Skip to main content

ఐఐటీల్లో ఎంటెక్ లేదా పీఎస్‌యూల్లో ఉద్యోగ‌మా.. సీఓఏపీతో తెలుసుకోండిలా!

గేట్‌ ర్యాంక్‌తో ఐఐటీల్లో ఎంటెక్, పీఎస్‌యూల్లో జాబ్‌ సొంతం చేసుకోవచ్చు. కానీ.. ఆయా ఐఐటీల్లో ఎంటెక్‌ సీట్లు.. పీఎస్‌యూల్లో ఉద్యోగ వివరాలు తెలుసుకోవడం అంత తేలిక కాదు.

గేట్‌ ర్యాంకర్లు..ఐఐటీల్లో ఎంటెక్‌; పీఎస్‌యూల్లో జాబ్‌ ఆఫర్ల వివరాలు తెలుసుకునేందుకు అమల్లోకి తెచ్చిన విధానమే.. సీఓఏపీ (కామన్‌ ఆఫర్‌ యాక్సప్టెన్స్‌ పోర్టల్‌). ఇందులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా తమ గేట్‌ స్కోర్‌కు అనుగుణంగా..సీటు కేటాయించే ఐఐటీ.. జాబ్‌ ఆఫర్‌ ఇచ్చే పీఎస్‌యూల సమాచారం తెలుసుకోవచ్చు! తద్వారా తమకు నచ్చిన ఆఫర్‌ను ఎంచుకోవచ్చు. 2021–22 విద్యా సంవత్సరానికి సీఓఏపీ 2021 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. సీఓఏపీ విధానం, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం..

కామన్‌ ఆఫర్‌ యాక్సెప్టెన్స్‌ పోర్టల్‌.. సంక్షిప్తంగా సీఓఏపీ.
ఇది గేట్‌(గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌)లో ర్యాంకుతో ఐఐటీల్లో ఎంటెక్‌ ప్రవేశాలు, అదే విధంగా పీఎస్‌యూ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు మేలు చేసేలా అమల్లోకి తెచ్చిన ఉమ్మడి ఆన్‌లైన్‌ వేదిక.

ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ఐఐటీలు, పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. తమ గేట్‌ ర్యాంకుకు లభించిన ఆఫర్లను చూసుకోవచ్చు. నచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పొచ్చు.

ఎంటెక్‌ అడ్మిషన్‌ల కోసం విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

2017 నుంచే సీఓఏపీ..
గేట్‌ ర్యాంకర్లు ఐఐటీల్లో ఎంటెక్‌ సీట్లు, పీఎస్‌యూ జాబ్‌ ఆఫర్లు తెలుసుకునేందుకు వీలుగా సీఓఏపీ విధానాన్ని 2017లోనే ప్రారంభించారు. మొదటి ఏడాదిలో కేవలం ఎనిమిది ఐఐటీలే ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. ఆ తర్వాత దాదాపు అన్ని ఐఐటీలు సీఓఏపీవైపు మొగ్గు చూపాయి. 2021–22 సంవత్సరానికి మొత్తం 21 ఐఐటీలు, ఐఐఎస్‌సీ–బెంగళూరు వంటి టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌; ఎన్‌పీసీఐఎల్‌ తదితర పీఎస్‌యూలు సీఓఏపీ ప్రక్రియలో పాల్గొనేందుకు సంసిద్ధత తెలిపాయి.

పాల్గొంటున్న ఇన్‌స్టిట్యూట్‌లు..
ఐఐఎస్‌సీ–బెంగళూరు,ఐఐటీ–భిలాయ్, భువనేశ్వర్, ఐఐటీ–బీహెచ్‌యూ, ఐఐటీ–ఢిల్లీ, ముంబై, గోవా, గువహటి, హైదరాబాద్, ఇండోర్, ఐఐటీ–ఐఎస్‌ఎం ధన్‌బాద్, ఐఐటీ–జమ్ము, జోథ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, మండి, పాలక్కాడ్, పాట్నా, రూర్కీ, రోపార్, తిరుపతి.

పీఎస్‌యూలు..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం–న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌).. సీఓఏపీ ద్వారా గేట్‌ ర్యాంకర్లకు జాబ్‌ ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. సీఓఏపీ రౌండ్లు ప్రారంభమయ్యే సమయానికి మరికొన్ని పీఎస్‌యూలు కూడా ఈ విధానంలో పాల్గొనే అవకాశముందని సమాచారం.

సీఓఏపీతో ప్రయోజనాలు..
సీఓఏపీతో ముఖ్య ప్రయోజనం ఏమంటే.. గేట్‌ ర్యాంకు ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే.. ఐఐటీలు ఇచ్చే ఎంటెక్‌ అడ్మిషన్‌ను, పీఎస్‌యూ జాబ్‌ ఆఫర్లను తెలుసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్‌లు, పీఎస్‌యూలు సదరు ర్యాంకర్లకు ఇచ్చే ఆఫర్లను సీఓఏపీ పోర్టల్‌లో పొందుపరుస్తాయి.

రెండో ప్రధాన ప్రయోజనం.. రౌండ్ల వారీగా జరిగే ఆఫర్ల ప్రక్రియలో.. అభ్యర్థులకు వాటిని సమ్మతించే అవకాశం లేదా తదుపరి రౌండ్ల కోసం వేచి చూసే వీలు కల్పించడం.

ఒక రకంగా ఇది ఐఐటీల్లో సీట్ల కేటాయింపు పరంగా ఉమ్మడి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ వంటిదే. పలు రౌండ్లలో సీఓఏపీ ద్వారా ఆఫర్లను వీక్షించి.. సరైన నిర్ణయం తీసుకోవచ్చు.

ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ఇన్‌స్టిట్యూట్‌లు.. తమ ఎంటెక్‌ అప్లికేషన్‌ పోర్టల్‌లో సీఓఏపీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను పొందుపరచడం తప్పనిసరి చేశాయి.

ప్రత్యేకంగా దరఖాస్తు..
గేట్‌ విద్యార్థులు ఆయా ఐఐటీల అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ఆధారంగా వాటికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను ఆయా ఐఐటీల వర్గాలు పరిశీలించి..సీటు కేటాయింపు జాబితాను రూపొందిస్తాయి. ఆ జాబితాను సీఓఏపీ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతాయి. అంటే.. సీఓఏపీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పటికీ..ఐఐటీల్లో ఎంటెక్‌ సీటు కోసం తమకు ఆసక్తి ఉన్న ఐఐటీలకు వేర్వేరుగా దరఖాస్తుగా చేసుకోవాల్సిందే. ఇదే విధానం పీఎస్‌యూ ఉద్యోగాల విషయంలోనూ అమలవుతోంది.

సీఓఏపీ ద్వారానే ఆఫర్‌..
ఐఐటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా సీఓఏపీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. ముందుగా సీఓఏపీలో తమ వివరాలను నమోదు చేసుకొని.. రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ పొందిన విద్యార్థులే ఆయా ఐఐటీల్లో ఎంటెక్‌కు దరఖాస్తులకు అర్హులవుతారు. అంతేకాకుండా అంతిమంగా ఐఐటీల్లో ఎంటెక్‌ అడ్మిషన్‌ ఆఫర్‌ సీఓఏపీ ద్వారానే లభిస్తుంది. కాబట్టి ఇక్కడ సీఓఏపీలో రిజిస్ట్రేషన్, అలాగే ప్రత్యేకంగా ఆయా ఐఐటీకీ దరఖాస్తు.. ఇలా రెండుసార్లు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరని విద్యార్థులు గుర్తించాలి.

సీఓఏపీ అయిదు రౌండ్లు..
సీఓఏపీ రిజిస్ట్రేషన్‌ ఆధారంగా అభ్యర్థులు తమకు లభించిన సీటు, ఇన్‌స్టిట్యూట్‌ వివరాలను తెలుసుకునే ప్రక్రియ మొత్తం అయిదు రౌండ్లలో (రౌండ్‌– ఎ, బి, సి, డి, ఈ) జరుగనుంది. మొదటి నాలుగు రౌండ్లకే పరిమితం కాకుండా.. అదనంగా మరో రౌండ్‌లో ఆఫర్లు ఇవ్వాలనుకునే ఐఐటీల విషయంలోనే రౌండ్‌–ఇ(అయిదో రౌండ్‌) ఉంటుంది. ఇలా దశల వారీగా ఆఫర్లను తెలియజేసే క్రమంలో.. వాటికి సమ్మతి, తిరస్కరణ, ఇతర రౌండ్లకు పాల్గొనే విషయంలో విద్యార్థులకు మూడు ఆప్షన్లను అందుబాటులో ఉంటాయి. అవి..
యాక్సెప్ట్‌ అండ్‌ ఫ్రీజ్‌
రిటైన్‌ అండ్‌ వెయిట్‌
రిజెక్ట్‌ అండ్‌ వెయిట్‌.

యాక్సెప్ట్‌ అండ్‌ ఫ్రీజ్‌..
అభ్యర్థులు మొదటి రౌండ్‌లో తమకు లభించిన సీటు లేదా ఇన్‌స్టిట్యూట్‌ విషయంలో సంతృప్తి చెందితే.. యాక్సెప్ట్‌ అండ్‌ ఫ్రీజ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇలా ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న వారికి తదుపరి రౌండ్లలో ఆఫర్లు చూసుకుని, మార్పుచేర్పులు చేసుకునే అవకాశం ఉండదు. యాక్సెప్ట్‌ అండ్‌ ఫ్రీజ్‌ చేసిన ఇన్‌స్టిట్యూట్‌లోనే చేరాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఐఐటీ–చెన్నైలో సీటు లభించి.. యాక్సెప్ట్‌ అండ్‌ ఫ్రీజ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే.. తదుపరి రౌండ్లలో మరో ఐఐటీలో ఆఫర్‌ను ఎంచుకునే అవకాశం ఉండదు.

రిటెయిన్‌ అండ్‌ వెయిట్‌..
మొదటి రౌండ్‌లో లభించిన సీటు/ఇన్‌స్టిట్యూట్‌ విషయంలో సమ్మతి తెలుపుతూనే.. మరింత మెరుగైన ఇన్‌స్టిట్యూట్‌లో సీటు కావాలనుకునే విద్యార్థులు.. రిటెయిన్‌ అండ్‌ వెయిట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న విద్యార్థులు.. తదుపరి రౌండ్లలోని ఆఫర్లను చూసుకొని.. దానికి అనుగుణంగా తమ నిర్ణయంలో మార్పులు,చేర్పులు చేసుకోవచ్చు.

రిజెక్ట్‌ అండ్‌ వెయిట్‌..
ఒక రౌండ్‌లో వచ్చిన అన్ని ఆఫర్లను తిరస్కరించి.. తదుపరి రౌండ్లలో మరింత మెరుగైన ఆఫర్లు లభిస్తాయని భావించే విద్యార్థులు.. రిజెక్ట్‌ అండ్‌ వెయిట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వీరికి తదుపరి రౌండ్లలో ఆఫర్లను వీక్షించే అవకాశం లభిస్తుంది. ఒకవేళ తొలి రౌండ్‌లో లభించిన సీటు, ఇన్‌స్టిట్యూట్‌లోనే కొనసాగాలనుకుంటే..కేవలం రెండుసార్లు మాత్రమే రిటెయిన్‌ అండ్‌ వెయిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. ప్రతి రౌండ్‌లోనూ పైన పేర్కొన్న ఆప్షన్లను ఎంచుకున్న అభ్యర్థులు.. తప్పనిసరిగా సబ్మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడే వారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఐఐటీలో చేరేందుకు లేదా ఇతర రౌండ్లలో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది.

ఇదే తీరుగా పీఎస్‌యూ జాబ్‌ ఆఫర్లు కూడా కనిపిస్తాయి. వాటి విషయంలోనూ పైన పేర్కొన్న విధంగా అందుబాటులో ఉన్న మూడు ఆప్షన్లను క్లిక్‌ చేసి.. సబ్మిట్‌ చేసే అవకాశం ఉంటుంది.

ఇన్‌స్టిట్యూట్‌ల మలిదశ ఎంపిక..
సీఓఏపీలోని పలు రౌండ్ల ద్వారా తమకు లభించిన సీటు, ఇన్‌స్టిట్యూట్‌కు సమ్మతి తెలిపిన విద్యార్థులు.. సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ మలిదశలో నిర్వహించే ఎంపిక ప్రక్రియకు హాజరవ్వాల్సి ఉంటుంది. అందుకు గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వూల‌కు సిద్ధం కావాలి. వాటిలో విజయం సాధించిన వారికే సీటు ఖరారు అవుతుంది.

ఇంకా చ‌ద‌వండి: part 2: సీఓఏపీలో రిజిస్ట్రేషన్.. మూడేళ్ల గేట్ స్కోరు ఆధారంగా..

Published date : 19 May 2021 02:49PM

Photo Stories