Skip to main content

గేట్ స్కోర్‌తో...పీఎస్‌యూల్లో కొలువులు

నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్‌బీఏ).. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్).. ఈ రెండూ మాత్రమే దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు, అవి నిర్వహించే కోర్సులకు గుర్తింపు ఇచ్చే ఏజెన్సీలు!! ఇప్పుడు..
ఈ రెండింటికి తోడు మరికొన్ని సంస్థలు తెరపైకి రానున్నాయా..! ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కోర్సులు, ఇంజనీరింగ్ విద్యను అందించండంలో పేరుగాంచిన ఐఐఎంలు, ఐఐటీలు అక్రిడిటేషన్ ఏజెన్సీలుగా సరికొత్త పాత్ర పోషించనున్నాయా? ఈ ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు.. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల ప్రమాణాలను పరిశీలించి గుర్తింపు ఇవ్వనున్నాయా?! అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది!! ఈ నేపథ్యంలో... యూజీసీ తాజా ప్రతిపాదనలు.. ఐఐటీలు, ఐఐఎంల అక్రిడిటేషన్‌తో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....
దేశంలో భారీ సంఖ్యలో ఏర్పాటైన ఉన్నత విద్యా సంస్థలకు అక్రిడిటేషన్ కోసం ఎన్‌బీఏ, న్యాక్‌లతోపాటు ఇతర అకడమిక్ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) భావిస్తోంది. ఇందుకోసం ముందుగా ఐఐటీలు, ఐఐఎంలను భాగస్వాములను చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఆ దిశగా యూజీసీ చర్యలు ప్రారంభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(రికగ్నిషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఏజెన్సీస్) రెగ్యులేషన్స్-2018 పేరుతో కొద్దిరోజుల క్రితమే నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.

రెండేళ్లుగా ప్రతిపాదన :
ఐఐటీలు, ఐఐఎంలను అక్రిడిటేషన్ ప్రక్రియలో భాగస్వాములను చేసే ప్రతిపాదన దాదాపు రెండేళ్లుగా కొనసాగుతోంది. అకడమిక్ వర్గాల నుంచి ప్రతికూలత కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రతిపాదన.. ఇప్పుడు దాదాపు ఖరారైంది. దేశంలో 2022-23 నాటికి ‘నో అక్రిడిటేషన్, నో పర్మిషన్’ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశముంది. కాబట్టి 2022 నాటికి అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు అక్రిడిటేషన్ పొందాలని.. లేకుంటే కోర్సులకు ప్రవేశాలు కల్పించే అర్హత కోల్పోతాయనే అభిప్రాయం కూడా తాజా ప్రతిపాదన అమల్లోకి రావడానికి మరో కారణంగా పేర్కొనొచ్చు. ఎంహెచ్‌ఆర్‌డీ తాజా ప్రతిపాదనకు ఇప్పటికే ఐఐటీ-ఢిల్లీ, గువహటి సానుకూలంగా స్పందించాయి. అక్రిడిటేషన్ ఏజెన్సీలుగా వ్యవహరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. మిగతా ఐఐటీలు, ఐఐఎంలు కూడా త్వరలోనే సానుకూలంగా స్పందించే అవకాశముందంటున్నారు..

ప్రతి విద్యాసంస్థకు అక్రిడిటేషన్!
ఉన్నత విద్యా సంస్థల నాణ్యత ప్రమాణాలను పరిశీలించి గుర్తింపు ఇచ్చేందుకు ఎన్‌బీఏ, న్యాక్‌లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అయితే దేశంలో యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య వేలల్లోనే ఉంది. వీటిలో కేవలం 15శాతం నుంచి 20శాతంలోపు ఇన్‌స్టిట్యూట్‌లకు మాత్రమే న్యాక్, ఎన్‌బీఏల గుర్తింపు ఉంది. మిగతా ఇన్‌స్టిట్యూట్‌లన్నింటికీ న్యాక్, ఎన్‌బీఏ తనిఖీలు చేసి.. గుర్తింపు ఇవ్వాలంటే సుదీర్ఘకాలం పడుతుందని అంచనా. ఇలాంటి పరిస్థితి విద్యా సంస్థల్లో జవాబుదారీతనం లోపించడానికి దారితీస్తోంది. ఫలితంగా కీలకమైన దశలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండాపోతోంది. దీనికి పరిష్కారంగానే ప్రతి విద్యాసంస్థ అక్రిడిటేషన్ పొందడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు వేగవంతమైన మార్గంగా.. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల సహకారం తీసుకోవాలని ఎంహెచ్‌ఆర్‌డీ నిర్ణయించింది.

కొత్త రెగ్యులేషన్స్ ఇవే :
న్యాక్, ఎన్‌బీఏలతోపాటు ఐఐటీలు, ఐఐఎంలు వంటి విద్యాసంస్థలను అక్రిడిటేషన్ ప్రక్రియలో భాగ స్వామ్యం చేసే క్రమంలో భాగంగా.. కొద్దిరోజుల క్రితమే యూజీసీ... యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (రికగ్నిషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఏజెన్సీస్) రెగ్యులేషన్స్-2018ను విడుదల చేసింది. ఇందులో ‘గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్’ విభాగాల్లోని సంస్థలు అక్రిడిటేషన్ ఏజెన్సీలుగా అనుమతి పొందొచ్చని పేర్కొంది. ఇలా అనుమతి పొందాలనుకుంటున్న ఏజెన్సీలను అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఏజెన్సీలుగా పిలవనుంది. యూజీసీ ఆధ్వర్యంలో పది మంది సభ్యులు ఉండే అక్రిడిటేషన్ అడ్వైజరీ కౌన్సిల్ ఆయా సంస్థల దరఖాస్తులను పరిశీలించి.. అక్రిడిటేషన్ ఏజెన్సీ లుగా గుర్తింపు ఇస్తుంది.

లెర్నింగ్ నైపుణ్యాలే ప్రామాణికం..
ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌లకు అక్రిడిటేషన్ ఇచ్చేందుకు సదరు ఇన్‌స్టిట్యూట్‌లలోని అన్ని అంశాలు పరిశీలిస్తున్నారు. న్యాక్ దాదాపు 80అంశాలు(ఇన్‌స్టిట్యూట్‌లోని సదుపాయాలకు సంబంధించి) ప్రామాణికంగా తీసుకుని గ్రేడింగ్ ఇస్తోంది. అయితే టీచింగ్-లెర్నింగ్ ప్రామాణికం పరంగా సరైన పరిశీలన జరగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై లెర్నింగ్ ప్రామాణికాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు ఎంహెచ్‌ఆర్‌డీ స్పష్టం చేసింది. ఇతర ప్రామాణికాలు.. మౌలిక సదుపాయాలు, వసతి వంటి వాటిని ఇన్‌స్టిట్యూట్‌లు తమ వెబ్‌సైట్ ద్వా రా ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే సరిపోతుంది.

ఐఐటీలు, ఐఐఎంలకు అందుకే !
విద్యా సంస్థలకు గుర్తింపునిచ్చే ప్రక్రియలో ముందుగా ఐఐటీలు, ఐఐఎంలకు హెచ్‌ఆర్‌డీ ప్రాధాన్యం ఇస్తోంది. అక్రిడిటేషన్ ఇచ్చేందుకు అవసరమైన సదుపాయాల పరంగా ఇవి మెరుగ్గా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఐఐటీలు, ఐఐఎంలకు నిపుణులైన అధ్యాపకులు, నాణ్యత ప్రమాణాల పరంగా మెరుగైన పనితీరుతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఫలితంగా వీటిని అక్రిడిటేషన్ ఏజెన్సీలుగా నియమిస్తే.. విద్యాసంస్థలకు గుర్తింపు ఇచ్చే క్రమంలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించే విషయంలో పకడ్బంధీగా వ్యవహరిస్తాయని హెచ్‌ఆర్‌డీ భావిస్తోంది.

పనిభారం పెరుగుతుందా ?
ఐఐటీలు, ఐఐఎంలను అక్రిడిటేషన్ ఏజెన్సీలుగా నియమించాలనే నిర్ణయంపై ప్రతికూల అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. ఐఐటీలు, ఐఐఎంల్లో ఇప్పటికే ఫ్యాకల్టీ కొరత ఉందని.. అదనంగా ఇప్పుడు అక్రిడిటేషన్ ఏజెన్సీ బాధ్యతలు కూడా అప్పగిస్తే వీటికి పనిభారం పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. అయితే ఇవి కేవలం గుర్తింపు ఇచ్చే వరకే పని చేస్తాయని.. ఆ తర్వాత దశలో విద్యాసంస్థల పనితీరును నిరంతరం తనిఖీ చేసే భారం ఉండదని ఎంహెచ్‌ఆర్‌డీ వర్గాలు పేర్కొంటున్నాయి. యూజీసీ నియమావళి ప్రకారం - స్వతంత్ర అక్రిడి టేషన్ ఏజెన్సీలు ఇచ్చే గుర్తింపు రెండేళ్లు చెల్లుబాటులో ఉంటుంది. తర్వాత మరో ఏడాది పొడిగించుకునే అవకాశముంది.

భవిష్యత్తులో ప్రయివేట్‌కూ అవకాశం..
దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియలో ప్రముఖ సంస్థలను భాగస్వాములను చేయడం ఇప్పటికే ప్రారంభమైంది. మొదట ఐఐటీలు, ఐఐఎంల సహకారం తీసుకోనున్నారు. భవిష్యత్తులో ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌కు కూడా అక్రిడిటేషన్ ప్రక్రియలో స్థానం కల్పించే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌లో అంతర్జాతీ యంగా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లను అక్రిడిటేషన్ ఏజెన్సీలుగా నియమించే వీలుంది.

ఆ దేశాల్లో ఎప్పటినుంచో..
బహుళ వ్యవస్థల అక్రిడిటేషన్ విధానం.. మన దేశంలో ఇటీవలే తెరపైకి వచ్చింది. కాని ఇలాంటి విధానంఇతర దేశాల్లో ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఉదాహరణకు అమెరి కానే పరిగణనలోకి తీసుకుంటే.. కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అక్రిడిటేషన్, అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కాలేజియేట్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్ వంటి సంస్థలు సహా పదుల సంఖ్యలో సంస్థలు ప్రాంతాల వారీగా.. అమెరికా ఉన్నత విద్యా శాఖ అనుమతితో ఇన్‌స్టిట్యూట్‌లకు గుర్తింపు ఇస్తున్నాయి. యూకేలోనూ క్వాలిటీ అష్యూరెన్స్ ఏజెన్సీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ అక్రిడిటేషన్ కౌన్సిల్, ఇంజనీరింగ్ కౌన్సిల్ వంటి సంస్థలు ప్రభుత్వ అనుమతితో ఇన్‌స్టిట్యూట్‌లకు గుర్తింపు ఇచ్చే ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి.

మంచి నిర్ణయమే..
ఉన్నత విద్యా సంస్థలకు గుర్తింపు ఇచ్చేందుకు ఇతర ఇన్‌స్టిట్యూట్‌లను అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఏజెన్సీలుగా భాగస్వాములను చేయాలనే ప్రతిపాదన మంచి నిర్ణయమే. అందుకే మా సంసిద్ధతను తెలియజేశాం. మా ఇన్‌స్టిట్యూట్‌లో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ పరంగా ఎలాంటి సమస్య లేదు. కాబట్టి అక్రిడిటేషన్ బాధ్యత ఇన్‌స్టిట్యూట్ అకడమిక్స్‌పై ప్రభావం చూపే అవకాశంలేదు.
-ప్రొఫెసర్.వి.రామ్ గోపాలరావు, డెరైక్టర్, ఐఐటీ-ఢిల్లీ
Published date : 20 Oct 2018 12:15PM

Photo Stories