Skip to main content

ఈ యాప్ లతో స్మార్ట్ గా చదువుకోవచ్చు..!

కోవిడ్–19 లాక్డౌన్తో స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యార్థులు ఇప్పట్లో తరగతులకు వచ్చే అవకాశం కనిపించడంలేదు. దాంతో విద్యాసంస్థలు ఆన్లైన్ బోధన వైపు మొగ్గు చూపుతున్నాయి.
 అందుకోసం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. నిన్నా మొన్నటి దాకా కంపెనీల్లో ఉద్యోగుల ‘ఆన్లైన్ మీటింగ్స్’ కోసం ఉపయోగించే ఫ్లాట్ఫామ్స్.. ఇప్పుడు బోధనకు ఉపకరణాలవుతున్నాయి. అందివచ్చిన ఆధునిక టెక్నాలజీ.. ‘ఎడ్యుకేషన్ యాప్స్’తో ఆడియో/వీడియో బోధన మొదలైంది. ప్రస్తుతం ప్రతి ఇల్లు స్మార్ట్ క్లాస్గా మారిపోతోంది. ముఖ్యంగా నగరాల్లో ప్రతి ఇంట్లో వై–ఫై కనెక్షన్, ఆండ్రాయిడ్ టీవీ, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్.. వీటిలో కనీసం రెండైనా ఉంటున్నాయి. ఆయా ఎడ్యుకేషన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని పాఠాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ‘ఎడ్యుకేషనల్ యాప్స్’పై ప్రత్యేక కథనం.

జూమ్
‘జూమ్’(zoom) అనేది వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్. బిజినెస్ మీటింగ్స్ కోసం రూపొందించిన జూమ్ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ ఇప్పుడు ఉపాధ్యాయులు.. విద్యార్థులను అనుసంధానించేందుకు, క్లాస్రూమ్ శిక్షణకు ఉపయోగపడుతోంది. ఈ యాప్ను ఉపయోగించి అధ్యాపకులు పాఠ్యంశాలను ఆన్లైన్లో విద్యార్థులకు బోధించే వీలుంది. ఎక్కడ నుంచైనా సమూహంతో నేరుగా మాట్లాడవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ పరిమితంగా (40 నిమిషాలు) వినియోగించుకుంటే ఉచిత సేవలు అందిస్తున్నారు. ఎక్కువ స్థాయిలో వినియోగించాలంటే మాత్రం ఫీజు చెల్లించాల్సిందేనని సదరు సంస్థ చెబుతోంది. ప్రతి నెలా సుమారు 20 డాలర్లు చెల్లిస్తే 100 మంది లేదా అంతకంటే ఎక్కువ మందికి ఒకేసారి ఆన్లైన్ వీడియో పాఠాలు చెప్పవచ్చు. ఇటీవల జూమ్ ఫ్లాట్ఫామ్లో భద్రత సమస్యలు ఉన్నాయని, దీన్ని వాడరాదని కేంద్రప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే!

గూగుల్ హ్యాంగ్ అవుట్ ..
వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలోకి ప్రవేశించిన గూగుల్ కంపెనీ ఇప్పటికే పలు ఫ్లాట్ఫామ్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్లో ఎక్కువ మందిని ఒకేసారి కలిసేందుకు అనువైన వేదికగా ‘గూగుల్ హ్యాంగ్ అవుట్’ (Google Hangouts)ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ సంస్థ జి–సూట్ గురించి చాలామందికి తెలుసు. వ్యాపార సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడెక్కడో ఉన్న తమ సిబ్బందిని ఒకేసారి కలిసి మీటింగ్స్ నిర్వహించేందుకు ‘హ్యాంగ్ అవుట్’ వీడియో కమ్యూనికేషన్ చక్కటి ప్లాట్ ఫామ్. దీనినే ఇప్పుడు కొన్ని స్కూళ్లు, కాలేజీలు తమ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు చెప్పేందుకు వినియోగిస్తున్నాయి. గూగుల్ సూట్లో మెంబర్స్ దీనిద్వారా సులువుగా ఆన్లైన్లో కలవవచ్చు. నెలకు ఆరు డాలర్లు ఫీజుగా చెల్లిస్తే అపరిమిత సేవలు పొందవచ్చని సదరు సంస్థ చెబుతోంది.

గూగుల్ మీట్
ఇది గూగుల్ హ్యాంగ్ అవుట్కు అప్డేటెడ్æ వెర్షన్. ‘గూగుల్ మీట్’(Google Meet) ఫ్లాట్ఫామ్ ను బోధనకు సైతం వినియోగించవచ్చు. ముందుగా షెడ్యూల్ను నిర్ణయించుకోవడం.. మెంబర్స్/స్టూడెంట్స్ పేర్లు ఎంటర్ చేయడం ద్వారా ఆన్లైన్లోకి తీసుకోవచ్చు. అంతేకాదు.. క్లాస్ మొదలు పెట్టడంతో పాటు సభ్యుల్లో కొందరిని తొలగించడం, చేర్చుకోవడం వంటి వెసులుబాటు కూడా ఉంది. ఈ వెర్షన్లో వీడియో కాల్స్ ఫ్రీగానే అందిస్తున్నారు. ఎక్కువ మందితో కలిసి వినియోగించుకునేందుకు అవసరమైన ఫీచర్ల కోసం మాత్రం కొంత మొత్తం చెల్లించాలి. గూగుల్ మీట్ ఫ్లాట్ఫామ్ ద్వారా ఒకేసారి 30 మందికి పైగా హై–డెఫినిషన్ వీడియో కాల్స్ ద్వారా లైవ్లో కలిసేందుకు అవకాశం ఉంది.

గో టు మీటింగ్..
మరో ఆన్లైన్ సమావేశ వేదిక ‘గో టు మీటింగ్’ (Go To Meeting) ద్వారా కూడా ఆన్లైన్ క్లాసులు చెబుతున్నారు. వాస్తవానికి ఇది ఆన్లైన్ మీటింగ్, డెస్క్టాప్ షేరింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్. దీన్ని ఉపయోగించేవారు ఆన్లైన్లో కస్టమర్లు, క్లయింట్స్, కొలీగ్స్తో ముచ్చటించొచ్చు. ఈ సాఫ్ట్వేర్తో అన్ని రకాలుగా విద్యార్థులను అనుసంధానం చేయవచ్చు. ఈ యాప్ వినియోగించాలంటే.. 10 మంది పాల్గొనే సమూహాలకు నెలకు 14 డాలర్లు, 150 మంది పాల్గొంటే 29 డాలర్లు చెల్లించాలి. ఆన్లైన్ ఫేస్ టు ఫేస్ మీటింగ్కు ఇది అనువైనదని చెప్పవచ్చు.

స్కైప్ ఫర్ బిజినెస్…
మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన ‘స్కైప్’ వీడియో చాట్ గురించి అందరికీ తెలిసిందే. వాట్సాప్ వీడియో కాలింగ్ లేని కాలంలో విదేశాల్లో ఉన్నవారితో వీడియో ద్వారా మాట్లాడే అవకాశం స్కైప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు దీన్నే ‘స్కైప్ ఫర్ బిజినెస్’( జుyp్ఛ జౌట ఆuటజీn్ఛటట)గా మార్చి వీడియో కాన్ఫరెన్సింగ్’ సాధనంగా అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న 250 మందిని ఒకేసారి ఆన్లైన్లో కలవచ్చు. వినియోగదారులు నెలకు 2 డాలర్లు ఫీజు చెల్లించి వినియోగించుకోవచ్చు. బిజినెస్ మీటింగ్స్ కోసం ఉద్దేశించిన ఈ ఫ్లాట్ఫామ్ ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్రూమ్ శిక్షణకు సైతం ఉపయోగపడుతోంది.

సిస్కో వెబ్ఎక్స్…
పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్న కంపెనీలు.. తమ బృంద సభ్యులతో ఆన్లైన్ సమావేశం కోసం ‘సిస్కో’ అందుబాటులోకి తెచ్చిన వెబ్ ఆధారిత ఫ్లాట్ఫామ్.. ‘వెబ్ఎక్స్’ (Cisco WebEx). ఈ వెబ్ఎక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు, వెబ్ కాన్ఫరెన్సింగ్, వాయిస్ కాలింగ్ సేవలను పొందవచ్చు. దీనినే ఇప్పుడు ఉపాధ్యాయులు.. ఇళ్ల వద్దనున్న తమ విద్యార్థులతో అనుసంధానం అవుతూ ఆన్లైన్లో లైవ్ బోధన చేస్తున్నారు. వినియోగ సామర్థ్యాన్ని బట్టి ధర నెలకు 13.50 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.

బ్లూజీన్స్
బ్లూజీన్స్(BlueJeans) అనేది వివిధ రకాలుగా వినయోగించుకునేందుకు అనువుగా రూపొందించిన క్లౌడ్ ఆధారిత వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్. ఇతర ఆన్లైన్ లైవ్ యాప్స్, పోర్టల్స్లో ఉండే క్లిష్టమైన సేవలకు భిన్నంగా, సరళంగా వాడుకునేలా దీనిని అందుబాటులోకి తెచ్చారు. బ్లూజీన్స్.. భిన్నమైన పరికరాలు, ప్లాట్ఫామ్స్, కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్లతో ఎక్కడైనా వీడియో సమావేశాలు, తరగతులు నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. ఈ యాప్ వినియోగానికి నెలకు 16.65 డాలర్లు ఫీజుగా సంస్థ నిర్ణయించింది.

అప్పియర్.ఇన్
చిన్న కంపెనీలు పరిమిత సంఖ్యలో ఉండే తమ టీమ్స్ పెద్దగా ఇబ్బందులు లేకుండా వీడియో చాటింగ్ ద్వారా అనుసంధానం అయ్యేందుకు అప్పియర్.ఇన్ (Appear.in)ను వినియోగిస్తున్నాయి. ఇది ఆన్లైన్ సమావేశాలకు, శిక్షణలకు మంచి వేదిక. పరిమిత అప్పియర్.ఇన్ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. అయితే ప్రతి నెల సుమారు 100 డాలర్లు చెల్లిస్తే ఒకేసారి 150 మందితో కలిసే అవకాశం లభిస్తుంది. దీన్ని ఆన్లైన్ బోధనకు ఉపయోగిస్తున్నారు.

బిగ్ బ్లూ బటన్..
ఆన్లైన్ లెర్నింగ్ కోసం ‘బిగ్ బ్లూ బటన్’(Big Blue Button) చక్కటి వేదికగా చెప్పవచ్చు. ఇందులో మరో ప్రత్యేకత యాడ్ ఆన్ సర్వీసులు. వీటిని థర్డ్ పార్టీ డెవలపర్స్ ద్వారా పొందవచ్చు. అంతేకాదు.. వీటిని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్(ఎల్ఎంఎస్)తో అనుసంధానించవచ్చు. ఉచితంగా పొందేందుకు వీలున్న బిగ్ బ్లూ బటన్ సేవల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య రెగ్యులర్ క్లాస్ అనుభూతి కలుగుతుందని డెవలపర్ సంస్థ చెబుతోంది. ఇందులో చాటింగ్, వీడియో, ఆడియో, వెబ్క్యామ్, మల్టి యూజర్ వైట్బోర్డ్ వంటి సేవలను పొందవచ్చు.

Published date : 24 Apr 2020 03:39PM

Photo Stories