AP POLYCET 2023: పాలిసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం
మురళీనగర్: పాలిసెట్ రెండవ విడత కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా చేరారు. వీరికి ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మిగిలిపోయిన సీట్ల భర్తీకి సంబంధించి రెండవ విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. పాలిసెట్‌లో ర్యాంకుల పొందిన విద్యార్థులు వచ్చే ఒకటో తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవచ్చు. ఇప్పటివరకు పేర్లు నమోదు చేసుకోని వారు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్లు పరిశీలన చేసుకోవచ్చు. సెప్టెంబరు ఒకటి, రెండో తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంది. నాలుగో తేదీన సీట్లు కేటాయిస్తారు. నాలుగు నుంచి 7వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌తోపాటు కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
చదవండి: AP POLYCET 2023: 30 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్
నేటితో ముగియనున్న ఇంజినీరింగ్ ప్రవేశాలు
ఏపీఈఏపీసెట్‌లో సీట్లు పొందిన విద్యార్థులు వారికి కేటాయించిన ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరడానికి గురువారంతో గడువు ముగుస్తుంది. అదేరోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. వీరు కేవలం అలాట్‌మెంట్ లెటర్, సెల్ఫ్ జాయినింగ్ లెటర్ ఇస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా ఈసెట్ కౌన్సెలింగ్ ముగిసిన నేపథ్యంలో వీరికి గురువారం సీట్లు కేటాయిస్తారు. వీరు సెప్టెంబరు ఒకటి నుంచి నాలుగో తేదీలోగా వారికి కేటాయించిన ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. వీరికిదే చివరి కౌన్సెలింగ్ అని అధికారులు చెప్పారు.