద్యార్థుల్లో సబ్జెక్టు నైపుణ్యాలు పెరుగుతాయి.
  • ఇప్పటికే 38 దేశాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌ల ఫ్యాకల్టీలు ‘జ్ఞాన్’పథకం ద్వారా గెస్ట్ లెక్చర్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ప్రత్యేక తరగతులు:
  • ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్, లా, లైఫ్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ తదితర 13 విభాగాల్లో విదేశీ ఫ్యాకల్టీలు గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు. వీటికి ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులే కాకుండా.. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల విద్యార్థులు కూడా హాజరు కావచ్చు. అయితే వీరు నిర్ణీత సమయంలో ఎఐఊ వెబ్ పోర్టల్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలి.
  • GIAN ద్వారా అంతర్జాతీయ నిపుణులే కాకుండా.. భారత్‌లోని ప్రొఫెసర్లు, విద్యావేత్తలు కూడా సంబంధిత అంశాల్లో నిర్దిష్ట ఇన్‌స్టిట్యూట్‌లలో లెక్చర్స్ ఇచ్చే సదుపాయం అందుబాటులో ఉంది. ఔత్సాహిక ప్రొఫెసర్లు ‘జ్ఞాన్’ వెబ్‌సైట్ ద్వారా తమ ప్రతిపాదనలను నమోదు చేసుకోవాలి. దీనికి ఆమోదం లభిస్తే గెస్ట్ లెక్చర్స్ ఇచ్చే అవకాశంతో పాటు నిర్దిష్ట మొత్తంలో గౌరవవేతనం కూడా పొందొచ్చు.
పర్యవేక్షణ కమిటీలు:
‘జ్ఞాన్’ ప్రోగ్రాంను సమర్థవంతంగా అమలు చేసేందుకు పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటి వివరాలు..
  • ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఈఎస్‌టీ, ఎస్‌పీఏ సంస్థల్లో కోర్సులను ఐఐటీ ఖరగ్‌పూర్ పర్యవేక్షిస్తుంది.
  • జాతీయ స్థాయిలో ఎఐఊ పర్యవేక్షణ బాధ్యతను కూడా ఐఐటీ - ఖరగ్‌పూర్ చేపడుతోంది.
  • ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌ఈఆర్‌లలో కోర్సులను ఐఐఎస్‌సీ బెంగళూరు పర్యవేక్షిస్తుంది.
  • మేనేజ్‌మెంట్ స్కూల్స్‌లో కోర్సులను ఐఐఎం-బెంగళూరు పర్యవేక్షిస్తుంది.
  • సెంట్రల్ యూనివర్సిటీలు, న్యాయ కళాశాలల్లో కోర్సులకు సంబంధించి జేఎన్‌యూ ఢిల్లీ పర్యవేక్షణ చేపడుతుంది.
  • ఏఐసీటీఈ అనుమతి పొందిన ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యత ఏఐసీటీఈ డెరైక్టర్ నేతృత్వంలో ఉంటుంది.
  • యూజీసీ పరిధిలోని కళాశాలలు, కోర్సుల పనితీరును యూజీసీ పర్యవేక్షిస్తుంది.
లైవ్ లెక్చర్స్ సదుపాయం:
‘జ్ఞాన్’ ప్రోగ్రాంలో విద్యార్థులు, ఔత్సాహికులకు అందుబాటులో ఉన్న మరో ప్రత్యేక అవకాశం.. లైవ్ లెక్చర్స్. ఆయా కోర్సులకు సంబంధించి తమ పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు ప్రత్యక్షంగా తరగతులకు హాజరుకాకపోయినా, ఇంటర్నెట్ ఆధారంగా ‘లైవ్ లెక్చర్స్’ వీక్షించొచ్చు.
  • ప్రోగ్రాంలో మరో ప్రత్యేకత.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో పూర్తయిన కోర్సులు, వాటికి సంబంధించిన లెక్చర్స్ కూడా ఎఐఊ వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ ఆర్కైవ్స్‌లో అందుబాటులో ఉంటాయి.
క్రెడిట్స్ సదుపాయం:
‘జ్ఞాన్’ ద్వారా అందుబాటులోకి తెస్తున్న కోర్సుల పరంగా మరో ముఖ్యమైన అంశం.. ఆయా కోర్సులకు క్రెడిట్స్ ఇవ్వడం. ప్రస్తుతం అమలవుతున్న విధానం ప్రకారం-వారానికి అయిదు రోజుల చొప్పున 10 నుంచి 14 గంటల వ్యవధిలో ఉండే కోర్సుకు ఒక క్రెడిట్ పాయింట్ లభిస్తుంది. అదేవిధంగా 20 నుంచి 28 గంటల వ్యవధిలో ఉండే కోర్సుకు రెండు క్రెడిట్స్ ఉంటాయి.

సహకార పరిశోధన అవకాశాలు:
‘జ్ఞాన్’ పథకం ద్వారా అంతర్జాతీయ విద్యాసంస్థలతో కలిసి పరిశోధనలు చేసేందుకు గల అవకాశాలపై కసరత్తు జరుగుతోంది. భారత్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లు తమ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చిన ఫ్యాకల్టీ సభ్యులు తమ సొంత ఇన్‌స్టిట్యూట్‌లో ఏమైనా పరిశోధన కార్యకలాపాలు చేపడితే వాటిలో భారత విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించే అవకాశాలపై ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రస్తుతం లెక్చర్స్ దశలో ఉన్న ఈ ప్రోగ్రాంకు ఆదరణ పెరిగితే కొలాబరేటివ్ రీసెర్చ్‌పై దృష్టిసారించనున్నారు.
  • ‘జ్ఞాన్’ పథకం ద్వారా కోర్సులు నిర్వహిస్తున్న సంస్థలు, కోర్సుల్లో ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు(కనీసం 50 శాతం) కూడా ప్రాధాన్యమిచ్చేలా నిబంధనలు రూపొందాయి.
మూల్యాంకనం:
‘జ్ఞాన్’ పరిధిలో నిర్దేశించిన కొన్ని కోర్సుల్లో విద్యార్థుల పనితీరును మూల్యాంకనం చేసే విధానం అమలవుతుంది. 20 నుంచి 30 రోజుల వ్యవధిలో ఉండే కోర్సులో అసైన్‌మెంట్స్, క్విజ్‌లు, క్లాస్ టెస్ట్స్, టెర్మినల్ ఎగ్జామ్స్ వంటివి నిర్వహిస్తారు. కోర్సు సమయంలో అభ్యర్థులు సాధించిన నైపుణ్యాలను బేరీజు వేసి, ఆ విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన ఇతర స్కిల్స్‌పై నిపుణుల సూచనలు, సలహాలు లభిస్తాయి.

201 కోర్సులకు అనుమతి:
‘జ్ఞాన్’ ప్రోగ్రాం ద్వారా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో నిపుణులైన ప్రొఫెసర్ల గెస్ట్ లెక్చర్స్ అందించే క్రమంలో ఇప్పటివరకు 201 కోర్సులకు అనుమతి లభించింది. మొత్తం 202 ఇన్‌స్టిట్యూట్‌లు వీటిని నిర్వహించనున్నాయి. మరో 76 కోర్సులకు కూడా అనుమతి లభించింది. వీటి షెడ్యూళ్లు కూడా విడుదలయ్యాయి.
  • ఐఐటీ-హైదరాబాద్‌లో 5 కోర్సులు నిర్వహించనున్నారు.
అవి..
  • ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ; బేసిక్స్ అండ్ అప్లికేషన్స్; కాంటెంపరీ రాడార్ సిస్టమ్ డిజైన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్; హైడ్రలాజికల్ మోడలింగ్ సిస్టమ్ యూజింగ్ SWAT మోడల్; మోడలింగ్ అండ్ డిజైన్ ఆఫ్ స్టీల్ - కాంక్రీట్ కాంపోజిట్ స్ట్రక్చరల్ సిస్టమ్స్ అండర్ ఎక్స్‌ట్రీమ్ లోడింగ్ కండిషన్స్; ఫినైట్ ఎలిమెంట్ మెథడ్.
నిట్-వరంగల్‌లో:
  • వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లోనూ GIAN ప్రోగ్రాం ద్వారా అంతర్జాతీయ ఫ్యాకల్టీతో లెక్చర్స్ ఇప్పించేందుకు పది కోర్సులకు అనుమతి లభించింది.
ఉపయోగించుకోవాలిలా..
  • ‘జ్ఞాన్’ పథకాన్ని ఆతిథ్య ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులే కాకుండా.. మిగతా ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు కూడా వినియోగించుకోవచ్చు. దీనికోసం చేయాల్సింది..
  • GIAN వెబ్‌సైట్ (www.gian.iitkgp.ac.in)లోని అప్రూవ్డ్ కోర్సెస్ లింక్ పై క్లిక్ చేస్తే ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సుల వివరాలు కనిపిస్తాయి.
  • అవసరమైన కోర్సుపై క్లిక్ చేస్తే ఆ కోర్సుకు సంబంధించిన షెడ్యూల్, ఫీజు వివరాలు కనిపిస్తాయి.
  • విద్యార్థులు సదరు కోర్సు కోఆర్డినేటర్‌ను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి, వివరాలు నమోదు చేసుకోవాలి.
  • కోర్సు సమయంలో అభ్యర్థులకు క్లాస్‌రూం లెక్చర్‌తోపాటు ప్రాక్టికల్స్‌లో పాల్పంచుకునే విధంగా లేబొరేటరీ సదుపాయం, ఇంటర్నెట్ సౌకర్యం వంటివి కల్పిస్తారు.
  • కోర్సు పూర్తి చేశాక క్రెడిట్ పాయింట్స్‌తో కూడిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేస్తారు.
ఇంటరాక్టివ్ సెషన్స్‌కు ప్రాధాన్యం..
‘జ్ఞాన్’ పథకం ద్వారా అందించే అంతర్జాతీయ ఫ్యాకల్టీల గెస్ట్ లెక్చర్స్ కేవలం బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థులతో సంభాషించే ఇంటరాక్టివ్ సెషన్స్‌కు ప్రాధాన్యమిస్తాయి. దీనివల్ల విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవ చ్చు. ప్రస్తుత పోటీ ప్రపంచం నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. గెస్ట్ లెక్చర్స్‌కు కేవలం ఆతిథ్యం ఇస్తున్న ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులే కాకుండా.. ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు కూడా హాజరుకావొచ్చు. ఈ ప్రోగ్రాం పరిధిలో లేని ఇన్‌స్టిట్యూట్‌లు.. తమ విద్యార్థులను ఎఐఊ పరిధిలోని లెక్చర్స్‌కు హాజరయ్యేలా ప్రోత్సహిస్తే నైపుణ్యాల పరంగా కొంతవరకైనా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
- ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, నిట్-వరంగల్.
Published date : 10 Dec 2015 06:15PM

Photo Stories