Skip to main content

విద్యార్థులకు కొత్త నైపుణ్యాలుంటేనే.. కార్పొరేట్ కొలువులు

‘జాబ్ మార్కెట్‌లో ఉద్యోగం దొరకడం కష్టంగానే ఉంది’- నిరుద్యోగుల నిర్వేదం! ‘కొత్త నైపుణ్యాల గురించి అవగాహన పెంచుకుంటే ఉద్యోగాలకు కొరత లేదు’- కంపెనీలు, నియామక సంస్థల అభిప్రాయం!! తాజాగా ప్రముఖ స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్, మరో ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సంస్థ లింక్డ్ ఇన్ నివేదికలు.. జాబ్ మార్కెట్ పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నట్లు వెల్లడించాయి.
కానీ..‘కండిషన్స్ అప్లైయ్’ అంటున్నాయి. ఎందుకంటే.. కొత్త నైపుణ్యాలుంటేనే సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం పలు కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మరికొద్ది రోజుల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తోపాటు ఉద్యోగ వేటకు సన్నద్ధంకానున్న నేపథ్యంలో జాబ్ మార్కెట్ తాజా పరిస్థితిపై విశ్లేషణ...

ప్రథమార్ధం.. ఆశాజనకం :
టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆయా రంగాల్లో పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది నగరాల్లోని సంస్థలను సంప్రదించగా.. అయిదు నగరాల్లోని కంపెనీలు కొత్త నియామకాల పరంగా సానుకూలంగా స్పందించాయి. ఏప్రిల్, సెప్టెంబర్ మధ్యకాలంలో కొత్త నియామకాల పరంగా 4 శాతం వృద్ధి నమోదవనుందని అంచనా.

తయారీ, ఆటోమొబైల్ రంగం :
వాస్తవానికి ఉద్యోగాల కల్పన పరంగా తయారీ, ఆటోమొబైల్‌కు ఒడిదొడుకులు లేని రంగాలుగా పేరుంది. తాజా నివేదిక ప్రకారం తయారీ, అనుబంధ రంగాల్లో గతేడాదితో పోల్చితే ప్రతికూల వృద్ధి(-2 శాతం) నమోదైంది. ఈ రంగంలో కొత్త జాబ్ ప్రొఫైల్స్ తెరపైకి రావడం విశేషం. ఆటో మొబైల్ రంగానికి సంబంధించి కూడా కొంత ప్రతి కూల పరిస్థితులే కనిపించాయి. ఈ రంగంలో పది శాతం కంటే తక్కువ మొత్తంలోనే వేతనాల వృద్ధి నమోదైంది. 13 శాతం కంటే తక్కువ వేతన వృద్ధితో బాటమ్ పేమాస్టర్స్ జాబితాలో నిలిచింది.

రంగాల వారీగా వేతనాల వృద్ధి :
టీమ్‌లీజ్ సంస్థ మొత్తం 17 రంగాలకు చెందిన సంస్థలను సంప్రదించి సర్వే జరిపింది. దీని ప్రకారం తొమ్మిది రంగాల్లో కనీస వేతనం లో పది శాతం, గరిష్ట వేతనంలో 15.37 శాతం వృద్ధి నమోదవడమే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని చెప్పడానికి నిదర్శనమని పేర్కొంది. వేతనాల పరంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ-కామర్స్, టెక్ స్టార్టప్స్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీడీ, ఎఫ్‌ఎంసీజీ; హెల్త్‌కేర్ అండ్ ఫార్మాస్యూటికల్, ఐటీ, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, రిటైల్, టెలికం రంగాల్లో పది శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని తెలిపింది. అగ్రికల్చర్ అండ్ ఆగ్రో కెమికల్స్; ఆటోమొబైల్, అనుబంధ పరిశ్రమలు; బీపీఓ, కన్‌స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్; హాస్పిటాలిటీ, పారిశ్రామిక ఉత్పత్తి, అనుబంధ పరిశ్రమలు; పవర్ అండ్ ఎనర్జీ రంగాల్లో మాత్రం 10 శాతం కంటే తక్కువగా వేతన వృద్ధి కనిపిస్తోంది. కొన్ని రంగాల్లో వేతనాల్లో వృద్ధి పది శాతం కంటే తక్కువగా కనిపించడానికి డీ-మానిటైజేషన్, జీఎస్‌టీ ప్రధాన కారణమని, ఇది త్వరలోనే తొలగి.. ఈ రంగాల్లోనూ వేతనాల వృద్ధితోపాటు కొత్త ఉద్యోగాలు లభిస్తాయనే అభిప్రాయం వెల్లడైంది.

ప్రాంతాల వారీగా..
ప్రాంతాల వారీగా వేతనాల్లో పెరుగుదలను పరిశీలిస్తే.. ఆయా రంగాల్లో అధిక వేతనాలు లభి స్తున్న నగరాల వివరాలు..
  • ఎఫ్‌ఎంసీజీ రంగం పరంగా ముంబై నగరం 13.64 శాతంతో ముందంజలో నిలిచింది.
  • హెల్త్‌కేర్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌కు సంబంధించి ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు ముందంజలో నిలిచాయి.
  • హాస్పిటాలిటీ విషయంలో ఢిల్లీ, ముంబైలదే అగ్రస్థానం.
  • పారిశ్రామిక ఉత్పత్తి, అనుబంధ విభాగాలకు సంబంధించి అత్యధిక వేతనాలు అందించడంలో.. ముంబై, బెంగళూరు నగరాలు తొలి రెండు స్థానాల్లో నిలవగా.. వేతన వృద్ధి పరంగా పుణె, ఢిల్లీలు ముందంజలో నిలిచాయి.
  • ఐటీ అండ్ నాలెడ్జ్ సర్వీసెస్ విభాగంలో.. చెన్నై, ముంబై, బెంగళూరులో అత్యధిక వేతనాలు లభించాయి.
  • మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో అత్యధిక వేతనాలు అందించడంలో ముంబై, బెంగళూరు టాప్-2లో ఉండగా.. వేతనాల వృద్ధి పరంగా ముంబై, హైదరాబాద్ తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం.
  • పవర్ అండ్ ఎనర్జీ రంగంలో బెంగళూరు, ఢిల్లీ అత్యధిక వేతనాలు అందించే నగరాలుగా నిలిచాయి.
  • రిటైల్ రంగానికి సంబంధించి అత్యధిక వేతనాల పరంగా బెంగళూరు, ముంబై నగరాలు ముందంజలో ఉన్నప్పటికీ.. అత్యధిక వేతన వృద్ధి విషయంలో హైదరాబాద్ 12.61 శాతంతో అగ్రస్థానంలో ఉంది.
  • టెలికం రంగంలో ఢిల్లీ, ముంబైలు టాప్‌లో నిలిచాయి. వేతనాల వృద్ధి పరంగా ఢిల్లీ, చండీగఢ్, పుణె నగరాలు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.
  • ఈ-కామర్స్ అండ్ టెక్ స్టార్టప్స్ విభాగంలో బెంగళూరు, ముంబై, చెన్నైలు తొలి వరుసలో ఉన్నాయి.
  • ఎడ్యుకేషన్ సర్వీసెస్‌లో ఢిల్లీ, ముంబై, బెంగళూరులదే పైచేయి.
జాబ్ ప్రొఫైల్స్.. ఉత్తమ నగరాలు (వేతనాల వృద్ధిపరంగా) :
  • యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైనర్ (రిటైల్)- ముంబై, బెంగళూరు, ఢిల్లీ.
  • ఎంబెడెడ్ టెక్నాలజీస్ ఇంజనీర్ (పవర్ అండ్ ఎనర్జీ)-బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై.
  • డిజిటల్ మార్కెటింగ్ హెడ్ (ఐటీ)-బెంగళూరు, ముంబై, హైదరాబాద్.
  • సీఎస్‌ఆర్ మేనేజర్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (హెల్త్‌కేర్ అండ్ ఫార్మా)-హైదరాబాద్, ఢిల్లీ.
టాప్-5లో టెక్నాలజీ..
లింక్డ్ ఇన్ నివేదిక ప్రకారం వేగంగా పెరుగుతున్న ఉద్యోగాలను చూస్తే.. టాప్-5 జాబితాలో టెక్నాలజీ విభాగం నిలుస్తోంది. టాప్-10లో 8 జాబ్స్ అంటే సగటున 80 శాతం ఉద్యోగాలు టెక్నాలజీ సంబంధించినవేనని లింక్డ్ ఇన్ నివేదిక పేర్కొంది. మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనలిస్ట్, బ్యాక్-ఎండ్ డెవలపర్, ఫుల్-స్టాక్ ఇంజనీర్, డేటాసైంటిస్ట్ ప్రొఫైల్స్‌లో ఉద్యోగాలు పెరిగే అవకాశముంది. ఐటీ కంపెనీలే కాకుండా.. బీఎఫ్‌ఎస్‌ఐ, మాన్యుఫ్యాక్చరింగ్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొఫెషనల్ సర్వీసెస్, రిటైల్ అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ రంగాల్లోని సంస్థలు మెషీన్‌లెర్నింగ్ ఇంజనీర్స్, డేటాసైంటిస్ట్స్ నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి.

సీఎస్‌ఎంకు పెరుగుతున్న డిమాండ్
టాప్-5 జాబితాలో నిలిచిన ఉద్యోగాలతోపాటు ఆరో స్థానంలో నిలిచిన ఉద్యోగం.. కస్టమర్ సక్సెస్ మేనేజర్ (సీఎస్‌ఎం). సంస్థల క్లయింట్లు సాస్ సర్వీసులవైపు మొగ్గుచూపుతుండటంతో సదరు సాఫ్ట్‌వేర్‌ను సమర్థంగా వినియోగించేలా సహకరించేందుకు కస్టమర్ సక్సెస్ మేనేజర్స్ పాత్ర కీలకంగా మారుతోంది. వాస్తవానికి భారత్‌లో ఆరో స్థానంలో నిలిచినప్పటికీ.. ఆస్ట్రేలియాలో టాప్ ఎమర్జింగ్ జాబ్‌గా, అమెరికాలో నాలుగో ముఖ్య ఉద్యోగంగా సీఎస్‌ఎంకు డిమాండ్ నెలకొంది.

టెక్నాలజీ ప్రభావం-కొత్త జాబ్ ప్రొఫైల్స్..
  • టెక్నాలజీ ప్రభావంతో టాప్ రంగాల్లో అందు బాటులోకి వస్తు న్న కొత్త జాబ్ ప్రొఫైల్స్ వివరాలు..
  • ఆటోమొబైల్, అనుబంధ పరిశ్రమలు: లీగల్ అసిస్టెంట్, డిజైన్ ఇంజనీర్ (యూనిగ్రాఫిక్స్), ఎలక్ట్రాని క్ డేటా ప్రాసెసింగ్, బ్రాండ్ ఛాంపియన్, డిస్ట్రిబ్యూటర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సీఆర్‌ఎం ఎగ్జిక్యూటివ్.
  • బీఎఫ్‌ఎస్‌ఐ: అసోసియేట్-వీసీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఎన్నారై రిలేషన్‌షిప్ మేనేజర్, సెక్యూరిటీ సూపర్‌వైజర్, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్, అనలిస్ట్-లిక్విడిటీ రిస్క్ కంట్రోలర్, హడూప్ డెవలపర్.
  • బీపీఓ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్: బ్యాక్ ఎండ్ సపోర్ట్ (ఎంట్రీ లెవల్ ఎంప్లాయీస్), కంటెంట్ రైటర్, ప్రాసెస్ ట్రైనర్, సోర్సింగ్ మేనేజర్, ప్రోగ్రామ్ అనలిస్ట్- ఐటీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్(పీయూఎఫ్ ప్యానెల్స్).
  • ఈ-కామర్స్ అండ్ ఇంటర్నెట్ స్టార్టప్స్: రికన్సిలియేషన్ ఎగ్జిక్యూటివ్, రెన్యువబుల్ ఎగ్జిక్యూటివ్, డేటా కలక్షన్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్-సీఆర్‌ఎం, ఇన్‌సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్.
  • ఐటీ అండ్ నాలెడ్జ్ సర్వీసెస్: సేల్స్‌ఫోర్స్ డెవలపర్, ప్రొడక్ట్ డెవలపర్, డిజిటల్ క్రాక్టోగ్రాఫర్స్, ఎస్‌ఏఎంఐ డెవలపర్, డిజిటల్ మార్కెటింగ్ హెడ్, ఇన్‌సైడ్ సేల్స్ స్పెషలిస్ట్.
  • రిటైల్: శాంప్లింగ్ స్టాఫ్, ఫ్యాషన్ కన్సల్టెంట్, విజువల్ బ్రాండింగ్ మేనేజర్.
  • తయారీరంగ, అనుబంధ పరిశ్రమలు: ప్రొ క్యూర్‌మెంట్ అనలిస్ట్, లేథ్ వర్కర్, క్లస్టర్ ఇన్‌ఛార్జ్, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్.
  • హెల్త్‌కేర్ అండ్ ఫార్మాస్యూటికల్: హెల్త్‌కేర్ అసిస్టెంట్, రిలేషన్‌షిప్ థెరపిస్ట్, లైన్ కెమిస్ట్, వెల్‌నెస్ అడ్వైజర్.
  • ఎఫ్‌ఎంసీజీ: కీ అకౌంట్ మేనేజర్, రూరల్ మార్కెట్ డెవలపర్, హౌస్ కీపర్/సూపర్‌వైజర్.
  • టెలికం: జోనల్ మార్‌కామ్ ఎగ్జిక్యూటివ్, రిగ్గర్, ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కోఆర్డినేటర్, రిపెయిర్ ఇంజనీర్, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, ఆన్‌సైట్ ఇంజనీర్.

ఎలాంటి అర్హతలున్నా
..
 ప్రస్తుతం దేశంలోని ఉత్పత్తి, సేవల రంగాలను పరిగణనలోకి తీసుకుంటే.. అకడమిక్‌గా ఎలాంటి అర్హతలున్నా... నైపుణ్యాలున్నవారికి ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తోంది. సగటున రూ.8 వేల నుంచి రూ.పది వేలు వేతనం లభించే బ్లూకాలర్ జాబ్స్ మొదలు.. మేనేజర్ వరకు ప్రతి స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. టెక్నాలజీ ఆధారిత ఉద్యో గాల పరంగా ఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యాలున్న వారికి సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. 
 - అజయ్ షా, వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్-రిక్రూట్‌మెంట్ సర్వీసెస్, టీమ్‌లీజ్.
 
 టెక్నికల్ నైపుణ్యాలు కీలకం..
 మాన్యుఫ్యాక్చరింగ్ వంటి కోర్‌సె క్టార్‌లో సైతం ఆటోమేషన్ ప్రమేయం పెరుగుతోంది. ఔత్సాహికులు ముఖ్యం గా టెక్నికల్ గ్రాడ్యుయేట్లు తాజా టెక్నా లజీని అందిపుచ్చుకునేందుకు ప్రయ త్నిస్తే ఉద్యోగం సొంతం చేసుకోవడం పెద్ద కష్టంకాదు. నాన్-టెక్నికల్ జాబ్ రోల్స్ పరంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
- అనింద్య మైత్ర, ఏవీపీ, మైండ్ ట్రీ కన్సల్టింగ్.
Published date : 27 Sep 2018 05:23PM

Photo Stories