Skip to main content

Income tax slabs: ఏప్రిల్ నుంచి మార‌నున్న ప‌న్ను విధానం... ప‌న్ను చెల్లింపుదారులు గుర్తించుకోవాల్సిన అంశాలివే...

కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కాబోతోంది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో నిర్ణయాలు అదే రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితి పెంపు, సీనియర్‌ సిటిజన్లకు డిపాజిట్లపై పరిమితి పెంపు వంటి ఊరటనిచ్చే నిర్ణయాలు 1 నుంచే అమలు కానున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఎల్‌టీసీజీ ప్రయోజనాలు తొలగింపు, అధిక ప్రీమియం కలిగిన జీవిత బీమా పాలసీపై పన్ను వాత వంటివీ ఆ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి.
Income Tax Rules Changing From April 1
Income Tax Rules Changing From April 1

డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం
2023 బడ్జెట్‌లో ఎక్కువగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశం కొత్త ఆర్థిక పన్ను విధానం. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి ఈసారి బడ్జెట్‌లో కీలక మార్పులను ప్రతిపాదించారు. ఇక నుంచి రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో ‘కొత్త ఆదాయ పన్ను విధానం’ డిఫాల్ట్‌ ఆప్షన్‌గా ఇస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు వారికి ఇష్టమున్న పన్ను విధానాన్ని ఎంచుకొనే వెసులు బాటును కల్పించారు.

Budget 2023:  సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకం పరిమితి పెంపు
పన్ను రాయితీ పరిమితి పెంపు
పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు పన్ను ఆదాయంపై రిబేట్‌ ఇచ్చేవారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో ఈ రిబేట్‌ను రూ.7 లక్షల వరకు పెంచారు. దీంతో రూ.7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త విధానంలో పన్ను మినహాయింపులు వర్తించవు కాబట్టి పన్ను చెల్లింపుదారుడు ఎంతమొత్తంలో పెట్టుబడి పెట్టారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు.
కొత్త పన్ను శ్లాబులు ఇలా..
గతంలో కొత్త పన్ను విధానంలో ఆరు శ్లాబులు ఉండేవి. వాటిని ఈ సారి ఐదుకు కుదించారు. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా ఐదు శ్లాబులే ఉంటాయి. రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించరు. రూ.3-6  లక్షల వరకు 5 శాతం; రూ.6-9 లక్షల వరకు 10 శాతం; రూ.9-12 లక్షల వరకు 15 శాతం; రూ.12-15 లక్షల వరకు 20 శాతం; రూ.15 లక్షల కంటే అధికంగా ఉంటే 30 శాతం పన్ను కట్టాలి. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులూ లేవు.

చ‌ద‌వండి: వందలో 20 వడ్డీలకే పోతోంది.. పెట్రోల్ స‌బ్సిడీలో కోత‌.. పూర్తి విశ్లేష‌ణ‌​​​​​​​
సీనియర్‌ సిటిజన్లకు ఊరట..

సీనియర్ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌లో ఒక్కో వ్యక్తి రూ.15 లక్షల వరకు గరిష్టంగా డిపాజిట్‌ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడా పరిమితిని రూ.30లక్షలకు పెంచారు. అలాగే మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (MIS) పరిమితిని కూడా పెంచారు. ఇంతకు ముందు సింగిల్‌ అకౌంట్‌ కలిగిన వ్యక్తి నెలకు రూ.4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్‌ చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ డిపాజిట్‌ను రూ.9లక్షలకు పెంచారు. ఇక జాయింట్‌ అకౌంట్‌లో రూ.7.5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.15లక్షల వరకు పెంచారు.
జీవిత బీమా పాలసీలపై పన్ను
ఇప్ప‌టివ‌ర‌కు జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. 2023 ఏప్రిల్‌ 1 తర్వాత కొనుగోలు చేసిన పాలసీ ప్రీమియం మొత్తం రూ.5 లక్షలు దాటితే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను విధిస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాలసీల మొత్తం రూ.5 లక్షలు దాటినా పన్ను వర్తిస్తుంది. యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌కు ఈ నియమాలు వర్తించవు.

చ‌ద‌వండి:​​​​​​​ ఆర్థిక వృద్ధికి నిర్మలమ్మ కొత్త సూత్రం.. పొదుపు కాదు.. ఖర్చు చేయండి!​​​​​​​
-
పాత పన్ను విధానంలో ఉద్యోగులకు ఇచ్చే రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌లో ఎలాంటి మార్పు లేదు. పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని కొత్త పన్ను విధానానికి పొడిగిస్తున్నారు. రూ.15.5 ల‌క్ష‌లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ప్రతి వేతన జీవికి రూ.52,500 లబ్ది చేకూరుతుంది.
- ప్రభుత్వేతర కార్మికులు ఇక‌పై రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు Encashed leaves ను ఎన్‌క్యాష్ చేసుకోవ‌చ్చు.
- ఇక‌పై బంగారాన్ని.. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ (ఈజీఆర్)గా మార్చుకుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు.  
- డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లపై ఇస్తున్న దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇకపై వీటిలో చేసే మదుపుపై వచ్చే రాబడిపై ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 35 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయని డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లకు ఇకపై ఎల్‌టీసీజీ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేస్తే వాటిని దీర్ఘకాల పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఇండెక్సేషన్‌తో కలిపి 20 శాతం ఎల్‌టీసీజీ పన్ను వేస్తున్నారు. ఇండెక్సేషన్‌ లేకుండా అయితే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఈ ఫండ్లలో మదుపు చేసిన వారందరూ ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 1 నుంచే ఇది అమల్లోకి రానుంది.

Published date : 29 Mar 2023 04:30PM

Photo Stories