Skip to main content

కెరీర్ గైడెన్స్..లైబ్రరీ సైన్స్

‘లైబ్రరీస్... రిజర్వాయర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్’.. గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు ఈ ఒక్క వాక్యం చాలు. సప్త సముద్రాలకు మించి ఉండే సమాచారాన్ని నిక్షిప్తం చేసే ప్రదేశాలు గ్రంథాలయాలు. ఆ గ్రంథాలయాలను సమర్థంగా నిర్వహించడం; సమాచారాన్ని పొందిగ్గా అమర్చడం; అడిగిన వెంటనే సదరు సమాచారాన్ని అందించడం అనుకున్నంత సులభమేమీ కాదు. అందుకే ఈ లక్షణాలు, నైపుణ్యాలు అందించేందుకు రూపొందిన కోర్సు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఆధునిక యుగంలో ఒక్కో అంశంపై పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు, రిఫరెన్స్‌లు పెరుగుతుండటంతో లైబ్రరీలను సమర్థంగా నిర్వహించే సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ రోజురోజుకీ పెరుగుతోంది. వినూత్న ఆలోచన, సహనం ఉన్న వారికి చక్కగా సరిపడే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఫోకస్...

‘అరల్లో పుస్తకాలను అమర్చడం.. అడగగానే అందించడం’.. లైబ్రరీలు, అందులో పనిచేసే సిబ్బంది విషయంలో సాధారణంగా నెలకొనే అభిప్రాయమిదే. కానీ ‘ఆ.. అడగగానే అవసరమైన పుస్తకాన్ని అందించడమే’ ఓ ఆర్ట్. సాధారణ వ్యక్తికి సాధ్యంకాని సైన్స్. అందుకే లైబ్రరీ నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన కోర్సు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్.

ఉదాహరణకు: హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో లక్షల్లో పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఒక వ్యక్తి తనకు కావలసిన పుస్తకం కోసం గంటలకొద్దీ అన్వేషణ సాగిస్తున్నాడు. దీన్ని గమనించిన లైబ్రేరియన్.. ఆ వ్యక్తి వద్దకు వచ్చి ఏం కావాలో కనుక్కున్నాడు. క్షణాల్లో ఆ పుస్తకం ఆ వ్యక్తి చేతిలోకొచ్చింది. సాధారణ వ్యక్తికి సాధ్యం కానిది లైబ్రేరియన్‌కు క్షణాల్లో సాధ్యమవడానికి కారణం.. అతడు లైబ్రరీ సైన్స్ కోర్సులో ఉత్తీర్ణత సాధించడమే.

ప్రఖ్యాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సైతం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో అసోసియేట్‌షిప్‌ను అందిస్తోందంటే ఈ కోర్సు ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా నేషనల్ నాలెడ్జ్ కమిషన్ సైతం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ మిషన్ ఫర్ లైబ్రరరీస్‌ను రూపొందించాలని సిఫార్సు చేసిందంటే లైబ్రరీలు, ఈ కోర్సు ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు.

కోర్సు స్వరూపం:
సాధారణంగా లైబ్రరీ సైన్స్ కోర్సులో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, క్లాసిఫికేషన్, క్యాటలాగింగ్ సిస్టమ్స్, బిబ్లియోగ్రఫీ, డాక్యుమెంటేషన్, మెయింటెనెన్స్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్, లైబ్రరీ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఆర్కైవ్స్ మేనేజ్‌మెంట్, ఇండెక్సింగ్, లైబ్రరీ ప్లానింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది.

కన్వెన్షన్ టు కంప్యూటరైజేషన్: కాలంతోపాటు లైబ్రరీ సైన్స్ కోర్సు స్వరూపం కూడా మారుతోంది. ఆధునిక కంప్యూటర్ యుగం నేపథ్యంలో.. గతంలో సంప్రదాయంగా పుస్తకాలు, జర్నల్స్ వంటి వాటి నిర్వహణకే పరిమితమైన శిక్షణ ఇప్పుడు సీడీలు, డీవీడీలు, మైక్రోఫిల్మ్స్ సేకరణ, శాస్త్రీయపద్ధతుల్లో సంరక్షణ వరకు పొడిగింది.

కోర్సుల వివరాలు
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సు ప్రాముఖ్యత తెలుసుకోగానే తలెత్తే ప్రశ్న.. కోర్సులేంటి? అనేదే. ప్రస్తుతం మన దేశంలో 80కి పైగా యూనివర్సిటీలు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా కోర్సులను నిర్వహించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ (NISCAIR), ఇండియన్ నేషనల్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ సెంటర్ (INSDOC)లు ఈ కోర్సు విషయంలో దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు అందించే కోర్సులు సర్టిఫికెట్ నుంచి పీహెచ్‌డీ వరకు ఉంటున్నాయి. ఆ వివరాలు..

సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
అర్హత: ఇంటర్మీడియెట్.

డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
అర్హత: ఇంటర్మీడియెట్.

బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (బీఎల్‌ఐఎస్‌సీ)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.
వ్యవధి: ఏడాది.

మాస్టర్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
అర్హత: బీఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత
వ్యవధి: ఏడాది.

ఎం.ఫిల్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
అర్హత: ఎంఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత.

పీహెచ్‌డీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
అర్హత: ఎంఎల్‌ఐఎస్‌సీ ఉత్తీర్ణత.

సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల కాల వ్యవధి ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల విధానాల మేరకు ఉంటుంది. సాధారణంగా సర్టిఫికెట్ కోర్సు ఆరు నెలలు, డిప్లొమా కోర్సు ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో సాగుతుంది.

మాస్టర్ డిగ్రీకి సమానంగా అసోసియేట్‌షిప్:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ (NISCAIR)-న్యూఢిల్లీ; ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరులు.. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీకి సమాన హోదాలో డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో రెండేళ్ల వ్యవధిగల అసోసియేట్‌షిప్ ప్రోగ్రాంను అందిస్తున్నాయి.

మన రాష్ట్రంలో:
ఈ కోర్సును మన రాష్ట్రంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు బ్యాచిలర్ (బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్) స్థాయిలోనే అందిస్తున్నాయి. ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, లేదా ప్రత్యేక ప్రవేశ ప్రక్రియ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలు దూర విద్యా విధానంలోనూ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును అందిస్తున్నాయి. జాతీయ స్థాయి ఓపెన్ యూనివర్సిటీ.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) సర్టిఫికెట్ నుంచి ఎం.ఫిల్ స్థాయి వరకు ఈ కోర్సును దూర విద్యా విధానంలో అందిస్తోంది.

స్పెషలైజేషన్స్‌తో:
ఇప్పుడు ప్రతికోర్సు, ప్రతి విభాగంలో స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అనే మాట తరచుగా వినిపిస్తోంది. ఆ మాట లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కూ విస్తరించింది. ఈ క్రమంలో మెడికల్ లైబ్రేరియన్, లా ఫర్మ్ లైబ్రేరియన్, మ్యూజియం లైబ్రరీస్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తే మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లు, లీగల్ పబ్లిషింగ్ హౌసెస్; మ్యూజియంలు ఆఫర్లు ఇవ్వడంలో ముందుంటాయి. మెడికల్ లైబ్రేరియన్ స్పెషలైజేషన్ చేస్తే క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, ఫార్మా సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.

కెరీర్ గ్రాఫ్:
ఈ విభాగంలో కెరీర్ గ్రాఫ్.. పూర్తి చేసిన కోర్సుపై ఆధారపడి ఉంటుంది. డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేస్తే లైబ్రరీ క్లర్క్ లేదా లైబ్రరీ అటెండెంట్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఇలా పలు స్థాయిల్లో కెరీర్ గ్రాఫ్ ఉంటుంది. అవి.. లైబ్రరీ అటెండెంట్/అసిస్టెంట్ లైబ్రేరియన్; డిప్యూటీ లైబ్రేరియన్; లైబ్రేరియన్/చీఫ్ లైబ్రేరియన్; రీసెర్చర్/అప్లికేషన్ స్పెషలిస్ట్; కన్సల్టెంట్/రిఫరెన్స్ లైబ్రేరియన్; టెక్నికల్ అసిస్టెంట్/ రికార్డ్స్ మేనేజర్; ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ వంటివి.

అవకాశాలు అపారం:
చాలామంది ఇప్పటికీ ఈ కోర్సుకున్న ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. కానీ కోర్సు పూర్తి చేస్తే అవకాశాలు ఆహ్వానం పలుకుతాయనడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. కారణం.. పెరుగుతున్న డాక్యుమెంటేషన్ సెంటర్లు, మ్యూజియంలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ముద్రణ సంస్థలు, రీసెర్చ్ సంస్థల్లో లైబ్రేరియన్ల కొరత వేధిస్తుండటమే! ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగంలో అవకాశాలు కోకొల్లలుగా పేర్కొనొచ్చు. అంతేకాకుండా 2008లో నిర్వహించిన ఎంప్లాయ్‌మెంట్ సర్వేలో ‘బెస్ట్ కెరీర్స్ ఆఫ్ 2008’ జాబితాలో ఈ కోర్సు స్థానం పొందిందంటే దీనికి గల అవకాశాలు అర్థం చేసుకోవచ్చు.

వేదికలు:
ఈ కోర్సు పూర్తి చేస్తే లైబ్రరీలే కాకుండా అనేక ఇతర విభాగాలు అవకాశాల వేదికలుగా నిలుస్తున్నాయి. అవి.. పబ్లిక్/ ప్రభుత్వ లైబ్రరీలు; విద్యా సంస్థలు; విదేశీ రాయబార కార్యాలయాలు; జాతీయ స్థాయి మ్యూజియంలు, పురాతత్వ శాఖలు. అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్; డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ); ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్); ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వంటి సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి.

కార్పొరేట్ సెక్టార్‌లోనూ:
లైబ్రరీ సైన్స్ కోర్సు ఉత్తీర్ణులకు కార్పొరేట్ సంస్థలు సైతం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయనడం అతిశయోక్తికాదు. సాఫ్ట్‌వేర్ సంస్థల్లో వీరి అవసరం పెరుగుతోంది. విస్తతమైన సమాచారాన్ని పొందిగ్గా అమర్చడానికి సంబంధిత విభాగంలో సుశిక్షుతులైన సిబ్బంది అవసరం ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో ఆయా సంస్థల నిరంతర కార్యకలాపాలైన డేటాబేస్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, వెబ్ కంటెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డిజైన్, ఇంటర్నెట్ కోఆర్డినేషన్ వంటి విభాగాల్లో లైబ్రరీ సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలున్నాయి.

వేతనాలు:
కోర్సు పూర్తి చేసిన వారికి వేతనాలు కూడా వెల్లువలా లభిస్తాయని చెప్పొచ్చు. విద్యా సంస్థల్లో లైబ్రేరియన్లుగా చేరిన వారికి యూజీసీ స్కేల్ అందిస్తారు. డీఆర్‌డీఓ, ఇస్రో వంటి పరిశోధన సంస్థల్లో చేరిన వారికి సైంటిఫిక్ సిబ్బందికి సమాన స్థాయిలో వేతనాలు లభిస్తాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విభాగాల్లో చేరితే ప్రారంభంలోనే అయిదంకెల జీతం గ్యారెంటీ. ఇతర విభాగాల్లో చేరిన వారికి ప్రారంభంలో కనీసం నెలకు రూ. 15 వేల జీతం ఖాయం.
Published date : 28 Jan 2013 05:15PM

Photo Stories