Skip to main content

కామర్స్‌తో.. కోరుకునే కొలువులెన్నో..

గ్లోబలైజేషన్‌తో వ్యాపార, వాణిజ్య రంగాల్లో వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విదేశీ కంపెనీల రాక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో.. ఎగుమతులు, దిగుమతులు, ట్రేడింగ్, స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి వాటిలో కార్యకలాపాలు పెరిగాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న కంపెనీలు మాల్స్ నుంచి ఈ-కామర్స్‌లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో ఆయా రంగాల్లో నిపుణుల కోసం కంపెనీలు జల్లెడపడుతున్నాయి. కామర్స్ కోర్సుల విద్యార్థులకు కంపెనీలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులకు దీటుగా కామర్స్ కోర్సుల ఉత్తీర్ణులకూ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల్లో బీకాం, ఎంకాం కోర్సుల సీట్లన్నీ వంద శాతం భర్తీ కావడమే ఈ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం. ఈ నేపథ్యంలో నగరంలో కామర్స్ కోర్సులను అందించే విద్యా సంస్థలు, అర్హతలు, అవకాశాలపై ఫోకస్...

కామర్స్.. స్పెషలైజేషన్లు
కామర్స్ అనగానే ఇంటర్ స్థాయిలో సీఈసీ, ఎంఈసీ. డిగ్రీ స్థాయిలో మూడేళ్ల వ్యవధిలో బీకాం(జనరల్), బీకాం (కంప్యూటర్స్) మాత్రమే గుర్తొచ్చేవి. కానీ మారుతున్న జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపారాలకు అనుగుణంగా ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అవసరమైన కాంబినేషన్స్‌ను యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్నాయి. బీకాం-మార్కెటింగ్, బీకాం-ఫారెన్‌ట్రేడ్, బీకాం -కార్పొరేట్ సెక్రటరీషిప్, బీకాం-ఫైనాన్స్, అకౌంటెన్సీ, బీకాం-ఒకేషనల్, బీకాం-బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, బీకాం-ఈ-కామర్స్, బీకాం-ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, బీకాం-అకౌంట్స్(ఆనర్స్), బీకాం-సేల్స్‌మెన్‌షిప్, అడ్వర్‌టైజింగ్, బీకాం-ట్యాక్స్ ప్రొసీజర్ ఇలా ఎన్నో కొత్త కాంబినేషన్లను దేశంలో ఆయా విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఇంటర్మీడియట్ అర్హతతో ప్రవేశం పొందే అండర్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు. పీజీ స్థాయిలో ఎంకాం-ఫైనాన్స్, ఎంకాం-మార్కెటింగ్, ఎంకాం -ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా మరెన్నో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను వివిధ విద్యా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రొఫెషనల్ కోర్సుల్లో మంచి ఉద్యోగావకాశాలు అందిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ వంటివి ఉన్నాయి.

ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచే కామర్స్ ల్యాబ్స్
బీకాం కరిక్యులంలో కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్‌సైన్స్‌తోపాటు.. అడ్వర్టయిజింగ్, సేల్స్ మేనేజ్‌మెంట్, ఫారెన్‌ట్రేడ్ ప్రాక్టీసెస్ వంటివాటిని విద్యార్థులు తెలుసుకునేందుకు కళాశాలలు కామర్స్ ల్యాబ్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలలో జరిగే అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు; పన్నులు, సుంకాలు తదితర విషయాలపై అవగాహన పెంచేందుకు విద్యార్థులకు వేసవి క్యాంపులు నిర్వహిస్తున్నామని విల్లామేరీ కామర్స్ విభాగ అధిపతి రేవతిమాధుర్ తెలిపారు. మూడేళ్ల బీకాం కోర్సులో కేవలం బోధనకే పరిమితం కాకుండా ఆఖరి సంవత్సరంలో ప్రాక్టికల్స్, ప్రాజెక్టు వర్క్‌ను తప్పనిసరి చేశామని చెప్పారు.. కోఠి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీత. ఇలా విద్యార్థులు.. ఉద్యోగిగా అడుగుపెట్టకముందే కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలను సొంతం చేసుకుంటారని నిపుణులు అంటున్నారు. ఓయూలో ఎంకాం స్థాయిలో ఒక సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్‌కు 100 మార్కులను కేటాయించారు. అదేవిధంగా ఎంకాం (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్)లో 60 శాతం ప్రాక్టికల్స్, 40 శాతం థియరీని ప్రవేశపెట్టారు. నూతన ధోరణులకనుగుణంగా ఈ-బిజినెస్‌కు అవసరమైనట్లుగా ఐటీలో విద్యార్థులకు ల్యాబ్స్ ద్వారా ప్రాక్టికల్ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఈ-అకౌంటింగ్, ఈ-కార్పొరేట్, ఈ-ఫైనాన్షియల్, సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలను అందిస్తున్నారు.

నిపుణులకు అవకాశాలు అనేకం
కామర్స్‌లో గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సులు పూర్తిచేసినవారికి కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఏడాది నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ నుంచి 13 మంది విద్యార్థులు అమెజాన్ కంపెనీ అందించే ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారు. వారిలో 12 మంది బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్నవారే కావడం విశేషం. కామర్స్ గ్రాడ్యుయేట్స్‌కు కంపెనీలు.. అకౌంటింగ్, ఆడిటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, స్టాక్‌మార్కెట్, ట్రేడింగ్ విభాగాల్లో ఏడాదికి రూ.2.5 లక్షల వరకు అందిస్తున్నాయి.

ఇవికాకుండా ఈ-బ్యాంకింగ్, ఈ-అకౌంటింగ్, ఈ- ఇన్సూరెన్స్ రంగాల్లో పనిచేయడానికి అకౌంటెంట్స్, ఎగ్జిక్యూటివ్స్, కరెన్సీ అండ్ బ్యాంకింగ్ ఎక్స్‌పర్ట్స్, బిజినెస్ ఎనలిటిక్స్ నిపుణులు భారీ స్థాయిలో అవసరం. హెల్త్, ఐటీ, ఫార్మా సెక్టార్‌లో అకౌంటెంట్స్, అనలిస్టులుగా కంపెనీలు కామర్స్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా మంచి వేతనాలు కూడా అందిస్తున్నాయి. ప్రారంభంలో నెలకు రూ.20,000 వరకు వేతనం ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ.45,000 వరకు సంపాదించుకోవచ్చు.

కోర్సులను అందించే సంస్థలు
నగరంలో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవే ట్ కళాశాలల్లో బీకాం (ఆనర్స్), బీకాం (జనరల్), బీకాం (కంప్యూటర్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం- కాలేజ్ అందించే కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. డిస్టెన్స్ విధానంలో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా, ఇగ్నో తదితర సంస్థలు మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ఇవేకాకుండా దేశంలో మరెన్నో విద్యాసంస్థలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) కోర్సును ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (www.icaihyd.org ), కంపెనీ సెక్రటరీ(సీఎస్) కోర్సు(www.icsi.edu/hyderabad ), కాస్ట్ అకౌంటెంట్ కోర్సును ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా(icmai.in/ ) అందిస్తున్నాయి.

చదువుకయ్యే ఖర్చు తక్కువే..
‘‘ఆరేళ్లలో ఇంటర్, డిగ్రీ, సీఏ మూడింట్లోనూ ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్న్‌షిప్ కోసం పనిచేసిన సంస్థే వార్షిక వేతనం రూ.10 లక్షలు ఆఫర్ చేసింది. కానీ.. నాకు టీచింగ్ అంటే ఇష్టం. ఆ ల క్ష్యంతోనే స్నేహితులతో కలిసి సీఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించా. సీఏ పూర్తిచేసేందుకు అయిన ఖర్చు కేవలం రూ.20 వేల లోపే. రెండో సంవత్సరం నుంచి ఆడిటర్ వద్ద, సంస్థలో ఇంటర్న్‌షిప్, పార్ట్‌టైం జాబ్ చేయడం వల్ల పేరెంట్స్‌పై భారం పడలేదు. తక్కువ ఖర్చుతో చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సును పూర్తిచేశా. కోర్సుకు అయ్యే ఖర్చును ఉద్యోగంలో చేరాక ఏడాదిలో సంపాదించుకోవచ్చు’
నేహా, డెరైక్టర్, ప్రాజెక్ట్ ప్రిఫిక్స్


నిపుణులకు మంచి ప్యాకేజీ
‘‘సమాజంలో ఆర్థిక కార్యకలాపాలు సాగినంత కాలం వాణిజ్యశాస్త్ర నిపుణుల అవసరం ఉంటుంది. క్రయవిక్రయాలు, మనీ ట్రాన్సాక్షన్స్, లాభనష్టాలు ఇవన్నీ కామర్స్‌తో ముడిపడినవే. అందుకే కామర్‌‌సకు అంతటి డిమాండ్. మార్కెట్ పరిస్థితులను అంచనా వేయాలంటే విశ్లేషణ చేయగలగాలి. భవిష్యత్తుల్లో క్రయవిక్రయాలను పరిశీలించాలన్నా అనలిటిక్స్‌పైనే ఆధారపడాలి. మారిన ఈ-కామర్స్ ట్రెండ్‌లోనూ అకౌంటింగ్స్‌దే కీలకపాత్ర. బ్యాంకింగ్, ఫైనాన్స్, ట్రేడింగ్, స్టాక్‌మార్కెట్ ఇలా కార్పొరేట్ రంగంలోనే కాదు.. ప్రభుత్వ రంగంలోనూ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆడిటర్స్‌ను ఎంపికచేస్తున్నారు. మున్సిపాలిటీల్లో సీనియర్, జూనియర్ అకౌంటెంట్స్, ఆడిటర్స్‌గా, బీఎస్‌ఎన్‌ఎల్, బీహెచ్‌ఈఎల్, ఏపీ ట్రాన్స్‌కో, రైల్వే, ఆర్టీసీ ఇలా వాణిజ్య కార్యకలాపాలు జరిగే అన్ని విభాగాల్లోనూ కామర్స్ గ్రాడ్యుయేట్స్‌కు అవకాశాలున్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ రంగాలు గ్రామీణ ప్రాంతాలకు చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నాయి. దీనికోసం నిపుణులైన మానవ వనరులపైనే ఆధారపడాలి. గతంతో పోల్చితే కామర్స్ చదివిన వారు కేవలం అకౌంటెంట్‌గానే మిగిలిపోవట్లేదు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదుగుతున్నారు. అయితే ఈ రంగంలో రాణించాలంటే కావ్సాలింది.. మంచి కమ్యూనికేషన్‌స్కిల్స్, వర్తమాన అంశాలపై అవగాహన, స్టాటిస్టికల్, అనలిటికల్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పట్టు. ఇవన్నీ కాలేజీలో ఉన్నప్పుడే అలవరుచుకోవాలి. సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే టెక్ట్స్‌బుక్స్‌ను ఫాలో అవ్వాలి. ప్రాజెక్టువర్క్‌ను నిజాయతీగా చేయాలి. విద్యార్థులు తమ క్యాంపస్‌లోని కామర్స్ ల్యాబ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి. నిపుణులుగా సబ్జెక్టును ఆకళింపు చేసుకోగలిగి, ప్రాక్టికల్‌గా అప్లై చేయగలిగే సామర్థ్యం సంపాదిస్తే లక్షల్లో వేతనాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి’’
ప్రొఫెసర్ మహ్మద్ అక్బర్ అలీఖాన్, డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఓయూ
Published date : 27 Sep 2014 06:30PM

Photo Stories