Skip to main content

డిమాండ్‌ పెరుగుతున్న బీడీఎస్‌.. కెరీర్‌ అవకాశాలు ఇవే..

బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ.. సంక్షిప్తంగా బీడీఎస్‌! డాక్టర్‌ కావాలని కలలు కనే విద్యార్థులు.. ఎంబీబీఎస్‌ను లక్ష్యంగా చేసుకుంటారు. ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభించకుంటే.. వారు ఎంచుకునే తొలి ప్రత్యామ్నాయం.. బీడీఎస్‌! మరోవైపు సమాజంలో డెంటిస్ట్‌ల (దంత వైద్యులు) సేవలకు డిమాండ్‌ పెరుగుతోంది. అల్లోపతి డాక్టర్లకు దీటుగా.. డెంటల్‌ వైద్యులకు ఉద్యోగాలు దక్కుతున్న పరిస్థితి నెలకొంది! అంతేకాకుండా బీడీఎస్‌ అభ్యర్థులకు ఉన్నత విద్య అవకాశాలు సైతం ఎక్కువే! ఈ నేపథ్యంలో.. బీడీఎస్‌ కోర్సు, ఉన్నత విద్య, ఉద్యోగాలపై ప్రత్యేక కథనం..

బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ.. దంత సమస్యలకు చికిత్స, నివారణ విధానాలపై నైపుణ్యాలు అందించే కోర్సు. బీడీఎస్‌ పూర్తి చేసుకుంటే.. డెంటిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో డెంటల్‌ స్పెషలిస్ట్‌లకు అవకాశాలు విస్తృతమని చెప్పొచ్చు. ముఖ్యంగా బీడీఎస్, ఆపై పీజీ కోర్సులు పూర్తి చేస్తే మెరుగైన కెరీర్‌ను సొంతం చేసుకునే వీలుంది.

నీట్‌తో ప్రవేశం..
బీడీఎస్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)–యూజీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. నీట్‌ యూజీకి అర్హత ఇంటర్మీడియట్‌ బైపీసీ. నీట్‌ స్కోర్‌ ఆధారంగా రాష్ట్రాల స్థాయిలోని డెంటల్‌ కళాశాలల్లో, అదే విధంగా ఆల్‌ ఇండియా కోటా విధానంలో జాతీయ స్థాయిలోని డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది.

అయిదేళ్ల కోర్సు..
బీడీఎస్‌ కోర్సు వ్యవధి ఐదేళ్లు. ఇది మెడికల్, డెంటల్‌ సబ్జెక్ట్‌ల సమ్మేళంగా ఉంటుంది. నాలుగేళ్లు క్లాస్‌ రూమ్‌ టీచింగ్‌. మరో ఏడాది రొటేటరీ ఇంటర్న్‌షిప్‌. కోర్సులో భాగంగా దంత సమస్యలకు సంబంధించిన చికిత్స పద్ధతులపై నైపుణ్యం అందించేలా బోధన సాగుతుంది. ఓరల్‌ అండ్‌ మ్యాక్సిలోఫేషియల్‌ సర్జరీ, ప్రోస్థోడాంటిక్స్, ఆర్థో డాంటిక్స్, ఓరల్‌ మెడిసిన్‌ అండ్‌ రేడియాలజీ, పెరియోడాంటిక్స్, పెడోడాంటిక్స్, కన్సర్వేటివ్‌ డెంటిస్ట్రీ వంటి దంత వైద్య సంబంధిత అంశాలతోపాటు జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్, ఫార్మకాలజీ వంటి వాటిపైనా అవగాహన కల్పిస్తారు.

ఎండీఎస్‌..
బీడీఎస్‌ తర్వాత అందుబాటులో ఉన్న ఉన్నత విద్య కోర్సు.. ఎండీఎస్‌ (మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ). నీట్‌–పీజీ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఎండీఎస్‌లో ప్రవేశం లభిస్తుంది. ఈ కోర్సులో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఓరల్‌ మెడిసిన్, డయాగ్నసిస్‌ అండ్‌ రేడియాలజీ; ఓరల్‌ అండ్‌ మాక్సిల్లోపేషియల్‌ సర్జరీ; ఓరల్‌ పాథాలజీ అండ్‌ మైక్రోబయలాజీ; కన్సర్వేటివ్‌ డెంటిస్ట్రీ అండ్‌ ఎండోడాంటిక్స్‌; ఆర్థోడాంటిక్స్‌; పోర్థోడాంటిక్స్‌; పెరియోడాంటల్‌ సర్జరీ అండ్‌ ఓరల్‌ ఇంప్లాంటాలజీ; పెడోడాంటిక్స్‌; పబ్లిక్‌ హెల్త్‌ డెంటిస్ట్రీ.

పీజీ డిప్లొమా: డెంటల్‌ మెడికల్‌ కేర్‌ విభాగంలో మరో ఉన్నత విద్య అవకాశం.. పీజీ డిప్లొమా. ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా ప్రైవేట్‌ రంగంలో చక్కటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

ఉద్యోగావకాశాలు..
బీడీఎస్‌ అర్హతతో ప్రభుత్వ వైద్య విభాగాల్లో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు లేదా వైద్య శాఖలు నిర్వహించే నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 

బీడీఎస్‌ ఉత్తీర్ణులకు కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో సైతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆర్మీ డెంటల్‌ కార్ప్స్, టెరిటోరియల్‌ ఆఫీసర్‌ ఇన్‌ ఆర్మీ పేరుతో రక్షణ దళాల్లో కొలువు దక్కించుకోవచ్చు. అదే విధంగా రైల్వే శాఖ, ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లోనూ దంత వైద్యుడిగా ఉపాధి లభిస్తుంది. ఇందుకోసం ఆయా శాఖలు, విభాగాలు నిర్వహించే నియామక పరీక్షలు, లేదా ఇంటర్వూల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

ఊ స్వయం ఉపాధి: బీడీఎస్‌ ఉత్తీర్ణులు స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. దంత వైద్యులుగా సొంతంగా క్లినిక్‌ నెలకొల్పి ప్రాక్టీస్‌ ప్రారంభించొచ్చు. ఇందుకోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం–మౌలిక సదుపాయాలు, వైద్య వసతులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి : part 2: ఈ నైపుణ్యాలు ఉంటే బీడీఎస్‌ విద్యార్థులకు విదేశాల్లోనూ కొలువులు.. !

Published date : 02 Jul 2021 04:54PM

Photo Stories