Skip to main content

సంస్థ - ప్రజల మధ్య వారధి.. పీఆర్‌ఓ

పీఆర్‌ఓ ఒక సంస్థ మార్కెట్‌లో నిలదొక్కుకొని, నాలుగు కాలాలపాటు తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ప్రజల్లో దానికి ఒక గుర్తింపు రావాలి. ఆ గుర్తింపును తెచ్చిపెట్టే ఉద్యోగి ప్రజా సంబంధాల అధికారి(పీఆర్‌ఓ). అంటే సంస్థ -ప్రజలకు నడుమ వారధి లాంటి వ్యక్తి.. పీఆర్‌ఓ. సంస్థ కార్యకలాపాలను, పనితీరును, ఉత్పత్తులను, వాటి నాణ్యతను ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో ప్రజలకు చేరవేసి, సంస్థ మనుగడను కాపాడే నిపుణుడు.. పీఆర్‌ఓ. ఆధునిక కార్పొరేట్ యుగంలో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. పబ్లిక్ రిలేషన్స్...

పీఆర్‌ఓలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అన్ని కార్పొరేట్ సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు, ప్రముఖ కంపెనీలు, యాడ్ ఏజెన్సీలు ప్రజా సంబంధాల అధికారులను తప్పనిసరిగా నియమించు కుంటున్నాయి. ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పీఆర్‌ఓ.. తాను పనిచేస్తున్న సంస్థ గురించి వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. సంస్థలో జరిగే కార్యక్రమాలు, సదస్సులపై సమాచారాన్ని ప్రెస్‌నోట్ల రూపంలో ప్రసార మాధ్యమాలకు అందజేయాలి. అవి ప్రజలకు చేరేలా చూడాలి. ప్రెస్‌మీట్లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పీఆర్‌ఓలకు మీడియాతో మంచి సంబంధాలు ఉండాలి.

పీఆర్‌ఓలో కెరీర్‌లో రాణించాలంటే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కనీసం మూడు భాషల్లో మంచి పట్టు ఉండాలి. సృజనాత్మకత, సహనం, పట్టుదల అవసరం. ప్రాపంచిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. ఈ రంగంలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు సమయంతో నిమిత్తం లేకుండా పగలూరాత్రి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ సమయంలోనైనా విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలి.

అర్హతలు
మనదేశంలో పబ్లిక్ రిలేషన్స్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. కొన్ని సంస్థలు జర్నలిజం కోర్సులో ఒక సబ్జెక్టుగా పబ్లిక్ రిలేషన్స్‌ను బోధిస్తున్నాయి. ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖలో చేరాలంటే డిగ్రీ ఉండడం అవసరం.

వేతనాలు
కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీలో పీఆర్‌ఓలకు మంచి వేతనాలు అందుతున్నాయి. యాడ్ ఏజెన్సీలో చేరితే ప్రారంభంలో నెలకు రూ.8 వేలు అందుకోవచ్చు. పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలో అయితే ప్రారంభంలో రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత సీనియారిటీని బట్టి వేతనాల్లో పెరుగుదల ఉంటుంది. సొంతంగా పీఆర్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే రూ.లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు.

పబ్లిక్ రిలేషన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
  • డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.braou.ac.in/
  • ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్
    వెబ్‌సైట్:
    dcac.du.ac.in/
  • కమలా నెహ్రూ కాలేజీ
    వెబ్‌సైట్:
    www.knc.edu.in/
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-ఢిల్లీ
    వెబ్‌సైట్:
    www.iimc.nic.in/
  • భారతీయ విద్యా భవన్-ఢిల్లీ
    వెబ్‌సైట్:
    www.bvbdelhi.org/
  • వైఎంసీఏ-న్యూఢిల్లీ
    వెబ్‌సైట్:
    www.newdelhiymca.in/
కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టుబడి
‘‘కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పీఆర్‌ఓగా మంచి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేయగలిగే ఓర్పు పీఆర్‌ఓలకు ఉండాలి. ప్రస్తుతం విద్యాసంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు కస్టమర్ల అభిరుచులను తెలుసుకునేందుకు సర్వేలను నిర్వహించేందుకు పీఆర్ సంస్థలపైనే ఆధారపడ్డాయి. గ్లోబలైజేషన్ నేపథ్యంతో ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు. దీనికి జర్నలిజం కోర్సు కూడా పూర్తిచేస్తే అదనపు అర్హత చేకూరినట్లే’’
ప్రొఫెసర్ బి.బాలస్వామి, జర్నలిజం విభాగ అధిపతి,
ఉస్మానియా విశ్వవిద్యాలయం
Published date : 17 Jul 2014 01:10PM

Photo Stories