Skip to main content

ఫుడ్ టెక్నాలజీ - పుష్కల అవకాశాలు

పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరల్లో... కాలాన్ని బట్టి వ్యత్యాసాలు ఉంటాయి. దీనివల్ల అటు వినియోగదారులు.. ఇటు ఉత్పత్తిదారులు (రైతులు).. నష్టపోతున్నారు. దీనికి పరిష్కారమే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్!! అన్ని కాలాల్లోనూ తాజా పండ్లు, కూరగాయలు లభ్యమవ్వాలన్నా.. మార్కెట్ ఒడిదుడుకు లను అరికట్టి... అందరికీ నాణ్యమైన, పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలన్నా... ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల అవసరం ఎంతో ఉంది!  భవిష్యత్ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న ఫుడ్ టెక్నాలజీ కోర్సుపై... ఈ వారం కెరీర్ గైడెన్స్..

ప్రస్తుతం ఆహార పదార్థాలకు పెద్దగా కొరతలేదు. కానీ భవిష్యత్తులో ఆహార సంక్షోభం తలెత్తే ఆస్కారాన్ని కాదనలేం. ఎందుకంటే... జనాభా నానాటికీ పెరుగుతోంది. ఆహార ఉత్పత్తి మాత్రం పరిమిత స్థాయిలోనే ఉంటుంది. సాధారణంగా.. ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. వీటిని నిల్వ ఉంచుకొని, కొరత ఏర్పడినప్పుడు వాడుకోగలిగితే... ఆహార సమస్యను కొంతవరకు నివారించవచ్చు. ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం కోసం కొత్తగా పుట్టుకొచ్చిన రంగమే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్!

భలే డిమాండ్ :
ప్యాకేజ్డ్ ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్స్ తయారీ, నిర్వహణలో... ఫుడ్ టెక్నాలజిస్ట్‌లకు ఎంతో డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది విద్యార్థులు ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నా రు. హోటల్స్, డిస్టిల్లరీస్, ప్యాకేజింగ్ పరిశ్రమలు, శీతల పానీ యాల తయారీ పరిశ్రమలు, రైస్‌మిల్స్, పలు ఆహార పదార్థాల తయారీ పరిశ్రమలు.. ఇలా అనేకచోట్ల ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల సేవలు అవసరం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగం లో.. ఉపాధి అవకాశాలు విస్తృతమవుతున్నారుు. 1998లో కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఇది ఈ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది.

టెక్నాలజిస్ట్‌ల పని ఇదీ :
ఫుడ్ టెక్నాలజిస్ట్‌లు.. ఆహార పదార్థాల తయూరీ, నిల్వ, ప్యాకేజింగ్‌లో పాలుపంచుకుంటారు. ఆహార పదార్థాల జీవ, రసాయన, భౌతిక ధర్మాలను అధ్యయనం చేసి.. ఆహారభద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఆహార పదార్థాలు తయూరు చేసేలా చూస్తారు. టెక్నాలజిస్ట్‌లు.. అటు వినియోగదారుల అవసరాలు.. ఇటు కంపెనీ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. మంచి పోషక విలువలున్న ఆహార పదార్థాల తయారీలో భాగంగా ఈ రంగంలో  నిరంతర పరిశోధన కొనసాగుతోంది. ఇందుకు శిక్షణపొందిన మానవ వనరుల అవసరం ఎంతో ఉంది.

అవకాశాలు పుష్కలం :
ఫుడ్ టెక్నాలజిస్టులకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. హోటల్ పరిశ్రమలో వీరికి మంచి డిమాండ్ ఉంది. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో అవకాశాలు పుష్కలం. ఫుడ్ టెక్నాలజీ కోర్సు పూర్తిచేసిన వారు... ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ పరిశ్రమల్లో...  క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్, ప్రిజర్వేషన్ మేనేజర్, ప్యాకేజింగ్ టెక్నాలజిస్ట్, ప్రొడక్షన్ మేనేజర్, లేబొరేటరీ సూపర్‌వైజర్ వంటి ఉద్యోగాల్లో చేరవచ్చు. ప్రముఖ సంస్థలు, యూనివర్సిటీల్లోని పరిశోధన, అభివృద్ధి విభాగాల్లో రీసెర్చ్ అసోసియేట్‌లుగా పనిచేయవచ్చు. ఫుడ్ టెక్నాలజీలో పీజీ చేసిన వారు కాలేజీల్లో లెక్చరర్‌గా చేరవచ్చు. పలు ఇన్‌స్పెక్షన్ బోర్డులు, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో వీరికి ఉద్యోగాలు లభిస్తాయి. హిందుస్థాన్ లివర్, హెంజ్, కెలాగ్స్, నెస్లే వంటి పలు సంస్థలకు ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల అవసరం తప్పనిసరి. హోంసైన్స్, న్యూట్రిషన్, హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు కూడా  ఈ రంగంలో స్థిరపడొచ్చు!

విదేశాల్లో:
ఫుడ్ టెక్నాలజిస్ట్‌లకు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఆహార పదార్థాల పరిశోధన కంపెనీల్లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్లుగా అవకాశాలు లభిస్తారుు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా... పరిశోధనల ద్వారా కొత్త ప్రొడక్ట్స్‌ను రూపొందించవచ్చు. కంపెనీల్లో  సైంటిస్టులుగా కూడా అవకాశాలు పొందవచ్చు. ఆహార పదార్థాల రుచి, వాసనను పర్యవేక్షించే నిపుణుడిగా పనిచేయవచ్చు. ఆహార పదార్థాల నాణ్యత, శుభ్రతను పర్యవేక్షించేందుకు విదేశాల్లోని కంపెనీలు ప్రత్యేకంగా ఫుడ్‌టెక్నాలజీ నిపుణులను నియమించుకుంటున్నారుు.

అర్హతలు :
ఇంటర్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/బయాలజీ సబ్జెక్టులను చదివిన వారు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. ఎంఎస్సీ కోర్సుల్లో చేరాలంటే... డిగ్రీస్థాయిలో కెమిస్ట్రీ చదివి ఉండాలి. ఫుడ్ టెక్నాలజీ రంగంలో చేరాలంటే.. ఆరోగ్యం, ఆహారం పట్ల ప్రత్యేక ఆసక్తి, పూర్తి అవగాహన ఉండాలి. నిశితపరిశీలనా శక్తి, శాస్త్రీయ దృ  క్పథం ఉండాలి. సైంటిఫిక్, టెక్నాలాజికల్ అంశాల్లో  ఆసక్తి పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్‌లో పనిచేయగల స్వభావం అవసరం.

ఏ కోర్సులు ఎక్కడ :
బీఎస్సీ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్): ఈ కోర్సును మన రాష్ట్రంలోని కాకతీయ యూనివర్సిటీతో పాటు... యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతా, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, ఔరంగాబాద్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ మరఠ్వాడ యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
బీఎస్సీ (ఫుడ్ ప్రాసెసింగ్): యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలలో ఈ కోర్సు ఉంది.

బీఎస్సీ టెక్నాలజీ: బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు ఈ కోర్సులో చేరవచ్చు. ఇది నాగ్‌పూర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబయిల్లో అందుబాటులో ఉంది.

బీటెక్: ఫుడ్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ వంటి వివిధ పేర్లతో ఇంజినీరింగ్ స్థాయిలో ఫుడ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో... ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ (కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల), ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ ఈ కోర్సునందిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ ముంబయి, మహాత్మాగాంధీ చిత్రకూట్ గ్రామోదయ్ విశ్వవిద్యాలయం, అవృుత్‌సర్‌లోని గురునానక్ యూనివర్సిటీ, తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ ల్లో ఈ కోర్సు ఉంది.
ఎమ్మెస్సీ: మైసూర్‌లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ) ఎమ్మెస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సునందిస్తోంది. ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథమేటిక్స్ చదివి... కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా బీఎస్సీ/ అగ్రికల్చర్/ ఇంజినీరింగ్ టెక్నాలజీలో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి.

మన రాష్ట్రంలోని ఆంధ్రా యూనివర్సిటీతోపాటు అవృుత్ సర్‌లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, దార్వాడ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్‌లలో ఫుడ్ టెక్నాలజీలో రెండేళ్ల ఎంఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది.

Published date : 09 Jul 2012 08:17PM

Photo Stories