Mechanical Engineering: మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు
ప్రొద్దుటూరు : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు లభించింది. దీని వల్ల 2024–25 విద్యా సంవత్సరం నుండి మూడేళ్లు కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు, రాయితీలు లభిస్తాయి. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇక్కడ చదివిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు క్యాంపస్ ఎంపికలలో కూడా ప్రాధాన్యత ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఎన్‌బీఏ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మళ్లీ గుర్తింపు కొనసాగుతుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఎన్‌బీఏ బృందం చైర్మన్ డాక్టర్ రాజీవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సిబ్బంది సౌకర్యాలు, హాస్టల్, వర్క్‌షాప్, ల్యాబ్స్, ప్లే గ్రౌండ్ తదితర 10 విభాగాలకు సంబంధించి వారు తనిఖీ చేశారు. ఎన్‌బీఏ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు ఎన్‌బీఏ గుర్తింపు ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరుడు మాట్లాడుతూ తమ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. రూ.70లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించిన పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌కు ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు.