Skip to main content

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2019-20

వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తన తొలి వ్యవసాయ బడ్జెట్‌లో- నవరత్నాలలో భాగంగా ప్రకటించిన ‘వైఎస్సార్ రైతు భరోసా’కు పెద్దపీట వేసింది.
జూలై 12న శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి వ్యవసాయం, అనుబంధ రంగాలకు మొత్తం రూ.28,866.23 కోట్లు ప్రతిపాదించగా, అందులో దాదాపు మూడో వంతు రూ.8,750 కోట్లను రైతుకు పెట్టుబడి సాయం కోసం కేటాయించారు. ఈ పథకంతో 15.37 లక్షల మంది కౌలు రైతులు సహా మొత్తం 70 లక్షల మంది అన్నదాతలు లబ్ధి పొందనున్నారు.

Budget 18-19

వ్యవసాయ బడ్జెట్‌లో కీలకాంశాలు..
  • రైతులందరికీ వడ్డీ లేని రుణాలు
  • దరల స్థిరీకరణ నిధి రూ. 3,000 కోట్లు
  • ప్రకృతి విపత్తుల నిధి రూ. 2,000 కోట్లు
  • రైతులు మరణిస్తే రూ. 7 లక్షల చొప్పున ఆర్థిక సాయం
  • రైతు సమస్యల పరిష్కార వేదికగా అగ్రీ మిషన్
  • పట్టు పరిశ్రమ శాఖ రూ.158.46 కోట్లు
  • పశు సంవర్థక శాఖ 1240.93 కోట్లు
  • పౌల్ట్రీ రైతుల రుణాలపై వడ్డీ రాయితీ
  • మత్స్య శాఖ రూ.550.86 కోట్లు
  • సహకార రంగం రూ.234.64 కోట్లు
  • ఆక్వా రంగంలో విద్యుత్ చార్జీల రాయితీ రూ.475 కోట్లు
  • ఉపాధి హామీతో వ్యవసాయ, అనుబంధ రంగాలు అనుసంధానానికి రూ.3626 కోట్లు
  • -ై వెఎస్సార్పీఎం ఫసల్ బీమా యోజన రూ.1,163 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ రూ.460.05 కోట్లు
  • వడ్డీ లేని రుణాలు రూ.100 కోట్లు
  • వైఎస్సార్ రైతు బీమా రూ.100 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.341 కోట్లు
  • రాయితీ విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు
  • రాష్ట్రంలో ఏర్పాటయ్యే కేంద్ర పరిశోధనా సంస్థలకు చేయూత
  • పులివెందులలో అరటి పరిశోధన, ప్రాసెసింగ్ యూనిట్
  • సహకార డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.4 బోనస్
  • పశువులు చనిపోతే పరిహారం
  • పశువుల మందుల సరఫరాకు రూ.75.35 కోట్లు
  • -వైఎస్సార్ రైతు భరోసా కింద ఉచిత బోర్లు రూ. 200 కోట్లు
  • వేర్‌హౌసింగ్ మౌలిక వసతుల నిధి రూ. 200 కోట్లు
  • వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ రూ. 109 కోట్లు
  • రైతులకు ఎక్స్‌గ్రేషియో రూ. 100 కోట్లు
  • సహకార రంగంలో డెయిరీ పటిష్టత రూ. 100 కోట్లు
  • పశుగ్రాసం, దాణా రూ. 100 కోట్లు
  • గోదాముల నిర్మాణం రూ. 37.54 కోట్లు
  • చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు సాయం రూ. 100 కోట్లు
  • చేపల వేట విరామ సమయంలో ఇచ్చే సాయం రూ.10 వేలు
  • జాలర్లకు ఇచ్చే ఆయిల్ సబ్సిడీ లీటర్‌కు రూ.12.96కు పెంపు
  • ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణిస్తే ఇచ్చే పరిహారం రూ.10 లక్షలకు పెంపు
  • మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీ రూ.100 కోట్లు
  • మత్స్య సంపద అభివృద్ధికి రూ.60 కోట్లు
  • ఎస్సీ మత్స్యకారుల సంక్షేమం, సహాయం రూ.50 కోట్లు
  • ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి రూ.100 కోట్లు
జాతీయ ఆహార భద్రతా మిషన్‌కు రూ.141.26 కోట్లు  Budget 18-19 దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ఏపీలోనే రూ.2,000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి, రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించేలా జాతీయ ఆహార భద్రతా మిషన్‌కు బడ్జెట్‌లో రూ.141.26 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.341 కోట్లు కేటాయించారు. రైతులకు రాయితీ విత్తనాల సరఫరాకు రూ.200 కోటు, భూసార, భూ విశ్లేషణ పరీక్షల కోసం రూ.30.43 కోట్లు, సూక్ష్మ ధాతు లోపమున్న పొలాలకు జింకు, జిప్సం, బోరాన్ వంటి పోషకాలను 100% రాయితీపై పంపిణీ చేసేందుకు మరో రూ.30.05 కోట్లు, యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి రూ.460.05 కోట్లు ప్రతిపాదించారు. వర్షాధారిత ప్రాంతాల్లో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌ను అమలు చేస్తామని మంత్రి అన్నారు. ప్రకృతి సాగుకు ‘పరంపరాగత కృషి వికాస్ యోజన’ కింద రూ.91.31 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2019-20లో రైతుల సంక్షేమం, వ్యవసాయ విభాగం అభివృద్ధికి రెవెన్యూ పద్దు కింద రూ.12,280.14 కోట్లు, క్యాపిటల్ వ్యయ పద్దు కింద రూ.230.28 కోట్లు కేటాయించారు.
 
 మూడు విశ్వవిద్యాలయాలకు...
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ శాఖల పరిధిలో ఉన్న 3 విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.630.60 కోట్లను ప్రతిపాదించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నాబార్డ్-ఆర్‌ఐడీఎఫ్ నిధులు రూ.60 కోట్లతో కలిపి మొత్తం రూ.415 కోట్లు, ఉద్యాన వర్సిటీకి రూ.98.60 కోట్లు, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.117 కోట్లు ప్రతిపాదించారు.
 
 వివిధ శాఖలకు కేటాయింపులు  
 వ్యవసాయంతో పాటు ఉద్యాన రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అధిక ఉత్పాదకత కలిగిన పసుపు వంగడాలను రైతులకు 50 శాతం రాయితీపై అందజేయనుంది. ఉద్యాన శాఖకు 2019-20లో రెవెన్యూ పద్దు కింద మొత్తం రూ.1,532 కోట్లను ప్రతిపాదించగా, అందులో బిందు, తుంపర సేద్య పరికరాల సరఫరాకు రూ.1,105.66 కోట్లు, పామాయిల్ రైతులకు ధరలో వ్యత్యాసం నివారించేందుకు అదనంగా రూ.80 కోట్లు ఉన్నాయి. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం, అరటి ప్రొసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టు పరిశ్రమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు 90% రాయితీని ప్రకటించింది. బైవోల్టిన్ పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రైతులకు కేజీ పట్టుగూళ్లకు రూ.50, డీలర్లకు బైవోల్టిన్ పట్టుదారం ఉత్పత్తిపై కేజీకి రూ.130 ప్రోత్సాహకం ఇవ్వనుంది. పట్టు పరిశ్రమ శాఖకు రెవెన్యూ పద్దు కింద రూ.158.46 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,240.93 కోట్లు, మత్స్యశాఖకు రూ.550.86 కోట్లు, మార్కెటింగ్ శాఖకు రూ.3,214.34 కోట్లు, సహకార రంగానికి రూ.234.64 కోట్లు, ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.4,525 కోట్లు, ఆక్వా రంగంలో విద్యుత్ చార్జీల రాయితీకి రూ.475 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలు ఉపాధి హామీ పథకంతో అనుసంధానానికి రూ.3,626 కోట్లు ప్రతిపాదించారు. 2019-20లో సుమారు 50,000 సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు ప్రణాళిక ఖరారు చేసినట్టు బొత్స తెలిపారు.
 
 రబీ నుంచి వైఎస్సార్ రైతు భరోసా 
 నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని ఈ ఏడాది రబీ నుంచి అమలు చేయబోతోంది. దీనికింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.12,500 మొత్తాన్ని సొంతంగా ఇవ్వనుంది. కేంద్రం ఏడాదికి మూడు విడతల్లో ఇచ్చే రూ.6 వేలు కూడా కలిపితే ఒక్కో రైతుకు రూ.18,500 అందుతుంది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రూ.1.50 చొప్పున ఇచ్చేందుకు రూ.475 కోట్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది 50 వేల సౌర విద్యుత్తు పంపుసెట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
 
 ఉపాధి హామీ నిధుల వినియోగం
 కరవు నివారణ కార్యక్రమాల్లో భాగంగా మినీ గోకులం, పట్టుపరిశ్రమ, చేప పిల్లల్ని పెంచే చెరువులు, ఎండబెట్టే యార్డులు, పండ్ల తోటల పనులకు ఉపాధి హామీ నిధుల్ని వినియోగించుకునే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.3,626 కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఖర్చు చేయనుంది. 81 వేల ఎకరాల్లో పండ్ల తోటలు, 5 వేల కిలోమీటర్ల పరిధిలో రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం, 25 వేల చెరువుల పునరుద్ధరణ, 35 వేల చెరువుల్లో పూడికతీత, 35 వేల ఎకరాల్లో భూమి అభివృద్ధి, 25,500 ఊటకుంటల ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించింది.
 
 రైతు సేవల కోసంఇద్దరు సహాయకులు
 కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లో రైతు సేవల కోసం వ్యవసాయ, అనుబంధ రంగాల నుంచి ఇద్దరు సహాయకుల్ని నియమించబోతున్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాల నుంచి గ్రామ వ్యవసాయ సహాయకుడు (విలేజి అగ్రికల్చర్ అసిస్టెంట్).. మత్స్య, పశుసంవర్థక రంగాల నుంచి పశుసంవర్థక సహాయకుడు (ఏహెచ్ అసిస్టెంట్)ను నియమిస్తారు.
 
 కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు
 రాష్ట్రంలో హెక్టారు భూమిలో వ్యవసాయానికి 2.5 కిలోవాట్లు యంత్రశక్తి అవసరం కాగా.. ప్రస్తుతం 1.72 కిలోవాట్లు మాత్రమే అందుబాటులో ఉంది. యాంత్రీకరణను పెంచే క్రమంలో రైతు సంఘాలను గుర్తించి కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది. అక్కడ రైతులకు అవసరమయ్యే అన్ని వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.460.05 కోట్లు ప్రతిపాదించారు. 
 
 కల్తీ విత్తనాల కట్టడికి చర్యలు
 ఎరువులు, పురుగుమందులు, విత్తనాల్లో కల్తీని నివారించడానికి ప్రతి నియోజకవర్గంలోనూ సమగ్ర పరీక్షా కేంద్రం (ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్) ఏర్పాటు చేయనున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాతే రైతులకు ఉత్పత్తులు అందిస్తారు. బడ్జెట్లో దీనికి రూ.109.28 కోట్లు కేటాయించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేందుకు ప్రభుత్వం వీటిని సరఫరా చేసే సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఎక్కడైనా పొరపాటు జరిగి రైతు నష్టపోతే సంస్థలే బాధ్యత వహించేలా ముందే వాటి నుంచి ధరావతులు తీసుకుంటుంది.
 
 గోదాములకు రూ. 200 కోట్లు
 రాష్ట్రంలో పంట ఉత్పత్తుల నిల్వ కోసం 10 లక్షల టన్నుల సామర్ధ్యంతో గోదాములు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గోదాముల మౌలిక వసతుల నిధి కింద రూ.200 కోట్లు కేటాయించింది. కొత్త గోదాముల నిర్మాణానికి రూ.37 కోట్లు ఇవ్వబోతోంది. కొత్తగా 100 రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
 
 ప్రకృతి వ్యవసాయ పథకం అమలు

 రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల వినియోగం అధికమై ఆహార పంటల్లో అవశేషాలు పెరుగుతున్నాయి. ఈ దుష్ఫలితాలను నివారించి తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను పండించడానికి ప్రభుత్వం ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ పథకాన్ని అమలు చేయనుంది.  పరంపరాగత కృషి వికాస యోజన పథకం కింద రూ.91.31 కోట్లు ప్రతిపాదించింది.
 
 కౌలు రైతుల కోసం కొత్త చట్టం

 కౌలు రైతులకు ప్రభుత్వ రాయితీలు, సాయం అందించే దిశగా కౌలు రైతు చట్టంలో సమూల మార్పులు తీసుకురాబోతున్నారు. భూయాజమాన్య హక్కులకు ఇబ్బంది లేకుండా.. భూయజమాని, కౌలు రైతు మధ్య 11 నెలల కాలానికి మాత్రమే ఒప్పందం అమల్లో ఉండేలా సవరణలు తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
 పసుపు విత్తనంపై 50శాతం రాయితీ
 ఉద్యానశాఖ ద్వారా పసుపు- గ్రామ విత్తన కార్యక్రమం ద్వారా కర్కుమిన్ అధికంగా ఉండే వంగడాలను రైతుకు రాయితీపై అందించే దిశగా ప్రణాళిక రూపొందించారు. కేరళలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చి (ఐఐఎస్‌ఆర్) ఆధ్వర్యంలో విడుదల చేసిన అధిక దిగుబడినిచ్చే  మహిమ, వరద రకాల అల్లాన్ని కూడా రైతులకు అందిస్తారు. కొత్తగా 100 రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయబోతున్నారు.
Published date : 16 Jul 2019 06:43PM

Photo Stories