Skip to main content

10వ తరగతి తర్వాత

సుస్థిర కెరీర్ ప్రగతి దిశగా చేసే ప్రయాణంలో పదో తరగతి తొలి సోపానం.
ఇంతటి కీలకమైన దశను దాటిన తర్వాత ఏ కోర్సులో చేరాలి? ఎందులో చేరితే అవకాశాలు ఎలా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రత్యేక కథనం..

ఇంటర్మీడియెట్
ఎంపీసీ:
ఇంజనీర్‌గా కెరీర్‌లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. గణితంపై ఆసక్తి ఉండి, వివిధ సూత్రాలను వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఐఐటీ, నిట్‌లు, టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే ఇంటర్‌లో చేరిన మొదటి రోజు నుంచి ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, బిట్‌శాట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం కృషిచేయాలి. ఇంజనీరింగ్ కెరీర్‌పై ఆలోచన లేని వారు, ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి, తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలు దిశగా వృత్తి జీవితాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.

బైపీసీతో వైద్యం:
మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండి, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ). వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తిచేయాల్సిన గ్రూప్ ఇది. దీని సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టపడి చదివే తత్వం ప్రధానం. ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను, ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత అవసరం. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్, జిప్‌మర్, సీఎంసీ తదితర పరీక్షల ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్‌గా జీవితంలో స్థిరపడటం సుదీర్ఘ ప్రక్రియనే చెప్పాలి. రెండేళ్ల పాటు ఇంటర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ కోర్సు చేయాలి. అందువల్ల ఆసక్తి, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా బైపీసీలో చేరడంపై నిర్ణయం తీసుకోవాలి.

సీఈసీ, ఎంఈసీ
వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారికి సరైన గ్రూపులు సీఈసీ, ఎంఈసీ. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కామర్స్‌లో నైపుణ్యాలున్న వారికి అవకాశాలు పలకరిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సులు సీఈసీ, ఎంఈసీ అని చెప్పొచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ. ఏ కోణంలో చూసినా ఇవి అవకాశాలకు వేదికగా నిలుస్తున్నవే.
  • ఈ గ్రూప్‌లను ఎంపిక చేసుకునే విద్యార్థులకు సహనం ముఖ్యం. చిట్టాపద్దుల సమస్యలను సాధించే క్రమంలో ఒక్కోసారి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సహనం కోల్పోతే నిర్దిష్ట అంశంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సీఈసీ, ఎంఈసీ తర్వాత చాలా మంది బీకాంలో చేరతారు. ఇప్పుడు బీకాంలో కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. (ఉదా: బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ఫారిన్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్). బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా త్వరగా స్థిరపడొచ్చు.

హెచ్‌ఈసీ:
సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్ హెచ్‌ఈసీ. ఇంటర్ హెచ్‌ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యాపరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్‌ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటు లో ఉన్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖాయం చేసుకుని ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఉన్నత విద్య పరంగానూ హెచ్‌ఈసీ తర్వాత అనేక అవకాశాలున్నాయి.

గ్రూప్ ఎంపికకు ఆసక్తి ప్రధానం
ఇంటర్‌లో గ్రూపు ఎంపిక అనేది విద్యార్థి జీవితంలో చాలా కీలకమైనది. భవిష్యత్తు కెరీర్ మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. పాఠశాల స్థాయిలో తమకు ఏ సబ్జెక్టులపై ఎక్కువ ఆసక్తి ఉందో చూసుకొని, వాటి ఆధారంగా గ్రూపును ఎంపిక చేసుకోవాలి. రెండేళ్ల తర్వాత భవిష్యత్తు ఏమిటి? అనేదానిపై ఆలోచించి విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి.
ఎం.ఎన్.రావు, శ్రీచైతన్య విద్యాసంస్థలు.


వొకేషనల్ కోర్సులు
అర్హత:
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులు: క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్స్‌షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించొచ్చు. అంతేకాకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం కూడా ఇంటర్ వొకేషనల్ గ్రూపుల్లో టెక్నికల్ గ్రూప్ ఉత్తీర్ణులకు లభిస్తుంది.
కెరీర్: బ్రాంచ్‌కనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి దిశగా వెళ్లొచ్చు.

టీఎస్‌ఆర్‌జేసీ
ఆహ్లాదకర వాతావరణంలో ఇంటర్ విద్యను అందిస్తున్నాయి తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు. ఇవి ము ఖ్యంగా గ్రామీణ, పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి తోడ్పాటునందించేందుకు ఏర్పాటయ్యాయి. ఈ కళాశాలలను రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ సొసైటీ నిర్వహిస్తోంది.
ప్రవేశాలు:
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఎంచుకున్న గ్రూపును బట్టి మూడు సబ్జెక్ట్‌లలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ/ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
నాణ్యమైన విద్య:
మొత్తం నాలుగు కాలేజీలున్నాయి. జనరల్ జూనియర్ కళాశాలల్లో (ఇంగ్లిష్ మీడియం) ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులున్నాయి. మైనారిటీ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులున్నాయి. గురుకుల కళాశాలల్లో లేబొరేటరీలు, లైబ్రరీలు, ఆటస్థలాలు.. ఇలా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులుంటాయి. అభ్యసనకు అనువైన వాతావరణం ఉంటుంది. అన్ని కళాశాలల్లో ఎంసెట్, సీఏ సీపీటీ పరీక్షలకు లాంగ్‌టర్మ్ ఇంటెన్సివ్ కోచింగ్ కూడా ఇస్తారు.

వ్యవసాయ పాలిటెక్నిక్‌లు
గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్‌లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు.
అర్హత, ప్రవేశాలు:
పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.
అవకాశాలు: వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటివాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది.

ఐటీఐ/ఐటీసీ
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియ ల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి.
అర్హత:
ఐటీఐ/ఐటీసీలలోని ట్రేడ్లలో పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు.
కోర్సులు:
ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర కోర్సులున్నాయి.
కెరీర్:
కోర్సు పూర్తయ్యాక అప్రెంటీస్ చేయొచ్చు. ఈ సమయంలో విద్యార్థి వేతనం(స్టైఫండ్) లభిస్తుంది. వివిధ కో ర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలుంటాయి. రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వయం ఉపాధి దిశగా కూడా అడుగులు వేయొచ్చు. ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారు ప్రవేశ పరీక్ష ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
వేతనాలు:
ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం పొందొచ్చు.

స్వయం ఉపాధికి ఊతం
పదో తరగతి తర్వాత స్వల్ప వ్యవధిలోనే స్వయం ఉపాధి, ఆదాయం దిశగా ఉపయోగపడే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోర్సుల్లో కొత్తవాటిని ప్రారంభించాలని, ఐటీఐ ఉత్తీర్ణులకు పాలిటెక్నిక్‌లలో లేటరల్ ఎంట్రీ పేరిట నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పించే దిశగా కేంద్ర ప్రభు త్వం యోచిస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మంచి అవకాశం లభించినట్లే.
ఎస్.పి.లక్ష్మణ స్వామి, ట్రైనింగ్ ఆఫీసర్, ఆర్‌ఐటీఐ, మహబూబ్‌నగర్.


పాలిటెక్నిక్ కోర్సులు
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు వీలుకల్పిస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నాయి.
అర్హత:
పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
మూడేళ్ల కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్‌కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచ్‌లున్నాయి. మూడున్నరేళ్ల కోర్సులు: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటివి.
కెరీర్:
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.
వేతనాలు: చేరిన సంస్థనుబట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.

పాలిటెక్నిక్‌తో బహుళ అవకాశాలు
అనేక రంగాలు విస్తరిస్తూ ఉండడంతో పాలిటెక్నిక్ అర్హతతో విధులు నిర్వర్తించే సూపర్‌వైజరీ పోస్టుల సంఖ్య పెరుగుతున్నా... విద్యార్థులు అవగాహన లేమితో వదులుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నో ఆధునిక కోర్సులు వస్తున్నాయి. వాటిని పూర్తిచేస్తే ఎన్నో అవకాశాలుంటాయి. మూడేళ్ల కోర్సులో థియరీ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచుకుంటే బీటెక్ అభ్యర్థులతో దీటుగా పోటీ పడే సామర్థ్యం కూడా లభిస్తుంది.
కె. కుమార స్వామి, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, హైదరాబాద్.
Published date : 10 Apr 2015 12:52PM

Photo Stories