Skip to main content

ఈ ఆర్థిక మాంద్యంలో..ఉద్యోగాన్ని కాపాడుకోవ‌డం ఎలా..?

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఛాయలు. మన దేశ ఆర్థిక రంగంలోనూ కనిపిస్తున్న ఒడిదుడుకులు.

 ప్రపంచ ఆర్థిక వ్యవ‌స్థను క‌రోనావైర‌స్ అతలాకుతలం చేసున్న నేప‌థ్యం...ప్రముఖ కంపెనీలు త‌మ ఉద్యోగుల‌ను తొల‌గించే ప్రక్రియ ప్రారంభ‌మైంది. ప్రస్తుతం ఉద్యోగుల ప‌రిస్థితి ములిగే న‌క్కపైన తాటికాయ పడే విధంగా త‌యారైంది. ఆటోమొబైల్, ఉత్పత్తి రంగాల్లో ఇప్పటికే ప్రతికూల పరిస్థితులు! తరిగిపోతున్న కొలువులు!! ఆటోమొబైల్ దిగ్గజం మారుతి మొదలు.. ప్రముఖ ఐటీ కంపెనీ ఐబీఎం వరకూ.. ఉద్యోగాల కోత మొదలైంది! ఇదే బాటలో మరికొన్ని సంస్థలు! ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, నిరుద్యోగుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఒకవైపు ఉన్న ఉద్యోగం కాపాడుకోవాలనే తపన.. మరోపక్క కొత్త కొలువు దక్కుతుందా లేదా అనే కలత!! ఈ నేపథ్యంలో ఉద్యోగాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం.. ఉద్యోగంలో మనుగడ సాగించేందుకు మార్గాలు.. కొత్తగా కొలువు సొంతం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం...
            ఆర్థిక మాంద్యం, జీఎస్‌టీ ప్రభావం, వ్యయాలు తగ్గించుకోవాలనే కంపెనీల ఆతృతల కారణంగా ఉద్యోగాల్లో కోతలు మొదలయ్యాయి. ఆయా కంపెనీల్లో సిబ్బంది తొలగింపునకు సంబంధించిన వార్తలతో ఉద్యోగుల్లో, నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొలువుల్లో ఉన్నవారికి సంస్థలో మనుగడ సాగించడం ఎలా? అనేది ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడం ఎలా? అనే సందేహం కొత్తగా పట్టాలతో బయటకు వస్తున్న అభ్యర్థులను వెంటాడుతోంది. కోతల కాలంలో కొలువులో నిలదొక్కుకునేందుకు, ఉద్యోగ సాధనలో ముందుండేందుకు తమ రంగాలకు సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ సొంతం చేసుకోవడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే ఉద్యోగులు, నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.

తయారీ టు ఐటీ :
ఆర్థిక మాంద్య పరిస్థితులు కనిపిస్తుండటంతో ఉత్పత్తి రంగంలోని సంస్థలు మొదలు ఉద్యోగుల స్వప్న సౌధంగా నిలిచే ఐటీ సెక్టార్ వరకు కోతలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఉత్పత్తి రంగం, సర్వీసెస్ విభాగాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవైపు వస్తు సేవలకు డిమాండ్ తగ్గుతుంటే.. మరోవైపు ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటంతో కంపెనీలు ఖర్చులు నియంత్రించుకునేందుకు సిబ్బందిని తొలగిస్తున్నాయి.

ఐటీ సంస్థలు కొంత ఫర్వాలేదు.. కానీ..
ఉద్యోగాల కోతల పరంగా ఐటీ సంస్థలు కొంత మేరకు ఫర్వాలేదని చెప్పొచ్చు. విదేశాల్లో ప్రధాన కార్యాలయాలు ఉండి.. మన దేశంలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐబీఎం, సిస్కో, కాగ్నిజెంట్ వంటి సంస్థలను మినహాయిస్తే.. ప్రస్తుతానికి ఐటీ రంగంలో.. ఆందోళన చెందే స్థాయిలో పింక్ స్లిప్‌లు లేవని చెబుతున్నారు. అయితే సాఫ్ట్‌వేర్ కంపెనీలు సైతం ఆటోమేషన్, ఐఓటీ బాటపడుతుండటంతో టెక్‌జాబ్ రోల్స్‌లో కోతలు, నూతన నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరించే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఐటీ ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం... తాము నేర్చుకున్న నూతన నైపుణ్యాలను సంస్థ ఉన్నతాధికారులకు తెలియజేయడం.. పనితీరులో నూతనత్వాన్ని ప్రదర్శించడం ద్వారా ఉద్యోగ భద్రత పొందొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. అందుకోసం ఆటోమేషన్, ఐఓటీ, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సర్వీసెస్ వంటి విభాగాల్లో తాజా నైపుణ్యాలు సొంతం చేసుకోవడం ఉద్యోగ వేటలో మేలు చేస్తుంది.

ఆటోమొబైల్ రంగంలో సంక్షోభం :
ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభానికి గురవుతోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగాలు పోయినట్లు వార్తలొస్తున్నాయి. రానున్న రెండేళ్లలో ఈ రంగంలో దాదాపు మూడు లక్షల మేరకు శాశ్వత ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడనుందని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ మనుగడ, నూతన ఉద్యోగ సాధన పరంగా కొత్త నైపుణ్యాలే కొండంత అండగా నిలవనున్నాయి. రోబోటిక్స్, 3-డి డిజైన్ ప్రింటింగ్ వంటి అంశాల్లో మంచి నైపుణ్యాలతో మనుగడ సాగించేందుకు అవకాశముంది.

సర్వీస్ సెక్టార్‌లో రాణించాలంటే..
సేవల రంగాలుగా భావించే బ్యాంకింగ్, రిటైల్ సంస్థల్లో కూడా కోతలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్, టెక్ జాబ్ రోల్స్‌లోని సిబ్బందిని కంపెనీలు తొలగిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు నిలదొక్కుకోవాలంటే.. టెక్ జాబ్ రోల్స్ పరంగా ఆటోమేషన్ నైపుణ్యాలను, కస్టమర్ సపోర్ట్ విభాగాల వారు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ స్కిల్స్, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం వంటి వాటిపై పట్టు సాధించాలి. అలాగే కొత్తగా కొలువుల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు కూడా ఆయా స్కిల్స్ పెంచకోవడం ద్వారా ఉద్యోగాన్వేషణలో ముందు నిలిచే వీలుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో సర్వీస్ సెక్టార్, రిటైల్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని సంస్థలు.. ఆన్‌లైన్ కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాంతో ఆన్‌లైన్ మార్కెటింగ్,బ్రాండింగ్ అంశాలకు సంబంధించి ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎంలలో నైపుణ్యాలు ఇటు ఉద్యోగులకు, అటు ఉద్యోగార్థులకు భరోసా కల్పించనున్నాయి.

ఫ్రీలాన్సర్స్ వైపు సంస్థల చూపు :
వ్యయ నియంత్రణ కోసం ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థలు.. అదే సమయంలో ఫ్రీలాన్స్ విధానంలో నిపుణుల సేవలను పొందాలని భావిస్తున్నాయి. ఆయా రంగాల్లో అప్పటికే మంచి అనుభవం, నైపుణ్యం సంపాదించిన వారిని సంప్రదిస్తున్నాయి. నిర్దిష్ట వ్యవధికి, లేదా ఒక ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఫ్రీలాన్స్ సేవలు పొందడం ద్వారా శాశ్వత నియామకాల వల్ల కలిగే ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందాలనే ఆలోచన చేస్తున్నాయి. కాబట్టి కొంత అనుభవంతో కొలువు కావాలనుకునే వారు.. తమ నైపుణ్యాలను తెలియజేస్తూ.. ఫ్రీలాన్స్ విధానంలో పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ సదరు సంస్థలను సంప్రదించొచ్చు. ఫలితంగా భవిష్యత్తులో ఆయా కంపెనీల్లో శాశ్వత ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు మార్గం ఏర్పడుతుంది.

ఉద్యోగాన్వేషణ.. కత్తి మీద సాము :
ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో నూతన నియామకాల పరంగా కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాన్వేషణ కత్తి మీద సాములా మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌కు అవకాశం లేని కాలేజీలు, సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన విద్యార్థుల పరిస్థితి కొంత గడ్డుగానే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలతోపాటు నెట్‌వర్కింగ్ పెంచుకోవడం, పర్సనల్ బ్రాండింగ్ చేసుకోవడం ద్వారా కంపెనీల దృష్టిలో పడితే సానుకూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

పర్సనల్ బ్రాండింగ్ :
బ్రాండింగ్.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వస్తువలకే కాకుండా.. వ్యక్తులకు కూడా అత్యంత కీలకంగా మారింది. కాబట్టి ఉద్యోగార్థులు తమ సామర్థ్యాలను, నైపుణ్యాలను బ్రాండింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం రెజ్యూమెలో తమ నైపుణ్యాలు హైలెట్ అయ్యే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా క్యాంపస్ లైఫ్‌లో తాము అకడమిక్‌గా, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పరంగా ఎంత చురుగ్గా ఉన్నామో తెలియజేయడం కూడా లాభిస్తుంది. అదే విధంగా తాము చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ వల్ల సంస్థలకు కలిగిన ప్రయోజనాలు తెలిసేలా చేయాలి.

సోషల్ నెట్ వర్కింగ్ :
తమ ప్రొఫైల్ ఆయా రంగాల్లోని నిపుణుల దృష్టిలో పడేలా సోషల్ నెట్ వర్కింగ్‌ను ఉపయోగించుకోవాలి. లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమాల ద్వారా ఆయా రంగాల్లోని నిపుణులతో సంప్రదిస్తుండాలి. నిపుణులు ఇచ్చే సలహాలు పాటిస్తుండాలి. సంబంధిత రంగాల్లోని తాజా పరిణామాలపై నిపుణులు వ్యక్తంచేసే అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా.. జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు.

జాబ్ సెర్చ్ పోర్టల్స్ :
ఉద్యోగార్థులకు ఉపయోగపడే మరో ముఖ్య మాధ్యమం.. జాబ్ సెర్చ్ పోర్టల్స్. అభ్యర్థులు ప్రొఫెషనల్ జాబ్ సెర్చ్ పోర్టల్స్‌లో తమ రెజ్యూమెలను, ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. సదరు రంగానికి అవసరమైన స్కిల్స్ తమలో ఉన్నాయని తెలిపే విధంగా వ్యవహరించాలి. తమ ప్రొఫైల్‌ను నిరంతరం అప్‌డేట్ చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. చాలామంది ఒకసారి ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాక.. దాని గురించి పట్టించుకోరు. అలాకాకుండా ఎప్పటికప్పుడు ప్రొఫైల్ అప్‌డేట్ చేస్తుండాలి. అదనంగా కొత్తగా శిక్షణ తీసుకున్న విభాగాలు, నైపుణ్యాలు ప్రొఫైల్‌కు చేర్చడం ద్వారా కంపెనీల దృష్టిని ఆకర్షించొచ్చు.

వెబ్‌సైట్స్‌లోనూ రెజ్యూమె అప్‌లోడ్ :
పలు సంస్థలు తమ సొంత వెబ్‌సైట్స్ ద్వారానే ఖాళీల వివరాలను, నియామకాల సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. అభ్యర్థులు తాము చదువుకున్న రంగానికి సంబంధించిన సంస్థల వెబ్‌సైట్స్‌లోని కెరీర్స్ లింక్‌లో/కరెంట్ ఆపర్చునిటీస్ లింక్‌లో తమ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసుకోవాలి. కొన్ని సంస్థలు ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు, నియామకాలు లేకపోయినా.. భవిష్యత్తు నియామకాల కోసం రెజ్యూమె అప్‌లోడ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఇంటర్న్‌షిప్ సాధనంగా..
అకడమిక్ కరిక్యులంలో భాగంగా ఇంటర్న్‌షిప్ చేసిన అభ్యర్థులు.. దాన్నే సాధనంగా చేసుకోవాలి. సదరు సంస్థలోని ఉన్నతాధికారుల సాయం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఇంటర్న్‌షిప్ సమయంలో పనిచేసిన టీమ్‌లోని సభ్యులతో టచ్‌లో ఉంటూ.. కొత్త అవకాశాలు, స్కిల్స్ గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. ఇటీవల కాలంలో సంస్థలు.. తాము చేపట్టే నియామకాలకు సంబంధించి సరైన వ్యక్తులను సూచించాలని తమ సీనియర్ ఉద్యోగులను అడుగుతున్నాయి. దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్లు, స్నేహితులు తమను రిఫర్ చేసేలా ప్రయత్నం చేయాలి.
- ఇలా.. అన్ని రకాల మార్గాల ద్వారా ఉద్యోగాన్వేషణ సాగించడం ద్వారా ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు.

మాంద్యం.. అనుసరించాల్సిన వ్యూహాలు
  • ఆటోమేషన్ నైపుణ్యాలు పెంచుకోవాలి.
  • బిగ్‌డేటా, డేటా అనలిటిక్స్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ, 3-డి డిజైన్, రోబోటిక్స్ తదితర అంశాల్లో శిక్షణ పొందాలి.
  • సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలి.
  • ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్ వర్క్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
  • సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా పర్సనల్ బ్రాండింగ్ చేసుకోవాలి.
క్లిష్ట పరిస్థితులే..
ప్రస్తుతం మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్, ఫ్రెషర్స్ పరంగా ఉద్యోగం సొంతం చేసుకోవడం కొంత క్లిష్టంగానే ఉంది. ఈ ఏడాది చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తమ కోర్సు పూర్తయ్యే సమయానికి ఉద్యోగావకాశాలు కొంత తక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది.
- పి.ఎస్.విశ్వనాథ్, సీఎఫ్‌ఓ, ర్యాండ్‌స్టాండ్ ఇండియా.

కొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ సాధనలో ముందంజలో నిలవాలంటే.. విద్యార్థులు కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. అన్ని రంగాల్లోనూ ఆటోమేషన్ ఆధారిత కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన అంశాల్లో శిక్షణ పొందడం మేలు చేస్తుంది. చివరి సంవత్సరం అభ్యర్థులు ఇప్పటి నుంచే ఈ దిశగా కృషిచేసి కోర్సు పూర్తిచేసుకునే సమయానికి రెజ్యూమెలో ఆయా నైపుణ్యాలను పొందుపరచాలి. తద్వారా ఉద్యోగ సాధనలో ముందంజలో నిలిచే ఆస్కారముంది.
- సుధీర్ నాయర్, డెరైక్టర్, సిస్కో ఇండియా.
Published date : 19 Sep 2019 03:10PM

Photo Stories