Skip to main content

కెరీర్ విత్ పొలిటికల్ సైన్స్

తెగలు, సమూహాలు, నగరాలు, దేశాలుగా నివసిస్తున్న ప్రజల మధ్య..వారి జీవన గమనానికి అవసరమైన నియమాలు రూపొందించడం, వాటిని అమలు చేయడం ద్వారా ప్రజలు కలసి మెలసి జీవించడానికి ఒక రకమైన వారధిగా నిలిచేవే రాజకీయాలు.. రాచరికం నుంచి ప్రజల చేతుల్లోకి అధికారం విస్తరించిన నేపథ్యంలో రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి..ప్రజలు తమకు కావల్సిన అవసరాల గొంతుకను రాజకీయమనే వ్యవస్థ ద్వారా వినిపిస్తుంటారు.. ఈ క్రమంలో రూపొందించే చట్టాలు, జరిగే నిర్ణయాలు, తీసుకునే చర్యలు వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్)...

దేశాల పరిపాలనకు సంబంధించిన విధానాలు, ప్రభుత్వ నియమాలు, రాజ్యాంగం పాత్ర, చట్టాల తయారీ మార్గాలు, ఎన్నికలు... ఇలా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరమైన అన్ని అంశాలను విశ్లేషణాత్మకంగా చర్చించేదే రాజనీతి శాస్త్రం. ఇందులో రాజకీయ విలువలు, సంస్థలు, అవి పని చేసేతీరు, రాజ్యాంగం వంటి అంశాలు ఉంటాయి.

లీడర్‌గా ఎదగడానికి:
శరవేగంగా మార్పు దిశగా ప్రపంచం దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో సమాజాన్ని వివిధ మాధ్యమాల నుంచి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయాలు అనే కోణంలోనే కాకుండా.. ప్రస్తుత ఆధునిక యుగంలో ఒక వ్యక్తిలా కాకుండా నాయకుడిగా ఉండాల్సిన పరిస్థితి. కుటుంబం నుంచి పని చేసే సంస్థ వరకు నలుగురికీ ఆదర్శంగా నిలుస్తూ.. నడిపిస్తూ ముందుకు సాగాలి. అంటే విద్యార్హతలతోపాటు నాయకత్వ లక్షణాలు కూడా నియామక ప్రక్రియలో నిర్ణయాత్మకంగా నిలుస్తున్న తరుణంలో ఒక వ్యక్తిని పరిపూర్ణ మూర్తిమత్వం ఉన్న నాయకుడిగా తీర్చిదిద్దేందుకు కావల్సిన అవగాహనను పొలిటికల్ సైన్స్ అందిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్‌లో రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకునే వారికి కావల్సిన పరిజ్ఞానాన్ని కూడా కల్పిస్తుంది (రాజకీయాల్లో రాణించాలంటే పొలిటికల్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు). కేవలం సంబంధిత రంగ పోకడలను, నేపథ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ శాస్త్రం వీలు కల్పిస్తుంది.

అధ్యయనం ఇక్కడి నుంచే:
పొలిటికల్ సైన్స్‌ను అధ్యయనం చేయడం పాఠశాల దశ నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఆ స్థాయిలో కేవలం పౌర విధులు, ఎన్నికలు, నాయకులను ఎన్నుకునే విధానం, నాయకత్వ అర్హతలు వంటి అంశాల చుట్టే కేంద్రీకృతమవుతుంది. డిగ్రీ స్థాయికి వచ్చేసరికి పొలిటికల్ సైన్స్‌గా ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్‌గా విస్తృత పరిధిలో ఆవిష్కృతమవుతుంది. కేవలం జాతీయ స్థాయి అంశాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసే అవకాశం ఇక్కడ లభిస్తుంది. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ తర్వాత పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ వంటి కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉంటే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న లేదా మనుగడలో ఉన్న అంశాలను ఎంపిక చేసుకుని.. దాని ఆధారంగా పరిశోధనలు చేయవచ్చు. కాలక్రమేణా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని రాజనీతి శాస్త్రానికి సంబంధించి పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వంటి కొత్త సబ్జెక్ట్‌లను ప్రవేశపెట్టారు.

పబ్లిక్ పాలసీ:
సమగ్రాభివృద్ధిలో పబ్లిక్ పాలసీ అనేది ఒక విడదీయరాని భాగం. భవిష్యత్ విధాన నిర్ణేతలు, విశ్లేషకులకు, ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలు ఒక పథకాన్ని రూపొందించేటప్పుడు చేయాల్సిన ఊహాత్మక కూర్పు, ఆచరణాత్మక నైపుణ్యాలు, సిద్ధాంతాలు వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి రూపొందించిన కోర్సు పబ్లిక్ పాలసీ. ఒక విధానాన్ని రూపొందించేటప్పుడు..దాని సాధ్యాసాధ్యాలకు సంబంధించి అన్ని కోణాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది. ఇందులో హెల్త్ పాలసీ, ఎన్విరాన్‌మెంటల్ పాలసీ, ఉమెన్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ వంటి ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ కంపెనీల్లోని సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లో, ఎన్‌జీవోలు, మెకన్సీ, డెలాయిట్ వంటి కన్సల్టెంగ్ కంపెనీలు, కమ్యూనికేషన్ కంపెనీల్లో పీఆర్ విభాగాల్లో, మీడియా హౌస్‌లలో, పరిశోధన సంస్థల్లో, యునెటైడ్ నేషన్స్, యూనిసెఫ్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కన్సల్టెంట్స్‌గా, ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఆడిట్ ఫార్మ్స్ వంటి సంస్థలు కెరీర్ వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ విభాగానికి సంబంధించి కేవలం మాస్టర్స్ స్థాయిలో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది.
అందిస్తున్న సంస్థలు:
ఐఐఎం-బెంగళూరు
(కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్, వెబ్‌సైట్: www.iimb.ernet.in),
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-ముంబై (వెబ్‌సైట్:  www.tiss.edu ),
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ-బెంగళూరు (కోర్సు: మాస్టర్ ఇన్ పబ్లిక్ పాలసీ, వెబ్‌సైట్:  www.nls.ac.in),
సెయింట్ జేవియర్స్ -ముంబై (వెబ్‌సైట్: xaviers.edu),
టెరీ యూనివర్సిటీ (కోర్సు: ఎంఏ-పబ్లిక్ పాలసీ అండ్ సస్టెయినబిలిటీ డెవలప్‌మెంట్, వెబ్‌సైట్: www.teriuniversity.ac.in),
జిందాల్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ-సోనిపట్ (కోర్సు: మాస్టర్ ఇన్ పబ్లిక్, వెబ్‌సైట్:  www.jsgp.edu.in),
ఢిల్లీ యూనివర్సిటీ (కోర్సు: ఎంబీఏ-పబ్లిక్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, వెబ్‌సైట్:  www.du.ac.in).

ఇంటర్నేషనల్ రిలేషన్స్:
అంతర్జాతీయ రాజకీయాలను విశ్లేషణాత్మక దృష్టితో అధ్యయనం చేసే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జాతీయ/అంతర్జాతీయ ఎన్‌జీవోలు, యునెటైడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థలు, మీడియా హౌస్‌లలో అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సు పీజీ/పీహెచ్‌డీ స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంది.
అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-న్యూఢిల్లీ (వెబ్‌సైట్:  www.jnu.ac.in),
జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ (వెబ్‌సైట్:  www.jsia.edu.in),
పాండిచ్చేరి యూనివర్సిటీ (వెబ్‌సైట్:  www.pondiuni.edu.in).

కెరీర్ అవెన్యూస్:
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ ప్లానింగ్, సోషల్ పాలసీ, అకడమిక్స్, పబ్లిక్ అఫైర్స్, అనాలిసిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫారెన్ కరస్పాండెంట్, సిటీ ప్లానర్, డిప్లొమాట్, ఇంటెలిజెంట్ ఎక్స్‌పర్ట్,ఇంటర్నేషనల్ ఆర్గనైజర్, ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్, రాయబార కార్యాలయాల్లో ట్రాన్స్‌లేటర్, ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు, ఎన్‌జీవోలు, యూనివర్సిటీలు, బిజినెస్ హౌస్, కార్పొరేట్ కంపెనీలు, మీడియా హౌస్‌లు తదితరాలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి.

పొలిటికల్ సైంటిస్ట్:
ప్రస్తుత రాజకీయ వ్యవస్థను పొలిటికల్ సైంటిస్ట్‌లు అధ్యయనం చేస్తుంటారు. అంటే ఒక సమూహం పోకడను నిశితంగా గమనిస్తుంటారు. ఉదాహరణకు ఎవరైనా ఒక అం శంపై ప్రజా అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం సర్వేలు నిర్వహిస్తుంటారు. అలాంటప్పుడు వీరి సేవలు అవసరమవుతాయి. వివిధ రకాల సర్వేలు నిర్వహించడం, వాటి ఫలితాలను విశ్లేషించడం, సంబంధిత వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం, సంబంధిత డాక్యుమెంట్స్ స్క్రూటినీ, వివిధ సంస్థలకు సలహాదారులుగా వ్యవహరించడం, ప్రభుత్వ సంస్థల కోసం కన్సల్టింగ్ వర్క్ నిర్వహించడం, నిర్దేశిత అం శాలపై పత్రికలకు వ్యాసాలు రాయడం వంటివి వీరి విధులు.

రీసెర్చ్:
రాజనీతి శాస్త్రం వల్ల విశ్లేషణాత్మక సామర్థ్యం, డేటా అనాలిసిస్, కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే కాకుండా ఓరల్, రిటెన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి. తద్వారా రీసెర్చ్ అసిస్టెంట్‌గా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే కెరీర్ ప్రారంభించవచ్చు. పొలిటికల్ సైన్స్ కోర్సులను అందిస్తున్న కాలేజీలు, యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లు, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో టీచింగ్‌తో సమాంతరంగా పరిశోధనా కార్యకలాపాలు కూడా తప్పనిసరి. ఎందుకంటే సంబంధిత అంశంపై సమకాలీనంగా చోటుచేసుకుంటున్న మార్పులపై అప్‌డేట్‌గా ఉండాలంటే పరిశోధనా విభాగం పాత్ర ఎంతో. కాబట్టి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో రీసెర్చర్‌గా కూడా చేరొచ్చు.

పాలసీ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్:
పొలిటికల్ సైన్స్‌ను ప్రభావవంతంగా అన్వయించే లక్షణం ఉన్న వారికి అవకాశాలు కల్పిస్తున్న మరో విభాగం పాలసీ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే కొన్ని కీలక రంగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. ఆ నిర్ణయాల పర్యవసానాలను సామాజికంగా అన్వయించాల్సి ఉంటుంది. ఆ సమయంలో పొలిటికల్ సైన్స్ అభ్యర్థులు కీలకంగా మారతారు. హౌసింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ రిలేషన్స్, కార్పొరేట్ హైరింగ్ స్ట్రాటజీస్, హెల్త్, లా వంటి విభాగాల్లో ఈ తరహా రిక్రూట్‌మెంట్ ఎక్కువగా జరుగుతుంది.

హెచ్‌ఆర్ విభాగాల్లో:
పొలిటికల్ సైన్స్‌లో పీజీ లేదా అడ్వాన్స్‌డ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. పరిశ్రమల్లో వీరిని ఇండస్ట్రియల్ పొలిటికల్ సైంటిస్ట్‌లుగా నియమించుకుంటారు. ఉత్పాదకత విషయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి, ఉద్యోగుల మధ్య సంబంధాలను నెలకొల్పడం వంటి అంశాలను నిర్వహించడానికి వీరి సేవలను వినియోగించుకుంటారు.

పభుత్వ పథకాల విశ్లేషణ:
పొలిటికల్ సైన్స్ అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల విశ్లేషణ/మాల్యాంకనం లేదా సంబంధిత పరిశోధనలో లేదా సమస్య పరిష్కార రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా పథకాల అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్, డెవలపర్స్‌గా స్థిరపడొచ్చు. రాష్ట్ర స్థాయిలో అర్బన్ ప్లానింగ్, హెల్త్ ప్లానింగ్, క్రిమినల్ జస్టిస్ వంటి వీరి సేవలను ఎక్కువగా వినియోగించుకుంటారు.

కావల్సిన లక్షణాలు
  • పొలిటికల్ సైన్స్ కోర్సును ఎంచుకున్న వారికి కావల్సిన లక్షణాలు. అవి..
  • రిటెన్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్
  • రిపోర్ట్ రైటింగ్ స్కిల్స్
  • పరిశోధనలు నిర్వహించడం, వాటిని అన్వయించే సామర్థ్యం
  • విశ్లేషణాత్మక-సృజనాత్మక ఆలోచన
  • తార్కిక వివేచన-సమస్య పరిష్కార నైపుణ్యం
  • సత్వరంగా నిర్ణయం తీసుకునే నేర్పు
  • విమర్శను స్వీకరించే గుణం
  • ఓపెన్ మైండ్
  • మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం
ఇతర అవకాశాలు
  • పొలిటికల్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన వారికి టీచింగ్, రీసెర్చ్, పబ్లిషింగ్, బిజినెస్, జర్నలిజం రంగాల కేంద్రీకృతంగా అవకాశాలు ఉంటాయి. మిగతా అభ్యర్థుల మాదిరిగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు నిర్వహించే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కావచ్చు.
  • టీచింగ్‌పై ఆసక్తి ఉంటే బీఈడీ, డీఈఈసెట్, పీఈసెట్, లాంగ్వేజ్ పండిట్స్ పరీక్షలకు హాజరుకావచ్చు. సంబంధిత కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు/ కాలేజీలు/ యూనివర్సిటీలలో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించవచ్చు.
  • మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
అన్ని సామాజిక శాస్త్రాలలోఅంతర్భాగంగానే రాజనీతిశాస్త్రం కూడా ముఖ్యమనేది గుర్తించాలి. రాజనీతిశాస్త్ర అధ్యయనం చేసిన విద్యార్థుల్లో సంకుచిత స్వభావాలు తొలిగి విశాల దృక్పథం అలవడుతుంది. కులం మతం ప్రాంతాలకు అతీతంగా విశ్వమానవ కల్యాణానికి ప్రపంచాన్ని జాగృతం చేయటం అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనం చేసిన విద్యార్థుల్లో ఉంటుంది. రాజనీతిశాస్త్ర అధ్యయనం వివిధ కాంపిటీటివ్ ఉద్యోగాల కోసం రాసే రాతపరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్ పోస్టులకు. రాజీకీయాల అవగాహనకు కూడా రాజనీతిశాస్త్రం అధ్యయనం కూడా అవసరమే.
- డాక్టర్ ఎ.హరిప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్,
రాజనీతిశాస్త్ర విభాగం-కాకతీయ యూనివర్సిటీ.
Published date : 12 Jun 2014 06:06PM

Photo Stories