ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20
సంక్షేమరథాన్ని ఉరకలెత్తిస్తూ రూ. 2,27,974 కోట్లతో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో 2019-20 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాస్‌చంద్రబోస్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య, మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.
ప్రస్తుత బడ్జెట్ సంక్షిప్తంగా... (కోట్ల రూపాయల్లో..)
మొత్తం బడ్జెట్ | 2,27,974.99 |
రెవెన్యూ వ్యయం | 1,80,475.93 |
మూలధన వ్యయం | 32,293.39 |
రెవెన్యూ ఆదాయం | 1,78,697.41 |
కేంద్ర పన్నుల్లో వాటా | 34,833.18 |
కేంద్ర గ్రాంట్లు | 60,071.51 |
రెవెన్యూ లోటు | 1,778.52 |
ద్రవ్యలోటు | 35,260.58 |
వ్యవసాయ బడ్జెట్
మొత్తం కేటాయింపులు | 28,866.23 |
ధరల స్థిరీకరణ నిధి | 3,000 |
పెట్టుబడి సాయం | 8,750 |
ముఖ్య కేటాయింపులు ఇలా..
- గ్రామ వలంటీర్లు, సచివాలయాలకు రూ.1,420 కోట్లు
- సంక్షేమ పింఛన్లకు రూ.15,746.58 కోట్లు
- సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139.05 కోట్లు
- గృహ నిర్మాణాలకు రూ.9,785.75 కోట్లు
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.4,962.30 కోట్లు
- అమరావతి మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు
- వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు
- పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.5,129 కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు
- జగనన్న అమ్మ ఒడికి రూ.6,455.80 కోట్లు
ముఖ్యమైన పథకాలకు కేటాయింపులు (రూ. కోట్లలో)
వైఎస్సార్ పెన్షన్ కానుక | 15,746.58 |
వైఎస్సార్ రైతు భరోసా | 8,750.00 |
జగనన్న అమ్మ ఒడి | 6,455.80 |
వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ | 4,525.00 |
ధరల స్థిరీకరణ నిధి | 3,000.00 |
విపత్తుల నిర్వహణ నిధి | 2,002.08 |
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ | 1,740.00 |
వైఎస్సార్ - పీఎం ఫసల్ బీమా యోజన | 1,163.00 |
అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సాయం | 1,150.00 |
కాపుల సంక్షేమం | 2,000.00 |
గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు | 1,140.00 |
పట్టణ స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ వడ్డీలేని రుణాలు | 648.00 |
మార్చి నాటికిరాష్ట్ర అప్పులు రూ.2,91,345కోట్లు
2020 మార్చి నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,91,345 కోట్లకు చేరుతాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌లో అంచనా వేశారు. ఈ మొత్తం అప్పులో రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ కాని అప్పు రూ.17,031 కోట్లు ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఈ ఆర్థిక సంవత్సరం అప్పుల శాతం తగ్గనుందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 28.18 శాతం ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో 26.96 శాతమే ఉంటుందని అంచనా వేశారు.
రాష్ట్ర అప్పుల తీరు ఇదీ..
ఆర్థిక ఏడాది |
మొత్తం అప్పు (కోట్లలో) |
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో శాతం |
2015-16 | 1,69,458.06 | 27.78 |
2016-17 | 1,94,862.15 | 27.87 |
2017-18 | 2,23,705.95 | 27.83 |
2018-19 | 2,58,928.17 | 28.18 |
2019-20 | 2,91,345.00 | 26.96 |
శాఖలు,రంగాలు ముఖ్య పథకాలకు కేటాయింపులు
సంక్షేమ రంగానికి పెద్దపీట
సంక్షేమ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి 2019-20 సంవత్సరానికి బడ్జెట్‌లో ఏకంగా రూ.7,268.83 కోట్లు కేటాయించింది. 2018-19లో ఈ మొత్తం రూ.6,210.63 కోట్లు మాత్రమే. గతేడాదితో పోలిస్తే 17.03 శాతం ఎక్కువగా పెరుగుదల ఉండటం గమనార్హం. అదేవిధంగా వైఎస్సార్ చేయూత పథకాన్ని కార్పొరేషన్‌ల ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కార్మిక సంక్షేమ శాఖకు గతేడాదితో పోలిస్తే 20.10 శాతం అధికంగా బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. మైనార్టీల సంక్షేమానికి సంబంధించి అన్ని పథకాలకు 2018-19లో రూ.1,101.90 కోట్లు కేటాయించగా దాదాపు రెట్టింపు మొత్తంతో ఈ ఏడాది రూ.2,106 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ పెళ్లి కానుక కింద బీసీ వధువులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
విభాగాలవారీగా బడ్జెట్ కేటాయింపులు (రూ.కోట్లలో)..
బీసీ సంక్షేమం | 7,268.83 |
సాంఘిక సంక్షేమం | 5,919.07 |
గిరిజన సంక్షేమం | 2,153.67 |
మైనార్టీ సంక్షేమం | 2,106 |
మహిళ, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం | 2,689.36 |
నైపుణ్య శిక్షణ, అభివృద్ధి కార్పొరేషన్ | 363.42 |
కార్మిక సంక్షేమం, ఉపాధి శిక్షణ శాఖ | 978.58 |
వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు | 15,061.64 |
అన్ని వర్గాలకు ఫీజురీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్ చార్జీలకు | 4,962.30 |
పెన్షన్లకు కేటాయింపులు..
పథకం | కేటాయింపులు(రూ.కోట్లలో) |
వైఎస్సార్ పెన్షన్ కానుక - వృద్ధులు, వితంతువులు | 12,801.04 |
వైఎస్సార్ పెన్షన్ కానుక - దివ్యాంగులు | 2,133.62 |
వైఎస్సార్ పెన్షన్ కానుక - ఒంటరి మహిళలు | 300.00 |
వైఎస్సార్ పెన్షన్ కానుక - మత్స్యకారులు | 130.00 |
వైఎస్సార్ పెన్షన్ కానుక - ఎయిడ్‌స రోగులు | 100.20 |
వైఎస్సార్ పెన్షన్ కానుక - కిడ్నీ డయాలిసిస్ రోగులు | 85.00 |
వైఎస్సార్ పెన్షన్ కానుక - గీత కార్మికులు | 75.85 |
వైఎస్సార్ అభయహస్తం | 90.88 |
వైఎస్సార్ పెన్షన్ కానుక - ట్రాన్స్జెండర్ | 7.00 |
వైఎస్సార్ కల్యాణ కానుకకు కేటాయింపులకు..
వైఎస్సార్ కల్యాణ కానుక - బీసీ సంక్షేమం | 300.00 |
వైఎస్సార్ కల్యాణ కానుక - ఎస్సీ సంక్షేమం | 200.00 |
వైఎస్సార్ గిరిపుత్రిక కల్యాణ పథకం - ఎస్టీ సంక్షేమం | 45.00 |
వైఎస్సార్ షాదీకా తోఫా -మైనారిటీ సంక్షేమం | 100.00 |
వైఎస్సార్ కల్యాణ కానుక - వివాహ ప్రోత్సాహక అవార్డు | 30.26 |
వైఎస్సార్ కల్యాణ కానుక- కులాంతర వివాహాల ప్రోత్సాహం | 41.00 |
ఇతర సంక్షేమ పథకాలకు కేటాయింపులు..
కాపుల సంక్షేమం | 2,000.00 |
అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సాయం | 1,150.00 |
వైఎస్సార్ బీమా | 404.02 |
సొంతంగా ఆటోలు కలిగిన డ్రైవర్లకు ఆర్థిక సాయం | 400.00 |
వైఎస్సార్ ఆర్థిక సాయం - నాయీబ్రాహ్మణ, రజకులు, దర్జీలు | 300.00 |
వైఎస్సార్ సాయం - చేనేత కార్మికులు | 200.00 |
వైఎస్సార్ గ్రాంట్ - మతపరమైన సంస్థలు | 234.00 |
బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ | 100.00 |
లాయర్ల సంక్షేమ ట్రస్టు | 100.00 |
లాయర్లకు సహాయం | 10.00 |
పౌరసరఫరాల పథకాలకు కేటాయింపులు..
బియ్యం సబ్సిడీ | 3,000.00 |
బియ్యం బ్యాగులు | 750.00 |
పౌరసరఫరాల సంస్థకు సహాయం | 384.00 |
- గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో రూ.2,153.67 కోట్లు కేటాయించింది. గతేడాది ప్రభుత్వం రూ.1,018.66 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
- ఈ ఆర్థిక సంవత్సరం ఎస్టీ ఉప ప్రణాళికకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.4,988.52 కోట్లు కేటాయించింది. గతేడాది టీడీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో 4,176.60 కోట్లు కేటాయించి రూ.2,877.57 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
- ఎస్సీ సంక్షేమం కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. 2019-20 సంవత్సరానికి ఎస్సీ సబ్ ప్లాన్‌కు బడ్జెట్‌లో రూ.15,000.85 కోట్లు కేటాయించింది. గతేడాది టీటీపీ ప్రభుత్వం కేవలం రూ.8,888.43 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం గమనార్హం
సాంఘిక సంక్షేమానికి రూ.5,919.07 కోట్లు
గతేడాదితో పోలిస్తే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2019-20కి బడ్జెట్‌లో ఏకంగా రూ.5,919.07 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని 188 గురుకుల విద్యా సంస్థలకు రూ.789.34 కోట్లు కేటాయిం చారు. షెడ్యూల్డ్ కులాల ఆర్థిక మద్దతు పథకాలకు రూ.901 కోట్లను సబ్సిడీగా కేటాయించారు. వైఎస్సార్ కల్యాణ కానుకకు రూ.200 కోట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుక కింద డప్పు కళాకారు లకు రూ.188 కోట్లు, చెప్పులు కుట్టే వృత్తి కళాకారులకు రూ.112 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి రూ.20 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.350.27 కోట్లు, ప్రభుత్వ హాస్టళ్లకు రూ.475.78 కోట్ల కేటాయింపులు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌కు సబ్సిడీ కోసం రూ.50 కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజురీయింబర్స్‌మెంట్‌కు రూ.382.23 కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకం కింద స్కాలర్‌షిప్‌లకు రూ.416.43 కోట్లు, ఎస్సీ గృహాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.348.65 కోట్లు వంటి వివిధ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు.
మైనార్టీల సంక్షేమానికి భరోసా
మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో 2019-20 ఏడాదికి రూ.948.72 కోట్లు కేటాయించారు. ఇమామ్‌లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం, మౌజన్లకు రూ.5 వేలు, పాస్టర్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇచ్చేందుకు నిధులు కేటాయించారు. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో చేర్చిన మొత్తం పథకాలకు గాను రూ.2,106 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్టేట్ క్రిస్టియన్ కార్పొరేషన్‌కు 30 కోట్లు, ఉర్దూఘర్, షాదీఖానాల నిర్మాణాలకు రూ.20 కోట్లు, ఏపీ హజ్ కమిటీకి రూ.14.22 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.15 కోట్లు, జగనన్న విద్యా దీవెన (ఎంటీఎఫ్)కు 150 కోట్లు, జగనన్న విద్యా దీవెన (ఆర్టీఎఫ్)కు 220.05 కోట్లు వంటి వివిధ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు.
బీసీ సంక్షేమానికి రూ.7,268.83 కోట్లు
బీసీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.7,268.83 కోట్లు కేటాయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్పొరేషన్‌ల ఏర్పాటు, సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు కేటాయించారు. ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేలు సమకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరికరాలు ఆధునికీకరించుకోవడానికి ఈ మొత్తం ఉపకరిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. చేనేతలు గౌరవప్రదమైన ఆదాయం ఆర్జించడానికి మార్కెటింగ్ సహాయం అందించడంతోపాటు ఇతర సబ్సిడీలను కూడా ప్రభుత్వం ఇస్తుందని తెలిపింది. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. 139 కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తారు. ఆదరణ పథకం కింద రూ.249.97 కోట్లు, బీసీ స్టడీ సర్కిళ్లకు రూ.10 కోట్లు, బీసీ గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యాభ్యాసానికి రూ.218.18 కోట్లు, బీసీ కాలేజీల హాస్టళ్ల నిర్వహణకు రూ.129.74 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.60 కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు రూ.360 కోట్లు కేటాయించారు.
బీసీ సంక్షేమానికి కేటాయింపులు-ఖర్చు (రూ. కోట్లలో)
సంవత్సరం | కేటాయింపులు | ఖర్చు |
2014-15 | 3,129.00 | 3,122.00 |
2015-16 | 3,231.00 | 2,720.00 |
2016-17 | 4,430.00 | 3,045.00 |
2017-18 | 5,013.50 | 4,783.22 |
2018-19 | 6,210.63 | 2,811.57 |
2019-20 | 7,268.83 | --- |
వైద్య ఆరోగ్యశాఖకు రూ.11,398.99 కోట్లు
పేదవారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ రాష్ట్ర సర్కారు బడ్జెట్‌లో వైద్య రంగానికి పెద్దపీట వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో వైద్య ఆరోగ్య శాఖకు తాజా బడ్జెట్‌లో రూ.11,398.93 కోట్లను కేటాయించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 35 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. ఆరోగ్యశ్రీ పథకానికి ఏకంగా రూ.1,740 కోట్లు కేటాయించింది. వెయి్య రూపాయలు బిల్లు దాటితే చాలు.. దాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి వారికి ఉచితంగా వైద్యం అందించాలన్న బలమైన ఆశయంతో ఈ పథకానికి భారీ కేటాయింపులు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని గత సర్కారు ఆపేయడం తెలిసిందే. దీనికి ముగింపు పలుకుతూ.. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకూ సేవలను విస్తరించింది. గతంలో ఉద్యోగుల వైద్యపథకంలో మాత్రమే ఉన్న కొన్ని జబ్బులను ఇప్పుడు ఆరోగ్యశ్రీలోనూ చేర్చి దాదాపు రెండువేల జబ్బులకు ఉచితంగా వైద్యమందించేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారికి సైతం ఉచిత వైద్యమందేలా నిర్ణయించింది. తద్వారా మధ్య తరగతి వారికీ సర్కారు ఆరోగ్య భరోసా కల్పించింది. ఈ ఏడాది దేశ బడ్జెట్ రూ.27,86,349 కోట్లు అయితే ఇందులో ఆరోగ్య రంగానికి కేటాయించింది రూ.62,659 కోట్లు. అంటే కేవలం 2.2 శాతం మాత్రమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.2,27,974 కోట్లు కాగా, ఇందులో ఆరోగ్యశాఖకు రూ.11,398.93 కోట్లు కేటాయించడమంటే ఆరోగ్య రంగానికి 5 శాతం కేటాయింపులు జరిపినట్టు అవుతుంది.
గడిచిన ఐదేళ్లలో వైద్య ఆరోగ్యశాఖకు చేసిన బడ్జెట్ కేటాయింపులు.. వ్యయం
సంవత్సరం |
బడ్జెట్ |
వ్యయం |
2014-15 | 4,387.94 | 4,839.06 |
2015-16 | 5,728.23 | 5,067.00 |
2016-17 | 6,661.16 | 6,103.76 |
2017-18 | 7,020.63 | 6,635.22 |
2018-19 | 8,463.51 | 7,227.90 |
ప్రస్తుత బడ్జెట్‌లో ప్రధానమైన వాటికి కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లల్లో)
ఆరోగ్యశ్రీ | 1,740 |
108 | 123.09 |
104 | 141.47 |
ఆశావర్కర్లకు | 455 |
ఉద్యోగుల వైద్యానికి | 200 |
రేడియాలజీ సర్వీసులు | 25 |
మందుల కొనుగోళ్లకు | 126 |
వైద్య రంగానికి కేటాయింపులు ఇలా..
పథకం | కేటాయింపులు (రూ.కోట్లలో) |
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ | 1,740.00 |
ఆస్పత్రుల్లో మౌలిక వసతులు | 1,500.00 |
ఆశా వర్కర్ల గౌరవ వేతనం | 455.85 |
వైద్య భవనాలు | 68.00 |
డాక్టర్ వైఎస్సార్ గిరిజన మెడికల్ కాలేజీ | 66.00 |
ప్రభుత్వ మెడికల్ కాలేజీ, గురజాల | 66.00 |
ప్రభుత్వ మెడికల్ కాలేజీ, విజయనగరం | 66.00 |
శ్రీకాకుళం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ | 50.00 |
రాష్ట్ర క్యాన్సర్ సెంటర్ | 43.60 |
గురజాలలో ప్రభుత్వ వైద్యకళాశాల
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మించేందుకు రూ.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే పాడేరులో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం గురజాలలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 300 పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తారు. మరోవైపు విజయనగరంలో కొత్తగా ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేస్తూ రూ.66 కోట్లు కేటాయించింది. మరోవైపు ఆయుష్ వైద్యకళాశాలల అభివృద్ధికి గతేడాది రూ.30 కోట్లు ఇస్తే ఈ ఏడాది రూ.52 కోట్లు కేటాయించారు.
హోంశాఖకు రూ.7,461.92 కోట్లు
హోం శాఖకు రూ.7,461.92 కోట్లను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు. గతేడాది రూ.6,258.09 కేటాయించిన టీడీపీ ప్రభుత్వం రూ.5,664.16 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బడ్జెట్‌లో 19.24 శాతం అదనంగా నిధులు కేటాయించింది. పోలీస్ శాఖలోని 75 భవనాల మరమ్మతుల కోసం రూ.1,423.63 లక్షలు కేటాయించారు. 13 జిల్లాల్లో 18,512 మంది మహిళా పోలీస్ వలంటీర్ల కోసం రూ.6.38 కోట్లు ప్రతిపాదించారు. సైబర్ క్రైమ్ నిరోధానికి నాలుగు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.38.85 లక్షలు కేటాయించారు. 18 కేంద్రాల్లో క్రైమ్ డేటా సెంటర్ల ఏర్పాటుకు రూ.6 కోట్లు, 75 పోలీస్ భవనాల నిర్మాణానికి రూ.4,250.10 లక్షలు కేటాయించారు. కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేలా కంప్యూటర్ సర్వీస్ (26 డిజిటల్ సెంటర్లు, 2వేల స్టేటస్టిక్ స్టేషన్ల) ఏర్పాటుకు రూ.8,959.48 లక్షలు, 19 కేంద్రాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేసేలా రూ.1,192 లక్షలు ప్రతిపాదించారు. అమరావతితోపాటు మరో మూడు రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిర్మాణాలకు రూ.10 కోట్లు కేటాయించారు.
హోంశాఖ బడ్జెట్ వివరాలు (రూ. కోట్లలో)
సంవత్సరం |
కేటాయింపు |
ఖర్చు |
2014-15 | 3,739 | 3,610 |
2015-16 | 4,062 | 4,073 |
2016-17 | 4,785.40 | 4,997 |
2017-18 | 5,221.31 | 5,371 |
2018-19 | 6,258.09 | 5,664.16 |
2019-20 | 7,461.92 | --- |
విద్యారంగానికి రూ. 32,618 కోట్లు
2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యాశాఖకు పెద్దపీట వేసింది. పాఠశాల, ఇంటర్మీడియెట్, ఉన్నత, సాంకేతిక, డిగ్రీ విభాగాలకు నిధులు పెంపు చేస్తూ కేటాయింపులు చేపట్టింది. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అమ్మ ఒడి వంటి పథకాలతో పాటు స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో రూ.29,772 కోట్లు కేటాయించారు. ఇంటర్మీడియెట్ విద్యకు ఈ ఏడాది రూ.805.61 కోట్లు కేటాయించారు. అలాగే ఉన్నత విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,423.35 కోట్లు కేటాయించింది. 2017-18లో టీడీపీ సర్కారు రూ.806 కోట్లు ఇచ్చింది. 2018-19లో రూ.1,075 కోట్లు చూపి చివరకు రూ.656 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
యూనివర్సిటీల వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)
ఆంధ్రా వర్సిటీ | 238.16 |
ద్రవిడ వర్సిటీ | 35.00 |
అంబేడ్కర్ వర్సిటీ | 70.00 |
కృష్ణా వర్సిటీ | 5.79 |
ఉర్దూ వర్సిటీ | 23.00 |
రాయలసీమ | 35.19 |
నాగార్జున | 50.00 |
పద్మావతి | 75.00 |
విక్రమ సింహపురి | 37.58 |
శ్రీవేంకటేశ్వర | 150.00 |
వైఎస్సార్ ట్రైబల్ | 50.00 |
కృష్ణదేవరాయ | 55.00 |
నన్నయ | 31.61 |
వేమన | 50.02 |
తెలుగు వర్సిటీ | 4.28 |
ఓపెన్ వర్సిటీ | 4.53 |
యూజీసీ ఎరియర్స్ కోసం | 503 |
మొత్తం : | 1,418.16 |
జగనన్న అమ్మ ఒడికి రూ.6,455 కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా శాఖకు అగ్రస్థానం దక్కింది. విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. ఆ మేరకు బడ్జెట్‌లో భారీగానే నిధులు కేటాయించింది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ‘అమ్మ ఒడి’ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులను సైతం అర్హులుగా చేర్చారు. తన పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఈ పథకం కింద ఏడాదికి రూ.15,000 అందిస్తారు. శుక్రవారం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లోనే అమ్మ ఒడి పథకానికి రూ.6,455.80 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది. అమ్మ ఒడి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న అమ్మ ఒడి’గా నామకరణం చేసింది.
విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన
ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది. కొత్తగా ప్రారంభించిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం అమలుకు నిధులు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రూ.4,962.30 కోట్లు కేటాయించడం విశేషం. విద్యార్ధుల వసతి, భోజన ఇతర సదుపాయాలకు ఏటా రూ.20వేల చొప్పున ఇవ్వాలని ప్రతిపాదించారు. వర్సిటీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1418.96 కోట్లు కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్లో చూపింది.
అరకులో వైఎస్సార్ గిరిజన విశ్వవిద్యాలయం
అరకులో వైఎస్సార్ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించారు. ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షల్లో అన్ని యూనివర్సిటీలు న్యాక్ ఏ ప్లస్ గుర్తింపునకు కృషి చేయాలని నిర్దేశించిన సంగతి తెలిసిందే. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు సాధించడానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్
చేయడం కోసం 52.04 కోట్లు కేటాయింపు చేయడం గమనార్హం.
ఫీజురీయింబర్స్‌మెంట్‌కు రూ.4,962.3 కోట్లు
ఫీజురీయింబర్స్‌మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, ఈబీసీలు, దివ్యాంగులు డబ్బులేక చదువులు ఆపేయకుండా ప్రభుత్వం వారిపై వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు 2019-20 బడ్జెట్‌లో ఫీజురీయింబర్స్‌మెంట్‌కు రూ.4,962.30 కోట్లు కేటాయించింది.
సంక్షేమ విభాగాల వారీగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్ కేటాయింపులు (2019-20)
విభాగం | విద్యార్థులు | ఎంటీఎఫ్ (రూ.కోట్లలో) | ఆర్టీఎఫ్ (రూ.కోట్లలో) | మొత్తం (రూ.కోట్లలో) |
సాంఘిక సంక్షేమం | 3,38,721 | 382.23 | 416.43 | 798.66 |
గిరిజన సంక్షేమం | 66,058 | 84.65 | 115.60 | 200.25 |
వెనుకబడిన తరగతుల సంక్షేమం | 7,82,396 | 943.14 | 1275 | 2218.14 |
మైనార్టీ సంక్షేమం | 1,15,230 | 150 | 220.05 | 370.05 |
కాపు సంక్షేమం | 1,32,762 | 249.54 | 405.73 | 655.27 |
ఆర్థికంగా వెనుకబడిన తరగతులు | 99,873 | - | 717.74 | 717.74 |
దివ్యాంగుల సంక్షేమం | 871 | 1.00 | 1.19 | 2.19 |
మొత్తం | 15,35,911 | 1,810.56 | 3,151.74 | 4,962.30 |
పౌర సరఫరాల శాఖకు రూ.4,429.43 కోట్లు
పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. పౌర సరఫరాల శాఖకు ఈ ఏడాది రూ.4,429.43 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.934.04 కోట్లు అదనంగా కేటాయించారు.
ఐదేళ్లలో పౌర సరఫరాల శాఖకు కేటాయింపులు, ఖర్చులు ఇలా..
ఆర్థిక సంవత్సరం | కేటాయింపులు (రూ.కోట్లలో) | ఖర్చు చేసిన నిధులు (రూ.కోట్లలో) |
2014-15 | 2,318 | 2,322 |
2015-16 | 2,459 | 2,461 |
2016-17 | 2,702 | 2,737 |
2017-18 | 2,800 | 2,842 |
2018-19 | 3,495.39 | 697.94 |
2019-20 | 4,429.43 | ---- |
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.13,139.05 కోట్లు
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి 2019-20 బడ్జెట్‌లో రూ.13,139.05 కోట్లు కేటాయించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును 2021 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రస్తుత బడ్జెట్‌లో సింహభాగం నిధులు అంటే రూ.5,129 కోట్లు కేటాయించారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, చింతలపూడి, తోటపల్లి, మహేంద్ర తనయ, వంశధార, గుండ్లకమ్మ, సంగం, నెల్లూరు బ్యారేజీలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు నిధులు కేటాయించారు. మిగతా ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
2019-20 బడ్జెట్‌లో సాగు నీటి ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపులు
ప్రాజెక్టు పేరు | నిధుల కేటాయింపు (రూ.కోట్లలో) |
పోలవరం | 5,129.00 |
హంద్రీ- నీవా | 1,136.44 |
చింతలపూడి ఎత్తిపోతల | 720.00 |
చిన్న తరహా నీటిపారుదల | 589.57 |
కృష్ణా డెల్టా | 512.00 |
వెలిగొండ | 485.10 |
తెలుగు గంగ | 435.98 |
గాలేరు- నగరి | 391.01 |
తుంగభద్ర బోర్డు | 370.22 |
పురుషోత్తపట్నం | 300.00 |
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి | 170.06 |
తోటపల్లి | 156.00 |
వంశధార | 147.10 |
గోదావరి డెల్టా | 115.10 |
పులివెందుల కాలువ | 112.00 |
మహేంద్రతనయ | 100.94 |
తుంగభద్ర ఎగువ కాలువ రెండో దశ | 90.17 |
పులిచింతల | 69.01 |
తాడిపూడి ఎత్తిపోతల | 55.00 |
పెన్నా నది కాలువ వ్యవస్థ | 50.00 |
గురురాఘవేంద్ర ఎత్తిపోతల | 47.49 |
సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్ | 42.00 |
పుష్కర ఎత్తిపోతల | 35.20 |
ముసురుమిల్లి | 31.02 |
తుంగభద్ర దిగువ కాలువ | 30.10 |
కేసీ కెనాల్ | 29.00 |
గుండ్లకమ్మ | 28.00 |
శ్రీశైలం కుడిగట్టు కాలువ | 24.39 |
తారకరామతీర్థ సాగరం | 21.00 |
కాన్పూర్ కాలువ | 17.00 |
చాగల్నాడు ఎత్తిపోతల | 12.52 |
సిద్ధాపురం ఎత్తిపోతల | 12.43 |
ఎర్రకాలువ | 12.25 |
వెంకటనగరం పంపింగ్ స్కీం | 10.50 |
కొరిశపాడు ఎత్తిపోతల | 10.00 |
మద్దువలస | 9.50 |
ముసురుమిల్లి | 8.32 |
జంఝావతి | 5.07 |
పాలేరు రిజర్వాయర్ | 5.00 |
భూపతిపాలెం | 4.27 |
కండలేరు ఎత్తిపోతల | 2.00 |
వ్యవసాయ బోర్లకు రూ.200 కోట్లు
గ్రామీణ రైతులు వ్యవసాయ బోర్లు తవ్వుకుంటే వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆర్థిక సహాయం చేయడానికి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రధానమంత్రి కిసాన్ సంచాయ్ యోజన పథకానికి రూ.312.62 కోట్లు.. డ్వాక్రా మహిళల జీవనోపాధి కోసం ఎన్‌ఆర్‌ఎల్‌ఎం గ్రాంట్‌కు
రూ.233.12 కోట్లు కేటాయించారు.
విద్యుత్ రంగానికి కేటాయింపు రూ.6,861 కోట్లు
పజలకు వెలుగులు పంచే ఇంధన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చింది. ఇందుకు అనుగుణంగానే భారీగా కేటాయింపులు చేసింది. మునుపెన్నడూ లేని విధంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.6861.03 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలోని కేటాయింపులతో పోలిస్తే ఇది 63.62 శాతం ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. అనుకున్న విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు బడ్జెట్‌లో రూ.4,525 కోట్లు ప్రతిపాదించింది. ఆక్వా రంగంలో వినియోగమయ్యే విద్యుత్ మొత్తానికి సబ్సిడీ కింద రూ.475 కోట్లు కేటాయించింది.
పారిశ్రామిక ప్రగతికి రూ. 3,986.05 కోట్లు
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే విధంగా బడ్జెట్‌లో ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి పరిశ్రమలు, పెట్టుబడులకు రూ. 3,986.05 కోట్లు కేటాయించింది. 2018-19 బడ్జెట్ (సవరించిన అంచనాలు)లో కేటాయించిన రూ. 2,178.09 కోట్లతో పోలిస్తే 83 శాతం అదనం. వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న కడప ఉక్కు కర్మాగారానికి రూ. 250 కోట్లు, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)కి రూ. 360 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ. 573.60 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. ఎన్నడూ లేని విధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధికి రూ. 400 కోట్లు కేటాయించారు. ఇందులో ఎంఎస్‌ఎంఈలకు మౌలిక వసతులు కల్పించడానికి రూ. 200 కోట్లు, ప్రోత్సాహకాలకు రూ. 200 కోట్లు ఇచ్చారు. కీలకమైన విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రూ. 200 కోట్లు కేటాయించారు. ఐటీ రంగానికి రూ. 453.56 కోట్లు ప్రకటించారు. 2018-19లో బడ్జెట్‌లో ఐటీ రంగానికి రూ. 1,006.90 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం వాస్తవంగా కేవలం రూ. 464.02 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. అలాగే పరిశ్రమల రంగానికి రూ. 4,021.47 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పి కేవలం రూ. 2,178.09 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
ఆర్టీసీని ఆదుకునే దిశగా
ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.1,572 కోట్లను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు. ఆర్టీసీకి సహాయం కింద రూ.వెయి్య కోట్లు, ఆయా వర్గాలకు ఇచ్చే రాయితీ పాస్‌లకు రూ.500 కోట్లు, బస్సుల కొనుగోలుకు రూ.50 కోట్లు, ఇతర అవసరాలకు రూ.22 కోట్లు కేటాయించారు. గత ఐదేళ్లలో రాయితీ పాస్‌ల రీయింబర్స్‌మెంట్‌కు రూ.118 కోట్ల నుంచి రూ.290 కోట్ల వరకు కేటాయించగా.. ఈసారి రూ.500 కోట్లు కేటాయించడంతో ఆర్టీసీకి భారం తగ్గింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లో ఆ కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చారు. ఈలోగా ఆర్టీసీకి వెసులుబాటు కల్పించేందుకు బడ్జెట్‌లో భారీ మొత్తాన్ని కేటాయించారు.
ఎకో ఫ్రెండ్లీగా ప్రజా రవాణా వ్యవస్థ
రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ఎకో ఫ్రెండ్లీగా మారుస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. దశల వారీగా విద్యుత్ బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మోనో రైల్ ప్రాజెక్ట్ అమలు చేస్తామని కూడా ఆర్థిక మంత్రి తెలిపారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు వారి సంక్షేమానికి రూ.400 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. పాదయాత్ర సందర్భంగా ఏలూరు బహిరంగ సభలో తాము అధికారంలోకి రాగానే.. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు మొదటి బడ్జెట్‌లోనే కేటాయింపులు చేశారు.
మత్స్యకారుల అభ్యున్నతికి రూ.300 కోట్లు
మత్స్యకారుల అభ్యున్నతికి తాజా బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారికోసం రూ.300 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా రూ.200 కోట్లను సముద్రంలో వేటను నిషేధించిన సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు కేటాయించింది. మరో రూ.100 కోట్లను రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్‌ల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఖర్చు చేయనుంది.
గృహ నిర్మాణానికి పెద్దపీట
వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకు 2019-20 బడ్జెట్‌లో రూ.9,785.75 కోట్లు కేటాయించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు రూ.3,617.37 కోట్లు, పట్టణ గృహ నిర్మాణ పథకానికి రూ.6,168.38 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో 91,119, గ్రామీణ ప్రాంతాల్లో 7,04,916 ఇళ్లు మాత్రమే నిర్మించగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కాలంలో 25 లక్షల గృహాలు నిర్మించాలని నిర్ణయించింది. ఆ ఇళ్లను పేదలు భవిష్యత్ అవసరాల కోసం తనఖా పెట్టుకునేందుకు వీలుగా హక్కు పత్రాన్ని కుటుంబంలోని మహిళ పేరుతో ఇస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
పథకాల వారీగా కేటాయింపులు ఇలా
ఈ ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ గృహ వసతి పథకం కోసం రూ.5,000 కోట్లు, పట్టణాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అమలుకు రూ.1,540 కోట్లు, వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం కింద బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి రూ.1,280.29 కోట్లు, వైఎస్సార్ అర్బన్ హౌసింగ్ పథకానికి రూ.వెయి్య కోట్లు, గ్రామాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు రూ.565.25 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల పేరిట గత ప్రభుత్వం వివిధ సంస్థల్లో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి రూ.150.21 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం
ఈ బడ్జెట్‌లో పట్టణాభివృద్ధికి ప్రభుత్వం రూ. 6,587.09 కోట్లు కేటాయించింది. పట్టణాల్లోని స్వయం సహాయక గ్రూపులకు వడ్డీ లేని రుణాలకు రూ.648 కోట్లు, వైఎస్సార్ అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా పథకానికి రూ.1,540 కోట్లు, ఏపీ టిడ్కోకు రూ.300 కోట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.35 కోట్లు, షెడ్యూల్ కులాల వర్గాలు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 200 కోట్లు కేటాయించారు. స్మార్ట్ సిటీల నిర్మాణాలకు రాష్ట్ర వాటాగా రూ.150 కోట్లు, అమృత్ స్కీంకు రూ.373 కోట్లు ఇచ్చారు. పట్టణాభివృద్ది సంస్థలకు రూ.50 కోట్లను, మంగళగిరిని మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేయడానికి రూ.50 కోట్లు కేటాయించారు. పట్టణాలు, నగరాల్లోని పేదరిక నిర్మూలనకు రూ.23 కోట్లు, విజయవాడ, విశాఖలోని మెట్రోరైల్ ప్రాజెక్టు పనులకు రూ.10 కోట్లు, ప్రజారోగ్య విభాగంలో ఉన్న ఔట్‌సోర్సింగ్ హెల్త్ వర్కర్స్ అలవెన్స్కు రూ.90 కోట్లు, మున్సిపాల్టీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.100 కోట్లు, ఎన్నికల ఖర్చుకు రూ.60 కోట్లు, గుంటూరు సిటీలోని భూగర్భ డ్రైయిన్ల నిర్మాణాలకు రూ. 10 కోట్లు, మున్సిపాల్టీల్లోని స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టులకు రూ.10 కోట్లు, మున్సిపల్ స్కూల్స్, నగర పంచాయతీల్లోని మౌలిక వసతుల కల్పనకు రూ.80 కోట్లు కేటాయించారు. గతేడాది టీడీపీ ప్రభుత్వం రూ.7,740.81 కోట్లు కేటాయించి వాటిని పలు పథకాలకు మళ్లించింది.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయింపుల వివరాలు..
పథకం | కేటాయింపులు |
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ | 700.00 |
రాజధానిలో అవసరమైన మౌలిక వసతులు | 500.00 |
ముఖ్యమంత్రి అభివృద్థి నిధి | 500.00 |
ఉపాధి హామీ అనుసంధాన నిధులు | 500.00 |
పీఎంజేవై కింద పంచాయతీరాజ్ రోడ్లు | 376.35 |
పంచాయతీరాజ్ రోడ్లు | 350.00 |
విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ | 200.00 |
న్యూ రైల్వే లైన్లు (50 శాతం) | 185.00 |
ఆర్‌డీఎఫ్‌లో పంచాయతీరాజ్ రోడ్లు | 150.00 |
స్మార్ట్ సిటీలు | 150.00 |
కడప యాన్యుటీ ప్రాజెక్టులు | 120.00 |
పట్టణాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులు | 100.00 |
పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ | 100.00 |
అమరావతి-అనంతపురం జాతీయ రహదారి | 100.00 |
సీఎం కాల్ సెంటర్ | 73.33 |
రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ | 71.90 |
కేపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ నిధి | 65.00 |
మున్సిపల్ ఎన్నికలు | 60.00 |
మంగళగిరి మోడల్ టౌన్‌గా అభివృద్ధి | 50.00 |
వ్యర్ధాల నిర్వహణ | 50.00 |
అమరావతి కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు | 50.00 |
ఇతర కేటాయింపులు
- గ్రామ సచివాలయాలు, వలంటీర్ల కోసం రూ.1,420కోట్లు
- వార్డు వలంటీర్లు, సచివాలయాలకు రూ.460 కోట్లు
- ఆలయాల నిర్వహణకు రూ.234కోట్లు
- బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.31,564 కోట్లు కేటాయింపు. ఇందులో గ్రామీణాభివృద్ధికి రూ.23,271 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.8,293 కోట్లు కేటాయించారు
- రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖలకు బడ్జెట్‌లో రూ. 6,202.98 కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్ కంటే ఇది 31.88 శాతం అధికం.
- సహకార రంగానికి రూ.200 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.