Skip to main content

ఏఐ, బిగ్‌డేటా విభాగాల్లో...2 లక్షలకుపైగా ఉద్యోగాలు

ప్రస్తుతం ప్రపంచమంతా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వైపు పరుగులు పెడుతోంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ.. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), బిగ్‌డేటా అవసరం పెరుగుతోంది. ఎక్స్‌పెరిస్ ఐటీ ఎంప్లాయిస్ అవుట్‌లుక్ (ఈఐటీఈఓఎస్) తాజా సర్వే ప్రకారం-రానున్న రెండేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడనుంది. భవిష్యత్‌లో సదరు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత అధికంగా ఉంటుందని సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా విభాగాల్లో అందివస్తున్న అవకాశాలపై ప్రత్యేక కథనం...
2లక్షల ఉద్యోగాలు:
పస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఐటీ నియామకాలు తగ్గినట్లు ఈఐటీఈఓఎస్ సర్వే వెల్లడించింది. రాబోయే 6 నెలల్లోను నియామకాల్లో 5 శాతం తగ్గుదల ఉంటుందని పేర్కొంది. ఇందుకు నైపుణ్యం కలిన మానవ వనరుల కొరతప్రధాన కారణమని తెలిపింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 53.41 శాతంగా ఉన్న పోస్టుల భర్తీ.. అక్టోబర్ నుంచి 2020 మార్చి నాటికి 47.54 శాతానికే పరిమితమయ్యే ఆస్కారముందని స్పష్టం చేసింది. మరోవైపు 2021 నాటికి నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా విభాగాల్లో 2లక్షలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని సర్వే అంచనావేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) :
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొదట ప్రయోగించింది జాన్ మెక్‌కార్తి అనే సైంటిస్ట్. కంప్యూటర్ ఆధారిత ప్రతి పనికి ఒక్కో ప్రోగ్రామ్ అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రోగ్రాములు పరిస్థితులకు అనుగుణంగా మారలేవు. పనికి సంబంధించిన మార్పులకు అనుగుణంగా మారడం, మనిషిలాగా నేర్చుకోవడం, సొంత ఆలోచనను ఉపయోగించడమే కాకుండా.. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో, పనిచేస్తాడో.. ఒక యంత్రం కూడా అదేవిధంగా సొంత ఆలోచన కలిగి ఉండేలా చేయడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఉదాహరణకు రోబో సినిమాలో రజినీ కాంత్ తయారు చేసిన చిట్టి(రోబో) లాంటిది. వాయిస్ కమాండ్‌తో పనిచేసే వ్యవస్థలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భాగమే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో ఉత్పత్తులను మెరుగుపర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

బిగ్ డేటా :
ప్రస్తుతం ఎలాంటి సమాచారం కావాలన్నా... మొదట మనందరికీ గుర్తొచ్చేది.. గూగుల్! గూగుల్‌లో మనకు కావాల్సిన అంశం టైప్ చేయగానే కుప్పలు తెప్పలుగా సమాచారం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. మరి ఇదంతా ఎలా వస్తుంది? ఇంత డేటాను ఎలా స్టోర్ చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే... బిగ్‌డేటా! దీనిపై పనిచేసే వారే బిగ్‌డేటా అనలిస్టులు. కుప్పలు తెప్పలుగా ఉన్న సమాచారాన్నంతటినీ క్రమ పద్ధతిలో అమర్చి, వినియోగ దారులకు అనుకూలంగా మార్చే కీలక ప్రక్రియను బిగ్‌డేటా అనలిటిక్స్ అంటారు. ఇందులో స్ట్రక్చర్డ్, అన్ స్ట్రక్చర్డ్ అని రెండు రకాల డేటా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల సాఫ్ట్‌వేర్ సంస్థలు నిత్యం ఈ డేటాను క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి.

డిజిటల్ యుగం :
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ వేగంగా మారిపోతోంది. రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. దాంతో ప్రపంచంలోని చాలా దేశాలు సమాచార, సాంకేతిక భద్రతకు; వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో వృద్ధిని సాధించడానికి ఏఐ, బిగ్‌డేటాను ఉపయోగించుకుంటున్నాయి.

కోర్సులు :
  • ఏఐ, రోబోటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులు ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో చేరితే మంచిది. ప్రస్తుతం మన దేశంలో చాలా ప్రభుత్వ, ప్రైవేటువిద్యాసంస్థలు ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కోర్సులు అందిస్తున్నాయి. బీటెక్ తర్వాత ఉన్నత విద్య పరంగా ఎంటెక్/ఎంఈలో చేరే వీలుంది.
  • ఐఐటీ ఖరగ్‌పూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఆరునెలల సర్టిఫికెట్ కోర్సు అందిస్తోంది. అదేవిధంగా ఐఐటీ హైదరాబాద్.. బీటెక్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఒక సబ్జెక్టుగా చేర్చింది. ఐఐటీ బెంగళూర్, ఐఐటీ బాంబే, ఐఎస్‌ఐ కోల్‌కతా, సీడాక్ ముంబైలు పీజీ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఉద్యోగావకాశాలు..
  • ప్రస్తుతం ఆర్టిఫిషియల్, బిగ్‌డేటా ఇంజనీర్లకున్న డిమాండ్ నేపథ్యంలో.. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఐబీఎమ్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ సంస్థలు ఏఐ, బిగ్‌డేటా ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి.
  • అలాగే ఫార్మా, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, మొబైల్ కంపెనీలు సైతం ఏఐ ఇంజనీర్లను ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నాయి.

విధులు :
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేయాలంటే.. ఆలోచనాశక్తి, విశ్లేషణాత్మక పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, టీమ్ వర్క్, ఓర్పు, నేర్పుతోపాటు తాజా అవిష్కరణలపై అవగాహన కలిగి ఉండాలి. అవసరమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను రూపొందించడం, సాంకేతిక సమస్యలను పరిష్కరించడంపై పట్టుసాధించాలి!!
Published date : 07 Nov 2019 12:16PM

Photo Stories