Skip to main content

కెరీర్ గైడెన్స్.. సోషల్ సైన్సెస్

సమాజం, మానవ సంబంధాలను సమగ్రంగా చర్చించే విభాగమే సోషల్ సైన్సెస్.. సమాజం.. అభివృద్ధి.. ప్రజలు.. వారి ప్రాముఖ్యత.., వారసత్వ సంపద, మానవ సంబంధాలు.. సామాజిక బాధ్యత వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఈ కోర్సులు ఉపకరిస్తాయి.. ఆర్ట్స్, హ్యుమానిటీస్ అంశాల కలయికగా ఉండే సోషల్ సైన్సెస్ కోర్సులపై విశ్లేషణ..

దేశంలోని సంప్రదాయ కోర్సుల్లో అత్యధిక మంది విద్యార్థులు ఆర్ట్స్, హ్యూమానిటీస్ కోర్సుల్లో చేరుతున్నారు. హిస్ట రీ, ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ స్టడీస్, లాంగ్వేజెస్, ఫిలాసఫీ, లిటరేచర్, లా, సోషియాలజీ, రిలీజియన్, కల్చర్, ఆర్ట్స్, ఆంత్రోపాలజీ, తదితర సబ్జెక్టులు సోషల్ సైన్సెస్ కోర్సుల పరిధిలోకి వస్తాయి. పదో తరగతి తర్వాత సోషల్ సెన్సైస్ కోర్సుల్లో ప్రవేశించేందుకు.. ఇంటర్మీడియెట్‌లో హెచ్‌ఈసీ (హిస్టరీ,ఎకనామిక్స్, సివిక్స్) గ్రూపును ఎంచుకోవాలి. ఈ విభాగంలో వీటిని ప్రాథమిక కోర్సులుగా పేర్కొనవచ్చు. ఈ రెండు గ్రూపులే కాకుండా ఇతర గ్రూపుల విద్యార్థులు కూడా తర్వాతి స్థాయిలో సోషల్ సైన్స్ కోర్సుల్లో చేరొచ్చు.

నూతనంగా బీఏ:
ఇంటర్మీడియెట్ తర్వాత సోషల్ సైన్సుల్లో బ్యాచిలర్ డిగ్రీని బీఏగా పేర్కొంటారు. ఈ విభాగంలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంప్రదాయ సబ్జెక్ట్‌లతోపాటు స్టాటిస్టిక్స్, జాగ్రఫీ, ఫిలాసఫీ, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, లింగ్విస్టిక్స్, రూరల్ ఇండస్ట్రియలైజేషన్, చైల్డ్ సైకాలజీ, రూరల్ బ్యాంకింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ అండ్ మీడియా స్టడీస్, బిజినెస్ ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ స్టడీస్ వంటి ఎన్నో నూతన సజ్జెక్టులను ప్రవేశ పెట్టారు. అంతేకాకుండా బీఎలోనూ విభిన్నమైన స్పెషలైజేషన్లు ఉన్నాయి. అవి.. బీఏ- హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, జర్నలిజం, కమ్యూనికేషన్, లిటరేచర్. ఒకరకంగా వీటిని జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు గా పేర్కొనవచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతో ఉస్మానియా యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.osmania.ac.in) ఆఫర్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సులో కూడా చేరొచ్చు.

పీజీ:
బీఏలో తీసుకున్న ఆఫ్షన్లను బట్టి ఆయా సబ్జెక్టుల్లో పీజీ స్థాయిలో ఎంఏ కోర్సులో చేరే అవకాశం ఉంది. ఇందులో కూడా సంప్రదాయ ఆప్షన్స్‌తోపాటు ఆంత్రోపాలజీ, డెవలప్‌మెంట్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఆర్కియాలజీ, సోషియాలజీ, సోషల్‌వర్క్, సైకాలజీ వంటి మరెన్నో కొత్త సబ్జెక్ట్‌లకు చోటు కల్పించారు. పీజీ తర్వాత పీహెచ్‌డీ, ఎంఫిల్ కోర్సులను ఎంచుకోవచ్చు.

పీహెచ్‌డీ:
పీహెచ్‌డీ చేసే క్రమంలో జాతీయ స్థాయిలో నెట్, రాష్ట్ర స్థాయిలో సెట్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. నెట్ ను 94సబ్జెక్ట్‌లలో నిర్వహిస్తారు. సెట్ 24సబ్జెక్ట్‌లలో ఉంటుం ది. నెట్‌లో క్వాలిఫై కావడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కాలేజ్‌లు/యూనివర్సిటీలు/తత్సమాన ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఏపీపీఎస్సీ భర్తీ చేసే డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్/సెట్‌లలో క్వాలిఫై అయి ఉండాలి. నెట్‌లో జేఆర్‌ఎఫ్‌నకు ఎంపికైన అభ్యర్థులకు యూజీసీ నిబంధనల మేరకు ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి పరిగణించే అర్హతల్లో నెట్/జేఆర్‌ఎఫ్ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. విదేశీ యూనివర్సిటీలు కూడా అడ్మిషన్లలో నెట్ స్కోర్‌కు ప్రాథన్యత ఇస్తున్నాయి.

నెట్ కాకుండా:
కేవలం నెట్ ద్వారానే కాకుండా పరిశోధన కోర్సుల్లో చేనే అవకాశాన్ని కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు కల్పిస్తున్నాయి. అవి.. టిస్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్), సీఎస్‌డీఎస్ (సెంటర్ ఫర్ ది స్టడీస్ ఆఫ్ సోషల్ డెవలపింగ్ సోసైటీస్), ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్, ఐసీపీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫిలాసఫికల్ రీసెర్చ్-హిస్టరీ అభ్యర్థులకు), ఐసీఎస్‌ఎస్‌ఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్), తదితరాలు. అభ్యర్థులు పంపించిన ప్రాజెక్ట్ ప్రపోజల్ ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఫెలోషిప్‌ను కూడా అందజేస్తున్నాయి.

ఐఐటీల్లో కూడా:
విద్యార్థులకు టెక్నికల్ నాలెడ్జ్‌తోపాటు చుట్టూ ఉన్న సమా జం, మానవ సంబంధాలు సంబంధిత అంశాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఐఐటీలు సోషల్ సైన్స్ కోర్సులకు కరిక్యులంలో చోటు కల్పించాయి. సోషల్ సైన్సెస్ కు సంబంధించి ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ కోర్సులను దాదాపు అన్ని ఐఐటీలు, బిట్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు బ్యాచిలర్, మాస్టర్, పీహెచ్‌డీ కేటగిరీల్లో ఆఫర్ చేస్తున్నాయి. వీటిని ఇంటర్ డిసిప్లినరీ పద్ధతిలో ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు బోధిస్తున్నాయి.
ఐఐటీ-మద్రాస్ ఐదేళ్ల ఎంఏ (ఇంటిగ్రేటెడ్ -డెవలప్‌మెంట్ స్టడీస్) కోర్సును ఆఫర్ చేస్తుంది. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వివరాలకు: www.hss.iitm.ac.in

ఐఐటీ-కాన్పూర్, నాలుగేళ్ల బీఎస్-ఎకనామిక్స్ కోర్సును ఆఫర్ చేస్తుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా ప్రవేశం.
వివరాలకు: www.iitk.ac.in

ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐదేళ్ల ఎంఎస్సీ (ఎకనామిక్స్)కోర్సును ఆఫర్ చేస్తుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా ప్రవేశం.
వివరాలకు: www.iitkgp.ac.in

స్కిల్స్:
సోషల్ సైన్సెస్ ఎంచుకున్న వారు కెరీర్‌లో రాణించడానికి కొన్ని రకాల స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. అవి..
  • రైటింగ్ స్కిల్స్
  • ఇంగ్లిష్ లాంగ్వేజ్
  • నిరంతర అధ్యయనం
  • సామాజిక అంశాలపై అవగాహన
  • అన్వేషించే గుణం
  • విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే నైపుణ్యం
  • కంప్యూటర్స్‌పై కనీస అవగాహన
ఇతర అవకాశాలు:
సోషల్ సైన్స్ గ్రాడ్యుయేట్లు మిగతా అభ్యర్థులు మాదిరిగానే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు నిర్వహించే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కావచ్చు. టీచింగ్‌పై ఆసక్తి ఉంటే బీఈడీ, డైట్‌సెట్, పీఈసెట్, లాంగ్వేజ్ పండిట్స్ పరీక్షలకు హాజరుకావచ్చు. మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. మేనేజ్‌మెంట్ కోర్సులపై ఆసక్తి ఉంటే బీబీఏ/బీబీఎం, ఎంబీఏ కోర్సులను ఎంచుకోవచ్చు.

సోషల్ సెన్సైస్‌లో కొన్ని క్రేజీ సబ్జెక్ట్‌లు:
సోషియాలజీ:
మానవ సమాజం, దాని మూలాలు, అభివృద్ధి, నిర్వహణ, మానవ సంబంధాలను సంబంధిత అంశాలను శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేసేదే సోషియాలజీ. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ రంగం నుంచి కార్పొరేట్ సెక్టార్ వరకు పలు రకాలు అవకాశాలు ఉంటున్నాయి. ఈ క్రమం లో పబ్లిక్ హెల్త్ అండ్ వేల్ఫేర్ ఆర్గనైజేషన్స్, లా ఫర్మ్స్, మెడికల్ సెంటర్స్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, సర్వే ఆర్గనైజేషన్స్, ఎన్‌జీవో సంస్థలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆఫీస్‌లో వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ కల్పించడం ద్వారా ఉద్యోగులతో మరింత ప్రభావవంతంగా పని చేయించుకోవడానికి..ఎంఎన్‌సీలు సోషియాలజీ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు తక్కువ కాకుండా వేతనం అందుకోవచ్చు.

సోషల్ వర్క్:
సేవా దృక్ఫధం ఉన్న వారికి సరిగ్గా సరిపోయే కోర్సు సోషల్ వర్క్. ఇటీవల కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందుతున్న కోర్సుల్లో ఇది ఒకటి. సామాజిక సమస్యలు, మావన హక్కు లు, వాటితో ముడిపడి ఉన్న అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే సోషల్ వర్క్. ఇటీవలి కాలంలో ఈ కోర్సును పూర్తి చేసిన వారికి పబ్లిక్, ప్రైవేట్, ఎన్‌జీవో సంస్థల్లో అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ డెరైక్టర్/ఆఫీసర్, ప్రోగ్రా మ్ కో-ఆర్డినేటర్, కౌన్సిలర్, కమ్యూనిటీ మొబలైజర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ వంటి హోదాల్లో స్థిర పడొచ్చు. అమ్నె స్టీ ఇంటర్నేషనల్, వంటి ఆంతర్జాతీయ సంస్థలతోపాటు యూకే తదితర దేశాల్లో వీరికి అవకాశాలు పుష్కలం. వేతనాల విషయానికొస్తే..పని చేస్తున్న సంస్థను బట్టి రూ.15 నుంచి 25 వేల మధ్య వేతనం ప్రారంభంలో లభిస్తుంది.

ఎకనామిక్స్:
విస్తృత అవకాశాల దృష్ట్యా సోషల్ సైన్స్‌లో అత్యధిక మంది విద్యార్థులు ఎంచుకుంటున్న కోర్సు ఎకనామిక్స్. ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, వెంచర్ క్యాపిటల్స్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్స్, రిటైల్ సెక్టర్, స్టాక్-షేర్ మార్కెట్స్ వంటి రంగాలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఎనలిస్ట్,ఎకనమిస్ట్, అడ్వైజర్, ఎకనోమెట్రీషియన్ వంటి హోదా ల్లో స్థిర పడొచ్చు. యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్) ఎగ్జామ్ ద్వారా ప్రణాళిక సంఘం, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-ఎ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 15 వేలకు తక్కువ కాకుండా వేతనం అందుకోవచ్చు.

ఆంత్రోపాలజీ:
మావన సంస్కృతి, నాగరికత, ఆచార, సంప్రదాయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేది ఆంత్రోపాలజీ. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి మ్యూజియం, లైబ్రరీలు, గ్యాలరీలు, ఆర్కివ్స్, పబ్లిషింగ్ హౌసెస్, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ హౌసెస్ సంబంధిత సంస్థలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐసీఎంఆర్ వంటి జాతీయ సంస్థలతోపాటు యూనిసెఫ్, యూనెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ వంటి అంతర్జాతీయ సంస్థల్లో వివిధ హోదాల్లో స్థిరపడొచ్చు. తూర్పు దేశాల్లో వీరికి కూడా అవకాశాలు ఎక్కువ. వేతనాల విషయానికొస్తే.. పని చేస్తున్న సంస్థను బట్టి రూ. 15 వేల నుంచి 25 వేల మధ్య వేతనం ప్రారంభంలో లభిస్తుంది.

ఫైన్ ఆర్ట్స్:
ఇతర రంగాలకు భిన్నంగా.. కళాత్మాక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి చక్కని వేదికగా నిలుస్తున్నాయి.. ఫైన్ ఆర్ట్స్ కోర్సులు. డిజైన్, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, ఇంటీరియర్ డిజైన్, డ్రామా, ఫోటోగ్రఫీ, స్కల్‌ప్చ్‌ర్, యానిమేషన్ వంటి విభాగాలు ఇందులో ఉంటాయి. వీటికి సంబంధించి మన రాష్ట్రంలోని జేఎన్‌ఏఎఫ్‌యూ, తెలుగు విశ్వవిద్యాలయం సహా మరి కొన్ని యూనివర్సిటీలు బ్యాచిలర్ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మ్యూజియం, పబ్లికేషన్స్, యూనివర్సిటీలు,అడ్వర్‌టైజింగ్,టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లలో పలు హోదాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.10-15 వేలకు తక్కువ కాకుండా వేతనం అందుకోవచ్చు.

లాంగ్వేజెస్:
భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తున్న ప్రభావవంతమైన సాధనాల్లో భాష ఒకటి. అలాంటి భాష నేడు పలు రకాల ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. తెలుగు, ఇంగ్లిష్ వంటి భాషలను బ్యాచిలర్, పీజీ స్థాయిల్లో అధ్యయనం చేయడం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీలుగా స్థిర పడొచ్చు. విదేశీ భాషలను నేర్చుకోవడం అవకాశాలను మరింత విస్తృతం చేస్తుంది. ఈ క్రమంలో ట్రాన్స్‌లేషన్, డాక్యుమెంటేషన్, ఇంటర్‌ప్రిటేషన్, టీచింగ్, రీసెర్చ్, రాయబార కార్యాలయాలు, టూరిజం సెక్టార్, వివిధ ఎంఎన్‌సీలలో పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 15 వేలకు తక్కువ కాకుండా వేతనం అందుకోవచ్చు.


స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి
నేడు చూస్తున్న అనేక ఆవిష్కరణల వెనుక ఉన్న ఆలోచనలకు మూలం ఒక రకంగా సోషల్ సైన్సెస్ కోర్సులే అని చెప్పొచ్చు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా సామాజిక స్పృహ లేకుంటే.. ఆ టెక్నాలజీ నిష్ఫలం. ఈ విషయాన్ని గమనించిన అన్ని ఐఐటీలు సోషల్ సైన్సెస్ కోర్సులను ఇంటర్ డిసిప్లినరీ పద్ధతిలో బోధిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ సైన్సెస్ అభ్యర్థులకు అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. వివిధ ఎన్‌జీఓ సంస్థలు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ తామ ప్రాజెక్ట్ వర్క్ కోసం ఆకర్షణీయమైన వేతనాలతో వీరిని నియమించుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ అవకాశాలను అందుకోవాలంటే మాత్రం తదనుగుణంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్, కంప్యూటర్స్‌పై పరిజ్ఞానం పెంచుకోవాలి. రైటింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుతం బీఏలో సంప్రదాయ కోర్సులేకాకుండా జాబ్‌ఓరియెంటెడ్ కమ్యూనికేషన్, జర్నలిజం, లిటరేచర్, చైల్డ్ సైకాలజీ వంటి నూతన అంశాలను ప్రవేశ పెట్టడం జరిగింది. నెట్/సెట్‌తోపాటు టిస్, డీఐఎస్‌ఎస్, సీఎస్‌డీఎస్ వంటి ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా రీసెర్చ పరంగా అవకాశాలు కల్పిస్తున్నాయి.

దేశంలో టాప్ ఇన్‌స్టిట్యూట్స్:
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.jnu.ac.in

ఢిల్లీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.du.ac.in

సెయింట్ జేవియర్స్ కాలేజ్-కోల్‌కతా
వెబ్‌సైట్: www.sxccal.edu

లయోలా కాలేజ్-చెన్నై
వెబ్‌సైట్: www.loyola-college.edu

సెయింట్ స్టీఫన్స్ కాలేజ్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.ststephens.edu

మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీలు సోషల్ సైన్సెస్ కు సంబంధించి పలు రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
Published date : 16 Jul 2013 11:00AM

Photo Stories