Skip to main content

జీప్యాట్-2019 విజయానికి మార్గాలు...

జీప్యాట్.. ఫార్మసీలో పీజీ కోర్సుల్లో (ఎంఫార్మసీ) ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష! ఎంఫార్మసీలో అడ్మిషన్ కోసమే కాకుండా.. జీప్యాట్‌తో ఉపకార వేతనాలు అందుకోవచ్చు. అంతేకాదు పీజీ పూర్తయ్యాక పీహెచ్‌డీలో చేరేందుకు కూడా జీప్యాట్ ర్యాంకు దోహదపడుతుంది.
 అంతటి ప్రాముఖ్యత కలిగిన జీప్యాట్ 2019కు నోటిఫికేషన్ విడుదలైంది. తొలిసారిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తున్న జీప్యాట్ తీరుతెన్నులు, ప్రయోజనాలు, ప్రిపరేషన్ గెడైన్స్ గురించి తెలుసుకుందాం...

అర్హతలు..
  • 10+2 తర్వాత, లేటరల్ ఎంట్రీ విద్యార్థులతో సహా ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. బీఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా జీప్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
  • బీటెక్(ఫార్మాసూటికల్, ఫైన్ కెమికల్ టెక్నాలజీ), తత్సమాన ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
ప్రయోజనాలు అనేకం..
  • జీప్యాట్.. ఫార్మసీ విద్యార్థుల కెరీర్‌కు ఊతమిస్తుంది. జీప్యాట్‌లో ర్యాంకు సాధిస్తే... ఫార్మసీలో ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు.
  • జీప్యాట్‌లో ర్యాంకు ద్వారా పేరున్న ప్రభుత్వ ఫార్మసీ ఉన్నత విద్యా సంస్థల్లో చేరొచ్చు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ముంబై; బిట్స్ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చేరేందుకు కూడా జీప్యాట్ ర్యాంకు ఉపయోగపడుతుంది.
  • నైపర్‌లో అడ్మిషన్ కోసం నైపర్ జేఈఈ పరీక్ష రాయాలన్నా.. జీప్యాట్‌లో ర్యాంకు సాధించాలి.
  • ఏఐసీటీఈ అనుమతితో నడుస్తున్న విద్యాసంస్థల్లో జీప్యాట్ ర్యాంకు ద్వారా చేరితే పీజీ కోర్సు పూర్తయ్యే వరకు నెలకు రూ.12,400 స్టైపెండ్ పొందొచ్చు.
  • జీప్యాట్ స్కోరు మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. కాబట్టి రెండేళ్ల పీజీ కోర్సు అనంతరం జీప్యాట్ స్కోరుతో పీహెచ్‌డీ ప్రవేశాలు సైతం దక్కించుకోవచ్చు. పీహెచ్‌డీలో ప్రవేశం పొందితే నెలకు రూ.25,000 వరకూ ఫెలోషిప్స్ లభిస్తుంది.
  • జీప్యాట్‌లో అర్హత సాధిస్తే ఫార్మా ఇండస్ట్రీలోని కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత అవకాశాలు అందుకునే వీలుంటుంది. దేశీయ కంపెనీలతోపాటు, బహుళజాతి సంస్థలు సైతం జీప్యాట్ అర్హులకు ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం.
  • జీప్యాట్ స్కోరు ఉంటే ఫార్మసీ కాలేజీల్లో బోధన వృత్తిలో చేరొచ్చు. ఫార్మసీ కాలేజీలు.. జీప్యాట్ స్కోరు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తుండటం కలిసొస్తుంది.
  • జీప్యాట్ ప్రిపరేషన్ ఫార్మసీ నేపథ్యంగా నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. పీజీఈసెట్, ఇతర ఫార్మా ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ రంగంలో నిర్వహించే ఫార్మాసిస్ట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల నియామకాలకు నిర్వహించే పరీక్షలకు జీప్యాట్ సన్నద్ధత ఉపయోగపడుతుంది.
500 మార్కులకు పరీక్ష :
జీప్యాట్ పరీక్షలో ర్యాంకు సాధించడం అంత సులువేమీ కాదు. దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల్లో 10 శాతం లోపు విద్యార్థులు మాత్రమే అర్హత సాధిస్తున్నారు. కాబట్టి జీప్యాట్‌లో విజయానికి పరీక్ష తీరుతెన్నులను సమగ్రంగా అవగాహన చేసుకొని పటిష్ట ప్రిపరేషన్ సాగించాలంటున్నారు నిపుణులు. జీప్యాట్.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్ మీడియంలో జరుగుతుంది. ప్రశ్నపత్రంలో మొత్తం 125 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయిస్తారు. అంటే.. మొత్తం 500 మార్కులకు పరీక్ష ఉంటుంది. మూడు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది.ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు.

సిలబస్ :
బయోఫార్మాటిక్స్ అండ్ ఫార్మకో కైనటిక్స్; ఫిజికల్ ఫార్మసీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, డిస్పెన్సింగ్ అండ్ హాస్పిటల్ ఫార్మసీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోకెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మకాలజీ, పాథోఫిజియాలజీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ జ్యూరిస్‌డిక్షన్, ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్, ఫార్మాస్యూటికల్ అనాలసిస్, క్లినికల్ ఫార్మసీ అండ్ థెరాప్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అంశాలు సిలబస్‌లో పేర్కొన్నారు. ఆయా సబ్జెక్టుల పూర్తి సిలబస్ అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంది.

ప్రిపరేషన్ టిప్స్...
  • జీప్యాట్‌లో మంచి స్కోర్ సాధించాలంటే.. ప్రధానంగా ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలపై పట్టు సాధించాలి.
  • తొలుత బీఫార్మసీ పాఠ్యపుస్తకాల్లోని బేసిక్స్‌పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. ముఖ్యమైన అంశాలకు సంబంధించిన అప్లికేషన్‌‌సను నేర్చుకోవాలి. గత పేపర్లు. గేట్ ఫార్మసీ పేపర్‌లను పరిశీలించి ప్రశ్నల తీరును అర్థం చేసుకోవాలి.
  • మల్టిపుల్ చాయిస్, అసెర్షన్-రీజన్, స్టేట్‌మెంట్ బేస్డ్ విధానంలో ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. సొంత నోట్స్ సిద్ధం చేసుకొని సన్నద్ధమవడం ఉపయుక్తం. ఫలితంగా రివిజన్‌ను వేగంగా పూర్తి చేసుకోవచ్చు.
  • నెగిటివ్ మార్కులు ఉండటం వల్ల విద్యార్థులు కచ్చితంగా తెలిసిన ప్రశ్నలకే సమాధానాలు గుర్తించడం మేలు.
  • వేర్వేరు సబ్జెక్టుల్లో సారూప్య అంశాలను అనుసంధానం చేసుకుంటూ.. చదవడం మేలు. ఒక సబ్జెక్టులో ఉన్న అంశాలు... ఇతర సబ్జెక్టులు, చాప్టర్లతో సంబంధం కలిగి ఉంటాయి. వాటిని అనుసంధానం చేసుకుంటూ... చదివితే సులువుగా గుర్తుండటమే కాకుండా సిలబస్ కూడా వేగంగా పూర్తవుతుంది.
  • టేబుల్స్‌ను రూపొందించుకోవటం ద్వారా ఫార్మకాగ్నసీలోని అంశాలపై తేలిగ్గా పట్టు సాధించొచ్చు.
  • జీప్యాట్‌లో అప్లికేషన్ ఓరియెంటేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ప్రిపరేషన్ కూడా లోతుగా ఉండాలి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను మాత్రమే ప్రాక్టీస్ చేసే కంటే సబ్జెక్టును సమగ్రంగా అధ్యయనం చేయడంపై దృష్టిసారించాలి.
  • మోడల్ టెస్టులు రాస్తూ.. వాటి ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. సందేహాలుంటే ఫ్యాకల్టీ సహాయంతో నివృత్తి చేసుకోవాలి.
  • వెబ్‌సైట్లో రిఫరెన్స్ పుస్తకాల జాబితా, సిలబస్ అందుబాటులో ఉంది.
ముఖ్యసమాచారం :
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2018, నవంబర్ 30.
 దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.1400. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.700.
 అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: 2019, జనవరి 7.
 జీప్యాట్ పరీక్ష తేదీ: 2019, జనవరి 28.
 ఫలితాల వెల్లడి: 2019, ఫిబ్రవరి 8.
 పరీక్ష కేంద్రాలు: తెలంగాణ:- హైదరాబాద్, వరంగల్; ఏపీ:- గుంటూరు, కర్నూలు, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి.
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ntagpat.nic.in
Published date : 24 Nov 2018 03:25PM

Photo Stories