Skip to main content

ఈ సెట్ పిపరేషన్ ప్లాన్

ఇంజనీరింగ్ కలను తీర్చే మరో మార్గం.. ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్).. ఈ పరీక్ష ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలో పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు.. ఇటీవల చేసిన మార్పుల కారణంగా బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ కోర్సులో చేరే అవకాశం కలుగుతోంది.. ఈసెట్-2014కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్, సంబంధిత వివరాలు..

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)-కాకినాడ, ఈ ఏడాది ఈసెట్‌ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా నిర్దేశించిన అర్హతలాధారంగా డిప్లొమా విద్యార్థులు బీఈ, బీటెక్ విభాగంలో 35కి పైగా బ్రాంచ్‌ల్లో ప్రవేశం పొందొచ్చు. బయోమెడికల్ విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఈసీఈ) బ్రాంచ్ పరీక్షకు హాజరు కావచ్చు. బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అభ్యర్థులు ఫార్మసీ మినహా మిగతా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో చేరడానికి అర్హులు.

ప్రశ్నల క్లిష్టత
సంబంధిత సబ్జెక్ట్‌లలో ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి 10+2. బ్రాంచ్ సబ్జెక్ట్ మాత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది.

సీట్ల కేటాయింపు
ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు 2013లో యూనివర్సిటీ కాలేజీల్లో 5 శాతం సీట్లను, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 20 శాతం సీట్లను కేటాయించారు. డిప్లొమా విద్యా ర్థులు చదివిన బ్రాంచ్‌లో మాత్రమే ఇంజనీరింగ్ కోర్సులో చేరొచ్చు. అన్ని బ్రాంచ్‌ల వారికి..సంబంధిత బ్రాంచ్ ర్యాంకుతోపాటు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఇస్తారు. ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్‌తో బ్రాంచ్‌తో నిమిత్తం లేకుండా ఎవరైనా ఐటీ బ్రాంచ్‌లో ప్రవేశం పొందొచ్చు. మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు రావాలంటే 200 లోపు ర్యాంకు సాధించాలి.

బీఎస్సీ విద్యార్థులు ఇలా
మ్యాథమెటిక్స్‌కు అత్యధిక వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్‌పై ఎక్కువగా దృష్టి సారించడం మంచిది. అంతేకాకుండా ఇందులోని ప్రశ్నల క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే డిగ్రీ పరీక్షల కోసం మ్యాథమెటిక్స్‌ను ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి మరోసారి మాదిరి ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ పునశ్చరణ చేసుకుంటూ పోతే ఇందులో మెరుగైన మార్కులు సాధించవచ్చు. ఇంగ్లిష్ విషయానికొస్తే.. విద్యార్థుల్లోని ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, వర్డ్ రీప్లేస్-సబ్‌స్టిట్యూట్ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్మీడియెట్ స్థాయి వరకే ఉండే గ్రామర్ అంశాలను చదివితే ఇందులో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. అనలిటికల్ ఎబిలిటీలో విద్యార్థి విశ్లేషణ, తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. డేటా సఫిషియన్సీ, కాలం, వేగం, నిష్పత్తి, వడ్డీ, వయసు, కోడింగ్- డీకోడింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇటువంటి ప్రశ్నలు ఇంటర్మీడియెట్, డిగ్రీలోకాని ఎదురు కావు. కాబట్టి సాధ్యమైనన్నీ మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.

పరీక్ష విధానం
ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్ మాధ్యమంలో 200 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో సమాధానాలను మూడు గంటల్లో గుర్తించాలి. ప్రశ్నపత్రాన్ని కూడా ఎంచుకున్న స్ట్రీమ్ ఆధారంగా భిన్నంగా రూపొందిస్తారు. ఈ క్రమంలో డిప్లొమా హోల్డర్లకు ఒక విధంగా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్), ఫార్మసీ విద్యార్థులకు మరో విధంగా ఉంటుంది. వివరాలు..

డిప్లొమా విద్యార్థులకు:
నాలుగు విభాగాల్లో పరీక్ష ఉంటుంది. అవి..
అంశం మార్కులు
మ్యాథమెటిక్స్ 50
ఫిజిక్స్ 25
కెమిస్ట్రీ 25
పాలిటెక్నిక్‌లో సంబంధిత బ్రాంచ్ 100
మొత్తం 200

బీఎస్సీ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు:
అంశం మార్కులు
మ్యాథమెటిక్స్ 100
అనలిటికల్ ఎబిలిటీ 50
కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ 50
మొత్తం 200

ఫార్మసీ కోర్సులకు:
నాలుగు విభాగాలు ఉంటాయి. అవి..
అంశం మార్కులు
ఫార్మాస్యూటిక్స్ 50
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 50
ఫార్మకాగ్నసీ 50
ఫార్మకాలజీ 50
మొత్తం 200

ప్రిపరేషన్ ప్లాన్..

మ్యాథమెటిక్స్:
మ్యాథమెటిక్స్‌లో క్యాలికులస్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, కో-ఆర్డినేట్ జామెట్రీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిల్లో క్యాలికులస్, ట్రిగ్నోమెట్రీ అంశాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ను ప్రిపేర్ కావడంతో ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లను సులభంగా అవగాహన చేసుకునేందుకు వీలు చిక్కుతుంది. ఇందులో ప్రశ్నల సరళిని గమనిస్తే..

Q. In a triangle ABC if a/cosA = b/cosB = c/cosC, then the triangle is
1) Isosccles
2) Equilateral
3) Right angled
4) Left angled
Ans: 2

ఫిజిక్స్:
ఫిజిక్స్‌లో యూనిట్స్, డెమైన్షన్స్, వెక్టార్స్, కైనమెటిక్స్, ఫ్రిక్షన్, వర్క్, పవర్, ఎనర్జీ, హీట్, సౌండ్ మోడ్రన్ ఫిజిక్స్ వంటి అంశాలు కీలకమైనవి. ఇందులో ప్రశ్నల సరళిని గమనిస్తే..

Q.The acceleration of a moving body can be found from
1) Area under velocity time graph
2) Area under distance time graph
3) Slope of the velocity time graph
4) Slope of distance time graph
Ans:3

కెమిస్ట్రీ:
ఇంజనీరింగ్‌లో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో వాటర్ ట్రీట్‌మెంట్, కరోజన్, సొల్యూషన్స్, ఫ్యూయల్స్, పొల్యూషన్, పాలిమర్స్ అంశాలను క్షుణ్నంగా చదవాలి. ఇందులో ప్రశ్నల సరళిని గమనిస్తే..

Q. A zinc rod half immersed in a beaker containing water
1) Corrods fastest at the top
2) Does not corrods at all
3) Corrod fastest at the water metal
4) Corrod fastest at the bottom
Ans: 3, 4

ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లకు సంబంధించి చదివిన డిప్లొమా ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రామాణిక పుస్తకాలను చదువుతూ.. ప్రాథమిక భావనలను అవగాహన చేసుకుంటూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. బ్రాంచ్‌ల వారీగా ఇందులోని ప్రశ్నల సరళిని గమనిస్తే..

సివిల్:
Q.
Change in the length of material with time under constant load is called
1) Homo-gin-ity
2) Defo-r-matio
3) Creep
4) Strain
Ans: 3

సీఎస్‌ఈ
Q.
In ER diagrams relationship is represented with symbol
1) Diamond
2) Rectangle
3) Double lines
4) Circle
Ans: 1

మెకానికల్:
Q.
Which of the following is not an air breathing engine?
1) Liquid propellant rocket
2) Solid propellant rocket
3) Mano propellant rocket
4) Turbo propellant rocket
Ans: 1, 2, 3

- ఈసెట్‌లో ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లు కీలకం. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి సారించడం మంచిది. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు. ఈ నేపథ్యంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఉత్తమం. ప్రస్తుత ఏడాది డిప్లొమా పూర్తి చేస్తున్న విద్యార్థులకు ఈ-సెట్ ప్రిపరేషన్ కోసం తక్కువ వ్యవధి మాత్రమే లభిస్తుంది. కాబట్టి వీలైనన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రమంలో సాధ్యమైనన్నీ షార్ట్‌కట్ మెథడ్స్ తెలుసుకోవాలి.

జనరల్ టిప్స్
  • సాధ్యమైనన్నీ మాక్‌టెస్ట్‌లు రాయాలి. దీని వల్ల లోపాలను విశ్లేషించుకోవడంతోపాటు తక్కువ సమయంలోనే సమాధానాన్ని గుర్తించే సామర్ధ్యం అలవడుతుంది.
  • ప్రామాణిక అకడమిక్ పుస్తకాలను చదువుతూ.. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది.
  • టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే లక్ష్యంతో ప్రిపేర్ కావడం మంచిది. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.
  • కనీసం రోజుకు 8 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఈ సమయాన్ని సబ్జెక్ట్ వారీగా విభజించుకోవాలి. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లకు నాలుగు గంటలు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌కు నాలుగు గంటల సమయం కేటాయించాలి.
  • ప్రతి రోజూ ప్రిపరేషన్ తర్వాత సినాప్సిస్ తయారు చేసుకోవాలి. పరీక్షకు ముందు వీటిని పునశ్చరణ చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.
  • కష్టంగా భావించే అంశాలను స్నేహితులతో చర్చించుకుంటూ ప్రిపేర్ కావడం లాభిస్తుంది.
నోటిఫికేషన్ సమాచారం
అర్హత:
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు పొందిన కళాశాల నుంచి 45 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 45 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ ఉత్తీర్ణత.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 29, 2014
  • రూ. 500 ఫైన్‌తో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2014
  • రూ. 1000 ఫైన్‌తో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2014
  • రూ. 5000 ఫైన్‌తో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2014
  • పరీక్ష తేదీ: మే 10, 2014
  • వివరాలకు: apecet.org
Bavitha
Published date : 13 Feb 2014 04:34PM

Photo Stories