Skip to main content

క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో ఉద్యోగావకాశాలు..

మీరు బీటెక్ చదువుతున్నారా.. ఉద్యోగాన్వేషణలో ఉన్నారా.. భవిష్యత్తు కెరీర్ గురించి కలలు కంటున్నారా... ముఖ్యంగా ఇంజనీరింగ్‌లో సీఎస్‌ఈ బ్రాంచ్ విద్యార్థులా? అయితే.. మీకో శుభవార్త! అదే.. క్లౌడ్ కంప్యూటింగ్!! ఈ రంగంలో 2022 నాటికి మిలియన్ ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని తాజా అంచనా. వీటిని అందుకోవాలంటే ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి.. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో కొలువు సొంతమవ్వాలంటే... ఎలాంటి స్కిల్స్ అవసరమో తెలుసుకుందాం..

ఆటోమేషన్.. ‘క్లౌడ్’
వాస్తవానికి దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం నుంచే సాఫ్ట్‌వేర్ సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ విధానంలో తమ క్లయింట్లకు సేవలందించడం ప్రారంభించాయి. ప్రస్తుత ఆటోమేషన్ యుగంలో క్లౌడ్ సేవలను మరింత విస్తృతం చేస్తున్నాయి. ఫలితంగా గత నాలుగేళ్లుగా క్లౌడ్ కంప్యూటింగ్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం భారత క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్ 2.2 బిలియన్ డాలర్లుగా ఉంది. రానున్న రెండేళ్లలో ఏటా 30 శాతం మేరకు పెరుగుదల నమోదు చేసుకుంటూ 2020 నాటికి నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తాజా అంచనా.

క్లౌడ్ కంప్యూటింగ్ అంటే..?
ఎక్కడో సుదూరాన ఉన్న క్లయింట్‌కు ఇంటర్నెట్, ఇతర ఆన్‌లైన్ విధానాల్లో వారికి అవసరమైన సాఫ్ట్‌వేర్ సర్వీసులు (సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్, ప్రోగ్రామింగ్ తదితర) అందించడమే... క్లౌడ్ కంప్యూటింగ్. ఉదాహరణకు ఒక సంస్థ తమ వినియోగదారులకు ఆన్‌లైన్ సేవలందించాలని భావిస్తుందనుకుందాం.. గతంలో సదరు ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు.. ప్రోగ్రామింగ్, కోడింగ్ రాసేందుకు.. క్షేత్రస్థాయిలో వాటిని తమ క్లయింట్ సంస్థ సమర్థంగా అమలు చేసేందుకు వీలుగా ఐటీ కంపెనీలు స్వయంగా కొన్ని రోజులపాటు క్లయింట్ సంస్థలోనే ఉండి అన్ని వ్యవహారాలు సజావుగా పూర్తిచేయాల్సి వచ్చేది. కానీ.. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఇంటర్నెట్ ఆధారంగానే వీటిని అందించే అవకాశముంది. క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రస్తుతం ప్రధానంగా మూడు విధానాలు అమలవుతున్నాయి. అవి.. సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ ఫార్మ్ యాజ్ ఏ సర్వీస్.

సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ :
వాస్తవానికి క్లౌడ్ టెక్నాలజీ పరంగా అత్యంత ప్రాచుర్యం పొందుతున్న విధానం సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇంటర్నెట్ ఆధారంగా సాప్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను ఆన్ డిమాండ్ అందించే విధానం ఇది. ఈ విధానం ప్రకారం వినియోగదారులు, వ్యక్తులు నేరుగా.. ఒక సంస్థ అందించే ఆన్‌లైన్ సేవలు పొందే అవకాశం లభిస్తుంది. గూగుల్ యాప్స్, ఇతర యాప్స్‌నే వీటికి ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఈ విధానంలో ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సదరు సంస్థ అందించే సేవలను వినియోగదారులు నేరుగా పొందొచ్చు. ప్రస్తుతం అన్ని రంగాల్లోని సంస్థలు తమ కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం వేగంగా, సులువుగా, ఆకర్షణీయమైన సేవలు అందించేందుకు క్లౌడ్ టెక్నాలజీస్ కోసం సాఫ్ట్‌వేర్ సంస్థలను సంప్రదిస్తున్నాయి.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ :
క్లౌడ్ కంప్యూటింగ్ విధానాల్లో మరో కీలకమైన విధానం.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సంస్థలు దీనికే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ విధానంలో క్లయింట్ సంస్థలకు అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సదుపాయాలను, సర్వర్స్‌ను, స్టోరేజ్, నెట్‌వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్ తదితర మౌలిక సదుపాయాలను సదరు సేవలు అందించే సంస్థ సిద్ధం చేస్తుంది. వినియోగదారులు కోరినప్పుడు సంబంధిత సేవలను ఇంటర్నెట్ ఆధారంగా అందిస్తుంది. ఒక సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి నెట్‌వర్కింగ్, స్టోరేజ్, కంప్యూటింగ్ వంటి వాటిని ఈ విధానానికి ఉదాహరణగా చెప్పొచ్చు.

ప్లాట్‌ఫామ్ యాజ్ ఏ సర్వీస్ :
క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్‌లో మరో ముఖ్యమైన విధానం.. ప్లాట్‌ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఈ విధానంలో క్లౌడ్ టెక్నాలజీ సేవలను అందించే సంస్థలు.. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సంబంధిత టూల్స్‌ను క్లయింట్ సంస్థలకు ఇంటర్నెట్ ఆధారంగా చేరవేస్తాయి. ఫలితంగా డవలపర్స్ వెబ్‌సైట్స్, మొబైల్ యాప్స్ వంటి వాటిని రూపొందించడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా వాటిని వాస్తవ పరిస్థితుల్లో తమ అవసరాలకు వినియోగించడం సులభమవుతుంది. గూగుల్ యాప్ ఇంజిన్, విండోస్ అజ్యూర్ వంటి వాటిని ఈ విధానానికి ఉదాహరణగా పేర్కొనొచ్చు.

బీటెక్ విద్యార్థులకు మంచి అవకాశం..
2020 నాటికి భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఇదే సమయంలో.. ఆ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు.. నిపుణులైన మానవ వనరుల కోసం ఐటీ సంస్థలు అన్వేషిస్తున్నాయి. దీనివల్ల కంప్యూటర్, టెక్నికల్ నైపుణ్యాలుండే బీటెక్ విద్యార్థులు అవకాశాలు అందుకునే వీలుంది.

సీఎస్‌ఈ, ఈసీఈ విద్యార్థులకు అనుకూలం..
క్లౌడ్ రంగంలో కెరీర్స్ పరంగా బీటెక్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌ల ఉత్తీర్ణులు.. ఇతర కోర్సుల విద్యార్థులతో పోల్చితే కొంత ముందంజలో ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే.. క్లౌడ్ టెక్నాలజీస్‌ను వినియోగిస్తూ అందించే సేవలు.. కొత్తగా రూపొందించే ప్రొడక్ట్‌లు.. సంబంధిత ప్రోగ్రామ్‌లు అన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ నైపుణ్యాల ఆధారంగానే ఉంటాయి. దీంతో అప్పటికే అకడమిక్‌గా ఆయా నైపుణ్యాలపై సీఎస్‌ఈ, ఈసీఈ అభ్యర్థులకు పట్టు ఉంటుందనే ఉద్దేశంతో సంస్థలు ఈ బ్రాంచ్‌ల విద్యార్థులకు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి.

వేతనాలు ఆకర్షణీయం :
క్లౌడ్ టెక్నాలజీస్ రంగంలో ఎంట్రీ లెవల్‌లో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వార్షిక వేతనం లభించనుంది. రెండు నుంచి అయిదేళ్ల అనుభవం ఉన్నవారికి రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల వార్షిక వేతనం లభించే అవకాశముంది. మిడిల్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్‌కు రూ.20 లక్షల వరకు వార్షిక వేతనం ఖాయమని అంచనా. క్లౌడ్ ఆర్కిటెక్ట్స్‌కు నైపుణ్యాలుంటే.. రూ.30 లక్షల వార్షిక వేతనం అందించడానికి సైతం సాఫ్ట్‌వేర్ సంస్థలు ముందుకొస్తున్నట్లు సమాచారం. క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు నిర్దిష్టంగా ఒక ప్రొడక్ట్‌ను డిజైన్ చేయడం మొదలు, దాన్ని డెవలప్ చేయడం, ఆ తర్వాత నిర్వహణ పరంగానూ ఒక ప్రణాళిక రూపొందించే విధంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతం భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ ఆర్కిటెక్ట్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.

క్లౌడ్ కంప్యూటింగ్.. జాబ్ ప్రొఫైల్స్
  • క్లౌడ్ ఆర్కిటెక్ట్
  • క్లౌడ్ బిజినెస్ అనలిస్ట్
  • క్లౌడ్ నెట్‌వర్క్ ఆర్కిటెక్ట్
  • క్లౌడ్ ప్రాజెక్ట్ మేనేజర్
  • క్లౌడ్ ప్రొడక్ట్ మేనేజర్
  • క్లౌడ్ కన్సల్టెంట్
  • క్లౌడ్ సిస్టమ్స్ ఇంజనీర్
  • క్లౌడ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్
  • క్లౌడ్ నెట్‌వర్క్ ఇంజనీర్.
క్లౌడ్ టెక్నాలజీస్, కొలువులు ఐటీ విభాగంలోనే కాకుండా.. నాన్-ఐటీ విభాగంలోనూ కొలువులు లభించనున్నాయి.
ప్రధానంగా క్లౌడ్ సర్వీసెస్ అప్లికేషన్ స్పెషలిస్ట్, బీపీఓ, క్లౌడ్ మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు పొందే వీలుంది.

కీలకం కానున్న ఈ 'స్కిల్స్'...
క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్‌లో కెరీర్ కోరుకునే వారికి కొన్ని టెక్నికల్ స్కిల్స్ అత్యంత కీలకంగా మారనున్నాయి.
అవి...
  • DevOps
  • ప్రోగ్రామింగ్
  • డేటా బేస్ మేనేజ్‌మెంట్
  • లినక్స్ సిస్టమ్ ఆటోమేషన్
  • క్వాలిటీ అష్యూరెన్స్
  • సాఫ్ట్‌వేర్ టెస్టింగ్
  • ప్రాసెస్ స్కిల్
  • కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
  • కాగ్నిటివ్ ఎబిలిటీస్
  • రిసోర్స్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ కూడా అవసరం.
అన్ని రంగాల్లోనూ పెరుగుతున్న క్లౌడ్..
క్లౌడ్ సర్వీసెస్ అంటే ఒక క్లయింట్‌కు ఇంటర్నెట్, ఆన్‌లైన్ ద్వారా ఐటీ సంస్థలు సాఫ్ట్‌వేర్ సేవలు అందించడం. వీటిని ఆధారంగా చేసుకుని క్లయింట్ సంస్థలు తమ వినియోగదారులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తేవడం. ఈ క్రమంలో ప్రస్తుత ఆన్‌లైన్ యుగంలో అన్ని రంగాల్లోనూ క్లౌడ్ ఆధారిత సేవలు విస్తృతమవుతున్నాయి. వీటిలో ఈ-కామర్స్, బ్యాంకింగ్ రంగాలు కొంత ముందంజలో నిలవగా.. ఇతర సర్వీసెస్ సెక్టార్‌లోని సంస్థలు, మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా క్లౌడ్ ఆధారిత సేవలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఫలితంగా ఈ రంగంలో లక్షల సంఖ్యలో కొలువులు పలకరిస్తున్నాయి.

అకడమిక్ నైపుణ్యాలు.. ఇలా సొంతం
అకడమిక్‌గా బీటెక్, ఎంటెక్ స్థాయిలో ఎలక్టివ్, మేజర్ సబ్జెక్ట్‌గా పలు ఇన్‌స్టిట్యూట్‌లు క్లౌడ్ టెక్నాలజీస్‌ను అందిస్తున్నాయి. వీటితోపాటు.. మరెన్నో ప్రముఖ సంస్థలు.. క్లౌడ్ నైపుణ్యాలకు సంబంధించి ప్రత్యేకంగా సర్టిఫికేషన్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. అవి..
  • ఐబీఎం సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ నాలెడ్జ్
  • హెచ్‌పీ ఎక్స్‌పర్ట్ వన్ క్లౌడ్ సర్టిఫికేషన్
  • వీఎం వేర్ క్లౌడ్ సర్టిఫికేషన్
  • ఈఎంసీ క్లౌడ్ ఆర్కిటెక్ట్
  • ఈఎంసీ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్
  • ఈఎంసీ వర్చువలైజ్డ్ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్టిఫికేషన్
Published date : 15 Dec 2018 02:20PM

Photo Stories