Skip to main content

ఎంపీసీ విద్యార్థులు యాక్చూరియల్‌ ఎక్స్‌పర్ట్‌గా.. బ్యాంకింగ్ కెరీర్‌లో ముందుకు దూసుకుపోవ‌చ్చిలా.

మ్యాథమెటిక్స్‌ సంబంధిత ముఖ్య విభాగాల్లో యాక్చూరియల్‌ సైన్స్‌ ఒకటి. బీమా కంపెనీలు, సంస్థలకు రిస్క్‌ సంబంధిత సమస్యలను విశ్లేషించడం, అవసరమైన పరిష్కారాలు చూపడం యాక్చూరియల్‌ నిపుణుల ప్రధాన బాధ్యత.
 

వీరిచ్చే నివేదికల ఆధారంగా బీమా సంస్థలు నిర్ణ యాలు తీసుకుంటాయి. ఆరోగ్య సంరక్షణ, బీమా, బ్యాంకింగ్, ఫైనాన్స్‌ వంటి అనేక రంగాల్లో యాక్చూరియల్‌ నిపుణుల సేవలు అవసరమవుతాయి. ఈ రంగంలో పనిచేసేవారికి రూ.5లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది. మ్యాథ్స్, కామర్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు యాక్చూరియల్‌ సైంటిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. అందుకోసం యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏసీఈటీ)లో ఉత్తీర్ణత సాధించి.. సదరు కోర్సును పూర్తిచేసుకోవాలి.

బ్యాంకింగ్‌ కెరీర్‌..
మ్యాథ్స్‌ విద్యార్థులకు మరొక అద్భుతమైన కెరీర్‌.. బ్యాంక్‌ జాబ్‌. ఈ కెరీర్‌ ఆకర్షణీయమైన వేతనం, ఉద్యోగ భద్రత, ఉన్నత పదవులను అందిస్తుంది. బ్యాంకింగ్‌ రంగ నిపుణులు నిత్యం సంఖ్యలతో సహవాసం చేస్తుంటారు. మ్యాథమెటిక్స్‌తో డిగ్రీ పూర్తిచేసిన వారికి బ్యాంకింగ్‌ కెరీర్‌ చక్కగా సరిపోతుంది. బ్యాంకులు ఉద్యోగ నియామకాల్లో మ్యాథ్స్, కామర్స్‌ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మ్యాథ్స్‌ నేపథ్యం కలిగిన విద్యార్థులు.. బ్యాంకులు నిర్వహించే పీఓ, క్లర్క్‌ వంటి పోటీ పరీక్షల్లో ముందంజలో నిలిచే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువు కోసం ఐబీపీఎస్, ఎస్‌బీఐ, ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ల్లో విజయం సాధించాలి. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు కనీస అర్హత ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ.

బ్లాక్‌ చైన్‌ డెవలపర్‌..
ఇటీవల బాగా పాపులర్‌ అవుతున్న కొత్త టెక్నాలజీ.. బ్లాక్‌ చైన్‌. క్రిప్టోకరెన్సీ నుంచి లాజిస్టిక్స్‌ వరకూ.. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. భవిష్యత్‌లో దాదాపు అన్ని రం గాలు ఈ టెక్నాలజీపై ఆధారపడి నడుస్తాయని అంచనా. బ్లాక్‌ చైన్‌ డెవలపర్‌గా టెక్‌ సమస్యలకు మెరుగైన పరిష్కారాలను కనిపెట్టవచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌ చైన్‌ డెవలపర్స్‌కు భారీ డిమాండ్‌ ఉంది. వచ్చే పదేళ్లలో వీరి అవసరం మరింత పెరుగుతుందని అంచనా. మ్యాథ్స్‌ విద్యార్థులకు ఇది గొప్ప కెరీర్‌ ఎంపికగా చెప్పొచ్చు. బ్లాక్‌ చైన్‌ డెవలపర్‌గా కెరీర్‌ ప్రారంభించాలంటే.. మొదట మ్యాథమెటిక్స్, సైన్స్‌ లేదా ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఈ రంగంలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాల కోసం బ్లాక్‌ చైన్‌లో సర్టిఫికేషన్‌ పొందాలి. బ్లాక్‌ చైన్‌ డెవలపర్‌గా రాణించడానికి స్మార్ట్‌ కాంట్రాక్ట్స్, హైపర్‌ లెడ్జర్, ఎథెరియం వంటి నైపుణ్యాలు అవసరం. వీటిని మ్యాథ్స్‌ విద్యార్థులు సులువుగా నేర్చుకోగలరు.

బిజినెస్‌ అనలిస్ట్‌..
బిజినెస్‌ అనాలసిస్‌ అనేది గణిత విద్యార్థులకు ఉత్తమ కెరీర్‌ మార్గంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. ఒక వ్యాపార విశ్లేషకుడు చాలా డేటాతో పనిచేయాల్సి ఉంటుంది. గణితం, గణాంక సూత్రాలపై పట్టుంటే.. డేటా సహాయంతో సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం తేలికవుతుంది. బిజినెస్‌ అనలిస్టులకు జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ నెలకొంది. రాబోయే రోజుల్లో వీరి అవసరం మరింత పెరుగుతుందని అంచనా. బిజినెస్‌ అనలిటిక్స్‌లో ఎంబీఏ పూర్తిచేయడం, లేదా మూక్స్‌ విధానంలో ఆన్‌లైన్‌ మార్గాల్లో సదరు నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.

డేటా సైంటిస్ట్‌..
అకడమిక్‌ రీసెర్చ్‌ నుంచి మానవ ప్రవర్తనను అధ్యయనం చేసే సైకాలజీ వరకూ..ప్రతి విభాగంలో డేటాసైన్స్‌ అవసరం ఏర్పడింది. డేటా సైంటిస్ట్‌.. కస్టమర్ల డేటాను విశ్లేషించి.. కొనుగోలు నమూనాలను అంచనా వేస్తారు. సంస్థలు.. తమ వస్తు, సేవలను, కార్యకలాపాలను మెరుగుపరచుకోవడానికి డేటా సైంటిస్టుల నివేదికలు ఉపయోగపడతాయి. ఈ విభాగంలో రాణించేందుకు మ్యా థ్స్‌పై పట్టుండటం చాలా అవసరం. ప్రస్తుతం డేటా సైన్స్‌ అనేది గణిత విద్యార్థులకు చక్కటి కెరీర్‌ను అందిస్తోంది. ఐబీఎం నివేదిక–2021 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా డేటా సైంటిస్టులకు 35 శాతం డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేసింది. ఇంటర్మీడియట్‌ ఎంపీసీ చదివిన విద్యార్థులు.. ఇంజనీరింగ్‌లో డేటా సైన్స్‌ లేదా పీజీ డిప్లొమా ఇన్‌ డేటా సైన్స్‌ వంటివి పూర్తిచేయడం ద్వారా డేటా సైంటిస్ట్‌ కొలువు దక్కించుకోవచ్చు.

మెషిన్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పర్ట్‌..
టెక్నాలజీ రంగంలో పనిచేయాలని చాలామంది కలలు కంటారు. లేటెస్ట్‌ టెక్నాలజీపై పనిచేయడం ద్వారా చక్కటి కెరీర్‌ అవకాశాలను అందుకునే వీలుంది. అందుకు అనువైన కోర్సు..మెషిన్‌ లెర్నింగ్‌ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మెషిన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ).. రిటైల్, సోషల్‌ మీడియా, లాజిస్టిక్స్, హెల్త్‌ కేర్, సెక్యూరిటీ వంటి అనేక రంగాల్లో తప్పనిసరిగా మారాయి. వచ్చే పదేళ్లల్లో ఏఐ, ఎంఎల్‌ నిపుణులకు మంచి డిమాండ్‌ ఉంటుందని అంచనా. మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు.. ఎంఎల్, ఏఐలో డిప్లొమా కోర్సులు పూర్తి చేయవచ్చు. వీరు నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్, కంప్యూటర్‌ విజన్, ప్రోగ్రామింగ్‌ సంబంధిత టూల్స్‌పై అవగాహన పెంచుకోవడం లాభిస్తుంది.

ఇంకా చ‌ద‌వండి: part 2: ఇంట‌ర్‌లో ఎంపీసీ తీసుకున్న విద్యార్థుల‌.. కెరీర్ మార్గాలు ఇలా..

Published date : 27 May 2021 09:50PM

Photo Stories