2021కి సంబంధించి తెలంగాణలో జరిగే వివిధ ప్రవేశ పరీక్షల వివరాలు ఇవే..
ప్రస్తుతం ఆయా సెట్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పరీక్ష తేదీలపైనా స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో.. టీఎస్ సెట్‌ల తేదీలు,
పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం...
టీఎస్ ఎంసెట్..
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది రాసే పరీక్ష ఎంసెట్. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫార్మసీ, ఫార్మా–డి తదితర కోర్సుల్లో ప్రవేశాలను ఎంసెట్ ద్వారా చేపడతారు.
- ఇంజనీరింగ్: ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్ నుంచి 80, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఇందులో సాధించిన ర్యాంకు ఆధారంగా.. బీటెక్, బీటెక్(డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
- అగ్రికల్చర్ అండ్ మెడిసిన్: ఇది అగ్రికల్చర్ బీఎస్సీ, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 ప్రశ్నల చొప్పున, బయాలజీ(బోటనీ, జువాలజీ) నుంచి 80 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు.
ముఖ్యతేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 8, 2021
- హాల్ టిక్కెట్స్ డౌన్‌లోడ్: జూలై 23–31
- ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష నిర్వహణ: ఆగస్టు 4–6
- మెడికల్ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్ష నిర్వహణ: ఆగస్టు 9, 10
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://eamcet.tsche.ac.in
టీఎస్ ఈసెట్..
ఈసెట్... పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథ్స్) పూర్తయ్యాక.. లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా బీటెక్/బీఈ, ఫార్మసీ కోర్సుల్లో సెకండ్ ఇయర్‌లో చేరేందుకు రాయాల్సిన పరీక్ష. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఫార్మసీ/బీఎస్‌సీ (మ్యాథ్స్) ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం..
ఈసెట్ 200 మార్కులకు ఉంటుంది. డిప్లొమా,ఫార్మసీ, బీఎస్‌సీ మ్యాథమెటిక్స్ ఉత్తీర్ణులకు వేర్వేరుగా ఉంటుంది. డిప్లొమా ఉత్తీర్ణులకు నాలుగు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. అవి.. మ్యాథమెటిక్స్–50 ప్రశ్నలు; ఫిజిక్స్–25 ప్రశ్నలు; కెమిస్ట్రీ–25 ప్రశ్నలు; ఇంజనీరింగ్ పేపర్(అభ్యర్థి ఎంపిక చేసుకునే పేపర్)–100 ప్రశ్నలు. ఫార్మసీ ఉత్తీర్ణులకు ఫార్మాస్యుటిక్స్, ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీ, ఫార్మకోగ్నసీ, ఫార్మకాలజీ విభాగాల నుంచి 50 ప్రశ్నలు చొప్పున మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఉత్తీర్ణులకు మ్యాథమెటిక్స్ నుంచి 100 ప్రశ్నలు; అనలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. పరీక్ష వ్యవధి: మూడు గంటలు.
ముఖ్యతేదీలు..
- లేటు ఫీజుతో జూలై 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.
- హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: జూలై 30 నుంచి ప్రారంభం.
- టీఎస్ ఈసెట్ నిర్వహణ తేదీ: ఆగస్టు 3
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ecet.tsche.ac.in
టీఎస్ ఐసెట్
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష... ఐసెట్. దీన్ని ఆ¯ŒSలైన్ విధానంలో నిర్వహిస్తారు. ఎంబీఏ కోర్సుకు ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత సరిపోతుంది. కానీ ఎంసీఏ కోర్సుకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. ఐసెట్‌ను 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీల నుంచి 75 ప్రశ్నలు చొప్పున, కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
ముఖ్య తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూలై 8
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్:ఆగస్టు 13వ తేదీ నుంచి
- ఐసెట్ పరీక్ష తేదీ: ఆగస్టు 19, 20
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://icet.tsche.ac.in
టీఎస్ లాసెట్..
రాష్ట్ర స్థాయి న్యాయ కళాశాలల్లో చేరడానికి వీలు కల్పించే పరీక్ష.. లాసెట్(లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్). మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సుల్లో లాసెట్ ర్యాంక్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు..
- ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(10+2 విధానంలో) (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతాయి).. మూడేళ్ల లా కోర్సుకు ఏదైనా డిగ్రీని(10+2+3 విధానం) 45 శాతం మార్కులతో పూర్తి చేయాలి.
- ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన వారు పీజీ లాసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం..
గంటన్నర వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకుSఒక మార్కు లభిస్తుంది. మూడు విభాగాలుండే ప్రశ్నపత్రంలో పార్ట్–ఎలో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీపై 30 ప్రశ్నలు.. పార్ట్–బిలో కరెంట్ అఫైర్స్‌పై 30 ప్రశ్నలు.. పార్ట్–సిలో ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లాపై 60 ప్రశ్నలుంటాయి. పీజీ లాసెట్‌ను 120 ప్రశ్నలతో నిర్వహిస్తారు.
ముఖ్యతేదీలు..
- ఆలస్య రుసుము(రూ.250)తో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూలై 15
- హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: ఆగస్టు 12
- లాసెట్ నిర్వహణ తేదీ: ఆగస్టు 23
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://lawcet.tsche.ac.in
టీఎస్ పీజీఈసెట్..
రాష్ట్ర స్థాయిలోఎంటెక్/ఎంఈ/ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్(పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహిస్తారు. సంబంధిత బ్రాంచ్‌లో 50 శాతం మార్కులతో బీటెక్/బీఈ/బీఫార్మసీ/బీఆర్క్ తదితర కోర్సు ల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.
పరీక్ష విధానం..
అభ్యర్థులు అర్హతల మేరకు సంబంధించిన స్పెషలైజేషన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్షను 120 ప్రశ్నలు–120 మార్కులకు రెండు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం..
- ఆలస్య రుసుము(రూ.250)తో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూలై 15
- హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: ఆగస్టు 1–10
- పీజీఈసెట్ నిర్వహణ: ఆగస్టు 11–14
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://pgecet.tsche.ac.in
ఎడ్‌సెట్..
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు చేరాల్సిన కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ). బీఈడీలో చేరేందుకు ఎడ్‌సెట్ రాయాల్సి ఉంటుంది.
అర్హతలు..
- మ్యాథమెటిక్స్ మెథడాలజీ: మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా బీఏ/బీఎస్సీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు, ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివిన బీసీఏ ఉత్తీర్ణులు అర్హులు.
- ఫిజికల్ సైన్సెస్: ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా అప్లయిడ్ మెటీరియల్ సైన్స్ ఒక సబ్జెక్ట్‌గా బీఎస్సీ/బీటెక్/బీఈ ఉత్తీర్ణులు/ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివిన బీసీఏ ఉత్తీర్ణులు.
- బయలాజికల్ సైన్సెస్: బోటనీ, జువాలజీ లేదా అనుబంధ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్‌లు గ్రూప్ సబ్జెక్ట్‌లుగా బీఎస్సీ/బీఎస్సీ(హోంసైన్స్) ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్‌లో బయలాజికల్ సైన్స్ చదివిన బీసీఏ ఉత్తీర్ణులు.
- సోషల్ స్టడీస్: బీఏ/బీకాం/బీబీఎం/బీబీఏ/బీసీఏ ఉత్తీర్ణులు.
- ఇంగ్లిష్: బీఏ స్పెషల్ ఇంగ్లిష్/బీఏ లిటరేచర్/ఎంఏ ఇంగ్లిష్ ఉత్తీర్ణులు.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తీరు..
పరీక్షను ఆన్‌లైన్ విధానంలో 150 ప్రశ్నలు– 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మ్యాథ్స్, సైన్స్,సోషల్ స్టడీస్(పదోతరగతి వరకు) సబ్జెక్టుల నుంచి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. అలాగే టీచింగ్ ఆప్టిట్యూడ్‌పై 20 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్‌పై 20 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్‌పై 30 ప్రశ్నలు, కంప్యూటర్ అవేర్‌నెస్‌పై 20 ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్య తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేదీ: జూలై 7
- హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: ఆగస్టు 10
- ఎడ్‌సెట్ నిర్వహణ తేదీ: ఆగస్టు 24, 25
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://edcet.tsche.ac.in