Skip to main content

ఇంట‌ర్‌లో ఎంపీసీ తీసుకున్న విద్యార్థుల‌.. కెరీర్ మార్గాలు ఇలా..

పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ ఎంపీసీలో చేరుతుంటారు. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఎంపీసీ తీసుకుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువ. మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉంటే.. ఇంజనీరింగ్‌ మాత్రమే కాకుండా.. మరెన్నో చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. ఎందుకంటే.. మానవ జీవితం అంకెలతో ముడిపడి ఉంది. సంఖ్య లేకుండా ప్రపంచం ముందుకు కదలని పరిస్థితి. ఇంజనీరింగ్, కంప్యూటర్స్, అకౌంటెన్సీ, బిజినెస్‌.. ఇలా అనేక రంగాలు మ్యాథమెటిక్స్‌తో ముడిపడి ఉంటాయి. ఇంటర్మీడియట్‌ ఎంపీసీ
విద్యార్థులకు మ్యాథ్స్‌తో అందుబాటులో ఉన్న కెరీర్‌ మార్గాల గురించి తెలుసుకుందాం..

మ్యాథమెటీషియన్‌..
గణితం అంటే ఇష్టపడేవారు ఇందులో లోతైన అధ్యయనం చేసి.. పరిశోధకుడిగా మారొచ్చు. మ్యాథమెటీషియన్‌లు సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తారు. గణిత శాస్త్రవేత్తలు కేవలం మ్యాథ్స్‌ మాత్రమే కాకుండా.. దీనికి అనుబంధ శాఖలైన స్టాటిస్టిక్స్‌ వంటి అంశాలను కూడా అధ్యయనం చేస్తారు. గణిత సిద్ధాంతాలు, ఫార్ములాలను అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు ఇది అద్భుతమైన కెరీర్‌గా చెప్పొచ్చు. ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు.. మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీలో చేరే దిశగా అడుగులు వేయాలి. ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఎస్‌ఐ–కోల్‌కతా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌–చెన్నై, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌–ముంబై వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరొచ్చు. వీటితోపాటు దేశంలోని ఐఐటీలు సహా అనేక ప్రముఖ విద్యాసంస్థలు మ్యాథమెటిక్స్‌/అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌ కోర్సులను అందిస్తున్నాయి.

ఎకనమిస్ట్‌..
ప్రతి దేశానికి ఆర్థిక వ్యవస్థ వెన్నుముక లాంటిది. దేశ ప్రగతి ఆర్థిక వ్యవస్థ గమనంపైనే ఆధారపడి ఉంటుంది. ఆర్థికవేత్తలు సమాజంలో వనరుల పంపిణీని అధ్యయనం చేస్తారు. దేశ, ప్రపంచ ఆర్థిక ధోరణులను పరిశోధించి విశ్లేషిస్తారు. మన్మోహన్‌ సింగ్, రఘురామ్‌ రాజన్, అమర్త్యసేన్‌ వంటి వారు ప్రముఖ ఎకనమిస్ట్‌లుగా గుర్తింపు పొందారు. ఆర్థికవేత్తలుగా మారాలంటే..ఎకనామిక్స్‌ను అవపోశన పట్టాలి. ఎకనామిక్స్‌తోపాటు మ్యాథమెటిక్స్‌పైనా పట్టు సాధించాలి. పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు బీఎస్సీ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ/ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటర్‌/డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్‌/ఎకనామిక్స్‌ చదివిన వారు ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఇంటర్మీడియట్‌తోపాటు డిగ్రీ స్థాయిలో ఎకనామిక్స్‌/మ్యాథమెటిక్స్‌ చదివినవా రు ఎంఏ/ఎంఎస్సీ ఎకనామిక్స్, పీహెచ్‌డీ వంటివి పూర్తి చేయడం ద్వారా ఎకనమిస్ట్‌గా రాణించే అవకాశం ఉంది. ఆర్థికవేత్తలు పరిశోధనా సంస్థలు, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ వంటి వాటిల్లో అవకాశాలు దక్కించుకోవచ్చు. అలాగే వీరు నీతి ఆయోగ్, ఆర్‌బీఐ తదితర సంస్థల్లో, కార్పొరేట్‌ రంగంలో తమ సేవలు అందిస్తారు. టీచింగ్‌ రంగాన్ని ఎంచుకున్నవారు ప్రముఖ యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో చేరవచ్చు. ఆయా ఆర్థిక రంగ పరిశోధనల్లో రాణించాలంటే.. గణిత పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించాలి.

స్టాటిస్టీషియన్స్‌..
డేటా వ్యాఖ్యానం, విశ్లేషణ చేయడం వంటి విధులను స్టాటిస్టీషియన్స్‌లు నిర్వహిస్తుంటారు. జనాభా గణాంకాలు, రాజకీయ అంచనాలు, ఓటింగ్‌ సరళిపై విశ్లేషణలు, నేరాలు, ఆరోగ్య సంరక్షణ, వ్యాపారం,ప్రమాదాలు, బీమా, పర్యావరణశాస్త్రం, వ్యవసాయం, క్రీడలు మొదలైన అన్ని రంగాల్లో గణాంక శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఆయా రంగాలకు అవసరమైన డేటాసేకరణకు సదరు విభాగాల గణాంక శాస్త్రవేత్తల సహాయం తీసుకుంటాయి. ప్రస్తుతం అన్ని రంగాలలోను వీరి ప్రాధాన్యం పెరుగుతోంది. స్టాటిస్టీషియన్‌లు.. గణాంకాలు, గ్రాఫ్‌లు, చార్టుల ద్వారా సమాచారం విశేషిస్తారు. వీరి నివేదికల ఆధారంగానే ప్రభుత్వాలు విధివిధానాలు రూపొందిస్తాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా స్టాటిస్టీషియన్లకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ఆర్థిక రంగంతోపాటు రాజకీయ రంగం, క్రీడలు, బ్యాంకింగ్, వివిధ పరిశ్రమలు సైతం కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి. గణిత విద్యార్థులకు ఇది చక్కటి కెరీర్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. మ్యాథమెటిక్స్‌ లేదా స్టాటిస్టిక్సలో బ్యాచిలర్‌ డిగ్రీ/పోస్‌్లగ్రాడ్యుయేషన్‌ చేసి ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు.

ఇంకా చ‌ద‌వండి: part 2: ఎంపీసీ విద్యార్థులు యాక్చూరియల్‌ ఎక్స్‌పర్ట్‌గా.. బ్యాంకింగ్ కెరీర్‌లో ముందుకు దూసుకుపోవ‌చ్చిలా..

Published date : 27 May 2021 09:19PM

Photo Stories